Monday, 4 August 2008

మధ్య తరగతి విలువలు బాబోయ్!!!

ఈ మధ్య తరగతి విలువలు ఉన్నాయి చూసారూ, వీటితో చాలా తంటాలండి . మొన్నటికి మొన్న "ఏంటి నిన్న ఇంటికి వచ్చి మరీ పారిపోయావంటా?" అన్నాడు మురళి. "నా జూనియర్ గాడు నన్నింత మాట అంటాడా, ఏదో సిన్సియర్గా ఉందామని వీళ్ళని రాగింగ్ చేయకపోవటం నాదే తప్పు" అని మనసులోనే పళ్ళు నూరుకొని బయటికి మాత్రం "హి హి హి నేను పారిపోయానా? ఎప్పుడూ?" అని బోల్డు ఆశ్చర్యపోయా . "అదే దీపిక స్నానం చేసి బయటకు వస్తే నువ్వు పారిపోయావంటా" నవ్వుతూ అన్నాడు మురళి. నాకు ఏం చెప్పాలో అర్థంకాక మిన్నకుండి పోయాను.

మనసు కొంచం చివుక్కుమంది. "అదేంటి, తన పెళ్ళాం అప్పుడే స్నానం చేసి వస్తే నేను అక్కడ ఉండకుండా మర్యాదగా నా రూంకు నేను వెళ్ళిపోతే ఇలా అంటాడు నేనేదో పిచ్చోడిని అయినట్టు, ఏదో చిన్న పిల్లాడి చేష్ట చేసినట్టు మాట్లాడతాడు." అని అనుకున్నమాట నిజం.

ఇంటికి వచ్చినప్పటినుంచి ఇదే ఆలోచిస్తున్నాను ఎందుకు నాకు బాధేస్తోంది? ఏమిటి దీనికి కారణం? తప్పంటూ ఉంటె అది ఎవరిదీ? నా మధ్యతరగతి విలువల ప్రకారం, నేను నేర్చిన సంస్కారం ప్రకారం అది నా తప్పు కాదు, నేను చేసింది ఒప్పే.

కాని మరి తను అలా ఎందుకు అన్నాడు? వాడికి ఈ విలువలు లేవా? వాడికి తప్పనిపించలేదా? అనిపించలేదనే అనిపిస్తోంది. లేకుంటే నన్నెందుకు అలా హేళనగా మాటాడతాడు?

ఇలా ఈ మధ్య నేను నా విలువల వల్ల కొంచం ఇబ్బందికి గురవటం ఇదేమీ మొదటి సారి కాదు. ఇంతక ముందు కూడా ఇలా ఇబ్బంది పడ్డ సందర్భాలు కొన్ని ఉన్నాయి. ఉదాహరణకు ఈ జంటనే తీసుకుందాము. వీళ్ళిద్దరూ నా మెడికల్ కాలేజిలో నాకంటే రెండు సంవత్సరాల తరువాత చేరినవారు. అయినా నాకు ఇక్కడ ఇంగ్లండులో వచ్చి ఇక్కడ కలిసేవరకు ఆ అమ్మాయి అస్సలు పరిచయం లేదు, మురళితో మాత్రం ముఖ పరిచయం ఉంది. వాడిని మొదటిసారి విమానాశ్రయాన్నుంచి రిసీవ్ చేసుకున్నది కూడా నేనే. కాని తరువాత రెండు సంవత్సరాల వరకు అత్తా పత్తా లేదు మళ్ళీ విధివశాత్తు ఈ ఊరిలో రెండు నెలల క్రితం కలిసేవరకూ. అప్పటినుంచి బాగానే దగ్గరయ్యారు ఇద్దరూ. ఇంకా పెళ్లి కాని నాకు, నా రూమ్మేట్కు మంచి స్నేహితులయ్యారు.

