Saturday, 12 September 2009

జీవన గీతిక

కణ్ణా,

నువు నా జీవితంలో ఏ ముహూర్తంలో అడుగుపెట్టావో కాని నా జీవితమే మారిపోయింది రా. జాడైనాలేకుండా రాలి పోయిన ఆ క్షణానికి నా గుండెల్లో ఎంత స్థానముందో తెలిస్తే “తుమ్మెద జన్మకు నూరేళ్ళెందుకు రోజే చాలులే” అంటూ తప్పక పాడేది. నిజంగా నీ పరిచయం నా ఎన్ని జన్మల అదృష్తమో.

ఆగాగు అలా నీ పెదాలపై చిరుదరహాసం తెచ్చుకోకు. మన వాదనలో నేనొడిపోయాను నువు చెప్పిందే నిజం అని అప్పుకోవట్లేదు. మన ఆ వాదన సృష్టించిన మనస్ఫర్ధలోనూ, తరవాత, మన ప్రవర్తనలను తలుచుకుంటుంటే అలా తోచింది.అలా నీ గురించి ఆలొచిస్తూ కూర్చున్నానా నాకెంతో ఇష్టమైన నీకూ ఊహల్లోనే అయినా నేనమితంగా ఆరాధించే గోదారమ్మకూఅ ఎంత స్వామ్యం కనపడిందో తెలుసా. చెపుతా విను.

ఆ గోదారమ్మ పుట్టుక, పెంపకం గురించి విన్నానే కాని చూడలేదు, అలాగే నువ్వూను. ఆ గోదారమ్మను చూసిన ప్రతీ సారి కలిగే అబ్బురం నిన్ను తరచిన ప్రతె సారి కలుగుతుంది. ఎక్కడో చిట్టి చినుకుగా మొదలైన ఓ ధార అఖండ వాహినిగా మారి ఈనాడు కనపడుతుంటే ఆ జీవనది ప్రయాణం ఆశాంతం ఆస్వాదించే భాగ్యం నాకెందుకు కలగలేదా అని పడే మధనే ఇప్పటి నిన్ను చూస్తూంటే నీ వచ్చే జన్మలో అయినా నీ తల్లీ తంద్రిగా, నీ అన్నా చెల్లిగా , నీ చిననాటి స్నేహితులగా, ఇలా నేనసంఖ్యాక జన్మలెత్తి నీ పరిచయం ముగియగానే ఆ తనువు చాలించి మళ్ళింకో జన్మెత్తి మళ్ళీ మళ్ళీ నీ పునఃపరిచయ భాగ్యం పొందే వరం సాధించటానికి ఏం చెయ్యాలా అన్న ఆలొచనను తెప్పిస్తుంది.

ఏయ్ అలా “ఎంత ఆశో” అనుకుంటూ చిలిపిగా నవ్వుకోకు. ఇంకా ఉంది చెపుతా విను. ఒకొక్కసారి పిల్లగొదారిలా పరుగులెడుతావు, పరవళ్ళు తొక్కుతావు, చిలిపితనం చిందిస్తావు….ఆ నీ ఉత్సాహం చూసి ముచ్చటపడి అక్కున చేర్చుకుందామని చొరవ చేసానా “అంతే సంగతులూ, చిత్తగించవలెనూ” అనుకునేట్టు నీ గాంభీర్యం, ఠీవి, లోతూ తెలిపే నీ మరుక్షణపు నడత…..అచ్చు పాపికొండల నడుమ పండు ముట్తైదువ గోదారిలా. ఎంత పవిత్రంగా అనిపిస్తావంటే “అయిగిరి నందిని విశ్వ వినోదిని…….” అంటూ సప్తపదిలో అతను చేసినట్టు సాష్ఠాంగం చెయ్యాలనిపిస్తుంది. ఆ సమయంలో నీ ఊగిసలాట చూస్తే ఎంత అసహనానికి గురిచేసినా ఇలా తీరికగా నెమరువెసుకుంటుంటే మాత్రం ఎంత హాయినిస్తుందో తెలుసా?

ఒయ్… కోపంగా పెదాలలా బిగించకు…..ఎమైనా చెయ్యటానికి నేనక్కడలేను…..ఉత్త అడవికాసిన వెన్నెల్ల నీ ఆ హావభావాలన్నీ. ఆవును నిజంగా నీది ఊగిసలాట మనస్తత్వమే కదరా. నీ వ్యక్తిత్వానికి నిర్వచనమైన స్ఫందలను దూరం చేసుకోలేవు (అవును రసానుభూతి ఇచ్చే కిక్ ఇంకేవాటిలో ఉంటుంది? అందులోనూ మనలాటి భావుకులకు) అలా అని ఆ స్ఫందనలనే జీవితం చేసుకోనూ లేవు….భాద్యతలున్నాయిగా. ఈ రెంటి చట్రంలో నువ్వెంత నలిగిపోతున్నావొ నాకు తెలుసు కానీ నువ్వలాగే ఉండాలని నా కొరికరా. నా ప్రకారం రస స్ఫందన లేని నీ జీవితం ఆ పెద్ద గదిలో బంధించిన గోదారమ్మలా స్థబ్ధుగా ఉంటుంది. ఆ స్థబ్ధత ఎంతమందికి మేలు చేసినా నీకు మాత్రం చేటే రా. నీ జీవచైతన్యం మొత్తం పోతుంది. నీ అంతట నువ్వలా అయిపోకేం?

