Saturday, 12 April 2008

నిశి రేయి- ఉషా కిరణం

నిశి రేయి-
జోరు వాన,
మామ లేడు
ఆకసాన.

వింత కోరిక
పుట్టె మదిన
మనసు నడిపె
బీచి దారిన.

పైన చూడ
మేఘావృతం,
కింద చూడ
అలల సంద్రం.

చూపు మేర
కలియ చూడ,
కాన రాదె
జన సంచారం.

ఎదో నావ
అలల పైన,
మిణుకు మిణుకు
దీప కళిక.

ఇసుక తిన్న
అలల లోన,
మనసేమో
ఆకసాన.

ఎగర సాగె
నిశి వీధిన,
శశి కొరకై
చకోర తీరున.

ఏర సాగె
మది తానె,
కాన రాని
ముత్యాలన్నీ.

మది రేగిన
అనుభూతుల
మిల మిలలే
అవన్నీ.

ఇంతలోనె
సడి విని,
చిర్రెత్తె
ఎవరాయని

తరచి కాన
నా సతియే,
నే మరచిన
సహచరిణె.

బితుకుమంటూ
"నీ తోడంటూ",
నే తెచ్చిన
నా భార్యే.

వణికే తను.......
తన్మయాన నేను,
సంద్రమొకటే--
అనుభూతులెన్నో!!!!!!!

"నీళ్లంటే
నాకు భయమె
పోదామా"
తను అంటే..........

"నే తోడుంటే
బెదురేలం"టూ
గొంతు లేచె,
కన్నెర్రవుతూ

"ఏమి లేదులే
చూడు నీరు
ఎంత బావుందో
దాని తీరు"

కంట్లో మెరయ
కన్నీరు,
జవాబిచ్చే
తన తీరు.

"ఎందుకు లేదు
ఎమిటో చెప్పు"?
ఎక్కడో దాచిన
మంచితనం!!!!!

"చిన నాడు
చూసాను
నీట మునుగి
స్నేహితుని చావు"

చిన్న స్వరాన,
తన మానాన
తననొదిలేసిన
నా అర్ధ తనువు.

"అర్ధ తనువా?
వ్యర్ధ మాటలు!!!!!
అర్ధమే అయితె
ఇదంతా జరిగేనా?"

"భావుకత
ముసుగున
మనసింత
మురుగునా?

సతి గతి
తెలియని
పతి- ఆతీ
గతి యుండునా?

ఏమీ లేని
శూన్యాన
అనుభూతులు
వెతికేనా?

అనుభూతుల
మయమైన
మనిషినే
మరిచేనే !!!!

చెంప పెటిల్లన
ఈ ఆలోచన
కాన వచ్చె
ముందు బాట

చేయి పట్టి
చెట్టా పట్టన,
నడిచె "నా" జంట-
నా వలపుల పంట.

ఆశీర్వచనమన
తూరుపున
ఉదయం,
ఒక ఉషా కిరణం.................

నిన్న రాత్రి చిలిపి కోరిక అంటూ నా భార్యను బీచికి తీసుకు వెళ్ళా. అక్కడ జరిగిన దానికి అక్షర రూపం.భావకులమనుకుంటూ మన చుట్టూ ఉన్నా వారిని మనం పట్టించుకోవక పోవటం అంటే ఇదే.

1 comment: