Monday, 19 October 2009

నాకు నచ్చిన జంటలు


రెండు నెలలుగా బ్రాడ్బాండ్ గతి లేదు, కొత్త సినిమా పాటలు విని తీరాలి కాబట్టి , చచ్చు మొబైల్ బ్రాడ్బాండ్లో ఉన్న డవున్లోడ్ లిమిట్ దాటకూడదు కాబట్టి అతి పొదుపుగా వాడుకుంటూ వస్తున్నా నా మొదటి పెళ్ళాం (అదేలెండి "జాలం")సమయాన్ని. చికాకు చికాగ్గా ఉంది. సరే చికాకుని పోగొట్టుకోడానికి నాకిష్టమయిన తెలుగు సినిమాల్లోని జంటల గూర్చి రాయదలచుకున్నాను. జంటలంటే యంటోడూ సావిత్రి, ఏయెన్నారూ జమున లాటివనుకుని మా తెగ సంబరపడిపోతూ వస్తే బొర్లా పడతారండోచ్. ముందే చెపుతున్నా.

ఈ జంటలన్నిటినీ కలిపేది ఒకటే సూత్రం. "మనసున మనసై బ్రతుకున బ్రతుకై......." అన్న పాట తెలీని వారుండరేమో మీలో. ఆ పాటకు సజీవ రూపాలఈ పాత్రలు. కల్పిత పాత్రలే అయినా ఎంత మధుర భావనో చూస్తుంటే. ఆ భావన మీరూ అనుభవిస్తారనే అనుకుంటాను.


సీతారామయ్యగారి మనుమరాలు.
ఇందులో సీత, ఆమే బావ ఒక జంటగా చూపిన సన్నివెశాలేవీ లేవు. ఈ ఒక్క పాట తప్పితే. "పూచింది పూచింది పున్నాగ కూసంత నవ్వింది నీలాగా, సందేల లాగేసె సల్లంగా దాని సన్నాయి జళ్ళోన సంపెంగా...." అంటూ సాగే ఈ పాటలో అసలేమి చెప్పకుండానే కొందంత చెప్పిన ఆ భావన ఎంత ఇష్టమో నాకు. అదీ ఆ భావన వారి నోటెంట చెప్పించకుండా దర్శకుడు ఆ బుడుగోడి చేత "ఒసే సీతా వీడి పైత్యమూ నీ ఫిడేలూనా....తోటంతా గాడిదలోయ్ గాడిదలు" అంతూ సున్నితంగా చెప్పించటం, ఈ ఒక్క పాటలో తప్పితే ఇంకెక్కడా ఆ జంటను జంటగా చూపెట్టకుండా కథకు న్యాయం చేకూర్చిన ఆ దర్శకుడిని నిజంగా మెచ్చుకోవాలి.

ఆకలిరాజ్యం
పై ఇద్దరూ జంటగా నేనెందుకు అనుకున్నాను, అదెందుకు నాకిష్టం అంటే దానికి కాఋఅం ఆకలి రాజ్యంలో కమల్, శ్రీదేవిల పాత్రలే. "కన్నె పిల్లవని కన్నులున్నవని ఎన్నెన్ని కలలు రప్పించావే గడసరీ" అంటూ ప్రారంభించి "కవినిని నేనై నాలో కవిత నీవై" అంటూ "సంగీతం నీవైతే సాహిత్యం నేనవుతా" అని సాగుతూ "మనమే కాగా......." అని ముగించటం నాకెంతో నచ్చిన విషయం. స్ఫష్టంగా తమ ఇష్టం చెప్పటంలో కూడా ఆ ఇష్టం ఎందుకో అనేది ఇంత సున్నితంగా చెప్పతం ఎంత బావుందో.

శంకరాభరణం
కథా పరంగా ఈ చిత్రంలో చాలా చిన్న పాత్రలు చంద్రమోహన్, శారద(చిత్రంలో పేరు) . కాని ఎంత మనోహరంగా జరిగిందో వారి చిత్రణ, చిత్రీకరణ........శంకరశాస్త్రి సమక్షంలో "సామజవర గమనా...." అంటూ పాడుతూ, తన వాడిపై దృష్టి నిలిపి, స్వర సంకరం చేసే వారొకరైతే అదే శంకరశాస్త్రి సమక్షంలో రిషభం అనబోయి వృషభం అనేసి తంతాలు తెచ్చుకున్న వారొకరు. ఇద్దరూ ఇద్దరే. మళ్ళీ "మదాలసాం" మాణిక్యవీణా ముపలాలయంతీ మదాలసాం మంజుల వాగ్విలాసాం అంటూ అమ్మవారినీ అయ్యవారినీ మెప్పించే ప్రయత్నాలు.....భలే భలే.

