ఇలా మరో ఏడు గడిచింది. నేను House Surgeonship చేస్తున్న రోజులు అనుకుంటా. అపుడపుడు చెల్లి నుంచి తన కబుర్లు తెలిసేవి. మంచి పనిమంతురాలు అని, నాన్న చిరు ఉద్యోగి, తాగుబోతు అయినా తల్లితో కలిసి గుట్టుగా కుటుంబాన్ని లాగటంలో పడి పదితో చదువు ఆపేసిందని ఇలా. ఇది తెలిసి మనసు కొంచం బాధ పడ్డ మాట నిజం మొదట. నేనేమో కాలేజిలో మార్కులలో మొదటి అయిదుగురికంటే కిందకు రాని వాడిని. అటువంటి వాడిని పది మాత్రమె చదివిన అమ్మాయిని చేసుకుంటే నా మనసును సమాధాన పెట్ట గలనా అని ఆలోచించే వాడిని. కాని తన మిగితా గుణ గణాలు, ముఖ్యంగా నస్యం రంగు పట్టు చీర పిల్లగా నా మనసున ముద్ర పడిన తన మోహన రూపం నన్ను ఎక్కువగా ఆలోచించనీయలేదు. ఉద్యోగం స్థిర పడిన వెంటనే ఈ విషయం ఎత్తాలని నిశ్చయించాను.
మరో ఏడాది గడిచింది. అప్పుడు నేను MBBS పూర్తి చేసిన డాక్టర్ను. ఇంటి భాద్యతలు పంచుకోవాలిసిన అవసరం ఏర్పడటంతో PG ఆశలు పక్కన పెట్టి రెండు ఆసుపత్రులలో డ్యూటీ డాక్టర్గా చేరాను. రోజుకు ఇరవై గంటల పని. సాయంత్రం ఒక నాలుగు గంటలు మాత్రం ఇంటికి వచ్చే వాడిని. ఇలా జీవన స్రవంతిలో కొట్టుకు పోతున్న నేను ఆ అమ్మాయిని గూర్చి తలవటం తప్ప ఇంకేం చేయలేక పోయే వాడిని. అందులోను ఆ అమ్మాయికి సంభంధాలు వెతుకుతున్నారన్న విషయం ఇంకా బాధ పెట్టింది.
అలాంటి సమయంలోనే ఆసుపత్రిలో నా సహోద్యోగులు UKలో ఉద్యోగం దొరకటం చాల సులువని, ఖర్చు ఒక రెండు మూడు లక్షలు మాత్రమె అని, జీతం నెలకు రెండు లక్షల దాక ఉంటుందని అనటంతో నా ఆశకు కొత్త ఊపిరి వచ్చినట్టైంది. రెండు ఉద్యోగాలు చేస్తూనే IELTS (ఇంగ్లీషు పరిక్ష ), PLAB -1 (అక్కడకు కావాల్సిన మెడికల్ పరీక్షలలో మొదటిది) పరిక్ష చక చకా పాసవటం, కావలసిన రెండు లక్షలు సర్దుబాటు అవటం చక చక జరిగి పోయాయి. ఇంక రెండు నెలలో నా UK ప్రయాణం అనగా, అంటే నెల క్రితం, ఆ సంఘటన జరిగింది.
ఆదివారం అందరం కలిసి భోజనం చేయటం మా కుటుంబంలో అలవాటే. అలాగే ఆ రోజు కూడా. మళ్లీ మాటల విషయంలో తన సంగతి వచ్చింది. అప్పటికే బాగా ఆలోచించిన నేను చిన్నగా "మీకు ఇష్టమైతే నేను తనను చేసుకుంటాను" అని అమ్మ, నాన్న వైపు చూసా. అమ్మ సంతోషంతో ఎగిరి గంతేసినంత పని చేసింది. "నా బాబే. నా మనసులోని మాట చెప్పావురా. నాకు ఎన్నాళ్ళ నుంచో ఉంది ఈ కోరిక, కాని అంత చదివిన నువ్వు ఆ అమ్మాయిని చేసుకుంటావో లేదో అని అనుమానమేసి అడగలేదు" అంది.
చెల్లి "ఎరా దొంగ. ఎప్పటినించి ఈ వ్యవహారం నడుస్తోంది? అమ్మాయికి I Love you చెప్పెసావా, ఇంకా లేదా? అమ్మో కామ్ గా, బిజీగా Hyderabadలో ఉండే వాడివి, ఎక్కడో పురంలో ఉన్నా తనతో కాంటాక్ట్స్ ఎలా మెయింటైన్ చేసే వాడివి. చెప్పరా నీ ప్రేమ కథ" అని సంబర పడ సాగింది. "అంత సీన్ లేదులేవే. తనతో ఇంట వరకు ఒక్క ముక్క కూడా మాటలాడలేదు. పెళ్ళిలో చూసిందే తరవాత చూడను కూడా లేదు. ఇంట్లో ఇష్టమైతే సాంప్రదాయ బద్దంగా అడిగిద్దాము అని నా ఆలోచన " అన్నాను. అది "ఛి వెధవ. నువ్వు నిజంగా వేస్టురా. సరే కాని ఇప్పుడు మాత్రం సమయం వృధా చేయకు ఇంక ఒక నెలే నువ్వు ఉండేది. ఇంతలోనే అన్ని సెటిల్ చేసుకొని వెళ్ళు" అని ఉచిత సలహా పారేసింది.
మౌనంగా ఉన్న నాన్న వైపు చూసా. నాన్న చిన్నగా నిట్టూర్చి "మీకందరికీ తెలుసు నా అభిప్రాయం. వాళ్ల కుటుంబం మనకు ఏ మాత్రం తగదు. అమ్మాయి మంచిదే కాదనను. కాని కుటుంబం మన స్థాయికి తగదు" అన్నారు. మా అందరి ఉత్సాహం మీద నీళ్లు చల్లినట్టయింది. నా మొహంలో నిరాశ చూసారో ఏమో నాన్న "సరే సరే. మీ అందరికి ఇష్టమయితే నేను వద్దనటం ఎందుకు. మాటాడమనండి సంబంధం" అని మళ్లీ తనే అని తన ఔన్నత్యాన్ని చాటు కున్నారు.
అమ్మ సంబరపడిపోతూ "ఇప్పుడే ఫోన్ చేస్తాను నీ పెద్ద చెల్లికి విషయం కదపమని" అంటూ ఫోన్ ఎత్తుతుంటే నేను "అమ్మా ఆగు. ముందు మనం మాట్లాడుకోవల్సింది ఇంక ఉంది " అని అమ్మను ఆపాను. "ఏ విషయం రా? " అమ్మ ప్రశ్న. "నా అనారోగ్యం సంగతి వాళ్ళకు తప్పని సరిగా తెలియాలి. అదీ పెళ్లి చూపుల ముందే." నా జవాబు. "అదేంటిరా. పెళ్లి చూపులవని అప్పుడు చెప్దాం. ఇప్పుడేం తొందర" అమ్మ బాధగా అడిగింది.
కొంచం గట్టిగానే నా నిర్ణయం తెలిపాను. "తప్పదమ్మా. నాకు ఉన్న హిమోఫీలియా అనే వ్యాధి చిన్నదేమీ కాదు. జన్యు పరంగా వచ్చిన లోపం వలన రక్తం గడ్డ కట్టదు. అందువలన ఏ చిన్న దెబ్బ తగిలినా శరీరంలో రక్తం కారడం ఆగదు, ఎక్కడైనా తెగితే లెదా కోసుకు పొతే ధారా పాతంగా రక్తం కారుతూనే ఉంటుంది. దీనికి చికిత్స లేదు. దెబ్బలు తగలకుండా మల్లె పూవెత్తు అన్నట్టు నన్ను చూసుకోవాలి.
పైగా నాకు పుట్ట బోయే కొడుకు బాగానే పుడతాడు కాని కూతురు తప్పని సరిగా ఈ జబ్బు కల జన్యువును తను మోస్తుంది నీలా carrier అయి . చెల్లి పెళ్ళప్పుడు చూసాంగా ఎంత అంతర్మధన పడతారో అటువంటి carriers. ఇటు తాము జబ్బు మనుషులు కాదు కాబట్టి చెప్పకూడదని అనిపిస్తుంది, అటు పుట్టబోయే పిల్లలు ప్రభావితం అయే అవకాసం ఉంది కాబట్టి చెప్పాలి అని ఆత్మ ఘోషిస్తుంది.
ఇవన్నీ నన్ను పెళ్లి చేసుకొనే వాళ్లు ఎవరైనా బాగా అలోచించి నిర్ణయం తీసుకోవాలిసిన విషయాలు. పెళ్లి చూపులకు ముందే చెపితే వారికి నచ్చకపోతే పెళ్లి చూపులనే ప్రహసనమే ఉండదు కదా. అప్పుడు నాకు, ఆ అమ్మాయికి ఇద్దరికీ అవమానం జరగ కుండా ఉంటుంది" అని నా సుదీర్ఘ ఉపన్యాసం ముగించాను. అమ్మ "సరేలే అలాగే చేద్దాం" అని బాధ పడుతూ అనటం నాకు ఇంకా గుర్తే.
తరవాత చక చకా సంభంధం విషయం అవతలి వారికి మోసేసారు నా చెల్లి, తల్లి ఇద్దరు. నా సంగతి తెలుసు కాబట్టి విషయం ఏదీ దాచకుండా చెప్పారు. పదిహేను రోజులు గడిచిన పిమ్మట వర్తమానం వచ్చింది వారి నుంచి. పెళ్లి చూపులకు రమ్మని. నా ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.
"వారి పేదరికము, భాద్యత మరిచిన తండ్రి-ఇలా ఈ సంభంధం వప్పుకోటానికి కారణం ఏదైనా కావచ్చు కాని నా చేతికి రాబోతున్న ఈ మంచి ముత్యాన్ని జీవితాంతం పదిలంగా చూసుకొనే విజ్ఞత, సమర్ధత నాకు ఇవ్వు తండ్రి" అని దేవుని ఉనికిని ఇంతవరకు నమ్మని నేను, చేతులు జోడించి నా జీవితంలో మొదటిసారి కోవెలలో దేవుని కోరుకున్నాను ఆ రోజు. "ఆ వర్తమానం ఫలితమే ఈ ప్రయాణం" అనుకుంటూ నా మనసు నా గతాన్ని నెమరు వేయటం ముగించింది.
----------------------XXXXXXXXX---------------------------
పెళ్లి చూపులకు హోటల్ నుండి వారి ఇంటికి వెళ్ళాము. అతిధి మర్యాదలు బానే జరిగాయి. అమ్మాయి తల్లి, అన్నా నను పలకరించిన తీరు వారికి ఈ సంభంధం ఇష్టమని చెప్పకనే చెపుతోంది. "ఇష్ట పడరా మరి. ఎంతైనా UK లో పని చేయబోతున్న డాక్టర్ని కదా " కొంచం గర్వంగా అనుకుంది మనసు. "ఇక్కడ నువ్వు నచ్చాల్సింది వారికి కాదు, అమ్మాయికి. ఒకటి గుర్తు పెట్టుకో. నువ్వేం జగదేక సుందరుడివి కాదు, పైగా అనారోగ్యం మనిషివి. అల్లాంటిది ఈ సంభంధం ఒప్పుకుంటున్నారంటే ఖచ్చితంగా నీ హోదా చూసే. అదీ తప్పేం కాదు కాని ఆ సర్దుబాటు అనేది అమ్మాయి నుంచి కూడా ఉందా లేక తనను బలవంత పెడుతున్నారా అనేది తెలుసుకోవాల్సిన భాద్యత నీదే. బలవంతపు పెళ్లి ఎవరికీ సుఖమివ్వదు గుర్తు పెట్టుకో" అని హెచ్చరిస్తున్న అంతరాత్మ గొంతు నొక్కాను తను రావటంతో.
