మిమ్మల్ని మీరు కొంచం బాధ పెట్టుకోండి...పర్లేదు, నా కోసం.
అందుకు ప్రతిగా నిద్రలో నా ఆఖరు అడుగు పడకూడదని నే కోరుకుంతా.
సరైన మూల్యమేగా మీ బాధకు.
పర్లేదు...నన్నింటికి తీసుకొచ్చేయండి.
ఆ తెల్ల గౌన్లూ, ముఖాలకు మాస్కులూ.....
వీటిని చూస్తూ కాదు నా ఆఖరు అడుగు పడాల్సినది.
బాబూ...అక్కను జాగర్తగా చూసుకో ఆడపిల్లది లాంటివేవీ సొల్లు కబుర్లు చెప్పను.
నా కాలి గోర్లు శుభ్రంగా నువ్వు కత్తిరించు.
నాకు చివరి సారి గడ్డం నువ్వు గీయి. పర్లేదు కొన్ని గాట్లు పడ్డా.
నా గడ్డంపై వణికే నీ చేయి చాలదూ?
ఒరేయ్, కన్నీరు ఆపుకోకు. కారనీ.
నాకు గోరుముద్దలు తినిపించు తల్లీ.
తమ్ముడు మగాడు కదా, ఆ లాలిత్యం ఉండదు.
మళ్ళీ ఓసారమ్మను గుర్తు చెయ్యి.
మనసారా అందరూ గట్టిగా కౌగిలించుకోండి.
కళ్ళు నొప్పులు పుడుతున్నా మా రూంలో నా మంచం మీదే ఉండండి.
అమ్మనొక్కదాన్నీ నాన్నతో ఉండనీ అని రాత్రి ఒంటరిని చేయొద్దు.
ఇంకెవరినీ పిలవొద్దు. అత్తయ్యలను కూడా.
నిన్న చూసాగా చాలు.
రాత్రంతా....ఆ నిశ్వాసమయ్యే దాకా.....పక్కనే కూర్చొండేం?
నచ్చనివి ఎన్నో చేసుంటాను.
అవి మాట్లాడుకోటానికి మీ పయనిమింకా ఎంతో ఉంది.
నచ్చినవి ఎంతో కొంత చేసే ఉంటాను.
అవి కొంచం బయటకు లాగండి.
వెచ్చగా కప్పండేం ఆ శాలువలు?
తరవాతి పూలమాలలెవడికి కావాలోయ్?
తెలుసు, మీక్కష్టమే.....
కానీ
ఆ చివరి పాదాభివందనానికీ
ఆ చివరి కౌగిలింతకూ
నోచుకొకుండా అవకండేం?
అనుభవపూర్వకంగా చెపుతున్నా!!!
బుజ్జోడా
అభిమన్యునిలా నేర్చుకో ఇది.
బుజ్జమ్మా
నీ సందూకలో ఈ నా లేఖ.
No comments:
Post a Comment