Tuesday, 20 January 2009

నిషిగంధగారి "జాజుల జావళి"-సమీక్ష-4-జాజుల జావళిలొ "సహచర్యం"

నిషిగంధగారు ఈ సమీక్షపై తన వ్యాఖ్యలొ "నా కవితల్లొ ఉన్నది ఏకాంతం ..వంటరితనం కాదు...రెంటికీ చాలా తేడా ఉంది" అని చెప్పేదాకా నా సమీక్షలొ అప్పటి వరకు వాటిని "ఇంటర్ చేంజబుల్"గా వాడిన సంగతి నేను గమనించలేదు. వెంటనే డిఫెన్స్ లొ పడిన మనసు బ్రౌణ్యం వెతికేలా చేసింది. "ఒంటరి" అన్న తెలుగు పదానికి బ్రౌణ్యం "సింగుల్, సాలిట్యూడ్, లొన్లినెస్స్" అన్న పెక్కు అర్థాలు ఇస్తే, "ఏకాంతం" అన్న సంస్కృత పదానికి మాత్రం "సాలిట్యూడ్" అన్న ఒక అర్థమె ఇచ్చింది. మ్మ్! ఇలా కాదు అని చెప్పి కవితల్లొ ఏకాంతానికి సంబంధించినవి ఎన్ని, వంటరితనానికి సంబంధించినవి ఎన్ని అని లెక్కలు కడుతూ ఉంటే "అసలు ఏమిటి నేను చెస్తున్న పని? కవితల్లొ స్ఫష్టంగా కనిపిస్తున్నది సహచర్యం కోసం పడుతున్న తపన, దాన్ని ఆనందిస్తున్నప్పుడు కలిగిన అనుభూతులూ...ఇది వదిలెసి నాయికకు/కవయిత్రికి ఈ అనుభూతులు వంటరితనం వల్ల కలిగినవ/ఏకాంతం వల్ల కలిగినవా అంటూ ఆలొచన ఏమిటి అని అనిపించింది." అందువల్ల చివరి కవితా వస్తువుగా "సహచర్యం" అని డెసైడ్ అయిపోయాను. మరి "పురుషుడొ?"....... ప్రతీ కవితలొ సహచర్యం "అతని" కొసమె అని ప్రస్ఫుటం కాబట్టి మళ్ళీ ఇంక ప్రత్యేకంగా ఎమీ చెప్పాల్సిన పనిలెదు అని అనిపించి దాన్ని వదిలేస్తున్నాను.


ఈ సాహచర్యాని గురించి ముచ్చటించుకొవాలంటే ఇంత ముందు మూడు భాగాలలొ చేసినట్టు కాకుండా ఇక్కడ ప్రతీ కవితనూ విడివిడిగా తీసుకొని పరిశీలిస్తె బావుంటుంది అన్న భావన కలిగింది. "బాబొయ్!! ఇరవయ్యారు కవితలకు విడివిడి విశ్లేషణా, అదీ ఇప్పటి వరకు ఇచ్చినవి కాకుండా...." అంటూ మనసు నీళ్ళు నమిలేసరికి దానిని సంతృప్తి పరచడానికీ (నా పని తగ్గించుకొటానికీ కూడా లెండి :-) ఇక్కద నాకు నచ్చినవి, నిగూఢార్థాలు ఉన్నాయి అని నాకు తోచినవి ఇలాటి వాటిపై మాత్రమె చెప్పదలిచాను. అంటే "నానిగాడు " "బంగారు తల్లి" లాటి వాటిలొ "సహచర్యం" లేదని కాదు...అంత స్ఫష్ఠంగా ఉన్న దానిపై నా వ్యాఖ్య అనవసరం అని మాత్రమే.


టూకీగా ఇప్పటివరకు సాగిన జావళి కథా కమామిషు చూద్దామా ముందు, ఆ తరువాత పైన చెప్పినట్టు విడివిడిగా ఆస్వాదిద్దాం ఒకొక్కటి.


1. మొదటి కొన్ని కవితలు నాయిక "అతని" సాహచర్యాన్ని
• ఆస్వాదిస్తూన్నవి ........................................."స్నేహ మాధురి",
• అందువల్ల తన జీవితానికి ఏర్పడ్డ సార్థకత గురించి చెప్పేవి........."ఆనతి నీయరా"
• కోల్పోయి దానికి తపన పడుతున్నవి..............."నీవు లేని క్షణాన", "నిరీక్షణ"
• ఆ విరహాన్ని కూడా ఆనందిస్తున్నవి ................."ఏకాంత వేళ" "ఏకాంత యామిని"
• ఆ విరహాన్ని అందంగా అభివర్ణించినవి .........."చంద్రోదయం" "ప్రియమైన శత్రువు"
• ఆ విరహాంతం దగ్గర పడిందని ఆనందిస్తున్నవి ........"తొలి స్పర్శ"

ఇలా ఈ కవితలు అన్నీ "సహచర్యం ఉంది కాని కారణాంతాల వల్ల ఇప్పుడు లేదు" అన్న భావన కలిగిస్తాయి.


2. తరవాత కవితలు కొన్ని "జీవన క్రమంలో ఇవన్నీ మామూలే నాకు బాధ లేదు, నీ జ్ఞాపకాలున్నాయిగా నాకు తీపి గుర్తులుగా " అని తనకు తాను నాయిక సర్ది చెప్పుకునే కవితలు......" మనిద్దరం" ............ఆ నిన్నటి జ్ఞాపకాలే ఇప్పటి పరిస్థితులలో బరువైపొతే ఎందుకిలా జరిగింది అని బాధపడటం ............"నిన్నటి స్వప్నం" కనిపిస్తుంది.


3. ఈ దశ దాటిన తరవాత దశలో కొంచం సుతిమెత్తగా "ఇంత ప్రకృతి అందం ఉండగా అవి ఆస్వాదించకుండా ఉన్న...అంటే భావుకత లేదని" అతని పై "విసుర్లు" విసరడం ........."ఒంటరి రహస్యం" లో కనిపించింది.


4. ఇంత ఎదురు చూస్తున్నా, నచ్చ చెపుతున్నా (వసంతం కోసం ఎదురు చూపులు అన్న మాట), అతని చేష్టలు, మాటలు, ప్రవర్తన "గ్రీష్మంలా" ఉంది అనీ పరోక్షంగా చెప్పటం....."ఆశా కిరణం", ఎంత ప్రయత్నించినా ఫలితం లేదని వాపోవటం........"ఆశా కుసుమం "


5. ఇంత చెప్పినా మారలేదనుకుంతా అతగాడి నైజం.....ఇంక ప్రత్యక్ష యుద్దానికే దిగుతుంది నాయిక "అడుగులో అడుగునై" కవితలో..........


6. ప్రత్యక్ష యుద్ధ ఫలమేమో, పాపం పురుషుడు రాజీ కొచ్చి "అలిగితివా" అంటూ బతిమాలుకొంటాడు,
మల్లెలు మరువం రాయబారం పంపుతాడు, చివరకు సాధించి అక్కున చేర్చుకొంటాడు ......."అలిగితివా"


7. దానితో మళ్ళీ అతనిపై అనురాగం జనించిన నాయిక అతని సాహచర్యాన్ని అనుభవిస్తూ మధ్యలో ఆగిపోయిన తన రస రమ్య స్వప్నాన్ని తిరిగి జనింప చేస్తుంది............."ఎకాంతార్ణవం"......ఇప్పటి వరకు కవితలలో ఆఖరుది.



ఈ సహచర్యం విషయంలో నాకు అన్నిటికంటే నచ్చిన కవిత "అడుగులో అడుగునై...." శీర్షిక చూడగానే "ఆకులో ఆకునై....." అన్న వేటూరి గీతం గుర్తుకు వచ్చింది. అదే పాట ప్రేరణ కూడా కావచ్చు ఈ శీర్షికకు. ఈ కవిత అంతగా నచ్చడానికి కారణమైన చివరి అయిదు పాదాలు చూడండి


"నాకు తెల్సు..
వచ్చేప్పుడైనా
నీకూ అర్ధమౌతుంది..

ఊపిరి తాకినంత మాత్రాన
సామీప్యం సాన్నిహిత్యమవ్వదని!!"


చదువుతుంటే ఆ అయిదు పాదాలు చాలు....అసలు విషయం చెప్పటానికి. మిగితా పాదాలన్నీ నాయిక భావుకత తెలియచెప్పటానికి ఉపయోగ పడ్డాయి కాని అసలు విషయం ఈ అయిదు పాదాలే చెప్తాయి. అదీ ఎలాగో చూడండి!!! ప్రాధేయ పూర్వకంగా నీతో అది చేయాలని ఉంది, ఇది చేయాలని ఉంది అని చెప్పిన నాయిక, చివరికి అలా చేస్తే అయినా "నీకూ భావుకత కలిగి, సున్నిత మనస్కుడవై, ఊపిరి తగిలేంత దగ్గరగా ఉన్నా అది సామీప్యం అనిపించుకుంటుందే కాని "నాతి చరామి" అంటూ నువ్వు ప్రమాణం చేసిన సహచర్యం మాత్రం కాదు అన్నది నీకు అర్థమవుతుంది" అన్న ఆశను వ్యక్తం చేస్తుంది. అది కూడా క్లుప్తంగా, తనదైన భావుకత నిండిన భాషలో, చిన్నగా.....ఇంకా చెప్పాలంటే....మామూలు భాషలో "మెత్తటి చెప్పుతో కొట్టినట్టు" అని అనిపించింది.

ఈ "అడుగులో అడుగునై" అన్నది ఈ కవితలలో paradaigm shift లాటిది. అప్పటి వరకు తనలో తాను అతని సహచర్యం పోతోంది అని వాపోయిన నాయిక ఇప్పుడు direct action కు సిద్దపడి "అతని" ని సూటిగానే అడుగుతుంది....."సామీప్యం కాదు నాక్కావలసింది...సాన్నిహిత్యం అని"....ఈ చొరవలోనే నిషిగారు అన్నట్టు "అభిసారిక" మళ్ళీ అగుపిస్తుంది...తనకు "నచ్చిన" వాడికై చొరవ చూపటానికైనా తాను సిద్దమే అంటూ ............. నా మటుకు నాకు ఈ కవితా సంకలనాన్నే నిర్వచించే కవిత ఈ "అడుగులో అడుగునై"...ఎందుకంటే .సహచర్యమే ప్రధాన విషయంగా నడిచే ఈ జావళి "యుగళ గీతం" కావటం ఎంతో అవసరం అంటూ "సాహచర్యాన్ని నిర్వచించే కవిత ఇది".