మళ్లీ అదే పట్టు చీర. నస్యం రంగుది. ఎంత బావుందో. ఏ మాత్రం బిడియం, అనవసరపు సిగ్గు లేకుండా అమ్మతో, చెల్లితో కలిసిపోయి కబుర్లు చెప్పటం ఇందాకటి నుంచి వినిపిస్తూనే ఉంది లోపలి నుంచి తన కోకిల స్వరం. అలాటి తను వంటరిగా నన్ను కలిసినపుడు మాత్రం మూగపోయింది. నేనే కదిలించాను "నేను గుర్తున్నానా?" అని. "చెత్త ప్రశ్న. అనవసరపు ప్రశ్న" మళ్లీ మొదలెట్టింది అంతరాత్మ. చిన్న చిరునవ్వుతో తల ఊపే తన జవాబు అవగా మళ్లీ మాట కలిపాను.
"నాకు ఇంటికి వెళ్లి చెప్పటం ఇలా వ్యవహారం లాగటం ఇష్టం ఉండదు. ఇక్కడే చెపుతున్నాను. మీరు అంటే నాకు ఇష్టం. ఈ పెళ్లి చూపులనేది నా మటుకు నాకు ఫార్మాలిటీ" అన్నాను. ఈసారి తలెత్తి చూసి "తెలుసు మీ అమ్మ చెప్పారు" అంది చిన్నగా నవ్వుతూ. తలెత్తి చూసినప్పుడు తన మెడ బోసిగా ఉండటం చూసి కొంచం బాధేసింది. ముత్యాల పేరు ఉంటే ఆ సన్నని మెడలో ఎంత బావుండేది అని నేను అనుకుంటుండగా తనే మాటాడించింది మళ్లీ.
"మీకు సిగరెట్, జూదం లాంటి అలవాట్లు లేవు కదా?" అని చిన్నగా అడిగింది. "మా నాన్న లాగ తాగుడు లాటి వ్యసనాలు లేవు కదా?" అన్న తన అసలు ప్రశ్న అర్థమై హృదయం ఆర్ధ్రమయింది. "చివరికి కాఫీ టీ కూడా అలవాటు లేదు. ఉత్త హార్లిక్స్ బేబిని. కావాలంటే మా బావగారిని, అదే మీ అన్నయని అడగండి చెపుతారు" అని చమత్కరిస్తూనే నేను తన సందేహం తీర్చాను. సందేహ నివృత్తి అయిన తన సుందర వదనం నవవికసిత కమలమే అయింది.
"మీకు చెప్పే ఉంటారు మా వాళ్లు నా అనారోగ్యం సంగతి. మీకు ఏ బలవంతం లేకుండా ఇష్టమైతేనే వప్పుకోండి. ఇంట్లో వాళ్లు ఏ మాత్రం మిమ్మల్ని బలవంత పెడుతున్నా నాకు చెప్పండి నేను చెప్తాను ఈ సంభంధం నాకే ఇష్టం లేదని" నేను చెపుతున్నపుడు నా గొంతుకలో జీర నాకే స్ఫష్టంగా వినపడింది. "బలవంతమేమి లేదు. నిర్ణయం అమ్మ నాన్నలు నాకే వదిలేశారు". తన జవాబు.
"మీ అమ్మ నాన్నలు నిర్ణయం నీ మీద వదలటం వారి అసమర్ధతకు , నిస్సహాయతకు, నిర్భీతిగా మాటలాడని నేటి సగటు తల్లి తండ్రులకు ప్రత్యక్ష తార్కాణం. వారు నిర్ణయం నీ మీద వదిలేసినా విధి మాత్రం నీకు నిర్ణయం తీసుకొనే స్వతంత్రం ఇవ్వలేదు. పేదరికం, భాద్యతలు, జీవితంలో సెటిల్ అవాల్సిన అన్నా తమ్ముడు, కట్నం వద్దంటూ స్వార్థంతో వచ్చిన నేను, ఇలా అందరం నిన్ను దిక్బంధనం చేసామన్న మాట అసలు నిజం. కాని ఈ నిర్ణయం వల్ల నువ్వు ఎప్పటికి వగచకుండా చూసే భాద్యత నాది" మనసులోనే అనుకున్నాను.
