Saturday, 29 November 2008

ఆవేశమొచ్చి నా కలాన్నెత్తా
వీర పోడుచుడు పొడిచేద్దామని.
అక్కడెక్కడో ముంబాయిలో జరుగుతుంటే
సురక్షిత దూరంలోని నేను.


కాగితంపై పెట్టానో లేదో
కలం కక్కింది.
అక్షరాలు కాదు,
అంతు పట్టని చిక్కటి సిరా మరక.


రోర్షా చార్టులా ఉన్న ఆ మరక
నన్ను చూసి నవ్వినట్టనిపించింది
పిచ్చి పట్టినోడిలా
"ఎందుకా నవ్వు" అనేసా.


"కవితలు రాస్తావు
రెండు రోజులు మరువనంటావు
మళ్ళీ షరా మామూలే
నీ నడవడి అసలు మారదే


లగ్షరీలు బ్లాకులో కొంటావు
వీలయినన్ని పన్నులు ఎగ్గోడతావు
అవినీతిని చూసి చూడనట్టుంటావు
ధైర్యం అవకాసం ఉంటే నువ్వే చేస్తావు


ముష్కరులు తెలిసినా
జాడ చెప్పవు,
తప్పని తెలిసిన
మత చాందసులను అడ్డగించవు


ఓటు హక్కు వాడవు
వాడినా కులం పేర దురుపయోగమే
అదేమంటే అందరూ దొంగలంటావు
మరి నువ్వేం చేస్తున్నావు దొర బాబు?


ఎన్నని చెప్పను నీ చర్యలు
కావా ఇవన్నీ వాటికి ప్రతి చర్యలు, అనుచర్యలు?"


అంటూ పెద్ద లెక్చర్ దంచింది
నిజమండి! మీరు నమ్మి తీరాలి.
నేను చెవులారా విన్నది
పలికినది ఆ సిరా మరక చిన్నది.


ఏమంటారు?
నేను పిచ్చోడినా?
ఎందుకూ ?
సిరా మరకతో మాటాడినందుకా ?
నిజమేనా?
లేక ఆ మాటలు ఇక్కడ చెప్పినందుకా?
ఏమో? ఎవరికి తెలుసు?
నేను నిజంగా పిచ్చోడినేమో!!!!

Thursday, 27 November 2008

కాలం మహిమ

మూలుగుతున్న మనసుకు
తడబడుతున్న తనువుకు
లేని సత్తువ అప్పిచ్చి
బయలుదేరాను గమ్యం వైపు!

"గమ్యం"! తలచుకుంటే నవ్వొచ్చింది
అసలు గమ్యానికి ఇంత చేరువలో ఉన్నా
ఇంకా వీటిని గమ్యం అనుకొనే
నా సగటు మనిషితనానికి।

నవంబరు నెల!
దీని విలువ ఇప్పుడిప్పుడేగా తెలిసింది।
తెలిసేనాటికి కాలం మజిలీల
మరపు మరిచి చాలా కాలమే గడిచింది।

ఇంటి నుంచి బయట పడ్డా
జారిపోతున్న కాలాన్ని జయించాలనే ఏమో
బిరబిరా పరుగుతీస్తున్న జనం మధ్యకు
కరిగిన కాలపు చిహ్నంలాటి నేను।

ఎలాగోలా చేరాను
గమ్యం దగ్గరి "అవసరపు" మజిలీకి
ఉచ్చల కంపులో వాహనాల రణగొణ ధ్వనుల మధ్య
నాలాటి నవంబరు బాదితులేందరో చేరిన కుంభమేళాకు।

"నెంబర్ వన్, టూ " అంటూ
హాజరు తీసుకున్న మేము
"మహాప్రభో ఉన్నాము ఇంకా"
అంటూ అర్జీ పెట్టుకుందుకు।

ఎంతటివారైనా గుర్తు పట్టి
"కూర్చోండి సర్"అంటూ కుర్చీ ఇచ్చేస్థితి నుంచి
మూడుకాళ్ళతో ఉన్నా
బారులు తీరి నిలబడాల్సిన స్థితి........

కాలపు కాటు తగిలి, వడలు చిదిగి
"ఆటో మే బైటే సాబ్,తబియత్ అచ్చా నహీ హై" అన్నా.......
"హమే అప్నీ కాం కర్నా హాయ్ నా అమ్మా" అంటూ కసిరే
క్లర్కు అయిడేంటిఫికేషను చేయాల్సిన స్థితి......

" యూ జీ సి ఇదర్ నహి ఉధర్ " అంటూనో
"మీది సెంట్రలా స్టేటా" అంటూనో
పడే వడగల్లకు నిలిచి, రెందంతస్తులను గెలిచి
సాధించిన ఘన కార్యం........

పించను లైఫ్ సర్టిఫికేటు ఇవ్వటం.

Wednesday, 12 November 2008



కార్తీక మాసపు వెన్నెలలో మా వనభోజనం జరిగింది ఇక్కడే.......

NightShot అంత సరిగా రాలేదు కదా ప్చ్ :-(



కార్తీక పున్నమి వేళలో.........................

కలికి వెన్నెల కెరటాల పైనా....................

వచ్చాడు మా రాజు ఈ రోజు, 

రానె వచ్చాడు నెలరాజు ఈ రోజు.

Saturday, 8 November 2008

నా పాట్లు.

చలికి తట్టుకోలేక
కోటు దగ్గరికి లాక్కున్నా.
పక్కనుంచి పాడు రోద,
వడివడిగా పారుతున్న "బ్రూక్" దయ.


ఝాము చూస్తె పదకొండు.
చిక్కటి చీకట్లో..... పెద్ద చెట్టు మొదట్లో....
రాలిన ఆకుల మధ్య..... పిట్టగోడపై.....
చూస్తె "భూతాల్రోయ్" అని దడిచేలా...........మేము!


ఆకుల గలగలలు,
క్రికెట్ల కీచులాటలు ....ఇవి, తన సంగీతాలు!
ప్చ్ , ఏం చేద్దాం
భావుకుడని తెలీక చేసుకున్నా.


వెచ్చని ఇల్లు,
పొగలు కక్కుతున్న కాఫీ,
ఇష్టమైన సీరియల్ .............
మిస్సవుతున్నవన్నీ...... ఏడుపు తెప్పించాయి.


ఫక్కున నవ్వినట్టనిపించింది
ఎవరా అని తలెత్తగా.......
తెల్లటి మబ్బుల మధ్యన
మచ్చల చందమామ!


కార్తీకమే అయినా
శుద్దాష్టమి కళ
అసంపూర్తిగానే ఉంది!
నా మనసులా.............


ఉలిక్కి పడ్డా!
"అదేమిటి అలా అనేసుకున్నా"
నన్ను నేను ప్రశ్నించుకున్నా.


"నిజమేగా మరి"
మనసు రెట్టించింది
"ఉన్నాడన్న మాటే గాని
నీతో ఉన్నాడా తను?"


తన వైపు చూసా...............
కరిగిపోతున్న కాలాన్ని
పట్టి బంధించే విఫల ప్రయత్నంలో
కెమెరాతో కుస్తీ పడుతున్నాడు.


శరత్సమీరం ఒణికిస్తున్నా,
ఆ అసంపూర్ణ శశాంకాన్ని...
తదేకంగా చూస్తూనే ఉన్నాడు.
అస్వాదనా?..... ఏమో.... ఎవరికి తెలుసు?


మధ్య మధ్యలో వచ్చి
ముద్దలు పెట్టించుకొని పోతున్నాడు.
తను తింటున్నది చూసా........
పెరుగన్నం, ఆవకాయ దబ్బా!!!!!


ఎముకలు కోరికే చలిలో,
ఇదేమీ తిండో?
నాకు చచ్చినా అర్థం కాడు.


నవ్వొచ్చింది!
ఉన్న దేశంలో ఇమడలేక
ఇమిడే దేశంలో ఉండలేక
సతమతమయ్యే మనిషి.


అయినా ఈ బుధ్ధెక్కడిదో?
పుట్టింది పెరిగింది పట్టణంలోనే అయినా,
ఇష్టాలు, ఆశలు...అన్నీ పల్లెపోకడలే!
చెట్లూ, పుట్టలూ, నెలవంక, ఆకాశం, అంటూ ....


"చిన్నా వెళదామా
చలి చాలా ఉన్నట్టుంది"
తను పిలిచే వరకు తెలీలేదు
ఆలోచనలలో ఎంతగా ముణిగిపోయానో.


"బ్రతుకు జీవుడా" అనుకుంటూ
కారెక్కాను తలూపి.
"తమాషా అయిపోయిందన్న" నిరుత్సాహమనుకుంటా......
తను కూడా తప్పుకున్నాడు, మేఘాల మాటుకి!!!



నేను తనను పెట్టె పాట్లకు నా శ్రీమతికే పద్యం కెలికే అలవాటుంటే ఎలా ఉంటుందా అన్న ఆలోచనకు ప్రతిరూపం ఇది. "కొన్ని అభిరుచులు కలవలేదన్న" నా అసంతృప్తిని ఇలా "అవతలి వారి వైపు నుంచి చూడటం" అనే ప్రక్రియ ద్వారా అప్పుడప్పుడూ బయటకు కక్కేస్తుంటానన్నమాట. Sublimation అనే Defence mechanism ఇది.