Sunday, 2 March 2008

స్వగతం- 2. నేను ఎందుకు రాస్తాను?

"ఏమిటి నువు చేస్తున్న పని?" కవిత్వం రాయటానికి ప్రయత్నిస్తున్న నేను చిర పరిచితమయిన గొంతుక విని తలెత్తాను, ఎదుట మనోజ కనిపించింది. "నీకు తెలియనిది కాదుగా, చిన్న పద్యం రాయటానికి ప్రయత్నిస్తున్నాను." జవాబు చెప్పాను. "అది తెలుసు కాని ఎందుకు రాస్తున్నావు?" తిరిగి తన ప్రశ్న, చిరునవ్వుతో. "అదేం ప్రశ్న ఎందుకు రాస్తున్నావు అంటావేమిటి?" నేను ఆరా తీశాను.

"అవును రఘు. ఎంత సమస్యా పూరణ అన్న communityలో చేరినంత మాత్రాన అన్నిటికి నువ్వు ప్రయత్నించాలి అని ఏముంది?" మనోజ ప్రశ్నించింది. "అన్నిటికి ప్రయత్నించాలి అని ఏమి లేదు కాని ప్రయత్నించటంలో తప్పేమి ఉంది?" "తప్పే. నువ్వు ఒక సంఘటనకు స్పందించినపుడు రాస్తే బావుంటుంది, ఒక మంచి భావన తట్టినపుడు రాస్తే బావుంటుంది అంతే కాని రాయాలని రాస్తే బావుండదు. అందువలన నీ రచనలలో పస ఉండదు. అలాటి రచనలలు చేయక పోవటమే మంచిది."

"నీ ఉద్దేశ్యం on demand రచనలలు పస లేనివి అనా అర్థం? అలా అయితే వేటూరి, సీతారామ శాస్త్రి లాటి వారు రాసే పాటలన్నీ పసలేనివి అవాలి కదా?" తిప్పి కొట్టగలిగానని కొంచం ఆనందం కలిగి స్వరంలో కొంచం వెటకారం ధ్వనించిన మాట నిజం. అయినా సహనం కోల్పోక మనోజ ఎప్పటిలానే చిరునవ్వుతో చెప్పటం మొదలెట్టింది "అన్ని ఆన్ డిమాండ్ రచనలు పసలేవని నేను అనలేదు. నువు ఇంతకు ముందు రెండు సమస్యా పూరణలకు దాదాపు రెండు పక్షాలు తీసుకున్నావు గుర్తుందా? ఎందుకో ఆలోచించు. సమస్యకు సమాధాన విధానం తోచినా అందమైన పూరణ చెప్పాలని అందమైన ఊహ తట్టేవరకు ఆగావు. అపుడు రాసిన కవిత ఎంత బావుంది. ఇప్పుడు చూడు మూడు రోజులనుంచి కష్టపడుతున్నావు కందంలో పద్యం పండించాలని. కాని ఏమి లాభం చెప్పు? ఒక్క పాదం కూడా ముందుకు సాగలేదు నీ ప్రయత్నం ఎందుకో ఆలోచించావా?"

"అది కూడా నువ్వే చెప్పు మరి" నా గొంతులో ఉక్రోషానికి నవ్వుతూ మనోజ చెప్పటం మొదలెట్టింది "అది తెలీనట్టు నటించకు మరి. నీకు ఇంతవరకు అందమైన ఆలోచన తట్టలేదు. కాని మొదలెట్టావు కాబట్టి రాయాలని వత్తిడి పడుతున్నావు. అందువలన ఒక పద్య రీతిని ఎన్నుకొని అందులోకి తట్టని భావాన్ని, పొంతన లేని పదాలని కుదించాలని చూస్తున్నావు. అందువలన భావం కాని, ఇతివృత్తం కాని, మాటల కూర్పు కాని ఏది కుదరటంలేదు. అది కుదరటంలేదని ఆరాట పడుతున్నావు. ఎందుకొచ్చిన తంటా చెప్పు."