"ఇంకా మీరు ఏమైనా తెలుసుకోవాలా నా గురించి,నా పరిస్థితుల గురించి?" అడిగాను. లేదన్నట్టు తల అడ్డంగా ఊపింది తను. "డాక్టర్ని ఎవరినైనా సంప్రదించారా నా గ్రించి తెలుసుకునేందుకు?" నేను తరచి అడిగాను. "అవసరం లేదు" అని తను జవాబు చెపినపుడు మాత్రం నిజంగా నా స్వార్థంపై నాకే కోపం వచ్చింది. కాని తప్పదు కదా. నేనూ సగటు మనిషినే అని సమర్ధించుకుంటూ అయితె వెళ్దామా అని మాటను దాట వేసాను. తను సరే అని చెప్పి లోపలి గదిలోకి వెళ్లి పోయింది.
నేను బయటకు వచ్చిన తరవాత కొంచం సమయం గడిపి తిరిగి హోటల్కు బయలు దేరాము. అమ్మ ఇంకా ఉండ బట్టలేక అడిగింది దారిలోనే "ఎరా, అమ్మాయి ఏమంటోంది? అమ్మా నాన్నలు బలవంత పెట్టటం లాంటిది...... " అని. "లేదులే అమ్మా, నిర్ణయం తనదే ఆట ఈ విషయంలో." అని చిన్నగా చెప్పి ముగించాను. అవును మరి పెద్ద చెల్లి పెళ్ళప్పుడు ఒక సంభంధం విషయంలో అన్నీ బావున్నా ఇంట్లో వారేవరికో కేన్సర్ ఉందన్న మాట తెలిసి ఆ సంబంధం కాదన్న అమ్మా ఇప్పుడు కొడుకు దగ్గరకు రాగానే ఎలా మారిందో కడ అనిపించింది. "నువ్వంటూ ఉంటావే సగటు మనిషి అని. ఇదీ సగటు మనిషి ప్రవర్తనే" చురక వేసింది అంతరాత్మ.
------------------XXXXXXXXXXXXXXXXXXX-----------------
అలా పెళ్లి చూపుల తంతు ముగించి వచ్చిన నేను వారి నుంచి జవాబుకి ఎదురు చూడక నా పనులలో నేను పడ్డాను నిశ్చింతగా. నాకు అక్కడ చూసిన పరిస్థితులను బట్టి సంబంధం ఖాయం అన్నా ధీమా కలిగింది. UK visa కోసం చెన్నై వెళ్ళాను.
వీసా వచ్చిన రోజే వారు కూడా ఒప్పుకున్నారని, నిశ్చయ తాంబూలాలకు రెండు రోజుల్లోనే ముహూర్తం కుదిరిందని తెలిసినప్పుడు పిచ్చాడిలా బీచిలో పరిగెట్టాను. ఒక్కొక్కటిగా చిన్ని గవ్వలు బోలెడు ఏరి తన పేరును, నా పేరుతో ఇసుకలో జత చేసి సంబరపడి పోయాను. అపురూపంగా ఏరికోరి ఆ బీచిలో గవ్వపై తన పేరు మొదటి అక్షరం చెక్కిన కీ చైను, షాపింగ్ కామ్ప్లేక్స్లో మంచిముత్యాల గొలుసు, దుద్దులు తీసుకున్నా ప్రధానం రోజున తనకు నా బహుమతిగా.
పనులను ముగించి ఆఘమేఘాల మీద ఇంటికి వచ్చేసా. అమ్మా, నాన్న చెల్లి ఎంత ఆనందంగా ఉన్నారో. నా మనసు సంగతి చెప్పనక్కర లేదు. ఎప్పుడూ అక్షింతలేసే అంతరాత్మ కూడా "నువ్వు చేయ గలిగింది చేసావు. ముందే సంగతి చెప్పావు. డాక్టర్ని కలిసి మాట్లాడమని చెప్పావు కూడా. అమ్మాయిని బలవంత పెట్టడం జరగకూడదు అని నీవు తీసుకోవలసిన జాగ్రత్తలన్నీ తీసుకున్నావు. నీ కర్తవ్య పాలన నీవు చేసావు. మంచి జరిగింది. సుఖించు." అని దీవించింది.
-----------------------XXXXXXX---------------------------------