సుమారుగా పదేళ్ళు ఉంటాయేమో నాకు అప్పుడు. మేము అద్దెకు ఉండే ఇంటి వాళ్ళింట్లో వారానికి ఒకరోజు మాత్రమె వచ్చే తెలుగు చిత్రాన్ని, అదీ నలుపు తెలుపు చిత్రం అనుకుంటా, వాళ్ల daynora TV లో చూసి బయట ఆడుకుంటున్నాను మిగితా పిల్లలందరితోనూ కలిసి.
"చూడవోయ్ లక్ష్మీ, నీ కొడుకు అప్పుడే నేనూ మా ఆవిడా అంటూ పాట పాడుతున్నాడు" అని మా ఇంటి ఓనరు ఆంటీ మా అమ్మతో పరాచికాలాడుతుంటే గాని అర్థం కాలేదు నాకు ఏదో పాటను బయటకే పాడేస్తున్నానని. అమ్మను మెల్లగా అడిగా "ఏం పాడానే?" అని. అమ్మ విరగబడి నవ్వుతూ "పాలూ మీగడ, పెరుగూ ఆవడ ......నేనూ మా ఆవిడా (16th song in 80s songs).... నాయనా నువ్వు పాడింది" అని అనేసరికి ఎక్కడ లేని సిగ్గొచ్చింది. పైకి పారిపోయి మా వాటాలో దాక్కున్న సంగతి నాకు ఇంకా గుర్తే.
తరవాత అదే ఆంటీ ఇంట్లో చిత్రలహరి ముందు వచ్చే advertisements లో "ఆప్కో చేనేతలు, అందమైన చీరలు" అన్న APCO advertisement ట్యాగ్ లైన్ తో స్వరం కలిపి, నన్ను నేను మరిచిపోయి, అందరి ఎదుటా (దాదాపు పదిహేను మంది చేరే వాళ్ళం ఆ అంటీ ఇంటి డ్రాయింగు రూములో రాత్రి ఎనిమిదిన్నరకు చిత్రలహరి కోసం 1984 వరకు) "ఆప్కో చేనేతలు అందమైన టీచర్లు" అని అనేసి ఆ ఆంటీ చేతిలో చివాట్లు కూడా తిన్నాను.
అలాగే ఆరోగ్యం బాలేనపుడు అమ్మ ఒడిలో పడుకొని తన మధుర కంఠంతో నాకు నచ్చిన సినీ పాటలు పాడిపించికుంటూ నొప్పిని మరచిన రోజులు కూడా ఇంకా గుర్తు.
ఇంతా ఉపోత్ఘాతము దేనికి అంటే "నేను చిన్నప్పటి నుంచీ మంచి సంగీతమంటే పడి చచ్చే వాడిని" అని చెప్పటానికి అన్నమాట. అలా చిత్ర గీతాలతో, advertisements tag lines తో మొదలయింది నా సంగీతాభిలాష. మొదట మొదట అది దాదాపుగా చిత్ర గీతాలకే పరిమితమయిండేది. ఎంతగా ఇష్టపడే వాడినంటే రాత్రి తొమ్మిది దాటాక పిడుగులు పడ్డా నిద్ర మేల్కోని నేను, పదిన్నరకి అనుకుంటా, మొదలయ్యే "ఏక చిత్ర గీతాలు" కార్యక్రమం కోసం చల్ల నీళ్లు మొహం పై కొట్టుకొని అయినా మేల్కొనే వాడిని. (దానికి తొడు మా నాన్నని ఎదిరించయినా, ప్రతి మంగళ వారం అనుకుంటా, ఆ కార్యరమం రేడియోలో పెట్టించే నా రాకాసి పెద్ద చెల్లి నాకు కొండంత అండ లెండి ఆ విషయంలో మాత్రం).