ఇక నాకు చాలా నచ్చిన రెండో కవిత "నగల పెట్టె". ఇది చదివిన వెంటనే ఎంతో అపురూపంగా దాచుకున్న భావుకత ప్రతిరూపాలను (అనుభూతులు ) భర్త నిర్లక్షం చేస్తే నిస్సహాయంగా చూస్తూ ఉండిపోయిన నాయిక మనసులో మాత్రం "అవైతే పదేసావు కాని నా భావుకత మనసు నుండి తీయలేవు కదా" అని ఆలోచించటం అన్న దాన్ని కవితా రూపకమిది అని అనిపించింది. ఆ విషయం నాయికకు ఎంత బలాన్నిచ్చిందంటే తన అపురూపాలను కోల్పోయిన ఆ ఓటమిలో కూడా ఈ భావుకత అనేది తన ఆభరణంగా అభివర్ణించటం....దాని మెరుపుని తన విజయ దరహాసంగా చిత్రీకరించటం జరిగింది అని అనిపించింది. నాలోని పిచ్చి వైద్యుడు "ఇది passive aggression……అంత మెచ్చదగిన విషయమేమీ కాదు అని" నా బుద్ది తలుపులు తెరవటానికి ప్రయత్నించినా "చస్ ఊర్కో......ఎంతో అందంగా వర్ణించబడింది....భావుకత చూడు" అంటూ నా హృదయం బుర్ర తలుపులు మూసేసింది. ఎంతయినా పురుష సామ్రాజ్యంలో పుట్టి పెరిగిన మగవాడిని కదా...passive aggression నే నచ్చుతుంది లెండి.


మూడోది "నిరీక్షణ"..............మొత్తం కవిత "ఒంటరితనం" తో నిండి ఉంది.......ఏకాంతం కాదు. "ప్రేమ అన్నది ఉత్త నీహారిక కాదు కదా" అన్నది ఒంతరితనానికే చిహ్నమేమో.....

నాకెందుకో చివరి పాదం
రేపొచ్చే ఉదయం మీద కొత్త ఆశతో
బదులు
"రేపొ"చ్చే ఉదయం మీద కొత్త ఆశతో
అని ఉండి ఉంటే మొత్తం కవిత ఆ ఒక్క పాదంలో ఇమిడేది అనిపించేది. "గోడ మీద రాసుకున్న రేపుకై ఎదురు చూపు" అన్న భావన కలిగింది ఈ కవిత చదువుతుంటే.



నాలుగోది "ఒంటరి రహస్యం". ఇందులో భావుకత లేదని "అతని" పై విసుర్లు విసరటం ఎంత రమ్యంగా చేయబడిందో. నాకయితే అది "విసుర్లు" అనే అనిపించింది...మరి మిగితా వారేమంటారో? చూడండి మొత్తం ప్రకృతి అంతా అందంగా వర్ణించి.....చివరి మూడు పాదాల్లో మాత్రం
"ఆసాంతం చైతన్య ఝరి.. తను మాత్రం నిశ్చలంగా! విశ్వరహస్యాలను భద్రపరుస్తూ!!" అన్నారు. "వెవ్వే! ఎప్పుడూ ఎంత గంభీరంగా, సీరియస్గా ఉంటావో చూడు.....చుట్టూ ఇంత అందంగా ప్రకృతి ఉంటే దానికి చలించకుండా (నిశ్చలంగా) ఏదో కొండ కట్టేలూ, కోనీటి నీళ్లు మోస్తున్నట్టు (విశ్వ రహస్యాలను భద్రపరుస్తున్నట్టు) ఎంత పోజో" అనే చిన్న పిల్ల వెక్కిరుంపుతనమే కనపడుతుంది నాకు ఇందులో.

ఇంకోటి చూడండి..."చంద్రోదయం". ఇక్కడ సూటిగా చెప్పబడింది చంద్రుని కోసం నిరీక్షణే అయినా "అతని నిరీక్షణ" గా అన్వయించుకుంటే ఇంకా ఎంత బావుందో. అపుడు "పక్షం రోజుల ఎదురు చూపులు" అన్నది "సంపూర్ణ కళ గల వాడే నా పురుషుడు, అతని కోసమే నా నిరీక్షణ, పూర్ణం కాని వాడు పురుషుడే కాదు......" లాటి భావాలు చూపెడుతుంది. తనను తాను నాయిక రాధగా ఎలా అంతర్లీనంగా పోల్చుకుందో చూడండని ఇందులో.... "డాబా మీద నీతో కబుర్లు చెబుతూ పెట్టుకోవాలనుకున్న గోరింటాకు చిన్న బుచ్చుకుని ముఖం నల్లబర్చుకుంది" అట. అంటే నల్లనయ్య రాలేదని రాధమ్మ బాధపడుతుంటే అది చూచి చెలులు కూడా మొహాలు వేలాదేసుకున్నట్టు గిన్నెలోని గోరింటాకు నల్లబడిందట....వావ్!!!!!



ఇలా చెప్పుకుంటూ పొతే ఎన్నో అన్వయాలు చేయోచ్చు. మొత్తానికి అద్భుతంగా ఉన్నాయి ఈ కవితలు. ఎన్నో తెలియని విషయాలు నేర్చుకున్నాను ఈ కవితలను చూసి, ముఖ్యంగా చెప్పాలనుకున్నది నిగూడంగా ఎలా ఉంచాలి అన్న విషయంలో. కాకపోతే ఇవన్నీ నిజంగా అందులో ఉద్దేశ్యపూర్వకంగా ఉన్నవో, లేక నేనుగా ఆపాదిస్తున్నవో తెలీదు. రచనలలో ఎన్నో కోణాలు అవగతం అవటం, రచయితా/త్రి అనుకోనివి కూడా, సాధారణమే అనుకుంటా.

పైగా ఇంకో విషయమేమిటంటే నేను దీన్ని ఒక కవితా సంకలనంగా తీసుకొని చేస్తున్న విశ్లేషణ ఇది. ఎన్నో సంవత్సరాల జీవన పయనంలో నిషిగారు రాసుకున్న వేరు వేరు కవితలను ఇలా చూడటం ఎంత భావ్యమో తెలీదు కాని నేను చెప్పిన కవితా వస్తువులే మాటి మాటికి రావటం, అవే అంతర్లీనంగా ఈ జాజులను ఒక మాలన కట్టటం వలన అది సబబే అనిపించింది.
ఈ జాజుల జావళి చదవాలనుకున్న వారు ఇక్కడ చడువుకోకగలరు.

సమాప్తం

మొదటి భాగం
రెండవ భాగం
మూడవ భాగం

Sunday, 18 January 2009

నిషిగంధ గారి "జాజుల జావళి" :- సమీక్ష -3 జాజుల జావళిలో ప్రకృతి-స్త్రీ

ప్రకృతిపై తన మక్కువను వర్గపు శీర్షికలో జాజులకు పెద్దపీట వేసి చెప్పకనే చెప్పారు నిషిగారు. ఆలకిస్తే శీర్షికలోనే నిషిగారి కవితాకన్యక కంఠం కూడా వినిపిస్తుంది అంతర్లీనంగా. అంటే ఇక్కడ నాయికా-ప్రకృతి స్త్రీ ఒకటే అనే భావన అవుపిస్తుంది. కొన్ని సందర్భాలలో "నాయిక -ప్రకృతి వేరు వేరు" అనీ, ఇంకొన్ని సందర్భాలలో "నాయికే ప్రకృతి" అంటూ చూపెట్టటం ఈ జాజుల జావళిలో ఉన్న ప్రత్యేకత. ఏదేమైనా ఈ కవితలలో ప్రకృతి స్త్రీతో చెడుగుడు ఆడేసారు నిషిగారు, ఎంతో అందంగా.

బాలభానుడు, అస్తమయ సూర్యుడు, పూర్ణచంద్రుడు , చల్లని శశిరేఖ, వెచ్చని భానురేఖ, పిల్ల గాలి, పచ్చగడ్డి, పావురం పిల్ల, కోనేరు, కొండ నీడ, కొబ్బరాకుల మధ్య కిరణాలు, ఎండుటాకులు, పండుటాకులు, తెల్లని నందివర్ధనాలు, పచ్చని చివుళ్ళు, గుచ్చుకునే ముళ్ళు, వసంత, శిశిర, హేమంత, వర్ష ఋతువులు, మబ్బు పరదాలు, సెలయేరు-జలపాతాలు, మలయమారుతాలు ఇలాంటి ప్రకృతి వన్నెచిన్నెలన్నీ, సోయగాలన్నీ వర్ణించటం మామూలే భావుకులకు. అది మాత్రమే చేస్తే ఇలా సమీక్షకు ఉసిగోల్పవేమో ........

ఈ కవితలలో వీటిని మనోహరంగా వర్ణించటమే కాదు వాటిని పాత్రధారులని కూడా చేస్తారు నిషి గారు, నాయికా-నాయకుల మధ్య నడిచే ఈ అభినవ శాకుంతలంలో. అంతే కాకుండా కొన్ని సందర్భాలలో అవే నాయిక మనః- శారీరక స్థితులని తెలిపే నిగూఢ చిహ్నాలు, అంటే ప్రకృతి స్త్రీయే నాయికయిందనమాట.

ప్రకృతి స్త్రీ చేత "నాయిక-ఆమె పురుషుడి" మధ్య ఎన్నో పాత్రలు పోషింప చేసారు నిషిగారు ....నల్లనయ్యకు-రాధమ్మకు రాయబారం నడిపే చెలులనూ, గౌరమ్మకు-జంగమయ్యకు నడుమ అడ్డు వచ్చే గంగమ్మనూ, అశోకవనంలో సీతమ్మ వారిని ఓదార్చే వనదేవత అమ్మతనాన్ని, ప్రణయకేళిలో ముణిగి ఉన్న రాదామాధవులను చూసి నవ్వుకుంటూ తప్పుకునే గోపికలనూ, ఇలా ఎన్నో పాత్రలను తలపుకు తెస్తాయి ఈ ప్రకృతి స్త్రీ పోకడలు.

ప్రకృతి పురుషుడికి ఎక్కువగా స్థానం కనిపించలేదు ఈ కవితాఝరిలో. ఎక్కడో పున్నమి నాటి చంద్రునిలా, కొండ పక్కన నక్షత్రంలా, అనంతంగా ఉన్న సముద్రంలా దర్శనమిచ్చినా, అక్కడ కూడా గుణ క్షీణంగానే కనిపిస్తాడు లోతుగా చూస్తె .......పక్షం రోజుల విరహం చూపిన కర్కసుడిగాను, నల్లటి నిశిలో ఒంటరిగా, దూరాన, మిణుకు మిణుకుమంటూ నిరుపయోగమైన వెలుగనే భరోసాతో, దోసిలితో వ్యక్తిత్వం స్వంతం చేసుకుందామనుకుంటే నవ్వుతూనే కాళ్ళకు అడ్డుపడే వాడిగాను.......పాపం!!!!!