స్వర్ణకమలం
నాకిష్టమయిన జంట భానుప్రియ, వెంకీ జంట కాదు. భానుప్రియ అక్క,ఆమె జంటైన ఇల్లుగలాయన కొడుకూ. ఎందుకొ చెప్పనా? తన పని తాను చేసుకుంటూ కూడా రాగాలాలపిస్తూ తనకు నచ్చిన వాడికి రాగాలు నేర్పుతూ రాగం తప్పితే గారాలు పోతూ అనురాగం తెలిపే అదృష్టం నీజంగా ఎంతదృష్టమో కదా? గుర్తుందా ఈ సన్నివేశం? బావి దగ్గర నీళ్ళు చేదుతూ అక్కా, ఆమే ఆలపిస్తున్న రాగానికి ఫిడేలు వాయిస్తూ, అనుసరిస్తూ ఆమేను కోరుకున్న వాడు. ఎంత చక్కగా సున్నితంగా చూపెట్ట్బడిందో ఆ జంట ప్రేమనూ, "....తోడొకోరుండిన అదే భాగ్యమో అదే స్వర్గమో....." అన్న భావననూ. అందులోనూ "నువ్వు తోడుంటానంటే నిన్ను అనుసరించటానికైనా సిద్దమే" అని తమ జంట కళ్ళాలను అలా తన స్త్రీకి ఇవ్వగలిగిన ఆ పురుషుని ఔన్నత్యం నిజంగా ఎంత బావుందో. విద్యలో తక్కువే కావచ్చు...సంస్కారంలో ఆ స్త్రీకి సరైన జొడీ.

సాగర సంగమం
ఒకే ఒక్క సీన్లో కనిపించిందీ భావన....."....అభినయ వేదము సభకనువాదము సలుపు పరమ పదమూ" అంటూ బాలు నర్తిసుంతుంటే అంతవరకు ప్రేక్షకురాలైన మాధవి తనను తానాపుకోలేక ఇహం , స్థాయి, సిగ్గు అన్నీ మరచి, బాలుతో కదం కలపటంలో. ఆ సీన్ చివర బాలు "వావ్" అంటూ చూపిన హావభావాలు సూపర్ . (నా జీవితాంతం వరకు పురుష నృత్య కళాకారుడు ఎవరూ అంటే గుర్తుకు వచ్చేది బాలూ పాత్రే.)

భక్త కణ్ణప్ప
ఒక పాటలో కనిపించిందా భావం "ఆకాశం దించాలా..నెలవంకా తుంచాలా..సిగలో ఉంచాలా.." అంటూ అతనడిగితే "చెక్కిలి నువ్వూ నొక్కేటప్పటి చక్కిలిగింతలు చాలు.....సిగలో నువ్వేరా" అనీ "పట్టు తేనె నీకన్నా తియ్యంగా ఉంటుందా మిన్నాగు మణికైనా నీ ఇలువ వస్తుందా" అనీ ఆమే సమాధనం చెపితే ఎంతపురూపమనిపిస్తుందో వారి చెలిమి.

స్వాతిముత్యం
సన్నివేశం గుర్తులేదు కాని "తాళి బొట్టు తెస్తననీ తాళ్ళ రేవుకెళ్ళిండూ మామా....వచ్చేదాకా అట్టనే ఉండు, పట్టపగలల్లె ఓ చందమామ" అన్న పాటలో కొంచం ఉందికదా? లేదా? :-( ఏమో నాకిక్కడ దాన్ని చేర్చాలనిపించింది చేర్చెసా...నా బ్లాగు, నా టపా కదా నా ఇష్టమంతే :-)

ఆనంద్ (మంచి కాఫీ లాటి సినిమా)
గోదావరి
ఈ రెండు చిత్రాలు మొత్తం అదే భావనతో నడిచాయి అనిపిస్తుంది. అందుకే నాకీ రెండు సినిమాలంటే ప్రాణం ఆ రెండు జంటలంటే కూడా.

అబ్బ....ఇష్టమయిన వారినీ, వాటినీ తలచుకుంటే ఎంత సుఖమో. చికాకు ఉఫ్ మని ఊదేసినట్టు పోయింది. కాబట్టి ఇక ఆపేస్తా. ఇప్పటికింకుంటా మరి. బై.

Sunday, 18 October 2009

కాలం.

క్షణాలెంత చిత్రమైనవో కదా
భుజాన కావడి ఖాళీ అయితే
పయనం భారం చెస్తాయి
పనిభారం మోస్తున్నపుడు
చకచకల పరుగులెడతాయి
అమావసి మది కప్పేస్తే
పర పున్నమి చూపి వెతలెడతాయి
పున్నమికి మది ఝల్లుమంటే
అభాగ్యులమావసి చూడమంటాయి
తలపున మరిచామో
ఉనికే లేనట్టుంటాయి
దృష్టిన్నిలిపామో
ఙ్ఞాన బోధలెన్నెన్ననీ?

Friday, 16 October 2009

మాధవ సేవా....మానవ సేవా?

http://eenadu.net/panelhtml.asp?qrystr=htm/panel7.htm

వార్త చదవంగానే ఏమనుకోవాలో అర్థం కాలేదు. "Roaseanne" అనే ఇంగ్లీష్ సినిమాలో అనుకుంటాను Steve Martin ను అతని పొడగాటి ముక్కు గూర్చి బార్లో ఒకడు కామెంట్ చేస్తే అతను ఆ కామెంటుకు Romantic, philosophical, action, comedy, sarcastic అంటూ ఎన్నో విధాలుగా సమాధానం చెపుతూ, ప్రతి ఒక్క విధానానికీ ఒక్కొ దెబ్బేస్తూ భలేగా కొడతాడు. ఈ చిత్రమూ, వార్తా చూసి వచ్చిన నా ఆలొచనలను పరికించుకుంటే ఆ చిత్రణే మదిలో మెదిలింది. సరే అనుకుని అదే స్టైల్ కాపీ కొట్టేస్తున్నా.

సాధారణ భక్తి
అబ్బ ఎంత భక్తి పరులో, అన్ని కోట్లు దేవునికి అంకితం ధారపోస్తున్నారు. కాళ్ళకు మొక్కాలి.

ఆర్ కే నారాయణ్ "సగటు మనిషి"
ఆ..అంత సీన్ లేదు. ఇంతకిన్ని వేల రెట్లు సంపాదించుంటారు అక్రమ మార్గంలో. ఆ గిల్టీ ఫీలింగ్స్ పోగొట్టుకోటానికివన్నీ. దేవునికి కూడా లంచం ఇవ్వ చూపే పుణ్యాత్ములు.

భక్తి పారవశ్యం
ఎంత బరువుంటుందో పాపం స్వామి ఇంత బరువైనది మొయ్యగలడో లేదో.

చిరుగు పాతల బరుగూ బ్రతుకుల నేతగాళ్ళు
నిజమే కదా......"చాకిరొకరిది, సౌఖ్యమొకరిది, సాగదింద్కా తెలుసుకో....." అనే పాట ఇప్పట్టికీ సమకాలీనమైనా "గాలిలోన తేలిపోయే చీర గట్టే" దేవుళ్ళ సౌకుమార్యాం గురించి మనం ఆలొచించి తీరాల్సిందే.

వేదాంతి.
తప్పు, తప్పు. మన ప్రాప్తం మన జన్మ ఫలితాలే. ఇదంతా ఒక "An accident of Birth" మాత్రమే. కాబట్టి మనం వాళ్లను ఆడిపోసుకోకూడదు.

అన్న
అవునవును. నూరెకరాలకు పుట్టినోడు వెయ్యెకరాలాసామి కావటం "Just an accident of birth" మాత్రమే.అంతే అంతే.

ఎకానమిస్టు
Value addition అని ఎందుకు అనుకోకూడదు. కష్టపడి ఉన్న నూరెకరాలను వెయ్యెకరాలు చేయడం ఎందుకు సాధ్యం కాదు? మీలాగా ఉన్న దానిని ధ్వంసం చేస్తూ Value Substraction చెయ్యట్లేదు కదా.

పిచ్చోడు
భలే భలే...... అడిషన్. మింగ మెతుకు లేక జనాలు పిట్టల్లా రాలిపోతుంటే ఇలా స్వామి వారికి నగలూ పీతాంబరాలూ ఎంత అడిషనో.....భలే భలే.


రియాలిస్టు
ఒరే పిచ్చోడా నొరు మూస్తావా? అంటే పేదోళ్ళున్నారని ఇంక అందరూ తమ కనీసావసరాలు తీర్చుకుని మిగితా సంపదంతా ఆ కనీస అవసరాలు లేని వారికి ధారపొయ్యాలా? అలా జరగటం నిజంగా సాధ్యమేనా?

భావుకుడు
ఎందుకు సాధ్యం కాదు? సాలెల మగ్గం, కుమ్మరి చక్రం........శరీర కష్టం స్ఫురింప చేసే సహస్ర వృత్తుల సమానంగా చూసే మా ఆ మరో ప్రపంచంలో సాధ్యమే.

సైకాలజిస్టు
ఇంపాసిబుల్. కూడు, గూడు, బట్టలతో సంత్రుప్తిపడే జంతువు కాదు మానవ మృగం. ఈ Basic Needs ఒకటే సరిపోవు ఈ మృగం జీవించటానికి మాస్లొవ్ చెప్పినట్టు అవి తీరితే భద్రత కావాలి, అది తీరితే గౌరవం కావాలి, అది తీరితే సవాళ్ళనిధగమించి జయిస్తే వచ్చే త్రుప్తి కావాలి, ఆ పైన రస సిధ్ధి కావాలి...ఇలా అనంత కోర్కెల తెనెతుట్టయిన ఈ మానవ మృగం "వేల పూలను దోచి మకరందం దాచి పెట్టద్దు" అంటే ఊరుకుంటుందా? ఊరుకోదు.

ఎకానమిస్టు
ఇంకో రకంగా "కాపిటల్ ఇన్వెస్ట్మెంట్" అనమాట మానసికంగా. తను మంచి చేస్తున్నాడు అని ఆ మనిషికి సంతృప్తి కలిగి ఆ సంత్రుప్తిని వాడుకుని తనకు తోచినంతలో మిగితా మనుషులకు కూదా సహాయం చేస్తాడు. ఈ "మానసిక పెట్టుబడి" లేకపోతే ఆ మనిషి నీరశుడై వడలిపోతాడు.

బెడ్రూం సమాజ సేవకుడు
చ. మీకంతా బాగా అలవాటయిపొయింది సమస్యలను వేలెత్తి చూపటం. కాని ఒక్కడు కూడా దీనికి పరిష్కారం చూపే వాడుండడు.

గోడ మీది పిల్లి (నేను)
ప్రతీ వారి వాదనలో నిజముందనిపిస్తోంది. ఏం చెయ్యాలో తోచట్లేదు, ఎవరిని అనుసరించాలో తెలియట్లేదు.

Wise man (My ego)
Wise man is allways in doubt and a fool is allways sure. Dont worry.











Tuesday, 13 October 2009

బాతు పిల్ల పాఠం


చలికొణుకుతూ
గాలికెదురీతన
అలల పోటుల మధ్య
స్థిరంగా శాంతంగా.....
చిన్న బాతు పిల్ల!!!

స్థిరమా? నిజంగానే?
అటూ ఇటూ ఎటో అటూ
విసిరికొట్టే గాలుల
స్థిరత సాధ్యమేనా?
అయినా ఎందుకనిపించిందలా?
అటూ ఇటూ ఎటో అటూ
కదలిపోయినా కదిలింపబడినా
తిరిగి సర్దుకునే
ప్రయత్నమేగా స్థిరత్వమంటే!

శాంతమా? అది నీకెరుకెలా?
వణికే చలి
చుట్టూ కలి
బొజ్జాకలి
ఇవన్నీ మరి
కనిపించే వీలవునా?
పైకవుపించేదెంత పైపైదో
తరచేకొద్దీ లోతంతే

బాతైనా, మనిషైనా
మనసైనా, బతుకైనా
ఎదైనా ఇంతే సుమా
పైదంతా ఉట్టి డొల్లేగా.





Pic belongs to http://farm3.static.flickr.com/2199/2491183812_baa386fc01.jpg