ఆవేశమొచ్చి నా కలాన్నెత్తా
వీర పోడుచుడు పొడిచేద్దామని.
అక్కడెక్కడో ముంబాయిలో జరుగుతుంటే
సురక్షిత దూరంలోని నేను.
కాగితంపై పెట్టానో లేదో
కలం కక్కింది.
అక్షరాలు కాదు,
అంతు పట్టని చిక్కటి సిరా మరక.
రోర్షా చార్టులా ఉన్న ఆ మరక
నన్ను చూసి నవ్వినట్టనిపించింది
పిచ్చి పట్టినోడిలా
"ఎందుకా నవ్వు" అనేసా.
"కవితలు రాస్తావు
రెండు రోజులు మరువనంటావు
మళ్ళీ షరా మామూలే
నీ నడవడి అసలు మారదే
లగ్షరీలు బ్లాకులో కొంటావు
వీలయినన్ని పన్నులు ఎగ్గోడతావు
అవినీతిని చూసి చూడనట్టుంటావు
ధైర్యం అవకాసం ఉంటే నువ్వే చేస్తావు
ముష్కరులు తెలిసినా
జాడ చెప్పవు,
తప్పని తెలిసిన
మత చాందసులను అడ్డగించవు
ఓటు హక్కు వాడవు
వాడినా కులం పేర దురుపయోగమే
అదేమంటే అందరూ దొంగలంటావు
మరి నువ్వేం చేస్తున్నావు దొర బాబు?
ఎన్నని చెప్పను నీ చర్యలు
కావా ఇవన్నీ వాటికి ప్రతి చర్యలు, అనుచర్యలు?"
అంటూ పెద్ద లెక్చర్ దంచింది
నిజమండి! మీరు నమ్మి తీరాలి.
నేను చెవులారా విన్నది
పలికినది ఆ సిరా మరక చిన్నది.
ఏమంటారు?
నేను పిచ్చోడినా?
ఎందుకూ ?
సిరా మరకతో మాటాడినందుకా ?
నిజమేనా?
లేక ఆ మాటలు ఇక్కడ చెప్పినందుకా?
ఏమో? ఎవరికి తెలుసు?
నేను నిజంగా పిచ్చోడినేమో!!!!
No comments:
Post a Comment