ఆగాగు అలా అసహనంగా ఉత్తరాన్ని గిరాటేసి వెళ్ళిపోతే ఎలా నాకు బాధేయదు? ఇలా వచ్చి మిగితా ఉత్తరం కూడా ఆశాంతం విను మరి……రావా? సరే నెనే వస్తా తప్పుతుందా? అమ్మయ్య, అలిగినా కనీసం గదిలోకి రానిచ్చావు థాంక్స్. నీతో ఇదే తంటా. కాగడా పెట్టి వెతికినా చిన్న మెలిక కూడ కనపడక, సరే తిన్నగా ఉందిలే అనుకుని ఏమాత్రం ఆదమరిచానా, అంతే….ఏ మలుపులు తిరిగుతావో, ఏ కోనన దాక్కుంటావో కనపడనే కనపడవు. నిద్రాహారాలు మాని శోధించి చేరుకుని “నన్నొదిలిపొయావు” అని నిందిద్దామనుకునే లోపే “నిన్నొదిలిపోవటమా? సాధ్యమా? నా దరిని వదిలి పోయే దారులున్నాయా ఈ లోకంలో? నీకే నాపై నమ్మకం లేదు. ఆ దరి ఆ దరే, ఈ దరి ఈ దరే…నేవే అనవసరంగా కలవరపడుతావు” అనో “నీ పక్కన నేనుంటే తారల పట్టుకు అడిగేవు” అంటూనో దబాయింపు సెక్షన్ మొదలెడతావు. అప్పటిదాకా నువు కనిపిస్తే “ఈ లైలా కోసం.... తిరిగాను దేశం దేశం. ప్రతి పగలూ.... ప్రతి రాత్రి... ఆమె కోసం…..” అనాలనుకుంటున్న నేను అప్రయత్నంగానే “నీకు ఎమీ కావాలో నాకు అర్థం కాలేదే, పూల బాణం వేసావే పిచ్చి వాణ్ణీ చేసావే” అనుకుంటూ నీ కొంగు పట్టుకు వచ్చేస్తాను.

అలా వచ్చెస్తానా, పాడు మగ బుధ్ధి మాత్రం “ఈసారి కూదా నువ్వే తలవొగ్గావు” అంటూ తెగ విసిగించ చూస్తుంది. కానీ కణ్ణా, నిజం చెపుతున్నా….మన మనస్ఫర్ధలు ఇలాగే అలకాలం ఉండాలని కోరుకుంటాను, నిజంగా నిజం. ఎందుకో ఎలుసా? ఈ మనస్ఫర్ధల్లోనూ, ఆ తరవాతా ఎంత జీవితం చూపుతావనీ? "సంతోషంలో కలిసుండటం గొప్పేం కాదు, కలతల్లో కలిసుండు చూద్దాం" అంటూ సవాలు చేస్తూనే ఎన్ని జీవిత సత్యాలు బోధిస్తావని.

ఈ కలతల చివరి మజిలీలో మనం తిరిగొకటైనపుడు నువు చూపే ఆ ఆర్థి ఎంత బావుంటుందో తెలుసా? కొద్ది సేపే అయినా, మచ్చుకైనా నీ ఛాయలు కానరాకుండా నాలో కలిసిపోయే నువ్వు ఆ గోదారమ్మకు ప్రతీకవై అప్పటివరకు ఎగసిపడిన నా పురుషాహంకారపుటలలు అప్పటికి ఎక్కడ దాగిపోతాయో కాని ప్రశాంత హృదయుడనై నిన్ను కలుపుకున్న నేను ఆ సాగరుడితో సమానమే.

ఆ సమానంలోనూ నేనే కొంచం ఎక్కువ సమానం.అతనికి అప్రతిహత ధారాపాతంగా కలయికొక్కటే, ఆగకుండా ఆనందభైరవి రాగాలాపనొక్కటే …మొహం మొత్తేట్టు. మరి నాకో? విరహం, కలహం, సర్దుబాట్లు, కలయిక ఇలా ఎన్ని మేలకర్తల రాగమాలికో నీవు నా ఎదను పాడుతున్న ఈ జీవన గీతిక. మన హృదయాలకూ, భావుకతలకూ, ఆ చతురానననునికి, నీ వ్యక్తిత్వానికి, ఇలా ఎందరికి ఋణపడున్నానో ఈ భాగ్యానికి.

నీ

ఎమ్మెస్సార్.

2 comments: