Tuesday, 29 July 2008

అందరూ ఖండించండి.

generalisations చేయకూడదు, మన దేశం ఇంకా దిగ జారకూడదు, మత ఛాందసులు ఇంకా ఎక్కువవకూడదు అని అనుకున్న ప్రతీ వారూ ఈ కింది బ్లాగు టపాను ఖండించాలని విజ్ఞప్తి.
http://tetageeti.wordpress.com/2008/07/28/minorites_are_not_wrong/#comment-156

ఇలాటి రచనల వల్లనే ఆవేశాలు ఎక్కువవుతాయి, ఆలోచనలు తగ్గుతాయి.

నేరస్తుడు ఎవరైనా సరే దండించాలి కాని దాన్ని మొత్తం పన్నెండు కోట్లకు పైగా ఉన్నా జనానికి ఆపాదించే ఇలాటి రచనలను ఎట్టి పరిస్థితులలో మన్నించకండి

అదే జరిగితే మన హిందువు ఒకరు ఇద్దరు తప్పు చేస్తే తమ దేశాలలో ఉన్నఅందరు హిందువులను నేరస్తులుఅని అంటే అపుడు మన NRIs గతి ఆలోచించండి.

సైలెంట్ మెజారిటీ గా ఉండొద్దు, గళం ఎత్తండి.

ఇట్లు
ఒక నిజమైన హిందువు.

అద్దం వెక్కిరించింది


పొద్దునే చూసాను ఆ అద్దం.


అందంగా ఉంది....... స్వచ్చంగా ఉంది......
తళ తళ మెరుస్తోంది.


మూసిన ఆఫీసు గది తలుపులో సగానికి పైగా ఉంది,
లోపలా బయటా కాన వచ్చేలా ఉంది.


మసిబారిన మనుషుల తలపుల పరిహసిస్తూ
"నాకేం భయం! కావలిస్తే చూసుకో నీ మకిలి మనసునూ" అంటూ

మనసు మూలిగింది!!!
అవును మరి, దెబ్బ తగిలింది దానికే కదా.


నిన్న సాయంత్రం తోటి పనిగాళ్ళతో
"పనిలేని పనిగాళ్ళతో మాటలు గుర్తొచ్చాయి


ఒక ఆడ, ఒక మగ కలిసి పని చేస్తుంటే
తలుపులు మూసిన గదిలో ఉంటే
కూసిన కూతలు గుర్తొచ్చాయి


సంస్కారం అడ్డడుతున్నా, దాని నోరునొక్కి
చేసిన వ్యక్తిత్వ ఖూని గుర్తొచ్చింది.


అది జరిగిన మరు పొద్దునే ప్రత్యక్షం,
మూసిన తలుపులో సగం ఆ అద్దం.


అద్దం వెక్కిరించింది.........
"ఖూనీ అయింది ఎవరి వ్యక్తిత్వం?" అంటూ ప్రశ్నించింది.


"సావాస దోషం" అని ఊరికే అనరు. మాములుగా మనకు రాని దురాలోచనలు కూడా సావాసదోష ఫలంగా ఎలా పుడుతాయో అనుభవం అయ్యి చాలా ఏళ్ళే గడిచినా, గుండెల్లో ముల్లే.... ఆ జ్ఞాపకం.

Thursday, 17 July 2008

2. "పట్నవాసపు బైతులు"

పేరు సరిగ్గానే చదివారండి మీరు, "పల్లెటూరు బైతు" కి పొరపాటున "పట్నపు బైతులు" అని రాయలేదు. ఎందుకంటే ఇది మా హైదరబాదు పట్నపు బైతుల కథ కాబట్టి. మామూలుగా అందరూ పల్లెల్లో, టౌనుల్లో పుట్టి పెరిగిన వారిని బైతులు అనటం కద్దు. కాని నాకు మాత్రం పట్టణాలలో పుట్టి పెరిగే మాలాటి వారు ఎంత బైతుల్లా ప్రవర్తిస్తారో అన్నది మాత్రమె బాగా అనుభవం. దాని కథా కమామిషు చెప్పటానికే ఇవాళ మీ ముందుకు వచ్చాను.


అమ్మా, నాన్నలది ఇద్దరిదీ కర్నూలు అయినా ఉద్యోగ రీత్యా నాన్న అరవై రెండులో హైదరాబాద్లో స్థిర పడ్డారు. ఇక్కడే పెళ్లి, పిల్లలూ, సంసారం, రిటైర్మెంట్ అన్నీ సాగించిన నాన్నను చూస్తె నాకు నిజంగా ఆశ్చర్యమేస్తుంది, భయమేస్తుంది. "అంతగా, పుట్టిన ఊరును ఎలా మర్చిపోగాలరా?" అనీ, నేనూ అలాగే తయారయి హైదరబాదును పూర్తిగా మర్చిపోతానా అని, కాని అది ఇప్పటి కథకు అప్రస్తుత ప్రసంగం అవటం వలన ఆపేస్తున్నాను.


నేను, ఇద్దరు చెల్లెళ్ళు మొత్తం ముగ్గురం మా అమ్మ నాన్నలకు. పుట్టి పెరిగింది మొత్తం హైదరాబాదులోనే. మేమే ఈ కథలో నాయికా నాయకులము. అంటే ఏమిటో అనుకొనేరు, మేమే ఆ "పట్వాసపు బైతులము" అన మాట.


"ఈ కథలో ఇతర పాత్రలు పోషించినది- దేవలరాజు భాగ్యలక్ష్మి గారు--బైతులకు అమ్మగా, , కీ. శే నాగ లక్ష్మమ్మగారు బైతులకు చిన్న పెద్దమ్మగా (పెద్ద పెద్దమ్మ వేరే ఉన్నారు లెండి అందుకని ఆ పేరు ) మరియు ఒక అతిధి మరియు విలక్షణమైన పాత్రలో ఒక ఎడ్ల జంట నటించడమైనది " (శని, ఆది వారాలలో మద్యాహ్నం పూట AIR లో చిన్నప్పుడు నాటకాలు వినటం అలవాటు ఉన్నవారు, నాటకం అయిపోయాక వచ్చే ప్రకటనలాగా ఊహించేసుకోండి.)


కథలోకి వస్తే మా అమ్మమ్మా వాళ్ల ఊరు "లంజ బండ", కర్నూలు జిల్లా లోది. అదేం పాపం చేసుకుందో ఆ ఊరు, పాపం ఆ పేరు వచ్చింది (స్థల పురాణం తెలిసిన వారెవరయినా ఉంటే తెలిపి పుణ్యం కట్టుకోండి). పలకటానికి చండాలంగా ఉందని చిన్నప్పటి నుంచి మేము దాన్ని L బండ అనటం అలవాటు చేసుకున్నాము. (ఎప్పుడు L బండ మా ఊరు అని చెప్పినా ఆ "L" అంటే ఏమిటో ప్రతీ ఒక్కరికి వివరించాల్సి వచ్చేది-అది వేరే విషయం లెండి. ) అందుకని ఇప్పుడు కూడా L బండ అనే పిలుచుకుందాము దాన్ని.

అలా L బండలో ఉన్న అమ్మమను కలవటానికి మేము వెళ్ళిన ఒకానొక యాత్రా ప్రహసనం వినండి మరి. అప్పటికి నాకు పట్టుమని పదేళ్ళయినా ఉండవేమో, ఇంక నా చెల్లెళ్ళకు ఎనిమిది , ఏడు కూడా దాటి ఉండవు. వేసవి శలవులకు అని మా అమ్మమ్మా వాళ్ల ఊరికి ప్రయాణం అయ్యాము మేము, మా అమ్మ. అమ్మమ్మ అప్పట్లో మా చిన్న పెద్దమ్మకూ, తన ఇద్దరు కొడుకులకూ తోడుగా ఉండేది ఆ ఊర్లో .

ఆ ఊరు చేరాలంటే అప్పట్లో కర్నూలు దాక రైలులో ప్రయాణం, ఆ పైన అక్కడి నుంచి ఎడ్ల బండి పై ప్రయాణం చేయాల్సి వచ్చేది. ఏకళనున్నామో ఏమో, రైలు ప్రయాణం బానే జరిగిందనిపించాము, ఒక్క కోతి చేష్ట కూడా లేకుండా.


ఆ కోతి చేష్ట అంటే గుర్తు కొచ్చింది. మా "గబ్బిలాయి"తనం ఆ రైలు ప్రయాణంలోనే కొంచం బయట పడినట్టు గుర్తు. మేమందరము కూర్చొని మామిడి పండ్లు తింటుంటే ఏదో స్టేషను దాటాక కంపార్టుమెంటులోకి వచ్చిన కోతులను చూసి "అమ్మా చూడవే చాలా ఆంజనేయ స్వాములు వస్తున్నాయి" అని మా చిన్న చెల్లెలు అనటంతో కంపార్టుమెంటు అంతా నవ్వులతో నిండిపోయింది. (హైదరాబాదు నుంచి కర్నూలు వెళ్ళే రూట్లో ఏ స్టేషనో గుర్తు లేదు కాని చాలానే ఉంటాయి ఈ కోతులు అక్కడ. వాటికి ఎంత ధైర్యమంటే కంపార్టుమెంటు లోకి వచ్చి మనుషుల చేతుల్లోవి సహితం తినుబండారాలు లాక్కు పోయేవి).


మా ఇంటికి కోతిని ఆంజనేయ స్వామి వేషం వేయించుకొని తీసుకొస్తే ఎప్పుడో చూడటం తప్ప అప్పటికింకా మేము కోతులను ప్రత్యక్షంగా చూసినది లేదు. అందుకని మా చిన్న దానికి అప్పుడు అమ్మ "తప్పు నాన్నా, కోతి అనకూడదు ఆంజనేయ స్వామి" అనాలి అని అమ్మ అనటం దాని చిన్ని బుర్రలో ఎంతగా నాటుకుపోయిందంటే అన్ని కోతులను చూసినా అవి దానికి "కోతులు" కాకుండా "ఆంజనేయ స్వాములే" అయ్యాయి. ఈ మాటలు విని పెట్టెలో ఉన్న ఒక ముసలమ్మ "ఇదెక్కడి చోద్యమమ్మా! ఎంత పట్నం పిల్లలైతే మాత్రం కోతుల్ని చూసి ఆంజనేయ స్వాములు అంటారు" అని బుగ్గలు నొక్కుకున్న తీరు నాకు ఇంకా జ్ఞాపకమే. అవును మరి నా చెల్లెల్ని అంటే మరి నాకు కోపం రాదా మరి? కాని ఏమి చేయలేని చిన్నతనం ,కదా అందుకనే అంతగా జ్ఞాపకం ఉండిపోయింది.


మొత్తానికి అలా రైలు ప్రయాణం చేసి కర్నూలులో దిగాము. అక్కడి నుంచి ఎక్కడ ఎడ్ల బండి మాట్లాడుకున్నామో, ఎంత సేపు గడిచిందో గుర్తు లేదు కాని గుర్తున్నదంతా మిట్ట మద్యాహ్నం వేళకు మేమింకా ఊరుకు చేరలేదు . సరేలే అందరికీ ఆకలేస్తోందని అనుకోని బండి వాడిని మార్గ మధ్యమ్లోనే ఆపించి, కర్నూలు నుంచి కట్టుకొచ్చుకున్న ఇడ్లీలు తినడం ప్రారంభించాము, బండి వాడికి కూడా ఇన్ని పెట్టి.

నేను చూస్తుండగానే వాడు తనకు ఇచ్చిన నాలుగు ఇడ్లీలు నాలుగు గుటకల్లో లాగించేసి ఎడ్లకు నీరు పెట్టటం చూసాను. ఇంకేముంది, నేను అమ్మ దగ్గర పోరు పెట్టటం మొదలెట్టాను "అమ్మ చూడవే వాడు ఇడ్లీలు అన్నీ తనే తినేసాడు మరి పాపం ఎడ్లకు? ఇంకొన్ని వాడికి ఇవ్వు ఎడ్లకు పెడతాడు" అని.

చూసారా మన తెలివి. ఇంట్లో కుక్క ఉంటే దానికీ ఇడ్లీలతో సహా అన్ని శాఖాహారాలు అలవాటు చేసిన నేను, ఇక్కడ కూడా ఎడ్లు కూడా దాని లాగే ఇడ్లీలు తింటాయి అని అనుకున్న తెలివి అన్న మాట. అవును మరి, చందమామలోనూ, బాల మిత్రలోనూ, సంక్రాంతికి డూ డూ బసవన్నలనూ తప్ప ఇతరత్రా ఎడ్లని ఎరుగని మేము అవి ఏమి తింటాయో ఎలా తెలుసుకుంటాము?

అలా అమ్మ దగ్గర మొండికేస్తున్న నన్ను చూసి బండి వాడు ఎడ్లకు నీళ్లు, ఎండు గడ్డి వేసోచ్చి "ఏమంటున్నాడమ్మా చిన్నయ్యా?" అని నవ్వుతూ అంటే వాడికేదో సర్ది చెప్పక "నువ్వే అడుగు" అని చెప్పాను అని నవ్వే అమ్మంటే ఇప్పటికీ నాకు కోపమే. ఉండదా మరి? ఆ ఎడ్ల బండోడి దగ్గర నా పరువు తీసిన మాటే కదా అది. ఆ మాట విని వాడు నింపాదిగా నన్ను "ఏంటి చిన్నయ్యా?" అని అడగ్గా నేను పెద్ద హీరోలా పోజు పెట్టి "ఇడ్లీలు అన్నీ నువ్వే తినీసవ్ వాటికి కూడా పెట్టొచ్చుగా" అని అడగ్గానే వాడు నవ్విన నవ్వు నేను జన్మ మరిచిపోలేను. అంతగా కిందా మీదా పడి నవ్వాడు వాడు.


చివరికి నవ్వాపుకొని (ఇడ్లీలు పెట్టకుండానే) ఎడ్లను మళ్ళీ బండికి కట్టి ప్రయాణం మొదలెట్టిన కొంచం సేపటికి ఎదురుగా ఇంకో ఎడ్ల బండి వస్తూ కనిపించింది.సిటీలో నాన్న "హిరో మజేస్టిక్" బండి మీద trebles వెళ్తూ నాన్నకు చెప్పినట్టే, భయమేసి "బండాయనా బండాయనా, జాగ్రత్త! accident అయిపోతుంది మెల్లగా పోనియ్" అనేసాను.

ఇంక చూసుకో నా సామిరంగా, వాడు వెళ్తున్న ఆ బండిని కూడా ఆపి మరీ ఈ మాట చెప్పి నవ్వ సాగాడు. ఆ బండిలో వెళ్తున్న సెట్టిగార్లు, సెట్టమ్మలూ ఆ మాటలకు నవ్వి నవ్వి అలసిపోయి "భాగ్యమ్మా భలే కొడుకును కన్నావమ్మా" అని అనేసరికి కాని మా అమ్మకు తెలీలేదు తన తప్పేంటో. బండి వాడిని కసిరి బండిని బయలుదేర తీసిన తను నన్ను తన ఒళ్ళో కూర్చో పెట్టుకొని "ఇంట నెమ్మదిగా వెళ్తుంటే, అదీ ఎడ్ల బండ్లల్లో accident అవదు నాన్నా" అని బోధిస్తే తప్ప వెలగని ట్యూబులైటు బుర్ర అప్పట్లో నాది. కొసమెరుపుగా మధ్యలో ఎక్కడో పాపం ఎడ్లు ఎందుకో కదలనని మొరాయిస్తే వాటితో తంటాలు పడుతున్న బండి వాడితో "ఇందాక ఇడ్లీలు పెట్టమంటే ,పెట్టలేదుగా అందుకనే అవి లేయ్యట్లేదు" అని అని నాదే చివరి మాట అనిపించుకున్నాను.

మొత్తానికి ఇలా మా తెలివిని దారంతా పరిచయమ చేసుకుంటూ మేము అమ్మమ్మా వాళ్ల ఇంటికి చేరాము. అక్కడ అమ్మమ్మ ఎంతొ సంతోషంగా మమ్మల్ని దగ్గరకు తీసుకొంది. చాలా ఏళ్ళ తరవాత అమ్మమ్మను చూడటంతో అంతా కొత్తగా కనపడింది. అప్పటికే అరవయ్యో వడిలో ఉన్న తను మొహమంతా ముడతలు పడ్డ చర్మంతో ఏంటో వింతగా ఉండేది. అప్పటికే రాజధానిలో nuclear families ఎక్కువవటం వల్ల, ఇంట్లో పెద్ద ప్రాణులని ఎరుగని మాలాటివారికి అన్నీ వింతే మరి .


రాత్రి అమ్మమ్మ పక్కలో చేరి తన మోచేతుల దగ్గర ఉన్న మడతలను లెక్క పెట్టటానికి ప్రయతించటం ఇంకా గుర్తు నాకు. అచ్చు గోమాతకు ఉండే గంగడోలులా సాగేది మడతలు పడ్డ తన చర్మం. అదీ, తన చారు రుచి, ఇప్పటికీ నిద్రపోయే ప్రతీసారి మూడు సార్లు చదువుకొనే "కర్కొటకస్య నాగస్య, దమయంతే నల స్థుతే. ఋతుపర్ణంచ రాజ ఋషి, కీర్తనం కలి నాశనం" ఆన్న శ్లోకం- ఇవి మేము అక్కడి నుంచి తెచ్చుకొన్న జ్ఞాపకాల మూటలు.

మరుసటి రోజు వీధిని సర్వే చేయటానికి బయలు దేరాము ముగ్గురం. ఆ వీధిలో మేమే అనుకుంటా ఏకైక బ్రాహ్మణ కుటుంబం. ప్రవృత్తి ఎలా ఉన్నా పుట్టుకకు ప్రాధాన్యం ఇచ్చే అలవాటు ఇంకా అప్పటికి ఉండటంతో "అమ్మయ్య వచ్చింది, అమ్మయ్య పిల్లలు వచ్చారు" అని బానే గౌరవించే వారు వీధిలో వారు. అందుకని బానే అతిధి మర్యాదలు జరిగేవి ఏ ఇంటికి వెళ్ళినా.

అలాగే వీధి చివరన ఉన్న శెట్టిగారి ఇంటికి వెళ్ళాము. అక్కడ వారి పిల్లలతో ఆడుకుంటూంటే అందరికీ ఉడక బెట్టిన వేరుశనక్కాయలు ఇచ్చారు. మిగితా వారందరూ మొహమాటం లేకుండా తీస్కుంటే మేము మా బస్తీ నాజూకుతనం చూపి "వద్దండి" అని తీసుకోలేదు. కానీ వల్ల పిల్లలు తింటూ ఉంటే నోరు మాత్రం ఊరుతుండేది. అలా అసలే మండుతూ ఉన్న నా పెద్ద చెల్లికి వాళ్ళబ్బాయి ఊరికే అవి చూపి "మీకు లేవు" అని ఎడిపిస్తూంటే విసుగొచ్చి వాడు తింటూన్న గిన్నెను ఎగరకొట్టింది. మరి నా పెద్ద చెల్లెలా మజాకా! దానితో మాట్లాడాలంటే మా అమ్మ నాన్నలకే హడల్ ఇప్పటికీ.


అది చూసి వాళ్ల అమ్మ "అదేంటి అమ్మయ్యా. నీకు కావాలంటే నన్ను అడగొచ్చు కదా" అని మమ్మల్ని ఇంటి ముందు ఉన్న చిన్న drianage మూత లాటిది తీసి "రండి నాతొ" అని చెప్పి మమ్మల్ని జాగర్తగా కిందకు దించింది నిచ్చెన సహాయంతో. దిగి చూద్దుము కదా ఆ పెద్ద గది నిండా వేరుశనగ బుడ్దలే (కాయలను మేము బద్దలు అని కూడా అంటాం లెండి). నిజంగా ఎంత ఆశ్చర్యమేసిందో ఆ గిడ్డంగిని చూసి, ఆ వేరుశనగ నిల్వను చూసి. మేము ఆశ్చర్యంగా నోరు తెరిచి చూస్తుంటే వాళ్లు మమ్మల్ని చూస్తూంది పోయారు "వీళ్ళు ఎంటిరా బాబు, ఇలా ఉండిపోయారు " అని.

అవి అనే కాదు మాకు ఆ కాలంలో మా అమ్మామా వాళ్ళ ఇంటి గవాక్షము, ఇంట్లోని దూలాలు, ఇంటి పెరటిలోని కట్టెల పొయ్యి, ఇంటి ముందుకు వచ్చే "అన్నం కలిపిన అయిసుక్రీము" (అలా ఆ పేరుతొ ఎందుకు గుర్తుండి పోయిందో ఇప్పటికీ తెలీదు) , అమ్మమ్మ చింత చిగురు అమ్మే అమ్మితో చేసే బేరాలు ఇవన్నీ మాకు కొత్తా, వింతానూ.


ఇలా ఎన్నెన్నో వింతలతో రోజులు సుఖంగా గడిచిపోతున్నాయి అనుకున్తున్నంతలోనే నా చిన్న చెల్లి చేసిన పనికి, శలవులు ఇంకా సగం ఉండగానే దాదాపు ఇంటికి తిరిగి వచ్చేంత పనయింది. మేమెవ్వరం కాఫీ, టీ తాగి ఎరగము డిగ్రీ వరకు కూడా. అందుకనే మా చిన పెద్దమ్మ (ఆమె పేరు హిట్లర్ అని కూడా లెండి ) అడిగితె మా అమ్మ "ముగ్గురికీ అలవాటు లేదులేవే, వద్దు " అని వారించింది. కొంచం సణుక్కుంటూనే తను మా అన్నయ్యలకు(తన కొడుకులకు) మాత్రం కలిపి ఇచ్చింది.

తరవాత అందరం తయారయి మా బంధువుల ఇంటికి వెళ్ళాము. అక్కడ కూడా మేమందరమూ వద్దన్నా మా చిన్నదానికి కొంచం సేపటికి ఎంత నోరు ఊరిందో ఏమో "ఆంటీ కొంచం టీ ఇస్తారా" అని అడిగి మరీ తాగింది. ఇంకేముంది, ఇంటికి రాగానే మా చిన పెద్దమ్మ పెద్ద యుద్ధమే చేసింది మా అమ్మతో "అవున్లే అమ్మా మేమెక్కడ ఆనుతాం మీ కళ్ళకూ. అడిగితె వద్దంటారు, అక్కడ మాత్రం టీ చుక్క ఉంటే ఇవ్వండి ఆంటీ అని అడిగి మరీ తాగుతారు" అని. అమ్మమ్మ సర్ది చెప్పటంతో అమ్మ ఆగిపోయింది కాని లేకుంటే మేము అప్పుడే వచ్చేసే వాళ్లము. మా పెద్దమ్మ తను కాలం చేసేంత వరకు ఆ విషయంలో మమ్మల్ని దేప్పటం మాత్రం ఆగలేదు.


అలా కోతులను "ఆంజనేయ స్వాములనీ" అనే వారికీ , ఎడ్లకు ఇడ్లీలు పెట్టమనీ, రెండు ఎడ్లబండ్లకు accident అవుతుందని నమ్మే వారికీ, అనవసరపు మొహమాటాలకు పోయే వారినీ మీ భాషలో ఏమంటారో తెలీదు కాని మేము మాత్రం "పట్నవాసపు బైతులు " అనే అంటామండి.

Thursday, 10 July 2008

మాసు-క్లాసు

"సోనియా సోనియా స్వీటు స్వీటు సోనియా...నీటు ఉంది, నాటు ఉంది" అంటూ పాట వినపడుతుంటే విసుగొచ్చి మార్చేసా online telugu radio channel ను. ఇంకో చానెల్ పెడితే అందులో "అంటే అమలాపురం, ఆ అంటే ......" అని వినపడగా చిర్రెత్తి మొత్తానికే ఆపేసాను. "ఛి! ఎక్కడ చూసినా మాసు పాటలే" అని తిట్టుకుంటూ "స్వరాభిషేకం" CD పెడితే "కుడి కన్ను అదిరెనే కూడిన తరుణాన" అన్న పాటను వింటూ తన్మయాన ఉన్న నన్నుఅక్కడే ఉన్న నా శ్రీమతి "అంటే ఏమిటి రఘూ?" అని అడిగింది.

"నిజంగానేనా అడుగుతున్నది" అన్నట్టు తన వైపు చూసా. నా వైపే చూస్తోంది కాబట్టి నిజంగా అడిగింది అని నిర్ధారణ చేసుకొని ఉత్సాహంగా వివరించటం మొదలెట్టాను. "భానుడిని, పిల్ల తెమ్మెరని, తీపి ఘడియని-తలుపు గడియని" అడ్డు పెట్టుకొని కవి చేసిన అంగాంగ వర్ణన, శృంగారానంతర స్థితి వర్ణన ఎంత మనోహరంగా సాగిందో చెప్ప సాగాను. అంతా విన్న తను చిన్నగా "మరి ఇవి నచ్చిన మీకు ఆ మాస్ పాటలు అంటె చిన్న చూపు ఎందుకు " అడిగి వంటింటిలొకి నడిచింది.

అధిరి పడ్డాను. "అమ్మో, ఇదా సంగతి! ఎన్నడూ లేనిది నన్ను అర్థాలు అడగటానికి కారణం"అనుకుంటూ తన వెనకాల నడిచాను వంటింట్లోకి . "అది కాదురా. అంత అందంగా ఆ పాటలొ స్త్రీని వర్ణించటం, ఆ ఊ అంటూ ఆ మూల్గులతొ ఈ పాటను నింపటం ఒకటే అనటం అన్యాయం కదరా?". అన్నాను తనతొ చిన్న పిల్లకు చెపుతున్నట్టు.

కాఫీ కలుపుతున్న తను నా వైపు తిరిగి "ఎందుకు ఒకటి కాదు రఘు? స్త్రీలొని అణువణువునూ వర్ణిచటం జరిగింది నీకు నచ్చిన పాటలొ. నువ్వన్నట్టు సటుల్ గా అయినా శృంగారాన్ని వర్ణించటం జరిగింది ఆ పాటలొ. నువ్వు మాస్ అనే ఆ పాటలొ జనం ఒక వెలయాలిని చూసి ఊగిపొయె విధానం మత్తెక్కే విధంగా చెప్పబడింది. రెందూ శృంగార సంబంధమైనవే. కాకపొతె ఒకటి నీకు నచ్చె రీతిలొ ఉంది, రెండొది నీకు నచ్చని రీతిలొ ఉంది. అంతే తేడా ." ముగించి మళ్ళీ కాఫీ కలపటంలొ నిమగ్నమయింది.

"అయితే ఏమిటంటావు. ఒక వెలయాలి శృంగార వర్ణన, ఒక భార్యా భర్తల జంట వలపుల వర్ణన ఒకటేనంతావా ?" అన్నాను గుర్రుగా. తను నావైపు తిరక్కుండానే "విషయం మార్చి వితండ వాదం చేస్తాను అంటే ఇంక మాట్లాడానులే" అనింది. నాకే అనిపించింది టాపిక్ మార్చినట్టుగా. అందుకే తప్పు ఒప్పుకొని "సరే నువన్నట్టు ఇక్కడ రెండూ శృంగార వర్ణనలే, కాదనను. అవి ఎందుకు పెట్టారూ, అలా పెట్టటం మంచిదా కాదా అన్నది ఇక్కడ అసందర్భము నేనూ ఒప్పుకుంటాను. కానీ అసలు క్లాసు-మాసు తేడా లేదు అంటే ఎలా? " ప్రశ్నించాను నేను.

"తేడా లేదు అని అనలేదు. చిన్న చూపు ఎందుకు? అని అడిగాను. అయినా ఇప్పుడు అడుగుతాను. చెప్పు, నువ్వనే ఆ సో కాల్డు క్లాసు-మాసు తేడా ఏంటి చెప్పు?" అని అడిగింది తను. చర్చ సీరియసుగానే జరుగుతోంది అని గమనించిన నేను ఒక్క నిమిషము మవునంగా ఉండిపోయాను. తరవాత నెమ్మదిగా చెప్పటం ప్రారంభించాను. "ఇది అని చెప్పలేను కాని ఏదో ఉంది ఈ క్లాసు-మాసు తేడా.

ఉదాహరణకి ఇంకోటి తీసుకో మన హైదరాబాదులో తీన్ మార్ అని ఉంటుంది తెలుసుగా. డప్పు మీద ఒకడు దరువేస్తూ ఉంటే వినాయక చవితి అప్పుడూ, పెళ్లి ఊరేగింపుల ముందూ- ఇష్టం వచ్చినట్టు ఎగురుతూ వెళ్తుంటారు చూడు .అది మాస్ అంటే. ఏమిటా ఎగరటం? ఒక్కడూ లయ బద్దంగా కదల్పడు కాళ్ళూ చేతులను. సివాలోచ్చినట్టే ఎగురుతారు. వారికీ క్లాసు మనుషులకూ తేడా లేదా?" అడిగాను.

"ఖచ్చితంగా ఉంది . ఆ తేడా ఏమిటో చెప్పే ముందు ఒకటి చెప్పు. నువ్వు క్లాసు మనిషివా మాసు మనిషివా?" ప్రశ్నించింది తను. "ఇదేం ప్రశ్న" అన్నట్టు తన వైపు ఒక చూపు విసిరి "నాకు తెలిసినంత వరకు నేను క్లాసు మనిషినే." అన్నాను. ఆ మాటలలో గర్వం నాకే తెలిసొచ్చింది అనేసాక. తను మాత్రం అది తనకు పట్టనట్టే సౌమ్యంగా చెప్పటం ప్రారంభించింది. "మరి అయితే మొన్న డిస్కోతేక్కులో నువ్వు నేను ఎగిరిన ఆ గంతులు ఎంత లయ బద్దంగా ఉన్నాయో నువ్వే చెప్పు" అని నా కళ్ళల్లోకి సూటిగా చూడటం మొదలెట్టింది. నా రాణి నన్ను అలా చూస్తూ ఉంటే ఇంక అబద్దం ఎలా చెప్పేది? బుద్ధిమంతుడిలా చెప్పాను "అస్సలు లయ లేదు, ఏదో పిచ్చి గెంతులే అవి. కానీ చిన్నూ మనము అక్కడ డాన్సు చేసింది, వాళ్లు వీధిలో ఎగరటం ఒక్కటే అనటం దారుణం" ఆక్రోసించాను, వాదన ఓడిపోతున్నాను అని తెలిసి.

""అవును ఎలా అవుతుంది? మనం డబ్బులు పారేసి ఒక గది కొనుక్కుని, అందులో పాటలను ఖూనీ చేయటానికి ఇంకొకడిని ఏర్పాటు చేస్కొని, ఇంకొన్ని డబ్బులు పోసి చెవులు దిబ్బిల్లు పడేటట్టు సంగీతమనే అర్థం కాని రోద పెట్టుకొని, చాలా డబ్బేసి తెచ్చుకొన్న మత్తులో, చాలీ చాలని బట్టలు వేసుకొని, ఆడా మగా తేడా తెలియకుండా ఒకరినొకరు పూసుకొని ఎగిరే మనము క్లాసు మనుషులము.

తిండికి, బట్టకు గతిలేని వారు, తమదైన శైలిలో తమ సంతోషాన్ని, దుఖ్ఖాన్నీ తెలియ చెపుతూ, తమదైన రీతిలో సాదా సీదా డప్పుల మోతకు అనుగుణంగా తమకు వచ్చిన చిందులు వేస్తూ , ఈ వీధులన్నీ మావీ అని చాటుతూ చేసుకొనే ఆ పండుగలు, పెళ్ళిళ్ళూ వాళ్ళను మాసు మనుషులను చేస్తాయి. నిజమే, నువ్వు అన్నది నిజమే. వారికీ మనకూ పోలిక ఎక్కడా?" కోపంతో ఎర్రబడ్డ తన మొహం చూడడానికి భయమేసి తల వంచుకున్నాను.

అయినా తను చెపుతున్నది ఎందుకో తప్పు అనిపిస్తోంది. అదే తనతో చెప్పాను నెమ్మదిగా "నువ్వు అన్నది అంతా బానే ఉందిరా. ఇవి రెండు బేసిక్గా చూస్తె ఒకటే. కానీ నాకు ఒకటి అర్థం కావట్లేదు. మరి క్లాసు మాసు అన్న తేడా ఏమీ లేకపోతె ఇన్నాళ్ళ నుంచి ఆ తేడా ఏమిటి? ఎందుకు ఇంకా ఉంది ఆ concept?" "ఏమో నాకేం తెలుసు? ఎవరైనా క్లాసు మనుషులను అడగండి చెపుతారు. అడగండి ఆ మనుషులను ఈ కుల, మత, వర్ణ, జాతి అన్న పదాలు ఇంత వరకు ఎందుకు ఉన్నాయి అని. వ్యక్తిత్వాన్ని బట్టి, నమ్మకాలను బట్టి, వృత్తులను బట్టీ వర్గాల పేర్లగా మొదలైనా ఈ పదాలు ఇంతగా మన సామాజిక జీవనంలో ఎందుకు ఇంత విచక్షణా హేతువులు అవుతున్నాయో" కోపంతో బుస కొడుతున్న తనను ఆపే సాహసం చేయలేక వింటూ ఉండి పోయాను.


"అడగండి ఆ మనుషులను- రుచులు అభిరుచులు వేరయినంత మాత్రానా క్లాసు-మాసు అని పేరు పెట్టి అంత చిన్న చూపు చూడటం ఎంత భావ్యము అని.

అడగండి ఆ మనుషులను- సామాజిక పరిస్థితులను బట్టి వచ్చిన అలవాట్లను, అభిరుచులను ఇలా వేరు వేరు పేర్లు పెట్టి చిన్నబుచ్చటం దారుణం కాదా అని.

అడగండి ఆ మనుషులను- శృంగార విషయాలు మీరు ఎన్ని subtleties తో వర్ణించినా, అవి రాని వారు ఎంత పచ్చిగా చెప్పినా- ఇద్దరూ ఒకటే కదా ఆశించేది. మరలాంటప్పుడు వీరు చిన్న అని చెప్పే అధికారం వారికీ ఎక్కడిది అని.
అడగండి వారిని- ఇది శాస్త్రీయం అని, అది అశాస్త్రీయం అనీ హద్దులు లేని సంగీతానికి మీరు ఎందుకు హద్దులు గీస్తారు అని.

చివరికి చెప్పండి వారికి. మీ రుచులు మీవి, ఇతరుల రుచులు ఇతరులవి. ఎన్నడూ పోలికలు తెచ్చి మీరు గర్వ పడి, ఇతరులను కించ పరిచే అధికారం వారికేవ్వరూ ఇవ్వలేదని"

ఇలా ఇంకా చాలా సాగేదేమో తన ఘోష, నషాలానికి అంటుకొనేటట్టు మాడిన పోపు వాసన రావటంతో తను దాని మీద తన కోపం చూపిస్తూంటే నేను మెల్లగా జారుకున్నా అక్కడ నుంచి, ఇంకెన్నడూ తను "కొట్టండి తిట్టండి గిల్లండి.............ప్రేమా" లాటి పాటలు వింటూంటే చచ్చినా నోరు మెదపకూడదు అని నిశ్చయించుకొని.

Sunday, 6 July 2008

1. ప్రియమైన అమ్మా-నాన్నలకు,

ప్రియమైన అమ్మా-నాన్నలకు,

ఇదేంటి, మొన్ననే కదా మాట్లాడాడు దూరవాణిలో (అదే టెలిఫోన్లో), ఇప్పుడు ఈ ఉత్తరం ఏమిటా అని ఆశ్చర్య పోతున్నారా? నాకూ అదే అనిపించింది మొదట, "మాటల్లోనే చెప్పొచ్చుకదా కాగితంపై పెట్టటం ఎందుకు?" అని. కాని కాగితం మీద పెట్టడంలో ఒక లాభం ఉంది. నెమ్మదిగా, నా emotions చెప్పాలనుకున్న దానికి అడ్డు రాకుండా, వాదోపవాదాలు లేకుండా చెప్పగలను ఉత్తరంలో. పైగా ఒకసారి రాసిన దాన్ని వంద సార్లు చూసుకొని, సరి చేసుకొని పంపొచ్చు. మాటలను అలా సవరించలేము కదా. అందుకే ఈ ఉత్తరము. కాకపొతే ఇది permanent గా మిగిలిపోయేది అని తెలుసు అందుకే ఆచి తూచి రాస్తున్నాను.

అసలు దేని గురించి మాట్లాడదలుచుకున్నాను అంటే మీ ఇద్దరి గురించే. "మా ఇద్దరి గురించి ఏమి మాట్లాడతాడా" అని ఆశ్చర్య పోకండి. చాల ఉంది మీ గురించి మాట్లాడేందుకు. నేను విదేశాలకు వచ్చి అయిదు ఏళ్ళు అయింది ఈ మధ్యనే. గడిచిన అయిదు ఏళ్ళు నెమరు వేసుకుంటుంటే "ఈ మధ్య అంతా బాగా జరుగుతోంది" అనుకొనగానే, మీ వైపు ఆలోచన మళ్ళింది. "ఏం బాగా జరిగింది? తల్లి, తండ్రులను వంటరిగా వదిలేసి వచ్చేశావు వాళ్ల మానాన వాళ్ళను వదిలి" అని మనసు ప్రశ్నించింది. పైగా ఇద్దరి ఆరోగ్యం కూడా అంతంత మాత్రమె. ఎంత చెల్లెళ్ళు పక్కనే ఉన్నా నేను మీదగ్గర ఉన్నట్టు కాదు కదా అని బాధ వేసింది.

నాన్నా, నేను ఇక్కడకు వచ్చే ముందు రోజు మీకు, నా ప్రయాణానికి అప్పు ఇచ్చిన మీ తోటి పంతులమ్మకూ జరిగిన వాదన గుర్తు ఉందా? "లేదు, మా వాడు డబ్బు కోసమే విదేశాలకు వెళ్తున్నాడు" అని మీరు, "అలా ఎందుకు అనుకుంటారు మాష్టారు. మంచి చదువుల కోసం వెళ్తున్నాడు. ఉన్నత చదువుల కోసం వెళ్తున్న వాడిని అలా ఎందుకు కించ పరుస్తారు?" అని మేడం, వాదులాడుకున్నారు నా ముందు. గుర్తుందా ఆ సంభాషణ?

ఆ రోజు మీ ఇద్దరి ఎదుటే ఉన్నా నేను మవునంగా ఉన్నాను. "వాళ్ళిద్దరూ వాదులాడుకున్నారు కాని అక్కడే ఉన్నా, నన్ను అడిగారా? లేదు కదా. అందుకే నేను ఏమి పలకలేదు " అని ఆత్మవంచన చేసుకున్నాను. కాని చాలా ప్రపంచం చూసేసా నాన్నా గత అయిదేళ్ళలో. ఇపుడు ధైర్యంగా చెప్పగలను "అవును, డబ్బు కోసమే మిమ్మల్ని వదిలి వచ్చేసాను". కసాయి వాడిలా అనిపిస్తున్నానా? ఈ మధ్య మీ మాటల్లో కూడా ఆ భావన కొంచం ధ్వనిస్తోంది అని అనిపించింది. అందుకే ఈ ప్రస్తావన ఇప్పుడు ఎత్తాను.

నాన్నా, అపుడు మన పరస్థితి ఎలా ఉండేదో మీకు మళ్ళీ నేను చెప్పాల్సిన అవసరం లేదు కదా. అంత చదివి కూడా నేను రోజుకు ఇరవై గంటలు పనిచేస్తే నాకు వచ్చిన జీతం ఏంటో మీకు గుర్తుందా నాన్నా? పదకొండు వేలు! దాంట్లో మన పరిస్థితి బాగు పడేదెపుడు? నేను సెటిల్ అయేది ఎపుడు? అందుకే వచ్చేసాను నాన్నా. No regrets. కాని మీరు దానికి హేళనగా మాట్లాడటం చాలా బాధేసింది.

మర్చిపోయారా నాన్నా మీ గత జీవితం? నానమ్మను ఊర్లో వదిలేసి, భాగ్యనగరానికి వచ్చిన ఎనిమిదేళ్ల వరకు తిరిగి చూడని మీరు ఇప్పుడు ఇలా అనుకోవటం సమంజసమా? ఆలోచించండి. అపుడు తాండ్రపాడు నుంచి భాగ్యనగరం ఎంత దూరమో ఇపుడు భాగ్యనగరం నుంచి మా ఉరికి అంతకన్నా తక్కువ దూరమే కదా నాన్నా. పైగా ఈ టెలీఫోనులు, లాప్టాపులు వగైరాల వల్ల అంత దూరం కూడా దగ్గరైపోలా? మొత్తానికి చెప్పేదేంటంటే "కాసు కోసం దాసులై దేశాలు పట్టి పోవటం మాతో మొదలు కాలేదు మాతో అంతం కాదు". కాబట్టి అంత హేళనగా చూడకండి నాన్నా బాధేస్తుంది. ఇక మీ విజ్ఞతకు వదిలేస్తా ఆ విషయం.

ఇంకో విషయం నాన్నా. మీరు నమ్మండి నమ్మక్యపొండి 2015 నాటికి నేను ఇంటికి వచ్చేసేది ఖాయం. ఈ మాట మాట్లాడిన ప్రతీసారి మీరు "చూద్దాంలేరా అప్పటికి, ఇప్పటి నుంచి ఎందుకు ఆ సంగతులు" అని దయచేసి అనకండి. ఒకవైపు పెళ్లి చూపుల్లో ఖచ్చితంగా "12 ఏళ్లకు నా ప్రవాసవాసం పూర్తి అయిపోతుంది" అని చెప్పినా "ఆ అందరూ ముందు ఇలానే అంటారు, పెళ్లి తరవాత మార్చుకోవచ్చులె అని అనుకున్నాను నాకేం తెలుసు మీరు నిజంగా వచ్చేస్తారని" అని పొడిచే భార్యామణి ఒక వైపు, మీరిలా ఒకవైపు నన్ను ఇబ్బంది పెట్టకండి. మీరు నన్ను ప్రోత్సహించకపోతే మానె నిరుత్సాహపరచకండి.

అమ్మా, ఆగాగు-నువ్వేంటి నవ్వుతున్నావు? నవ్వకు, నీతో మాట్లాదవలసినదీ ఉంది. ముఖ్యంగా "మా-మన" సంసారం గురించి. మొన్న నువ్వు తనకు "మన" చారుపొడి ఎలా చేయాలో అన్న విషయం "వివరిస్తున్నపుడు" ఈ విషయం నీతో చెప్పాలని అనిపించింది. ఇప్పుడు సావకాశంగా చెపుతున్నా.

అమ్మా, నీకు "నీ సంసారం" తోలి రోజులు గుర్తున్నాయా? అప్పుడు మీ అత్తగారు నీ వంట బావున్నా, "ఇప్పుడు నువ్వు మద్వల ఇంటికి వచ్చావు -నీ స్మార్త వంట మరచిపో" అని అనింది అనీ, నువ్వు బాధపడే దానివి అని చెప్పావు గుర్తులేదా? మరి ఇపుడు అదే పని నువ్వు చేస్తే ఎలా? నీకు తెలుసు తను వంట ఎంత బాగా చేస్తుందో-అయినా కాని నువ్వు "మన చారు పొడులు" అంటూ తనకు చెపితే తను బాధ పడుతుందా లేదా? పాపం వచ్చి బేల ముఖం వేస్కొని, "రఘు నేను చేసే చారు బావుందడా నీకు" అని అడిగింది కన్నీళ్ళతో. తనకు రానివి, తను బాగా చేయలేని చెప్పు నేను వద్దనను. అంతే కాని తనకు బాగా వచ్చినవి చెప్పటంలో, తనను మారమనటంలో అర్థం లేదు. అర్థం చేసుకో, ప్లీస్.

ఇంకో విషయం, తను రోజు ఏడు వరకు లేవదని, వారాంతాలు తొమ్మిది వరకు నిద్ర పోతుందని నీతో చెపితే "అవునా......" అంటూ రాగాలు తీసావు. పొద్దున్న ఆరుకు లేచి అది ఇక్కడ చేసే పని ఏంటి చెప్పు? ఉన్నది ఇద్దరం. చక చకా పని చేసుకొనే తను, ఇంట్లో పనులు నిమిషంలో చేసి పెట్టే మర మిషనులు, ఇంటి పనిలో సాయం చేసే భర్తా ఇందరు ఉండగా తను ఈ పనులన్నీ ఒక్క గంటలో చేస్తుంది. మరి అలాటప్పుడు ఏడు వరకూ నిద్ర పొతే ఏమయింది? పిల్లా జెల్లా వొచ్చాక ఎలాగూ తప్పదు కదా? అందులో ఇక్కడ సంవత్సరానికి ఏడు నెలలు పొద్దున్న ఎనిమిదిన్నరకు కాని "తెల్ల"వారదు. పొద్దున్నే లేచే అలవాటున్న నేనే ఏడు వరకు నిద్రపోతాను, మరి తను ఎలా లేస్తుంది చెప్పు? నేనెలా తనకు చెప్పేది చెప్పు?

ఒకటి గుర్తు పెట్టుకో అమ్మా, "మీ సంసారం" వేరు ఇప్పటి "మా సంసారం" వేరు. వినడానికి కష్టమైనా ఈ తేడా ఖచ్చితంగా ఉంది. 2015 నాటికి దేవుని దయ వల్ల ఇవి రెండూ కలిసి "మన సంసారం" అయ్యేంత వరకు "మీ సంసారపు విలువలు" మా మీద రుద్దాలని చూడకు. "మన సంసారం" అయ్యాక అందరం కలిసి మళ్ళీ ఒక రొటీన్ ఏర్పరుచుకుందాం పరిస్థితులకు తగ్గట్టు. ఓకేనా?


ఖండాంతర వాసం, మారిన వాతావరణం, మారిన దేశ, ప్రాంత వ్యవహారాలు, కొత్త స్నేహాలు ఇవన్నీ కలిపి రోజువారి జీవనాన్ని కూడా మారుస్తాయి తప్పక. మా ఈ జీవన శైలిని మీ జీవన శైలి కొలబద్దతతో కొలవద్దు ప్లీస్.

నువ్వు ఇలా ప్రతీ సారీ రాగాలు తీసావో నాకు ఎపుడో ఒకసారి కోపం రాకా మానదు, నేను దాని మీద అరవకా మానను, అది మా ఇద్దరి మధ్యా కలతలు తేకా మానదు. అది నాకు ఇష్టం లేదు. అందుకని ఈసారి నుంచి అలా రాగాలు తీయకేం?

అగో, ఇద్దరూ అలా బుంగమూతులు వేసుకొని కూర్చోకండి, ప్లీస్. నాకు ఇబ్బందిగా ఉన్నవి మీతో చెప్పాలని ఇలా ఉత్తరం రాసాను. అంతే కాని భార్యా దాసుడిని కాలేదు.
ఏది మంచో, ఏది చెడో విచక్షించే జ్ఞానం ఉందనీ, సంసారాన్ని చక్కపెట్టుకోగల దక్షత ఉందనే కదా మీరు నాకు పెళ్లి చేసింది. ఆ దక్షతా, విచక్షణా ఉన్నవాడిగా, తప్పు మీ వైపైనా, తన వైపైనా నేను చెప్పాల్సిందే కదా? అందుకే ఈ చిన్ని ఉత్తరం. మొదట బాధ పడ్డా సహృదయంతో మీరు అర్థం చేసుకుంటారని నాకు తెలుసు.

ఇట్లు,
"ఎప్పటికీ
మీ"
కన్నా.



Friday, 4 July 2008

చిననాటి ముచ్చట్లు - 1. నేనూ మొదలెట్టేసానోచ్-ప్రేమించటం!

పనిలేక ("కాదులెండి, పని ఉన్నా చేయ బుద్దేయక") ఖాళీగా కూర్చున్నా ఆఫీసులో. నిషిగంధ గారి బ్లాగులో వెన్నెల రాత్రి గురించిన reminiscenses చదివి "నాకూ బోలెడు జరిగాయి కదా ఇలాటివి, అవి ఎందుకు ఇంతవరకు చెప్పలేదు చెప్మా?" అని అనుమానం వచ్చింది. "అదుగో అదే వద్దన్నది. చెప్మా, గిప్మా, ఉప్మా...... అంటూ చదివే వారి తలను బొప్పి కట్టిస్తున్నావు నీ భాషతో. ఎంతో మర్యాదగా మహేష్ గారు ఒక సారి చెప్పి చూసారు భాష మార్చుకోమని. ఇంకా వినలేదనుకో కత్తి పట్టుకొని వచ్చినా వచ్చేస్తారు ఆయన, అసలే వాళ్ల ఇంటి పేరు "కత్తి". ఏమనుకుంటున్నావో ......... " అని నా "మనోజ" గయ్యాళిలా నా మీద లేచే సరికి "తప్పయిపోయింది తల్లీ, ఇంకోసారి అలా అనను" అని లెంపలేసుకొని మరీ ఈ ప్రయత్నం మొదలెట్టాను.