అప్పటి నుంచే నా ఇబ్బంది మొదలయింది. అందరూ ఆ అమ్మాయిని "నువ్వు" అనే పిలిచేవారు. నాకు మాత్రం చచ్చే ఇబ్బంది అయ్యేది. నాకంటే రెండేళ్ళ జూనియర్ అయినా, నాకు అప్పటి వరకు పరిచయం లేని అమ్మాయి తను, అందునా స్నేహితుని భార్య. ఎంత ప్రయత్నించినా "నువ్వు" అని వెంటనే వచ్చేది కాదు. "మీరు" అని పిలిస్తే అందరూ వింతగా చూసేవారు అని అనిపించేది. వారు నోటీసు చేసారో లేదో కాని నాకు మాత్రం "ఒంటి కాయ శొంఠి కొమ్ము" ఫీలింగ్ వచ్చేది. ఈ మొహమాటంతో, ఒక సారి నువ్వు అని, ఒకసారి మీరు అని పిలిచి వాళ్ళను కూడా తికమక పెట్టిన సందర్భాలు చాలానే ఉన్నాయి.

ఈ ఉదాహరణను పరిశీలిస్తే మాత్రం నాదే తప్పు అని అర్థం అవుతుంది. నా విలువల మీద నాకే నమ్మకం లేకపోవటం, వాటి మీద నిలబడ లేకపోవటం కారణాలు అని అనిపించింది. వీటికి కారణం అందర్లో నేనూ ఒకడిని, "ఒంటి కాయ శొంఠి కొమ్మును" అనిపిన్చుకోకూదదు అన్న తాపత్రయమే అని అర్థమయ్యింది.

సైకాలజీ ప్రకారము ఈ "గుంపులో గోవిందం" అన్నది చాలా పరిశోధింపబడ్డ విషయం. వారి ప్రకారం ఈ "గుంపులో గోవిందాలకు" ఎక్కడలేని ధైర్యము వస్తుందట, ఒంటిగా ఉన్నపుడు చేయని పనులని కూడా, గుంపులో మమేకమయినపుడు, తమ నైజానికి, సామాజిక విలువలకు వ్యతిరేకమయిన పనులను కూడా "ధైర్యంగా" చేస్తారట. అందుకనే మనిషి చాలా వరకు గుంపులో గొర్రెలవుతారట.

నేను కూడా అలాటి మనిషినే కదా అందుకని గుంపు విలువలు నా విలువలు వేరయే సరికి ఊపిరి అందని మనిషిలా ఇబ్బంది పడతాను. అలా అని పెంపకం, స్మస్కారం, వ్యక్తిత్వం వలన వచ్చిన విలువలను అంత సులువుగా వదులుకోనూ లేను. అందుకే ఈ సంఘర్షణ అని అర్థం అయ్యింది.

"కరిగిపోయాను కర్పూర వీణలా ....కలిసిపోయాను మీ వంశధారలో" అంటూ మనసుకు నచ్చచెపుకొని వారిలో చేరిపోవటమో, "నేను పుట్టాను-లోకం చచ్చింది...........నాకింకా లోకంతో పని ఏముంది? DON'T CARE" అని పాడుకొని నా దారిలో నేను నడవటమో జరిగే వరకూ ఈ పితుకులాట తప్పదనీ అర్థమయింది. చూద్దాం ఏం జరుగుతుందో?

ఇలా జీవితం గడుస్తూ ఉంటే, కొన్నాళ్ళకు వెతగ్గా వెతగ్గా "నాకు తగ్గ బొంత" ఒకటి దొరికితే దాన్నే కట్టుకున్నా. అదేనండి పెళ్లి చాస్కున్నా. దాని తరువాత ఈ విలువలు నా జీవితంతో ఫుట్బాలు ఆడుకోవటం మరీ ఎక్కువయింది.