"నిజమే. అసలు కుదరటం లేదు ఈ పద్యం." చింపి పారేసిన కాగితాల గుట్ట వైపు చూస్తూ బాధగా అన్నాను. "ఎలా కుదురుతుంది? పైన చెప్పినవే కాక ఇంకో తప్పు కూడా చేస్తున్నావు గమనించే ఉంటావు." అంది మనోజ. "అవును" తప్పు చేసానన్న భావన మెదులుతుండగా చెప్పటం మొదలు పెట్టాను "ఇంతకు ముందు నాకు మనసులో మెదిలిన భావాన్ని కాగితం మీద పెట్టే వాడిని అది వచ్చిన తీరును పట్టి వచనమో, పద్యమో చూసుకొని అప్పుడు, వీలైతేనే, పద్య రీతుల అలంకరణ చేసే వాడిని. కాని ఇప్పుడు ఇది కందంలో రాయాలి అనుకొని భావాన్ని అందులో ఇరికించటానికి ప్రయత్నం చేస్తున్నాను. అందువలన రచన్ బాగా రావటంలేదు." ముగించాను. "బలవంత మాఘ స్నానంలా…….. " మనోజ చురక. "అవును" అనక తప్పలేదు.

"అందుకే నీ ఇంకో రచన కూడా సాగట్లేదు గుర్తించావా". కొంచం కఠినంగా ధ్వనించింది ఈసారి తన గొంతు. తలెత్తి చూద్దును కదా అరిణిమాంతరమైన తన ముఖము ఎంత అందంగా ఉంద........ "మొగ బుద్ధి పోనిచ్చావు కాదు.నా అందం సంగతి తర్వాత అలోచిద్దువు కాని నా ప్రశ్నకు జవాబు?" రెట్టించింది. "ఏది నా ప్రథమ రసాస్వదనేనా" మనసుకు కళ్ళెం వేస్తూ అడిగాను. "ఆ ఆ అదే. పేరు గొప్పగా పెట్టావు, పైగా మొదటి పద్యం లోనే జయదేవ రచిత జిత అని పొగడేసుకున్నావు. మరి ఇంత వరకు రెండో పద్యమే రాయలేదేం?" ప్రశ్నించింది.

"నువ్వు ఇందాక అన్నావే భావం తట్టేంతవరకు ఆగాలని. అందుకని ఆగాను." అన్నాను మొహంలో భావాలు కనపడకుండా జాగ్రత్త పడుతూ. "నేను నీ మనోజను అన్న సంగతి మరచావా. నీ మొహంలో భావాలు ఎవరికి కావాలి. కళ్ళు మూసుకు చెప్ప గలను అది అపద్దం అని" గట్టిగా పలికింది తన స్వరం. ఈ విషయంపై చర్చ సాగుతున్న కొద్ది తన అధరారుణిమ అధికమవటం గమనిస్తూ పలికా "అంటే ప్రధమ రసాస్వాదన భావం సిద్ధించిందా నాకు."

"రఘు నీకిది న్యాయం కాదు. నేను నీ సమ వయస్కురాలను, స్నేహితురాలను అన్నావు. నీ స్వగతానికి అద్దం పట్టాలన్నావు. ఒప్పుకున్నాను జన్మ కారకుడవు కాబట్టి. కాని ఇలా శృంగార విషయాలపై కూడా చర్చ వస్తుందని ఊహించలేదు. తప్పదా?" బేలగా ప్రశ్నించింది. పాపం అనిపించింది, కాని ఒక సారి జననం, నైజం, కర్తవ్య నిర్దేశం జరిగిన తరవాత ఎట్టి పరిస్థితులలోనూ పాత్రల మార్పు చేసే అలవాటు లేని నేను ఇప్పుడు మొదటి సారి నా రచనా శైలి మార్చుకోవాలా అని ఆలోచించ సాగాను. "అవసరం లేదులే. నీ ఉన్నతికై సృష్టింపబడిన నేను నాకు ఇబ్బంది అని విషయం చెప్పక మానటం సబబు కాదులే." నే చెప్పక ముందు తనే తేల్చేసింది.

