Wednesday, 20 August 2008

నేను-సంగీతం........రెండవ భాగం

మొదటి భాగం ఇక్కడ
అలా సినీ గీతాల ఒరవడిలో పడి అటు సంగీత సాహిత్యాభిమనాలను (అవి అని నాకు తెలీకుండానే) పెంచుకుంటున్న నాకు "శంకరాభరణం" చిత్రం ఒక గొప్ప అనుభూతి. ఎనభై అయిదు నుండి ఏడు వరకు ఎప్పుడు వచ్చిందో సరిగ్గా గుర్తులేదు నాకు మన "దూరదర్శన్"లో కాని, అది చూసిన తరువాత నిజంగా సంగీతాభిమానం చాలా పెరిగింది. అందులో నాకు చాలా నచ్చిన సన్నివేశం శంకరశాస్త్రి (సోమయాజులు) గారు తన గడ్డు కాలంలో కూడా మన సంగీతానిపై మమకారం వదలక సాధన చేస్తూ, వెక్కిరించిన పాశ్చాత్య సంగీత ప్రియులకు బుద్ధి చెప్పే సన్నివేశం. అందులో ఆయన అన్నా ఒక మాట నాకు ఎప్పటికీ మరవలేనిది "సంగీతం హద్దులు లేనిది, అది పాశ్చాత్యమైనా మనదైనా...." ఇలా సాగుతుంది ఆయన ఆవేదనాభరిత వాగ్ధాటి. అంత ఆవేదనలోను ఆయన సంయమనం కోల్పోక తన సంగీతాన్నీ ప్రజలు నిర్లక్షం చేస్తున్నారని బాధపదతారే కాని పాశ్చాత్య సంగీతాన్నీ తులనాడరు. అది నాకు చాలా నచ్చిన విషయం.


ఆ చిత్ర ప్రభావం ఎంతగా పడిందంటే అప్పటి వరకు "కాకి గోలగా" (అమంగళం ప్రతిహతమగుగాక) భావించిన కర్నాటక సంగీతంపై మక్కువ మొదలయింది. కాని అది కూడా అప్పటికి ఉట్టి చిత్ర గీతాల వరకే పరిమితం అయింది. ఒకవైపు విద్యార్థిగా సాధించాల్సినది చాలా మిగిలిపోవటం, ఇంటికి పెద్ద కొడుకుగా భాద్యతలు ఎత్తుకోవాలి అన్న విషయం, ఆస్తిపాస్తులు ఏమి లేకపోవటం, సరస్వతీ దేవి కరుణిస్తే గాని లక్ష్మీ దేవి కరుణించదన్న విషయం గుర్తుండటంతో ఎటువంటే "పిచ్చి వేషాలు వేయకుండా" బుద్ధిగా చదువుపై శ్రద్ధ పెట్టాను. సంగీతాభిమానాన్ని ఉట్టి వినటం వరకే పరిమితం చేసేసాను.


అలాటి సమయంలో (నేను పట్టు వదలని విక్రమార్కునిలా EAMCET మూడవ సారి రాస్తున్నప్పుడు అనుకుంటా) నాన్న టేప్ రికార్డర్ తెచ్చారు ఇంటికి మొదటిసారిగా. ఎంతగా సంతోషించానంటే నాన్నకు ముద్దు పెట్టాను బుగ్గమీద. నాన్న సంబరంతో అమ్మతో "ఏమేవ్ నీ కొడుకు నాకు ముద్దు పెట్టాడు" అని చెప్పటం నాకు ఇంకా కళ్ళ ముందు కదలాడుతూనే ఉంది. నేను అప్పటి వరకు నా మనసులోని భావాలను అంతగా బయటకు ప్రస్ఫుటించిన సందర్భం మరొకటి లేదు ఎంత ఆలోచించినా ఆ రోజు.


ఇక చూసుకోండి నా సామి రంగా, రూములో లైట్లన్నీ ఆర్పేసి, కిటికీలు మూసేసి, తెరలు కప్పి ముఖేష్ గారి.రాజ్ కపూర్ పాటలు "దోస్త్ దోస్త్ నా రహా, ప్యార్ ప్యార్ నా రహా ..... " అంటూనో లేక "దునియా బనానే వాలే క్యా తేరే దిల్ మే సమాయీ , తూనే కాహేకో దేది జుదాయీ" అంటూనో, లేక ఘంటసాలగారివి "కుడి ఎడమైతే పొరపాటు లేదోయ్ ఓడిపోలేదోయ్" అంటూనో ఆ పాత మధురాలు వింటూఉండే వాడిని, గదిలో అటూ ఇటో పచార్లు చేస్తూ. బయట అమ్మ, నాన్న నా ఈ పరిస్థితి చూసి నన్ను "ఎరా నాన్నా! ఎక్కడన్నా ప్రేమలో ఫెయిల్ అయ్యావా" అని అడిగేంతవరకు వచ్చింది. లేదని వాళ్ళకు ఎలా నచ్చ చెప్పాలో నాకు అర్థమయ్యి చచ్చేది కాదు. (నిజంగానే లేదండి :-)


నిజం చెప్పాలంటే నాకు ఆ విషాద గీతాలు ఎందుకు అంత నచ్చుతాయో ఇంతవరకు తెలీదు, కానీ నేను మెచ్చిన, నచ్చిన సినిమా పాటల్లో అధిక శాతం విషాద గీతాలే. అటు లవకుశలో "ఏ నిమిషానికీ ఏమి జరుగునో ఎవరూహించెదరూ" కానివ్వండి, ఆనంద్ లోని " " , లేదా రాజేష్ ఖన్నా అమర్ ప్రేమ లోని "చింగారి కోయీ భడ్కే ......"కాని, ఆంధీలోని "తేరే బిన జిందగీ సే కోయి షికవా తో నహీ, షిక్వా నహీ..... ", ముకద్దర్ కా సికందర్లోని "ఓ సాథీ రే, తేరే బిన భి క్యా జీనా..... " కానీయండి ---వీటిలో ఉన్న ఆనందం నాకు ఎంత మంచి రొమాంటిక్ పాట అయినా కాని అందులో కనపడదు. క్లుప్తంగా చెప్పాలంటే "బాదే సౌఖ్యమనే భావన రానీవోయ్" అన్న మాటల భావం బలంగా నాటుకుపోయిందేమో నాలో అనిపిస్తుంది అపుడపుడూ నా ఈ చాయిస్ చూసి నాకే.


1995 లో మూడో ప్రయత్నంలో గాందీ మెడికల్ కాలేజిలో సీటు రావటంతో ఇంకో అంకం మొదలయింది నా సంగీతాభిమానంలో. ఈ అంకానికి నాంది పలికింది నేను వైద్య విద్యార్థిగా చేరిన మొదటి రోజే. అదీ నా గార్ధభ స్వరంతో! (నిజంగానండి బాబు, కావాలంటే నా శ్రీమతినదగండి). పరంపరగా వస్తున్నా అర్థం పర్థం లేని "ర్యాగింగు" అనే ప్రక్రియలో మొదటి రోజే నా చేత తిట్లు తిన్న కోతి మూక సీనియర్లు (నాలుగు గంటలు చెండాలంగా చేసిన తరవాత లెండి, ఊరకే తిట్టలేదు వాళ్ళను ) "వాడసలే తిక్క వెధవ వాడిని ర్యాగింగు చేయటంలో మజా లేదు" అని కోతి మూక సీనియర్లు నన్ను పట్టించుకోవటం మానేస్తే సిన్సియర్ సీనియర్లు పట్టుకొని రాగ చీయటం మొదలెట్టారు. పాపం ఏమడగాలో తెలియక అనుకుంటా "నీ హాబీలు ఏమిటి" లాటి ప్రశ్నలు వేస్తుంటే చెప్పాను పాత పాటలు వింటాను, పాడుకుంటాను అని. వాళ్ల ఖర్మకాలి వారిలో ఒకడు సరే అయితే నీకు నచ్చిన "పాత పాట పాడు" అని నాకు చాయిస్ ఇచ్చాడు. అంతే నేను ఎంతో ఉత్సాహంతో "కుడి ఎడమయితే పొరపాటు...." అంటూ పాట ఎత్తుకున్నానో లేదో అందరూ spontaneus గా చెవులు మూసుకోవటం, అప్పటి వరకు బాగా మాట్లాడుతున్న ఆ సీనియర్లు "ఏం బే! ర్యాగింగు నిన్ను మేము చేస్తున్నామా లేక నువ్వు నన్ను చేస్తున్నావా, ఆపు నీ గోల" అని అరవటం తృటిలో జరిగిపోయింది. ఇంకేముంది వాళ్లకు కోపం తెప్పించినందుకు ఒకడి అనాటమీ రికార్డు మొత్తం వేసి పెట్టాల్సిన శిక్ష పడింది. (లాస్ట్ డేట్ ముందు రోజు ఇష్టమొచ్చినట్టు గెలికి రికార్డు వాడి మొహాన పడేస్తే వాడు ఏడవలేక నవ్వలేక పెట్టిన మొహం ఇంకా గుర్తుందిలెండి, అది వేరే విషయం)


ఈ ఘట్టాన్ని ఎందుకు చెపుతున్నానంటే అంతవరకు "నా గొంతు బాలేదు" అని నా ధ్యాసలోకి రాకపోవటం, ఆ రోజు అంత spontaneus గా వాళ్లందరూ చెవులు మూసుకోవటంతో నా గార్దభ స్వరం యొక్క అసలు సత్యం నాకు జ్ఞానోదయమయ్యింది. చిన్నప్పుడు ఎపుడో పక్కింటి ఆంటీ పంద్రాగస్టుకు గీతం నేర్పుతూ "కంఠమెత్తి పాడరా...ఎంత ఎత్తు ఎగిరిందో ఈ దేశపు మన జెండా" అన్న చరణంలో ఎంతకీ పైకి లేవని నా కంఠస్వరాన్ని గమనించి ఆ చరణాన్ని నా చెల్లికి నేర్పటం, మా బడిలో క్లాసులో మొదటి ర్యాంకు నాదే అయినా మా "ప్రేయర్ సింగింగు గ్రూపు"లోకి నాకు ఆహ్వానం రాకపోవటం (మా బడిలో ఆ గ్రూపులో సభ్యుడవ్వాలంటే బాగా చదివే వారన్న అయి ఉండాలి లేదా నిజంగా సూపర్ కంఠ స్వరమన్నా అయి ఉండాలి) ఇవన్ని చక చకా కళ్ళ ముందు తిరిగాయి. అసలు నాది కాదండి తప్పు ఈ విషయంలో, "మా అమ్మా నాన్నలది, మా చెల్లెళ్ళదీను, ఎంత కాకి పిల్ల/అన్న కాకికి ముద్దయితే మాత్రం అంతగా నోరు మూసుకొని భరించాలా అని అడుగుతున్నా యువరానర్! ముందే చెప్పుంటే నాకు ఇన్ని అవమానాలు తప్పేవి కదా." అలా నా కంఠస్వరం బాలేదని తెలియడం నాంది అనమాట ఈ అంకానికి.

(సశేషం)

5 comments:

  1. బాగుంది మీ సంగీతాభిలాష నాకు కూడా విషాద గీతాలు ఇష్టం.
    బాగా వ్రాశారు...

    ReplyDelete
  2. బావుంది మీ సంగీతాభిలాష.

    ReplyDelete
  3. నాక్కూడా sad songs అన్నా విప్లవ గీతాలు అన్నా చాలా ఇష్టం. మా ఆవిడకు మాత్రం ఇవి బలె చిరాకు :)

    ReplyDelete
  4. మీ సంగీతాభిలాష బావుంది. శంకరాభరణం స్నిమాలో పాశ్చాత్య సంగీతాన్ని బాగానే తిడతారు.

    ReplyDelete