ప్రకృతి అంటే ఉట్టి పల్లెదనమే కాదండి బాబు......మన చుట్టూ ఉన్న వాతావరణం ఏదయినా అది కూడా ప్రకృతే అని చెప్తాయి ఈ కవితలు. చూడండి...... వర్షంలో తడిసిన మట్టి రోడ్లూ, ఇంటి ముందు నాట్యమాడుతున్న మాలతీ తీవె, పట్టుపరికిణీ అంచుకు తగిలిన మట్టి, మంచం పక్కనున్న సంపెంగలూ, పూజాగదిలో శిక్ష అనుభవిస్తున్న మల్లెలూ మరువం, కిటికీ అవతల నవ్వుకుంటున్న కొబ్బరాకులు, గదిలోపల జరిగేవి చూచి నవ్వుకుంటూ లేదా సిగ్గుపడుతూ జారుకుంటున్న ఘడియలూ......

  • నాయిక సిగ్గును తెలియ చేస్తూ ఇంటి గడపా……పురుషుని రాకతో పులకించి పోతూ ఆ సిగ్గుని జయించేసిన (గడపను దాటేసిన) చొరవ చూపెడుతున్న చీర కుచ్చుళ్ళు........
  • అదే పురుషునితో విభేదిస్తే ముఖం చాటేసుకున్న నడుమ్మీద పుట్టు మచ్చ, అది చూసి ముభావంగా ఉండి పోయిన మందారం.............
  • అదే పురుషుడు పక్షం రోజుల పాటు నిర్లక్షం చేస్తే ముఖం మాడ్చుకున్నగిన్నెలోని గోరింటాకు, మాసాలకు మాసాల నిరీక్షణలోరంగు వెలిసిన వేళ్ళపై ముళ్ళ గోరింట.......
  • అదే పురుషుని కర్కశానికి బలయి ఆశలు, అనుభవాలు అనే నగల పెట్టె కోల్పోయినా మనసున ఉన్న విడదీయలేని భావుకత చిహ్నంగా ముక్కున ముక్కు పుడక, దాని విజయగర్వానికి చిహ్నంగా అది మెరవటం......

వాహ్.....ఎంత హృద్యంగా స్త్రీని, ఆమె అలంకరణనూ ప్రకృతిగా (వాతావరణంగా ) మలిచారో.

ఇదండీ దీన్లో ఉన్న "ప్రకృతి-స్త్రీ". ఈ ప్రకృతిని ఆస్వాదించాలంటే ప్రతీ కవిత చదవాల్సిందే, ఇవి అని ఉదాహరణలు చెప్పటం అనేది బహు కష్టం.

అయినా నాకు అతిగా నచ్చినవి మచ్చుకు కొన్ని చూడండి అని చెప్పకుండా ఉండలేకపోతున్నా....


౧. ఊహా సుందరిలో.........స్వప్న సుందరిని "స్వప్న శాఖలా" అభివర్ణించటం..ఆ పేరా మొత్తం అదుర్స్.


౨. తెల్లని "నందివర్ధనాలు" తమకు రంగులద్దమని రంగవల్లులను అర్తించటం.....ఓహ్! ఎంత ఆర్ద్రత!!! నాకయితే "బాల వితంతువులే" గుర్తుకు వచ్చారు ఎందుకో....భగవంతుని తమ వర్ణవిహీన జీవనాలకు రంగులనద్దమని వేడుకొనే సీనే కళ్ళ ముందు.....



౪. చుక్కల్ని సూరీడు హడావుడిగా వెలుగు దుప్పటి కింద దాచేయటం......"వాన వెలసిన వేకువ" అదే సూరీడు స్కూలు మాష్టారిలా, అల్లరి చేస్తున్న గువ్వల్ని గూటికి పంపి ఇంటికి పోవాలని తొందర పడటం....""



౫. కాలేజీ ఆడపిల్లలు విహారయాత్రలను గుర్తుకు తెచ్చే "వెన్నెల విహారం భూలోకంలో" యమా గమ్మత్తుగా..."కౌముదిలో"



౬। "ప్రియమైన శత్రువులోని" ప్రకృతి ప్రేక్షక వర్ణనతో చూచాయిగా ప్రణయ వర్ణన ....గిలిగింతలు పెట్టేట్టు.

మిగితాది తరువాయి భాగంలో.

Saturday, 17 January 2009

"జాజుల జావళి"- సమీక్ష, రెండవ భాగం

"శృంగారం "

ఈ కవితలను చదువుతుంటే కొన్ని సార్లు నాకు అనుమానమోచ్చేది నిషిగంధ గారు నిజంగా స్త్రీనేనా లేక స్త్రీలకే పెద్ద పీట వేస్తారు అన్న పేరున్న (నిజమేనా?) నేటి సమయంలో ఒక పురుషుడే ఇవన్నీ స్త్రీ కలం పేరుతొ రాస్తున్నాడా అని.