అలా కొంచం కొంచంగా బలపడసాగింది నా సంగీతాభిలాష. అయితే అప్పటికి "సంగీతాభిలాష" ఇలాటి conceptual భావాలు ఏవీ ఉండేవు కావు. "పాట నచ్చింది, మాటలు బావున్నాయి" ఇవి మాత్రమె తెలిసేది. పైగా శాస్త్రీయ సంగీతం అంటే చూపు ఉండేది "చ! ఎప్పుడూ ఒకటే గోల ఆ...ఆ..అంటూ ఒక్క అక్షరాన్ని లాగుతూ పీకుతూ ఉండటమేగా అది" అని కారుకూతలు కూసి దూరదర్శన్లో వచ్చే మంగళంపల్లి గారి సంగీత కచేరిని తులనాడిన సందర్భాలు కూడా గుర్తే. (ఇపుడు అదే మంగళంపల్లి వారి కచేరి నిజంగా ఇక్కడ మా UK లో జరగాలె కానీ "అవునులే international film festival యార్కులో జరుగుతోంది, మనకు గంటే దూరం అన్నా తీసుకుపోలేదు కాని ఇప్పుడు నీకు నచ్చిన కచేరి కోసం అంత దూరం వెళ్తానంటావు" అని నా శ్రీమతి చేత శఠగోపం పెట్టించుకోటానికయినా సిద్ధమే)
కొంచం కొంచంగా వయసూ,ఊహ, జ్ఞానం పెరిగే కొద్దీ ఈ పాటలు ఇష్టమవాడమే కాకుండా emotional memories జత అవటం మొదలెట్టాయి ఈ పాటలతో. పొద్దున్న పూట నీరెండలో బడికి వెళ్తూ "భూలే భిశ్రే గీత"లోనో ఇంకో దేంట్లోనో "నూరీ..... నూరీ....ఆజారే....." అంటూ వచ్చే పాటలు ఎంతగా మనసును గిలిగింతలు పెట్టేవో చెప్పలేను. ఆరోజు మొదటి పీరియడ్ అంతా నా ఇష్టమయిన సహధ్యాయినులు అందరూ "నూరీలుగా" అనిపించి ఎంత అల్లరి పెట్టే వారో మనసును. (మనసును ఎంత అల్లరి పెట్టినా స్కూల్లో ఎవ్వరినీ ఏడిపించలేదండీ బాబూ. ఉట్టి "రాముడు మంచి బాలుడినే" . దానికి ప్రమాణము నాకు ఏ బడిలోనూ ఎవ్వరూ కట్టని రాఖీలు, కావాలంటే ఆ రాఖీ దేవతనే అడగండి సాక్షం:-)
అలాగే "ప్రాభాత మంగళ పూజా వేళా...... నీ పద సన్నిధి నిలబడీ....., నీ పద పీఠిక తలనిడీ......." అన్న భక్త తుకారాం పాట, "ఎన్నీఎల్లో.... ఎన్నీఎల్లో సందామామా...పిల్లాదానీ మనువూ సేయి సందామామా..." భక్త కన్నప్ప పాటా పొద్దునే వినటం చాలా ఇష్టమయ్యేవి. ఆ అలవాటు ఎంతగా నాటుకు పోయిందంటే ఇప్పటికీ ఆ మూడు పాటలు నేను పొద్దుటి పూట నీరెండలో మాత్రమె వింటాను. నీరెండ లేకపోతె విననే వినను.
అలాగే మా న్యూ నల్లకుంట కొత్త రామాలయం దగ్గర ఉన్న సందులో BJP వారి ఎన్నికల కార్యాలయం నుంచి వచ్చే "I am a disco dancer" అన్న మిథున్దా పాటలకు ఉర్రూతలూగిపోతూ ఊగటం, పంద్రాగస్టు నాడు "ఏయ్ మేరె వతనుకే లోగో, జరా ఆంఖ్ మే భార్లో పానీ" అన్న లతాగారి పాటకు కన్నీళ్లు పెట్టాం కూడా అలవాటయ్యాయి. ఇప్పటికీ ఆ పాట వింటే రోమాలు నిక్కబొడుచుకుంటాయి.
(సశేషం )
నేను వరుసలో ఉన్నాను తరువాయి భాగము కోసము ఎదురు చూస్తూ...:)
ReplyDeletemee tappa chaduvutunte, manasuki chekkiligintalu pettinatlu undi. chala hayi ga , aeduruga undi kaburlu cheputunnatu..
ReplyDeleteచాలా బాగుందండీ మంచి మంచి పాటల్ని మళ్ళీ ఓ సారి మనసారా గుర్తు చేసుకున్నాను.
ReplyDelete