ఇబ్బందికరమైన ఒక ఘడియ గడిచిన తరువాత తనే మొదలెట్టింది చిన్న గొంతుకతో "నీ ప్రథమ పద్యం నీ అసలు తొలి రచనాలోచన కాదు. ఆ రోజు నీ భార్య పరిష్వంగనంలో, తన నిట్టూర్పుల గాడ్పుల వేడిమిలో పుట్టిన ఆ ఆలోచన వేరు. అది నీ మలి పద్య విషయం, కాదంటావా?" ప్రశ్నిస్తున్న తనను ఇంకా ఇబ్బంది పెట్టక ఒప్పేసుకున్నా "నిజమే. భావం తట్టింది, పదాలూ మదిలో మెదలుతున్నాయి కాకపొతే మొదటి పద్యంలో ఘన ఉత్పల చంపకాంబురూహాది వృత్త చలిత అని కేలికేసా కద. అందుకని వాటిలో రాయాలని ఆగాను."

విషయం సాధారణ విషయాల వైపు మళ్ళటంతో తను ఇబ్బంది పడకుండా చెప్పటం మొదలెట్టింది "George Orwell's why I write essay గుర్తుందా రఘు. అందులో తను ఎందుకు రాస్తాడో వివరించినది చదివినపుడు నీ మదిలో కదలాడిన భావాల సారాంశం విను. నువ్వు నీ మనసున కదిలిన భావాలను, స్ఫందించిన విషయాలపై, నీకు నచ్చే విధంగా రాస్తావు. మొదట అది నీకు అందంగా ఉంది అని అనిపించాలి. అపుడే నీవు ఇతరులకు అది అందుబాటులో తెస్తావు. అంటే నీ బ్లాగ్లో పెట్టడం అలా అనమాట. This is why Raghu writes. This is how Raghu writes. అంతే కాని orkut communityలో ఉన్నావని, మొదటి పద్యంలో చంపకమాల, ఉత్పలమాల లాంటి పద్య రీతులలో రాస్తానని ప్రగల్భాలు పలికావని భావన రాకుండా పద్యం రాయటం, వచనలో ఉరుకులాడుతున్న పద్యగీతఝరిని బలవంతంగా తెచ్చి పద్య రీతులనే పంజరంలో ఇరికించి ఆ వాగ్దేవిని అవమానించకు." చిన్న బోయిన మొహంతో నీతులు చెప్పి మాయమయిన మనోజ వాక్యాలను నెమరువేస్తుండగా శ్రీమతి పిలుపుతో సంసార సాగరంలో నా తిమింగళానికి ప్రతి పలికాను.
context- నా రచనలు నేను ఎందుకు చేస్తాను, ఎందుకు బ్లాగ్లో అందరు చూడటానికి పెడతాను అని నేను చేసుకున్న అంతర్మథనానికి, నేను ఈ మధ్య రచనా వ్యాసంగంలో చేసిన పొరపాట్లను గూర్చి చేసిన ఆలోచనలకు ఈ సంభాషణ అద్దంలాటిద

2 comments:

  1. మీ బ్లాగును ఇన్నాళ్ళూ చూడలేదు.. ఎలా మిస్సయ్యానో!? కూడలిలో చేర్చలేదేమోనని అనిపిస్తోంది. బ్లాగు లోకానికి స్వాగతం!

    ReplyDelete
  2. చదువరి గారు,
    ధన్యవాదాలు. ఈవాళే వీవెన్ గారికి మెయిల్ చేశాను కూడలిలో చేర్చమని.

    ReplyDelete