ప్రకృతిపై తన మక్కువను వర్గపు శీర్షికలో జాజులకు పెద్దపీట వేసి చెప్పకనే చెప్పారు నిషిగారు. ఆలకిస్తే శీర్షికలోనే నిషిగారి కవితాకన్యక కంఠం కూడా వినిపిస్తుంది అంతర్లీనంగా. అంటే ఇక్కడ నాయికా-ప్రకృతి స్త్రీ ఒకటే అనే భావన అవుపిస్తుంది. కొన్ని సందర్భాలలో "నాయిక -ప్రకృతి వేరు వేరు" అనీ, ఇంకొన్ని సందర్భాలలో "నాయికే ప్రకృతి" అంటూ చూపెట్టటం ఈ జాజుల జావళిలో ఉన్న ప్రత్యేకత. ఏదేమైనా ఈ కవితలలో ప్రకృతి స్త్రీతో చెడుగుడు ఆడేసారు నిషిగారు, ఎంతో అందంగా.
బాలభానుడు, అస్తమయ సూర్యుడు, పూర్ణచంద్రుడు , చల్లని శశిరేఖ, వెచ్చని భానురేఖ, పిల్ల గాలి, పచ్చగడ్డి, పావురం పిల్ల, కోనేరు, కొండ నీడ, కొబ్బరాకుల మధ్య కిరణాలు, ఎండుటాకులు, పండుటాకులు, తెల్లని నందివర్ధనాలు, పచ్చని చివుళ్ళు, గుచ్చుకునే ముళ్ళు, వసంత, శిశిర, హేమంత, వర్ష ఋతువులు, మబ్బు పరదాలు, సెలయేరు-జలపాతాలు, మలయమారుతాలు ఇలాంటి ప్రకృతి వన్నెచిన్నెలన్నీ, సోయగాలన్నీ వర్ణించటం మామూలే భావుకులకు. అది మాత్రమే చేస్తే ఇలా సమీక్షకు ఉసిగోల్పవేమో ........
ఈ కవితలలో వీటిని మనోహరంగా వర్ణించటమే కాదు వాటిని పాత్రధారులని కూడా చేస్తారు నిషి గారు, నాయికా-నాయకుల మధ్య నడిచే ఈ అభినవ శాకుంతలంలో. అంతే కాకుండా కొన్ని సందర్భాలలో అవే నాయిక మనః- శారీరక స్థితులని తెలిపే నిగూఢ చిహ్నాలు, అంటే ప్రకృతి స్త్రీయే నాయికయిందనమాట.
ప్రకృతి స్త్రీ చేత "నాయిక-ఆమె పురుషుడి" మధ్య ఎన్నో పాత్రలు పోషింప చేసారు నిషిగారు ....నల్లనయ్యకు-రాధమ్మకు రాయబారం నడిపే చెలులనూ, గౌరమ్మకు-జంగమయ్యకు నడుమ అడ్డు వచ్చే గంగమ్మనూ, అశోకవనంలో సీతమ్మ వారిని ఓదార్చే వనదేవత అమ్మతనాన్ని, ప్రణయకేళిలో ముణిగి ఉన్న రాదామాధవులను చూసి నవ్వుకుంటూ తప్పుకునే గోపికలనూ, ఇలా ఎన్నో పాత్రలను తలపుకు తెస్తాయి ఈ ప్రకృతి స్త్రీ పోకడలు.
ప్రకృతి పురుషుడికి ఎక్కువగా స్థానం కనిపించలేదు ఈ కవితాఝరిలో. ఎక్కడో పున్నమి నాటి చంద్రునిలా, కొండ పక్కన నక్షత్రంలా, అనంతంగా ఉన్న సముద్రంలా దర్శనమిచ్చినా, అక్కడ కూడా గుణ క్షీణంగానే కనిపిస్తాడు లోతుగా చూస్తె .......పక్షం రోజుల విరహం చూపిన కర్కసుడిగాను, నల్లటి నిశిలో ఒంటరిగా, దూరాన, మిణుకు మిణుకుమంటూ నిరుపయోగమైన వెలుగనే భరోసాతో, దోసిలితో వ్యక్తిత్వం స్వంతం చేసుకుందామనుకుంటే నవ్వుతూనే కాళ్ళకు అడ్డుపడే వాడిగాను.......పాపం!!!!!