మొన్నటికి మొన్న నా ఇంటి పక్కనుండే నా సహోద్యోగి శ్యాంగాడు "మరేం పర్లేదు రఘూ, మావి మీరు వాడుకుంటూ ఉంటె ఏవైనా పాడవుతే ఏం ఫర్లేదులే" అన్నాడు, "బాలికా, భయమ లేదు నాతొ రా, నిన్ను స్వర్గ లోకానికి పంపే ఏర్పాటు చేస్తా" అంటూ శ్రీదేవిని ట్రాప్ చేయచూసిన అమ్రీష్ పురిలా. "మరి పరుల సొమ్ము పాము వంటిది" అని అమ్మ చెప్పిన సద్దన్నం మూట మాటేవిటి అని మనసు నన్ను నిలదీసింది. "ఆగవే ఆలోచించనీవా, నీ దుంప తెగా" అని మనసుని మనసులో అనుకోపోయి పైకే అనేసి నా "బొంత" చేతుల్లో తల బొప్పి కట్టించుకోనేంత ప్రమాదం కొనితెచ్చుకొన్నా.

ఎలాగో అలా దాన్నుంచి తప్పించుకొని ఆలోచిస్తే నాకయిన జ్ఞానోదయం ఇదండీ-పరుల సొమ్ము పాము వంటిది నిజమే. కాని అది వేటికి వర్తిస్తుంది? "మనము ఏదయితే కొనుక్కోలేమో అది పాము వంటిది" ఎందుకంటే అలాటి వస్తువు మనం ఇతరుల నుంచి తీసుకొని పాడుచేస్తే అది వారికి కొనివ్వటం మనకు అనవసరపు ఖర్చు అవుతుంది, అందుకని అలాటివి వాడకూడదు. మనకు చిన్నపుడు చెప్పిన కథలో ఆ సోమిదేవమ్మ తన తాహతుని మించిన నగ తీసుకుపోయి పారేసుకుంటుంది కదా అలాగనమాట.
మనము ఎవరి దగ్గరియితే అరువు తీసుకొని పాడు చేస్తే "అవసరాన్ని మించి అతిగా ఫీల్" అవుతారో అలాటి వారు "పరులు" అవుతారు, వారి వస్తువు "పాము వంటిది అవుతుంది". అలాటి వారి దగ్గర మనం తీసుకోకూడదు. ఇవండీ నాకు తెలిసిన నిజాలు.


అయితే ఈ నిజాలు శోదిస్తూంటే నాకు ఇంకో బల్బు కూడా వెలిగిందందోయ్. సీమా బల్బు, ECE బల్బు కాదు ఐడియా బల్బు అనమాట. అదేంటంటే "పెద్ద వాళ్ళ మాటలు సద్ది అన్నం మూటలే కావచ్చు కాని అవి పనికి వస్తాయో లేదో చూసుకోకుండా తింటే విరేచనాలే"

వాడుక భాషలో చెప్పాలంటే- మనం నేర్చిన విలువలు, మనకు ఎదురైన ప్రతీ సందర్భంలో, "ఈ సందర్భానికి ఇది సరిపోతుందా" అని ఆలోచించాలి, అపుడే మనం విజ్ఞత ఉపయోగించినట్టు. లేదంటే schematics ప్రకారం పనిచేసుకు పోయే కంప్యూటర్లకు మనకు తేడా ఏం ఉంటుంది చెప్పండి.

మా ష్రింకుల భాషలో చెప్పాలంటే "kohlberg's post conventional morality అనమాట - stage 6 morality-the highest stage of morality- where a man decides morality not just based on what is right or wrong rigidly but based on a principle of "universal ethical ప్రిన్సిపల్స్"-

Thus, a man who has attained this Post conventional stage of morality decides what is right or wrong in each given event based on the specific circumstances of the event, not just on what society/tradition/culture deems right or wrong"(వివరాలకు http://en.wikipedia.org/wiki/Kohlberg చదవండి )



అయ్ బాబోయ్!!!! ఎన్ని ట్యూబులైట్లు వెలిగించేసానో ఒకేసారి. "బత్తి బంద్" గ్యాంగు వచ్చి "ఒకేసారి ఇన్ని వెలిగించావ్" అంటూ నా మీద గయ్ మనేలోగా నేను గప్ చుప్ అయిపోతా. బై.


ps- పైన రాసిన దాంట్లో అచ్చు తప్పులు కాక ఇంకో తప్పు జరిగింది కనుక్కోండి చూద్దాం ;-) దిద్దటానికి బద్ధకం వేసి ఇలా మీకు పని పెడుతున్నా.

2 comments: