Monday, 28 April 2008

అలుపెరుగని పయనమేది?

జీవితాన ఏమి లేదా?
ఆపులేని కన్నీళ్ళా?
నచ్చింది దొరకలేదా?
దొరికింది నచ్చలేదా?

బాధ వలదు మిత్రమా,
ఆశ వీడకు జీవితాన.
అలుపన్నది గుర్తెరుగక,
లాగుమిక జన్మమింక.
-
నిరంతర అలల పోటుకు
వెరిచేనా ఇసుక తిన్నె?
చేకొనదా తన వంతు
ఆగి మరీ అల వెనుక?
-
క్షణమాగక ధరణి చుట్టు
తనకేలని చందమామ
ఆపేనా తన పయనం
అమావసి ఎన్నటికంతం?
-
అలుపన్నది ప్రయాణ విధి
అలుపు లేని పయనమేది?
అలపుకు వెరిచెనా మది
నువు చేరు గమ్యమేది?
-
ఉన్నది నచ్చ లేదా?
దాన్ని మార్చు శక్తి నీదేగా!
ఉన్నది జార విడకు,
లేని దానికై పరుగునిడకు.

పుట్టిన రోజు బహుమతిగా ఈ చిన్ని కానుక, "స్వీకరిస్తావని" ఆశిస్తూ ........................

Sunday, 27 April 2008

నేనెట్లైతి ఇంటి పెద్దన్?

ఆవేశపరుండ, కోపమునాపజాల

అపాయమున యుపాయంబు చేజాల

కోరికల దాస్యుండ, అనుభవ శూన్యుండ

ఎట్లైతి నే ఇంటి పెద్దన్?

మూలనిడి తల్లిదండ్రుల్

సుభాషితముల ఆలి విడిన్

పరుష, కఠు వాక్యుండ

ఎట్లైతి నే ఇంటి పెద్దన్ ?

జన్మమిచ్చె తెలివి

తెలివి తెచ్చె చదువు

చదువిచ్చె కొలువు

కొలువు దెచ్చె ధనము

ధనము జేసే మనువిక

మనువు జేసే మగడిగ

తరచిన జన్మ తెచ్చె నిటుల భోగము

మరి భోగమేల తెచ్చెరా పరుషము?

జనని క్షోభ కారణభూతుండా

ఇలనేలలేదురా నీకు నరకము?

(తొందరపాటున తల్లిని పరుష పద జాలముతో క్షోభ పెట్టిన సందర్భమున కన్నీటితో ....)

Friday, 25 April 2008

నీతోనేట్టేటే పిల్లా, పానాలు తీస్తావు ఇల్లా..39-50

మల్లి నీవే
మరుమల్లి నీవే
మల్లి నీకు
మల్లేలు దేనికే సిన్ని
నీతోనేట్టేటే పిల్లా, పానాలు తీస్తావు ఇల్లా.....39

పూలు తెద్దామని
బజారు నేబోతే
పూవు పూవులో నీవేనే
పెద్ద సిక్కేనే సిన్ని
నీతోనేట్టేటే పిల్లా, పానాలు తీస్తావు ఇల్లా.....40

గులాబి సూస్తె
నీ బుగ్గలాగుండాది
మల్లేలు సూస్తె
నీ మనసూ లాగుండాది
నీతోనేట్టేటే పిల్లా, పానాలు తీస్తావు ఇల్లా.....41

సామంతిలోనూ నవ్వు
నల్లకలువా నీ కన్ను
సంపంగేమో ముక్కు
వచ్చిందే పెద్ద సిక్కు
నీతోనేట్టేటే పిల్లా, పానాలు తీస్తావు ఇల్లా.....42

ఏదిదెస్తూ నేను
ఏదోదిలేనూ నేను
కొండంటి బంగారమే నీవు
అన్నీ పూలు తేలేనే సిన్ని
నీతోనేట్టేటే పిల్లా, పానాలు తీస్తావు ఇల్లా.....43

మల్లేలు తీసి సప్పునా రాబోతే
బంతీ సామంతీ సిన్నాబోయే
మరువమేమో మరిక
మల్లె నన్నిడ్సీ పాయంటూ ఎడ్సే
నీతోనేట్టేటే పిల్లా, పానాలు తీస్తావు ఇల్లా.....44

మల్లె, మరువం కొంటేనే సిన్ని
కొంటె ముసిల్ది నవ్వెనే సిన్ని
"రేయి మెత్తంగారా" అందే సిన్ని
"సిన్నీ మల్లేరా" అందె సిన్ని
నీతోనేట్టేటే పిల్లా, పానాలు తీస్తావు ఇల్లా.....45

ఆకులిమ్మంటేనే సిన్ని
"సిలకలకేనా" అడిగేరే సిన్ని
"వేలు జగర్తోరే" సేప్పేరే సిన్ని
"సిన్ని సిలకేరో" గుర్తూ సేసేరే సిన్ని
నీతోనేట్టేటే పిల్లా, పానాలు తీస్తావు ఇల్లా.....46

"మిఠాయి పోట్లమంటేనే" సిన్ని
కన్నూ కొట్టేడే సిన్ని
బుర్ర మీసాలోడే సిన్ని
ఎకసెక్కాలాడేఢే సిన్ని
నీతోనేట్టేటే పిల్లా, పానాలు తీస్తావు ఇల్లా.....47

దమ్మూకు రానంటే
తోటీ గాల్లంతా
"మనువయి మారేవురో" అంటూ
దుమ్మెత్తీ పోసేరే సిన్ని
నీతోనేట్టేటే పిల్లా, పానాలు తీస్తావు ఇల్లా......48

గుళ్లోనా సామికి
బయటీ నుండే దండమెడితే
"తెల్సులేరా తొందరంటూ"
సామీ నవ్వేరీ సిన్ని
నీతోనేట్టేటే పిల్లా, పానాలు తీస్తావు ఇల్లా.....49

వచ్చీ నెలైనా కాలే
బతుకంతా నీవేనే
యారూ నవ్వీనా
నీ దరికే నా ఉరుకే సిన్ని
నీతోనేట్టేటే పిల్లా, పానాలు తీస్తావు ఇల్లా......50
---------------xxxxxx-------------

Saturday, 19 April 2008

నీతోనేట్టేటే పిల్లా, పానాలు తీస్తావు ఇల్లా...19--38

----------------------------------xxxxxxx--------------------

పనికీ వచ్చీ నే

పనినీ సేస్తున్నా

మనసు నీపైనే

కనులా నీవేనే

నీతోనేట్టేటే పిల్లా, పానాలు తీస్తావు ఇల్లా.....19


రోగం సూస్తున్నా

మందూ యిస్తున్నా

మనసు నీపైనే

తనువొకటే యీడనే

నీతోనేట్టేటే పిల్లా, పానాలు తీస్తావు ఇల్లా.....20

రోగాలు తీర్చేటీ

వైద్యం సేసేటీ

నన్నూ రోగీనీ

నువ్వే సేసేవే

నీతోనేట్టేటే పిల్లా, పానాలు తీస్తావు ఇల్లా.....21

రోగం నువ్వేనే

మందూ నువ్వేనే

నీ నైజమేదేనో

అర్ధం కావేమే

నీతోనేట్టేటే పిల్లా, పానాలు తీస్తావు ఇల్లా.....22


పిచ్చి తీర్చేటి

మనిషీ నేనైతే

నన్నూ పిచ్చోన్ని

చేసేటి నువ్వేటే?

నీతోనేట్టేటే పిల్లా, పానాలు తీస్తావు ఇల్లా.....23


తోటీ గాల్లతో

బేటీ సేస్తున్నా

నీ సూపు బాకు

నా "బోటి" సేస్తుంటే

నీతోనేట్టేటే పిల్లా, పానాలు తీస్తావు ఇల్లా.....25 ("బోటి" అంటే "ముక్క" అన్న అర్ధంతో )


పైనోల్లతో మాటల్లు సేస్తునా

కిందోల్లకీ మాటల్లు సెబుతున్నా

ఎదనిండా నీవై

తప్పుల్లు దోర్లేనే

నీతోనేట్టేటే పిల్లా, పానాలు తీస్తావు ఇల్లా.....26


తప్పుల్లు దొర్లి

నేనగుబాలైతే

మల్లీ సెవుల్ల

గుసగుసల నీ సర్దుఢేన్దే

నీతోనేట్టేటే పిల్లా, పానాలు తీస్తావు ఇల్లా.....27


సేసింది సాలంటూ

ఆకలికి ఏలంటూ

నే బువ్వ దీస్తుంటే

బువ్వల్ల నీ ముఖమేందే

నీతోనేట్టేటే పిల్లా, పానాలు తీస్తావు ఇల్లా.....28


సల్లటి బువ్వని

నోట ఎట్టేనా

గోరూ ముద్దలేసే

నీదే యాదేందే

నీతోనేట్టేటే పిల్లా, పానాలు తీస్తావు ఇల్లా.....29

బువ్వా తింటూ నే

పోలమారి దగ్గేనా

పై చూడు ఎలకంటూ

నెత్తీ మొట్టేవే

నీతోనేట్టేటే పిల్లా, పానాలు తీస్తావు ఇల్లా.....30


పూటుగా తినినే

బ్రేవుమని త్రేంచేనా

ఎందది మావంటూ

మదికి వోచ్చేవే

నీతోనేట్టేటే పిల్లా, పానాలు తీస్తావు ఇల్లా.....31


తిండీ దినినే

కునుకూ దీస్తేనూ

కలలా అచ్చీ

కవ్వింపు నీదేందే

నీతోనేట్టేటే పిల్లా, పానాలు తీస్తావు ఇల్లా.....32


నా కాడా లేవూ

నన్నోదిలీ లేవూ

ఉన్నావో లేవో

అర్దామే కావేమే

నీతోనేట్టేటే పిల్లా, పానాలు తీస్తావు ఇల్లా.....33


లేని పిల్లా

కనిపిస్తాది, ఇనిపిస్తాది

ఈడూ సత్తెంగా

రోగేనంటున్డారు

నీతోనేట్టేటే పిల్లా, పానాలు తీస్తావు ఇల్లా.....34

రోగేనంటున్డారు

గెలీ సేస్తుండారు

పక పకా నవ్వేరు

నన్నూ మోసేరు

నీతోనేట్టేటే పిల్లా, పానాలు తీస్తావు ఇల్లా.....35


ఇంతా సేస్తుంటేను

మల్లీ అచ్చేవూ

ముసిముసిగా నవ్వేవు

ముత్యాలు రాల్సేవు

నీతోనేట్టేటే పిల్లా, పానాలు తీస్తావు ఇల్లా.....36

నినిడ్సి నా సిన్నీ

నేనుండ లేనమ్మీ

యిడిగో వస్తున్డానంటే

మల్లెలంటావేటే?

నీతోనేట్టేటే పిల్లా, పానాలు తీస్తావు ఇల్లా.....37


బజారుకెల్లాల

పూవుల్లు తేవాల

ఈ రోజోగ్గేవంటే

సిన్నబోయే ముఖమాయే

నీతోనేట్టేటే పిల్లా, పానాలు తీస్తావు ఇల్లా.....38
---------------------------xxxxxxxxxxxxxx----------------------------

Friday, 18 April 2008

నీతోటెట్టేటె పిల్లా, పానాలు తీస్తావు ఇల్లా..7...18

సద్దీ కట్టేవు
కూరీ ఎట్టేవు
మేతుకూ మిగిలిందంటే
ఒట్టే మావంటావు
నీతోటెట్టేటె పిల్లా, పానాలు తీస్తావు ఇల్లా.....7

దండమెట్టీ
కొబ్బరిచ్చేవు
కంటి పాపన
నీరు ఎట్టేవు
నీతోటెట్టేటె పిల్లా, పానాలు తీస్తావు ఇల్లా.....8

నీరు ఎట్టేవు
"కలక మావా" అంటూ
మాటా మార్సేవు
ఎడుపాపేవు
నీతోటెట్టేటె పిల్లా, పానాలు తీస్తావు ఇల్లా.....9

ఎదురూ వచ్చేనూ
లాభమంటావు
నిన్నొగ్గి పోతుంటే
లాభామేంటే పిచ్చి ?
నీతోటెట్టేటె పిల్లా, పానాలు తీస్తావు ఇల్లా.....9

బేగి పోమ్మంటావు
బెగే రమ్మంటావు
రమ్మంటావు
పొమ్మంటావు
నీతోటెట్టేటె పిల్లా, పానాలు తీస్తావు ఇల్లా.....10

అడుగేయక మునుపే
తిరిగీ పిలిసేవు
"మావా" పిలిసేవు
"మల్లెలు" గునిసేవు
నీతోటెట్టేటె పిల్లా, పానాలు తీస్తావు ఇల్లా......11

మల్లెలంటావు
మల్లెవవ్తావు
సిగ్గులా నీ సెంప
కెంపులె పూయిస్తావు
నీతోటెట్టేటె పిల్లా, పానాలు తీస్తావు ఇల్లా.....12

పగటి పనికి
నేబోతు ఉంటే
రేయి పనిని
మదికి తెస్తావు
నీతోటెట్టేటె పిల్లా, పానాలు తీస్తావు ఇల్లా.....13

తల యిదిల్సి
గుండె గట్టి
నేగదిలి పోతె
వాకిలి నిల్సేవు
నీతోటెట్టేటె పిల్లా, పానాలు తీస్తావు ఇల్లా.....14

పొద్దు గూకి
గూటికి అస్తే
మల్లి వాకిలే
నిల్సి కల్సేవు
నీతోటెట్టేటె పిల్లా, పానాలు తీస్తావు ఇల్లా.....15

పొద్దుగాల ఆకిటున్డేవు
పొద్దుగూకి ఆకిటున్దేవు
దినమంతా ఆకిటున్డేవా?
కాల్సక సూరీడున్డేనా?
నీతోటెట్టేటె పిల్లా, పానాలు తీస్తావు ఇల్లా.....16

సామీ సూరీడా
దయ సూపేరా
ఒంటరి నా సిన్ని
దిక్కు నీవేరా
నీతోటెట్టేటె పిల్లా, పానాలు తీస్తావు ఇల్లా.....17

రేయి రేడొచ్చో
బేగి నేనొచ్చో
సిన్ని సేరేదాక
భారం నీదేరా
నీతోనేట్టేటే పిల్లా, పానాలు తీస్తావు ఇల్లా.....18

Saturday, 12 April 2008

నిశి రేయి- ఉషా కిరణం

నిశి రేయి-
జోరు వాన,
మామ లేడు
ఆకసాన.

వింత కోరిక
పుట్టె మదిన
మనసు నడిపె
బీచి దారిన.

పైన చూడ
మేఘావృతం,
కింద చూడ
అలల సంద్రం.

చూపు మేర
కలియ చూడ,
కాన రాదె
జన సంచారం.

ఎదో నావ
అలల పైన,
మిణుకు మిణుకు
దీప కళిక.

ఇసుక తిన్న
అలల లోన,
మనసేమో
ఆకసాన.

ఎగర సాగె
నిశి వీధిన,
శశి కొరకై
చకోర తీరున.

ఏర సాగె
మది తానె,
కాన రాని
ముత్యాలన్నీ.

మది రేగిన
అనుభూతుల
మిల మిలలే
అవన్నీ.

ఇంతలోనె
సడి విని,
చిర్రెత్తె
ఎవరాయని

తరచి కాన
నా సతియే,
నే మరచిన
సహచరిణె.

బితుకుమంటూ
"నీ తోడంటూ",
నే తెచ్చిన
నా భార్యే.

వణికే తను.......
తన్మయాన నేను,
సంద్రమొకటే--
అనుభూతులెన్నో!!!!!!!

"నీళ్లంటే
నాకు భయమె
పోదామా"
తను అంటే..........

"నే తోడుంటే
బెదురేలం"టూ
గొంతు లేచె,
కన్నెర్రవుతూ

"ఏమి లేదులే
చూడు నీరు
ఎంత బావుందో
దాని తీరు"

కంట్లో మెరయ
కన్నీరు,
జవాబిచ్చే
తన తీరు.

"ఎందుకు లేదు
ఎమిటో చెప్పు"?
ఎక్కడో దాచిన
మంచితనం!!!!!

"చిన నాడు
చూసాను
నీట మునుగి
స్నేహితుని చావు"

చిన్న స్వరాన,
తన మానాన
తననొదిలేసిన
నా అర్ధ తనువు.

"అర్ధ తనువా?
వ్యర్ధ మాటలు!!!!!
అర్ధమే అయితె
ఇదంతా జరిగేనా?"

"భావుకత
ముసుగున
మనసింత
మురుగునా?

సతి గతి
తెలియని
పతి- ఆతీ
గతి యుండునా?

ఏమీ లేని
శూన్యాన
అనుభూతులు
వెతికేనా?

అనుభూతుల
మయమైన
మనిషినే
మరిచేనే !!!!

చెంప పెటిల్లన
ఈ ఆలోచన
కాన వచ్చె
ముందు బాట

చేయి పట్టి
చెట్టా పట్టన,
నడిచె "నా" జంట-
నా వలపుల పంట.

ఆశీర్వచనమన
తూరుపున
ఉదయం,
ఒక ఉషా కిరణం.................

నిన్న రాత్రి చిలిపి కోరిక అంటూ నా భార్యను బీచికి తీసుకు వెళ్ళా. అక్కడ జరిగిన దానికి అక్షర రూపం.భావకులమనుకుంటూ మన చుట్టూ ఉన్నా వారిని మనం పట్టించుకోవక పోవటం అంటే ఇదే.

Tuesday, 8 April 2008

నీతోనెట్టేటె పిల్లా, పానాలు తింటావు ఇల్లా 1-6

కొడీ కూసేనంటూ
పొద్దున్నేలేపేవు
రేయి బాసల ఊసుల
నా కలలనాపేవు
నీతోనెట్టేటె పిల్లా, పానాలు తింటావు ఇల్లా-----1

కలలనాపి నే లేస్తే
ఎదుటా నీవొచ్చి
రేటి కలలూ అన్నీ
మల్లీ రేపేవు
నీతోనెట్టేటె పిల్లా, పానాలు తింటావు ఇల్లా-----2

వల్లిరస్తా నే వస్తె
బద్దకపు నా మావంటూ
బుగ్గా గిల్లేవు
మనసూ గిల్లేవు
నీతోనెట్టేటె పిల్లా, పానాలు తింటావు ఇల్లా-----3

తానానికీ నేపొతే
ఈపు రుద్దేవు, తలనూ అంటేవు
తడిసి ముద్దయి
నీవు ముద్దయ్యేవు
నీతోనెట్టేటె పిల్లా, పానాలు తింటావు ఇల్లా-----4

పోయ్యీ కాడ నీ సేయి గాలి
నీ బాధ జూసి నేనెట్టో ఉంటేను
రేయి కాడి నీ పంటి కంటేనా అంటూ
ఎకసేక్కాలతో గుండే పిండేవు
నీతోనెట్టేటె పిల్లా, పానాలు తింటావు ఇల్లా-----5

నేనేటి సేస్తున్నా
నేనేటి సూస్తున్నా
నా గుండె నిండేవు
నా పనులూ ఆపేవు
నీతోనెట్టేటె పిల్లా, పానాలు తింటావు ఇల్లా-----6

Saturday, 5 April 2008

నీతోనెట్టేటె పిల్లా, పానాలు తింటావు ఇల్లా

ఛీ,ఛీ అంటావు

ఛీ,పో అంటావు

ఎధవా ఏసాలు

నేనె నేర్సానంటావు

నీతోనెట్టేటె పిల్లా, పానాలు తింటావు ఇల్లా


ఎంగిలంటావు,

సాగదంటావు

దొరసాని ఏసాలు

మనకేలనంటావు

నీతోనెట్టేటె పిల్లా, పానాలు తింటావు ఇల్లా


దొండ పండూలాటి

పెదవూలతోటి

సిలకలిస్తావు

కులికి వస్తావు

నీతోనెట్టేటె పిల్లా, పానాలు తింటావు ఇల్లా

కులికీ వస్తావు

అలిగీ పోతావు

ఎఱ్ఱబడ్డా నీ నాల్కె

మల్లీ నాకె సూపిస్తావు

నీతోనెట్టేటె పిల్లా, పానాలు తింటావు ఇల్లా

అకలున్నోడి ఎదుటా

కూడిట్టా ఎట్టేవు

కూడెట్టి మరీ

నా నోరు కట్టేవు

నీతోనెట్టేటె పిల్లా, పానాలు తింటావు ఇల్లా

నా నోరు కుట్టీ

నీ నోరు సుట్టీ

నన్నిట్టా కవ్విస్తావు

ఎటేటొ సేస్తావు

నీతోనెట్టేటె పిల్లా, పానాలు తింటావు ఇల్లా

Wednesday, 2 April 2008

1-3

పొలిమేర దాటిపోయానూ ఓ గువ్వల చెన్నా

పొరుగూరికి చేరుకున్నానూ ఓ గువ్వల చెన్నా

అరువూ మాటాడినా ఓ గువ్వల చెన్నా

మనసే మాటాడేనూ ఓ గువ్వల చెన్నా-----1.


కాసూ కారులకై ఓ గువ్వల చెన్నా

తల్లీ తండ్రులనూ ఓ గువ్వల చెన్నా

వదిలీ వచ్చినా ఓ గువ్వల చెన్నా

బతికీ చస్తున్నా ఓ గువ్వల చెన్నా-----2.

కాసెంత విలువైనదో ఓ గువ్వల చెన్నా

తెలిసిన బతుకైనా ఓ గువ్వల చెన్నా

బతుకే కాసాయెరా ఓ గువ్వల చెన్నా

విడుపిక ఎన్నటికో ఓ గువ్వల చెన్నా-----3.