ఎన్నో ఏళ్ళ కోరికైన గోదావరి పాపికొండలకన్నా ముందే గంగా దర్శనం.
అమ్మతో వెళ్ళిన కాశీ క్షేత్రాన.
అబ్బ ఏమని చెప్పాలి?
సాంకాలం గంగా ఆరతి కాదు, పొద్దుటి విశ్వేశ్వరుని గుడి కాదు .. పది నుండి పన్నెండు మధ్యన అనుభవించిన ఆ గంగా తీరపు ఆనందం.
ఒక చోటేమో పక్కన లేని స్వాతి లోటును గుర్తు చేస్తూ నది అలలు -చింగారి కొయీ భడ్కే పాట గుర్తొచ్చింది.
ఇంకో చోటేమో జనజీవన స్రవంతి -జాలర్లు తమ బోటు ఇంజిన్ రెపైర్ చేస్తూ, వలలను సర్దుకుంటూ, పడవలను తయారు చేస్తూ, బుడ్డి జాలరి చిట్టి చేపలను పడుతూ..... వెనకాల ఉన్న గాలిపటం ఎగిరెస్తున్న అమ్మాయి ఫోటో తీస్తుంటే ముందున్న పేకాటరాయళ్ళ ఉలికిపాటు తమను తీస్త్తున్నాను అనుకుంటూ...భలే నవ్వొచ్చింది.
బడి వేళల్లో కిర్కెట్ ఆడుకుంటున్న మూడు నాలుగు టీంలు - ఇదేంట్రా బడి రోజుల్లో బడికి పోరా అనడిగితే ---కరోనానే హమారా పడాయీ బంద్ కర్దియా అన్న తమ్ముళ్ళ (అవును తమ్ముళ్ళు అనే అనుకొంటాను పోరగాళ్ళను ఇంకా ...నా ఇష్టం మీకేం కష్టం? నువ్వు యూతేంట్రా అన్నా కూదా!!)
హాయిగా ఆ ఘాట్ల వెంట ఒక గంట అటూ ఒక గంట ఇటూ నడుస్తూ ఉంటే నన్ను నేనే మళ్ళీ ఎన్నో ఏళ్ళకు పలకరించుకొన్నట్లు అయింది.
ఆవలి తీరానికి పడవలో నింపాదిగ వెళ్ళాలన్న కోరిక ఈసారి తీరలా --అయితేనేమీ ఇది తొలి చూపే. సఖ్యత కుదుర్చుకోవాలి, మరులు కొలపాలి, అక్కున చేర్చుకోవాలి, అలకలూ కొట్లాటలూ అబ్బో ఇంక ఎన్నో నెరపాలి గంగతో తన తీరాలతో... నా కోసం, నా స్వాతితో రావటం కోసం ఎంతగానో ఎదురుచూస్తానని చేతిలో చేయేసి చెప్పింది.
గంగమ్మ కాదు గంగ, అంతే, ఉత్తి గంగే.
No comments:
Post a Comment