ప్రకృతి అంటే ఉట్టి పల్లెదనమే కాదండి బాబు......మన చుట్టూ ఉన్న వాతావరణం ఏదయినా అది కూడా ప్రకృతే అని చెప్తాయి ఈ కవితలు. చూడండి...... వర్షంలో తడిసిన మట్టి రోడ్లూ, ఇంటి ముందు నాట్యమాడుతున్న మాలతీ తీవె, పట్టుపరికిణీ అంచుకు తగిలిన మట్టి, మంచం పక్కనున్న సంపెంగలూ, పూజాగదిలో శిక్ష అనుభవిస్తున్న మల్లెలూ మరువం, కిటికీ అవతల నవ్వుకుంటున్న కొబ్బరాకులు, గదిలోపల జరిగేవి చూచి నవ్వుకుంటూ లేదా సిగ్గుపడుతూ జారుకుంటున్న ఘడియలూ......
- నాయిక సిగ్గును తెలియ చేస్తూ ఇంటి గడపా……పురుషుని రాకతో పులకించి పోతూ ఆ సిగ్గుని జయించేసిన (గడపను దాటేసిన) చొరవ చూపెడుతున్న చీర కుచ్చుళ్ళు........
- అదే పురుషునితో విభేదిస్తే ముఖం చాటేసుకున్న నడుమ్మీద పుట్టు మచ్చ, అది చూసి ముభావంగా ఉండి పోయిన మందారం.............
- అదే పురుషుడు పక్షం రోజుల పాటు నిర్లక్షం చేస్తే ముఖం మాడ్చుకున్నగిన్నెలోని గోరింటాకు, మాసాలకు మాసాల నిరీక్షణలోరంగు వెలిసిన వేళ్ళపై ముళ్ళ గోరింట.......
- అదే పురుషుని కర్కశానికి బలయి ఆశలు, అనుభవాలు అనే నగల పెట్టె కోల్పోయినా మనసున ఉన్న విడదీయలేని భావుకత చిహ్నంగా ముక్కున ముక్కు పుడక, దాని విజయగర్వానికి చిహ్నంగా అది మెరవటం......
౧. ఊహా సుందరిలో.........స్వప్న సుందరిని "స్వప్న శాఖలా" అభివర్ణించటం..ఆ పేరా మొత్తం అదుర్స్.
౨. తెల్లని "నందివర్ధనాలు" తమకు రంగులద్దమని రంగవల్లులను అర్తించటం.....ఓహ్! ఎంత ఆర్ద్రత!!! నాకయితే "బాల వితంతువులే" గుర్తుకు వచ్చారు ఎందుకో....భగవంతుని తమ వర్ణవిహీన జీవనాలకు రంగులనద్దమని వేడుకొనే సీనే కళ్ళ ముందు.....
౪. చుక్కల్ని సూరీడు హడావుడిగా వెలుగు దుప్పటి కింద దాచేయటం......"వాన వెలసిన వేకువ" అదే సూరీడు స్కూలు మాష్టారిలా, అల్లరి చేస్తున్న గువ్వల్ని గూటికి పంపి ఇంటికి పోవాలని తొందర పడటం....""
౫. కాలేజీ ఆడపిల్లలు విహారయాత్రలను గుర్తుకు తెచ్చే "వెన్నెల విహారం భూలోకంలో" యమా గమ్మత్తుగా..."కౌముదిలో"
౬। "ప్రియమైన శత్రువులోని" ప్రకృతి ప్రేక్షక వర్ణనతో చూచాయిగా ప్రణయ వర్ణన ....గిలిగింతలు పెట్టేట్టు.
మిగితాది తరువాయి భాగంలో.
No comments:
Post a Comment