అసలే యమా సీరియస్ మనిషినీ ("నిజ్జం, మీమీదోట్టు") హ్యూమర్ లెస్ ఫెలో ని. అలాటి నేను ఇలా కొంచం హాస్యం పండిస్తూ ("అబ్బో పండిస్తూ......అట. ముందు వండు, అది పండిందో లేదో పాఠకులు చెప్తారులే"-- ఇలా నా మనోజ చేత తిట్లు తింటూ) నేను ఎంతో కష్టపడి రాసే నా ఈ చిన్ననాటి ముచ్చట్లని మీరు "వవ్హా వహ్వా" అని మా హైదరాబాదీ తీరులో కాకున్నా, కనీసం బావుంది అని చిన్న వ్యాఖ్య అన్నా రాయలేదనుకోండి, అంతే సంగతులు మీ పని........జాగ్రత్త!

సరే మొదలెట్టేసాం, "మరి దేనితో షురూ చేద్దాం" (చెప్మా అనను లెండి) అని బుర్ర గోక్కుంటుంటే ఒక ఐడియా తట్టింది. అరువు తెచ్చుకున్నదే అయినా నా గురించి రాస్తున్నా కాబటి నాకు తట్టినట్టే. అదేంటంటే ఇప్పుడు అందరూ "ప్రేమ" గురించే కదా రాస్తున్నారు, దాని గురించే మొదలెడదాం అని అనిపించింది. ఒకే అని డిసైడ్ అయిపోయా.

ఇప్పటి అందరిలా మేమూ (royal we లెండి) 10th క్లాసు నుంచే ప్రేమించటం మొదలెడితే మా గొప్పతనం ఎం ఉంటుంది చెప్పండి? అందుకే మనం 4th క్లాసు నుంచే మొదలెట్టాం అన మాట. అదీ ఓ ...... పే.....ద్ద త్యాగంతో. దాని కథా కమామిషు వినండి.

అది నేను నాలుగవ తరగతిలో చదువుతున్న రోజులు. మా క్లాసులో తను ఎప్పుడూ ఫస్టే. నాకు ఎప్పుడు రెండవ ర్యాంకే. అది ఎంతలా ఫిక్స్ అయిపోయిందంటే, దారుణంగా మా అమ్మ నాన్నలు కూడా "ఏరా! నీకు ఈసారి ఫస్టు ర్యాంకు వచ్చిందంటే తను పాపం వంట్లో బాలేక రాయలేదా ఏంటి? " అని నన్ను ప్రశ్నించే దాక వచ్చింది. ఎంత ప్రయత్నించినా నాకు ఫస్టు రాంకు రాదాయే. ఇంక తనను ఓడించటానికి ప్రయత్నం చేయటం మానేసి "తను అదే స్కూలులో టీచర్ కూతురు, తనకు గాక నాకు వస్తుందా ఫస్టు ర్యాంకు" అని నన్ను నేను ఒదార్చుకుంటూ ఉండే వాడిని. (తరవాత తెలిసింది లెండి ఇది rationalisation అనే ఒక మానసిక defense mechanism అని)

అలాటి "గడ్డు రోజులలో" ఒకానొక unit test exam రోజు మేమిద్దరం ఒక నిమిషం ఆలస్యంగా వచ్చాము మా క్లాసుకి. అప్పటికే మా వాళ్లందరూ తమక్కావలసిన చోట్లన్నీ ఆక్రమించేసారు. ఒక్క ప్లేస్ మిగిలింది బెంచి మీద. తన వైపు చూసాను. ఎక్కడ కూర్చోవాలా అని చూస్తోంది. "సరే నువ్వే కూర్చో బెంచి పైన" అని తనకు నా ప్లేస్ త్యా....గం చేసి నేను వెళ్లి నేల మీద కూర్చున్నా. అప్పటికి నాకు ఛాతీ ఎంత ఉందొ గుర్తు లేదు కాని చాలానే పొంగింది అని మాత్రం చెప్పగలను , నేను చేసిన త్యాగానికి. అప్పుడే మొదలైంది తనంటే ఇష్టం. కాకపొతే ఆ ఇష్టం అనేది ప్రేమ అని మీనాక్షి గారి టపా చదివే దాకా తెలీని మూర్ఖుడిని.

అల్లా (దేవుడు కాదు లెండి "అలా" కు వికృతి అది.) ఇష్ట పడుతూ.......... ఉన్న నన్నూ, నా మనసునూ చాల చిన్న చిన్న ముక్కలుగా చేసింది తను, వారంలోనే . ఛి, క్రుతఘ్నురాలు! అది మా స్కూలు పంక్షను ఢే. మా బడిలోనే కార్యక్రమాలు వేస్తున్నారు అందరూ. రెండు కార్యక్రమాల మధ్య విరామ సమయంలో మా అమ్మ వద్దన్నా వినకుండా నన్ను మైకు ముందుకు తోసింది "దుర్యోధన ఏకపాత్రాభినయం" చెప్పమని.

ఎంత పరదా వెనకాతల ఉన్నా మనకు అసలే చచ్చేంత స్టేజి ఫియరు. అందుకే రెండు సార్లు "ఆహా! ఏమి ఈ మాయ సభ" అన్న డైలాగు రిపీట్ చేసి మైకు ముందు ఉన్నానన్న విషయం మర్చిపోయి "మర్చిపోయా టీచర్" అనేసాను మైకులో. అది స్కూలంతా వినపడటం, పిల్లలతో పాటు టీచర్లు కూడా నవ్వటం జరిగిన తర్వాత కాని నా తప్పు అర్థం కాలేదు. అయినా ఎం లాభం? పడాల్సిన నా cut out భారీగా అప్పటికే పడిపోయింది.

ఇంత జరిగిందా? "అయ్యో తోటి కుర్రాడే" అని చూడకుండా, "నా కోసం మొన్ననే అంత పెద్ద త్యాగం చేశాడే" అన్న కృతజ్ఞత అయినా లేకుండా, తనూ కూడా నవ్వటమే కాకుండా, దర్జాగా వచ్చి "ఆహా! ఏమి ఈ మాయ సభ..." చెప్పటం మొదలెట్టి స్కూల్ మొత్తాన్ని మంత్రముగ్ధుల్ని చేసింది తన ఏక పాత్రాభినయంతో. దాంతో నాకు తనకు కచ్చి అప్పటినుంచి.

అయిదవ క్లాసు అయిపోగానే వేరే స్కూలుకు వెళ్ళిపోయింది తను. మళ్లా ఎప్పుడో తను కర్నూలు మెడికల్ కాలేజిలో mbbs చేరిందని తెలిసింది. అప్పటికి మొదటి ప్రయత్నంలో సీటు రాక, పట్టు వదలని విక్రమార్కునిలా మళ్ళీ ప్రయత్నిస్తున్న నేను ""ఇందులో కూడా నన్ను ఓడించిందే" అని అనుకోకుండా ఉండలేకపోయాను. తరవాత ఇంత వరకు తన జాడే లేదు (నేనూ వెతకలేదనుకోండి. హాయిగా పెళ్లి చేసుకొని నేను లైఫ్ లో సెటిల్ అయిపోయాను. అది వేరే సంగతి.)

అలా ముగుసిందండి నా మొదటి ప్రేమ. ఇంకా ఎన్నెన్నో బోలెడు చిన్న నాటి ముచ్చట్లతో (ప్రేమవే కాదు లెండి) మళ్ళీ కలిసేవరకు శలవు మరి.