ఇక్కడ ఆగుదామా
సరే
రా కూర్చుందాం
"ఎక్కడ?" అన్నట్టు ప్రశ్నార్థకానికి
సూటిగా నన్నే చూస్తున్న చూపులు
మాట్లాడకుండా పక్కనే సర్దుకుపోయా
తనను తాకుతూ కూర్చోటం కొత్తేం కాదు
కోటి వీణలు మనసులో మ్రోగటంలాటివేవి ఉండవు
కాని ఆ దగ్గరితనం ..........ఎలా చెప్పను?
ఎదురుగా సూరీడు
ఆయన కింద మబ్బులమ్మ
ఆమె కింద పచ్చని పిల్ల పైర్లు
చుట్టూ కమ్ముకున్న గాలి దేవుడు
కిచకిచమని అల్లరి చేస్తూ పక్షులు
రోజాలో పెళ్లి చూపుల్లో అరవింద్ రోజా అక్కను మాట్లాడించే సీన్ గుర్తొచ్చింది.
"ఖామోష్" అంటూ అనార్కలీలో పృధ్వీ రాజ్కపూర్ లా ఊగిపోతూ అరవాలన్నంత కోపం.....
"తఖ్లీయత్" అంటూ పెదాలు కదలకుండానే దిలీప్కుమార్లా ఆజ్ఞాపించి వారందరినీ మాయం చేసే అధికారం ......
స్పర్శ!
ఎంత సేపు ఉండిపోయామో
ఎన్ని సెకన్లు వచ్చి చూసిపోయాయో
పాపం మంచివే
తమ రాక, పోక, ఉనికి ఏవీ తెలీనంత మెల్లగా
ఆకలేస్తోంది - తను.
లోకంలో పడ్డాను
తెచ్చుకున్న పెరుగన్నం విప్పుతుంటే ఎప్పుడో తన మాటలు
అలా దేశాటన చేసుకుంటూ ఒక నెల రోజులు అనామకుడినై పోవాలనుంది...పొద్దున్న పూట ఎవ్వరూ లేని చోట...తెచ్చుకున్న సద్దన్నం పెరుగు వేసుకుని అంటున్న నన్ను అంతా బానే ఉంది కాని ఆ సద్దన్నం ఎందుకు అప్పుడే వేడి వేడిగా వండుకోవాలి అనుకోవచ్చుగా అంటూ
చిన్నగా నవ్వు తన పెదాల మీద
తనకూ అదే గుర్తొచ్చిందేమో
పెరుగన్నం గట్టిగా కలుపుకొచ్చాము
చేతుల్లో ముద్దలు
భోజనాన్నికాలాన్నీ అలా.......
చేతులు కడుక్కుంటున్న తను
వెనకనుంచి తడుముతున్న నా చూపులు
వెనుతిరిగిన తన చూపుల్లో
ఇకపై అలాటివేవీ ఉండవన్నావుగా ప్రశ్న
నన్ను నా శరీరాన్నుంచి పెకలించే శక్తే లేదా
కేక వినిందేమో
కళ్ళలో ఏదో పడింది ఊదు అంటూ
నా చేతుల్లో తన మోహం, కళ్ళెదుట కళ్ళు
పడిందో లేదో కాని "జల"తారు పొర మాత్రం చూసా
అరుంధతిని చూసేస్తూ నేనూ ఉదేసా
ఎలా అర్థం చేసుకోనూ తనను
ఇలాటివేవీ ఉండవన్నావుగా అన్నప్పుడు తన కళ్ళల్లోని బాధ
నా చేతుల్లోకి తన మొహాన్ని ఇచ్చేసి కళ్ళు మూసుకున్న తన నమ్మకం
మనసులో ఏముందో కాని మోహంలో చెరగని నిర్మలత్వం
నా హృదిలోని గరళాన్ని కూడా ఇలాగే సబ్లైం నేనెందుకు చెయ్యలేను?
పనుల హడావుడిలోనూ ఆయమ్మ పిలిచింది
అనుకుంటూ వచ్చిపోతున్న పేరంటాళ్ళా
కొంతసేపు మెరిసిపోతున్న తారలు
కొత్త కోడలి పేరంటం ముచ్చటను పర్యవేక్షిస్తున్న జాబిలమ్మ మాత్రం మొత్తంగా .......
సూర్యుడు మాయమయ్యి జాబిలమ్మ!
సమయం అయిపోయింది
జైలర్లా కరుకుగా ఉరుము
మాట్లాడకుండా వచ్చేసాము
కొండ దిగి, బాట దాటి
అరణ్యంలోకి
ఇంటి దగ్గర దిగబెట్టాక
మళ్ళీ ఎప్పుడు అన్న ప్రశ్నను చూడలేకేమో
చూపులు కలవలా
ఆ ప్రశ్నకు సమాధానం రాదని తెలిసే
వస్తా కు బదులు ఒకే బై అంటూ వచ్చింది నా వీడ్కోలు
No comments:
Post a Comment