కావాలంటే మీరే చూడండి ఈ వర్ణనలు

• "వెండి కిరణం పెదవి అంచున చెదిరినట్టు".................స్నేహ మాధురి.... రెండవ పేరా, మొదటి లైను

• "కోనేట్లో స్నానమాడిన పిల్లగాలి గుడిమెట్లు ఎక్కి వచ్చి కొతూహలంగా చూస్తుంటే ఇంకా ప్రభు దర్శనం కాలేదని ఎలా చెప్పను?"...............................................నిరీక్షణ...............రెండవ పేరా మొత్తం

నిద్రా దేవిని "ఊహా సుందరిగా" ……………………..కవిత మొత్తం

నవ్వుతూ పలికరించే నడుమ్మీద పుట్టు మచ్చ ముఖం చాటేస్తే వాలు జడలోని ముద్ద మందారం ముభావంగా చూసింది ……………… అలిగితివా" లోని రెండవ పేరా


నాకయితే ఇందులో సరస శృంగారం పురుష దృక్పదంలో కనపడుతోంది. మొదటి ఉదాహరణే తీసుకోండి ......."చెదరి జారినా కుంకుమ రేఖలు పెదవుల పైబడి మెరుస్తు ఉంటే" అన్న సినీ కవి వర్ణన గుర్తుకు చేయదూ?

నడుమ్మీద పుట్టుమచ్చలూ, వాలు జడలూ, ముద్ద మందారాలు మగ వారిని దోచినంతగా ఆడ వారిని దోచవు కదా........ అంటూ లాజిక్కులు, లా ట్ర్రిక్కులు కూపీ లాగ సాగింది మనసు.

పైగా పిల్ల గాలి కోనేట్లో స్నానమాడి వస్తే మనసుకు కన్నెపిల్లలా కనపడి "ఇంకా దేవి దర్శనం కాలా" అని కదా చెప్పే ఆనవాయతి అని మనసు తనను తాను సమర్ధించుకో చూసింది.


కానీ............

కవితలన్నీ పరికిస్తే ఎంత స్త్రీత్వము పరిచయమయిందనీ!!!!! చూడండి అవి కూడా 


అతని జ్ఞాపకాల "మల్లెల మాల కట్టాలనే" ఆలోచనా ......."ఏకాంత వేళ"

పొద్దుటే "పవిత్ర స్నానాల, పూజా వేళయిందనే" ఆత్రాలు,
తెల్లటి నంది వర్ధనానికి రంగులద్దమని రంగ వల్లులను అర్థనలు...."నంది వర్ధనాలు"
 
పెళ్లి మండపంలో వీడ్కోలు పల్కేటప్పుడు పడే వేదన పరిచయాలు......."నానీ గాడు"

 భావుకత నిండిన ఆలోచనలు, అనుభూతులను నగలుగా వర్ణనలు....."నగల పెట్టె"

"మల్లెలా కనకాంబరాలా" అంటూ మధన పడటాలు,
 "నిన్ను చూస్తూనే గడపను దాచేసేవి చీర కుచ్చుళ్ళు" చమత్కారాలు........"తొలి స్పర్శ" 

"పట్టు పరికిణీ అంచులకి చుట్టుకున్న మట్టి గీతను" గమనించే చూపులు......"ఉయ్యాల"


ఇలా అంతర్లీనంగా స్త్రీత్వాన్ని చాటేవే ఎక్కువగా కనపడ్డాయి కవితలలో. మాతృత్వంలాటి బహాట స్త్రీత్వ చిహ్నాలు అయిన "బంగారు తల్లి" లాటివి ఒకటో రెండో అయినా మొత్తం కవితల నిండా స్త్రీత్వమే.


ఇక్కడ చెప్పని ఇంకో అతి ముఖ్యమయిన కారణం "అతను".......................కవితలన్నీ దాదాపుగా "అతని సహచర్యానికై" తపన చెందేవే....అందుకే నా మగ పక్షపాత బుద్దిని పక్కన పెట్టేసి ....ఇవి "స్త్రీ లిఖితమే" అని ఒప్పేసుకుంటున్నా.



ఇంత సుత్తేసానా,
సరే శృంగార రసం ఉందని అనిపించిందా మొదట చదవగానే....."ఏదీ చూడని" అని పరికించి చదవసాగాను. చూద్దును కదా అష్ట విధ శృంగార నాయికల్లో అయిదు మంది కనిపించేసారండి ఇందులో.....చూడండి


కవితల్లో చాలా మటుకు మనకు పరిచయమయ్యేది "విరహోత్కంఠిత"
"అతను" లేని వేళ నాయిక ఒంటరితనాన్ని తెలుపుతూ రాసినవే కవితలన్నీ. దీనిపై సహచర్యం అన్నడి ముచ్చటించుకున్నప్పుడు ఇంకా విపులంగా చెప్తాను. మొత్తానికి నిషిగారి ప్రథమ కథా నాయిక "విరహోత్కంఠిత" అన్నది వివాదం లేని అంశము. దీనికి ఉదాహరణలు అక్కరలేదు....అన్నీ అవే.


రెండవ నాయిక "వాసక సజ్జిక"
అతనికై, అతని రాకకై, సింగారిత అవటానికి నాయిక పడే పాట్లు చూడండి...... ఎంతగా సాక్షాత్కరించిందో ఈ నాయిక.

మల్లెలా? కనకాంబరాలా?? నిర్ణయాలు తీసుకోవటం కష్టమే సుమా .......అంటూ "తొలి స్పర్శలో"

హారాలు, గాజులు, లోలాకులు, వడ్రాణం...కలల రవ్వలద్ది .... అచ్చంగా నీ కోసమే......అంటూ,
అన్నీ ధరించి ఆకస్మిక వైభవాన్ని నీకు పరిచయం చేస్తే.......అంటూ "నగల పెట్టెలో"


మూడవ నాయిక  "కలహాంతరిత"

"అలిగితివా" లోని వస్తువంతా ఇదే. 
చూడండి పాపం రాయబారానికి వచ్చిన "మల్లెలూ మరువం" పూజా పీఠానికి బలి అయిపోయాయి.

"నీవు లేని క్షణాన" లో మాత్రం...... నాయిక బేలయి తనను తాను ఎలా నిందిన్చుకొంతోందో.......



"ఊహా సుందరిలో" హృదయ పారిజాత దడిలో (సంకేత స్థలమా?) వచ్చిన ఆ స్వప్న సుందరి "నీకోసమే వచ్చాను" అంటూ బాహాటంగా చెప్పటం, పెదవులు బిగించి, చిలిపిగా నవ్వుతూ, మరో అడుగు ముందుకు వేసి మరింత చేరువగా రావటం.....అంత చొరవ చూపటం .....అభిసారిక వంతేగా.



చివరికి అదే "ఊహా సుందరి"లో "నాలో మేల్కొన్న వివేకాన్ని ఉక్రోషంగా చూస్తూ అప్పటికి నన్ను విడిచి వెళ్లిపోయింది " అంటూ మనకు "ఖండిత"ను కూడా పరిచయం చేసారు. నిజమేగా .......వివేకమనే సవతికి ప్రాధాన్యత ఇచ్చే పతి ఉన్న ప్రతి సతీ ఖండితే కదా :-)


ఇలా స్త్రీ పురుష ద్రుక్పదాలలో సరస వర్ణనలు, శృంగార నాయికా పరిచయాలు ఉన్నా ఈ కవితలు శృంగార రస భరితాలని అంటే మనసుకు ఎందుకో నచ్చట్లేదు..........కారణం ప్రప్రధమంగా ఉన్న ఒంటరితనమేమో. అయినా "సహచర్యానికి" మించిన శృంగారం ఏముంటుందీ" అంటూ మనసు మూలిగింది. పైన "మనసున మనసై, బ్రతుకున బ్రతుకై, తోడొకరుండిన అదే భాగ్యమో అదే స్వర్గమో" అంటూ ఇంటర్నెట్ రేడియోలో పాట మొదలయింది....సహచర్యానికీ -శృంగారానికీ ఉన్న అవినాభావ సంబంధం నిర్వచించటానికా అన్నట్టు. నా భార్య నిద్ర లేచినట్టుంది, నేను ఇంక వెళ్తానండి.


ఈ కవితల్లో శృంగారం ఉందొ లేదో మీరు నిర్ణయించుకోండి.......నాకు మాత్రం Jeffrey Archer రాసిన Quiver Full of Arrows కథా సంపుటిలోని "The Old Love " కథ గుర్తుకు వస్తోంది.....భమిడిపాటి గారి "మీ సంబంధం మాకు నచ్చలేదు" కథ కూడా......శృంగారమంటే "సహచర్యమే" అన్నది రుజువు చేస్తూ.


మిగితావి తరువాయి భాగంలో

Friday, 16 January 2009

నిషిగంధగారి "జాజుల జావళి" :- కవితా సమీక్ష -మొదటి భాగం

"జాజుల జావళి" వర్గపు పేరు చూడగానే ఆకట్టుకుంది. ఆఘ్రాణిద్దును కదా సువాసనలే కాక షడ్రుచులు, సప్త వర్ణాలు అన్నీ అవగతమయ్యాయి. భావుకత "మానస వీణ" తీవెలు మీటగా జీవిత గమనంలోని ఆరోహ అవరోహాలు సప్తస్వర సమ్మేళనంగా విందు చేసాయి. నేను పొందిన ఆ అనుభూతులను పంచుకోడానికి నా చేతనయినంతలో ఒక చిన్న సమీక్ష నిషిగంధగారి "జాజుల జావళి" పై. సంవత్సరమున్నర కాలంలో ఇరువయ్యారు జాజుల పూయించిన ఈ జావళి ఇలాగె అనంతంగా, రసభరితంగా సాగాలని కోరుకొంటూ కవయిత్రికి శుభాభినందనలు.

నిజం చెప్పాలంటే నన్ను ఈ బ్లాగుకు మొదట కట్టిపడేసినవి ఈ జావళులు కాదు.... "పయనమయే ప్రియతమా" అన్న చిన్ని ఒక పేజి కథలోని ప్రథమ వాక్యం చేసిందా పని ...మీరే చూడండి "వర్షం ఇంకాస్త పెద్దదయింది.....స్వామివారిది అయిపొయింది, ఇప్పుడు మా వంతంటూ గుడి మెట్లు తృప్తిగా అభిషేకం చేయించుకుంటున్నాయి" అన్న ఈ పరిచయ వాక్యాలలోని భావుకత ఎంత అనిర్వచనీయమో. అప్పటి నుంచి అనుకుంటున్నా, కవితలన్నీ ఒక రోజు తీరిగ్గా ఆస్వాదించాలని. ఈ రోజు ఆస్వాదించిన తరవాత చిన్న వ్యాఖ్య రాసి ఊరుకోబుద్ది కాలేదు. నాకు నచ్చితే స్ఫందిస్తాను కాబట్టి నాకు నచ్చిన విషయాలు ముచ్చటిస్తాను. ప్రొఫెషనల్ సమీక్షకుడిని కాదు కాబట్టి బ్యాలన్స్డ్ సమీక్ష ఆశించేవారికి నిరాశే మిగలవచ్చని ముందే చిన్న హెచ్చరిక.

పేరులో ఏముంది?
అమ్మమ్మా అలా తీసి పారేయకండి. అసలు కవితలేమేమి ఉన్నాయా అని పేర్లు చూద్దును కదా, పేర్లతోనే నిషిగంధగారు ఎంత పరిచయం చేసుకున్నారని తన గురించి. నాకు అర్థమయిందేమంటే ఈ జాజులన్నీ "సహచర్యం" కోసం తపించేవే, "సహచర్యం" అస్వాదించేవే। కావలిస్తే చూడండి, ఇరవయ్యారులో కవితలలో "కౌముది, ఉయ్యాల, నందివర్ధనాలు, చంద్రోదయం, వాన వెలిసిన వేకువ, ఆశాకిరణం, ఆశా కుసుమం" అన్న ఏడు కవితలు తప్పితే (నిజం చెప్పాలంటే ఇవన్నీ కూడా ప్రకృతి సహచర్యమే కదా) మిగితావన్నీ సహచర్యానుభూతులే ...... "ఏకాంత వేళ"లోని "వంటరి రహస్యాలు"....... "ఏకాంత యామిని"ని "అలిగితివా" అని పలుకరింపులు...... ""ఏకాంతార్ణవం" లోని "నిరీక్షణ "....... "నీ రాక కోసమై" "ఊహా సుందరి" "నగల పెట్టి" తెరిచి సర్వాభరణభూషితయై "ఆనతి నీయరా" "అడుగులో అడుగునై" మనియెదా అని "ప్రియమైన శత్రువు" "తొలి స్పర్స" కై కన్న "నిన్నటి స్వప్నం"........



ఓహ్ ......నిజంగా ఎంత బావున్నాయో। తొమ్మిదో తరగతిలో ఒక పాఠము తప్పితే శ్రీనాధ శృంగార రచనలు ఇంతవరకు పరిచయం లేనందు వల్ల అచ్చ తెలుగులో (నాకర్థం అయ్యే తెలుగు అని అన్వయించుకోండి) ఆయన రచనలు ఇలాటి అనుభూతులే రేపుతాయేమో అన్న అతిశాయోక్త్యాలోచన వచ్చిన మాట నిజం.

ఉత్త "పేరు" గొప్పేనా, అసలు విషయం ఏమన్నా......
అంత సందేహమక్కరలేదు. విషయమింకా చాలా ఉంది. కవితా వస్తువులు తరచి చూద్దును కదా రెండు ముక్కల్లో చెప్పేయొచ్చు అనిపించింది......"ప్రకృతి", "పురుషుడు" అనీ...... "నానిగాడు" "బంగారు తల్లీ" తప్పితే మిగితావన్నీ ఈ రెండు కోవలలో ఏదో ఒకదానికి చెందినవే. "రెండు విషయాలే కదా" అని తొందరపడి చప్పరించేసారంటే నోట్లో ఉప్పుగల్ల వేసుకొన్నంత తప్పే.......నింపాదిగా రుచి చూసారా, ఘన షడ్రసోపేతమే.

ఈ రెండూ పైకి కనపడే కథా వస్తువులయితే అంతర్లీనంగా ఒకే ఒక రసానుభూతి....అదే ప్రధమ (శృంగార) రసాస్వాదన....ఒకొక్క జాజి పువ్వూ శృంగారరస రైకలు తొడిగిన కవితా కన్యకలే। బ్లాగుల్లో శృంగార రసాన్ని ఇంత బాగా, ధైర్యంగా పండించిన రచయిత్రులే కాదు రచయితలను కూడా నేను చూడలేదు। (నేను అన్నీ చూసాను అని అనట్లేదండోయ్---చెప్పాగా నా అనుభవ చట్రం వరకే పరిమితం ఈ సమీక్ష అనీ) అంతర్జాలంలో మామూలుగా "పోర్న్ సైట్లకే" పరిమితమై భ్రష్టు పట్టిన శృంగార రసం, ఇలా బ్లాగ్జన బాహుళ్యం మోద భరితమై చప్పట్లు కొట్టగా కవన సింహాసనం అధిరోహించటం నిజంగా హర్షణీయం। అందుకు కారణమైన రచయిత్రి ధైర్యం నిజంగా ప్రోత్సహనీయం। "కీప్ ఇట్ అప్" నిషిగంధ గారు.

నాలుగవదీ, ఆఖరుదీ అయిన కవితా వస్తువు "ఏకాంతం". ఇది నా ఊహో లేక నిజమో తెలీదు కాని కవితల నిండా నాకు ఏకాంతమే కనిపిస్తోంది। భరించరాని ఏకాంతం। "సామీప్యానికీ - సహచర్యానికీ" ఉన్న ఆ తేడా తెలియచేసేంత ఏకాంతం. అది రచయిత్రి ఊహించినదో, అనుభవించినదో తెలీదు కానీ భావుకత నిండిన మనసు కఠినమైన ఏకాంతానికి స్ఫందించిన ఛాయలు ప్రతి కవితలోనూ సుస్ఫష్టంగాను-అస్ఫష్టంగానూ కనిపిస్తాయి. ఎవరో వ్యాఖ్యాత అన్నట్టు "If this is true in someone's life, they need to work on it. This kind of feeling will make a person very depressed and has the potential to take away few years of his/her life.

If this is not true in someone's life, they are lucky and they should consider that they are blessed by god and MUST make all efforts to keep it going." ఎంత గొప్ప వ్యాఖ్య.....అనామక వ్యాఖ్యాతకు ధన్యవాదాలు.


ఈ నాలుగు కవితా వస్తువుల గూర్చి ఇంకా విపులంగా తరవాయి భాగంలో.