Tuesday, 20 January 2009

నిషిగంధగారి "జాజుల జావళి"-సమీక్ష-4-జాజుల జావళిలొ "సహచర్యం"

నిషిగంధగారు ఈ సమీక్షపై తన వ్యాఖ్యలొ "నా కవితల్లొ ఉన్నది ఏకాంతం ..వంటరితనం కాదు...రెంటికీ చాలా తేడా ఉంది" అని చెప్పేదాకా నా సమీక్షలొ అప్పటి వరకు వాటిని "ఇంటర్ చేంజబుల్"గా వాడిన సంగతి నేను గమనించలేదు. వెంటనే డిఫెన్స్ లొ పడిన మనసు బ్రౌణ్యం వెతికేలా చేసింది. "ఒంటరి" అన్న తెలుగు పదానికి బ్రౌణ్యం "సింగుల్, సాలిట్యూడ్, లొన్లినెస్స్" అన్న పెక్కు అర్థాలు ఇస్తే, "ఏకాంతం" అన్న సంస్కృత పదానికి మాత్రం "సాలిట్యూడ్" అన్న ఒక అర్థమె ఇచ్చింది. మ్మ్! ఇలా కాదు అని చెప్పి కవితల్లొ ఏకాంతానికి సంబంధించినవి ఎన్ని, వంటరితనానికి సంబంధించినవి ఎన్ని అని లెక్కలు కడుతూ ఉంటే "అసలు ఏమిటి నేను చెస్తున్న పని? కవితల్లొ స్ఫష్టంగా కనిపిస్తున్నది సహచర్యం కోసం పడుతున్న తపన, దాన్ని ఆనందిస్తున్నప్పుడు కలిగిన అనుభూతులూ...ఇది వదిలెసి నాయికకు/కవయిత్రికి ఈ అనుభూతులు వంటరితనం వల్ల కలిగినవ/ఏకాంతం వల్ల కలిగినవా అంటూ ఆలొచన ఏమిటి అని అనిపించింది." అందువల్ల చివరి కవితా వస్తువుగా "సహచర్యం" అని డెసైడ్ అయిపోయాను. మరి "పురుషుడొ?"....... ప్రతీ కవితలొ సహచర్యం "అతని" కొసమె అని ప్రస్ఫుటం కాబట్టి మళ్ళీ ఇంక ప్రత్యేకంగా ఎమీ చెప్పాల్సిన పనిలెదు అని అనిపించి దాన్ని వదిలేస్తున్నాను.


ఈ సాహచర్యాని గురించి ముచ్చటించుకొవాలంటే ఇంత ముందు మూడు భాగాలలొ చేసినట్టు కాకుండా ఇక్కడ ప్రతీ కవితనూ విడివిడిగా తీసుకొని పరిశీలిస్తె బావుంటుంది అన్న భావన కలిగింది. "బాబొయ్!! ఇరవయ్యారు కవితలకు విడివిడి విశ్లేషణా, అదీ ఇప్పటి వరకు ఇచ్చినవి కాకుండా...." అంటూ మనసు నీళ్ళు నమిలేసరికి దానిని సంతృప్తి పరచడానికీ (నా పని తగ్గించుకొటానికీ కూడా లెండి :-) ఇక్కద నాకు నచ్చినవి, నిగూఢార్థాలు ఉన్నాయి అని నాకు తోచినవి ఇలాటి వాటిపై మాత్రమె చెప్పదలిచాను. అంటే "నానిగాడు " "బంగారు తల్లి" లాటి వాటిలొ "సహచర్యం" లేదని కాదు...అంత స్ఫష్ఠంగా ఉన్న దానిపై నా వ్యాఖ్య అనవసరం అని మాత్రమే.


టూకీగా ఇప్పటివరకు సాగిన జావళి కథా కమామిషు చూద్దామా ముందు, ఆ తరువాత పైన చెప్పినట్టు విడివిడిగా ఆస్వాదిద్దాం ఒకొక్కటి.


1. మొదటి కొన్ని కవితలు నాయిక "అతని" సాహచర్యాన్ని
• ఆస్వాదిస్తూన్నవి ........................................."స్నేహ మాధురి",
• అందువల్ల తన జీవితానికి ఏర్పడ్డ సార్థకత గురించి చెప్పేవి........."ఆనతి నీయరా"
• కోల్పోయి దానికి తపన పడుతున్నవి..............."నీవు లేని క్షణాన", "నిరీక్షణ"
• ఆ విరహాన్ని కూడా ఆనందిస్తున్నవి ................."ఏకాంత వేళ" "ఏకాంత యామిని"
• ఆ విరహాన్ని అందంగా అభివర్ణించినవి .........."చంద్రోదయం" "ప్రియమైన శత్రువు"
• ఆ విరహాంతం దగ్గర పడిందని ఆనందిస్తున్నవి ........"తొలి స్పర్శ"

ఇలా ఈ కవితలు అన్నీ "సహచర్యం ఉంది కాని కారణాంతాల వల్ల ఇప్పుడు లేదు" అన్న భావన కలిగిస్తాయి.


2. తరవాత కవితలు కొన్ని "జీవన క్రమంలో ఇవన్నీ మామూలే నాకు బాధ లేదు, నీ జ్ఞాపకాలున్నాయిగా నాకు తీపి గుర్తులుగా " అని తనకు తాను నాయిక సర్ది చెప్పుకునే కవితలు......" మనిద్దరం" ............ఆ నిన్నటి జ్ఞాపకాలే ఇప్పటి పరిస్థితులలో బరువైపొతే ఎందుకిలా జరిగింది అని బాధపడటం ............"నిన్నటి స్వప్నం" కనిపిస్తుంది.


3. ఈ దశ దాటిన తరవాత దశలో కొంచం సుతిమెత్తగా "ఇంత ప్రకృతి అందం ఉండగా అవి ఆస్వాదించకుండా ఉన్న...అంటే భావుకత లేదని" అతని పై "విసుర్లు" విసరడం ........."ఒంటరి రహస్యం" లో కనిపించింది.


4. ఇంత ఎదురు చూస్తున్నా, నచ్చ చెపుతున్నా (వసంతం కోసం ఎదురు చూపులు అన్న మాట), అతని చేష్టలు, మాటలు, ప్రవర్తన "గ్రీష్మంలా" ఉంది అనీ పరోక్షంగా చెప్పటం....."ఆశా కిరణం", ఎంత ప్రయత్నించినా ఫలితం లేదని వాపోవటం........"ఆశా కుసుమం "


5. ఇంత చెప్పినా మారలేదనుకుంతా అతగాడి నైజం.....ఇంక ప్రత్యక్ష యుద్దానికే దిగుతుంది నాయిక "అడుగులో అడుగునై" కవితలో..........


6. ప్రత్యక్ష యుద్ధ ఫలమేమో, పాపం పురుషుడు రాజీ కొచ్చి "అలిగితివా" అంటూ బతిమాలుకొంటాడు,
మల్లెలు మరువం రాయబారం పంపుతాడు, చివరకు సాధించి అక్కున చేర్చుకొంటాడు ......."అలిగితివా"


7. దానితో మళ్ళీ అతనిపై అనురాగం జనించిన నాయిక అతని సాహచర్యాన్ని అనుభవిస్తూ మధ్యలో ఆగిపోయిన తన రస రమ్య స్వప్నాన్ని తిరిగి జనింప చేస్తుంది............."ఎకాంతార్ణవం"......ఇప్పటి వరకు కవితలలో ఆఖరుది.



ఈ సహచర్యం విషయంలో నాకు అన్నిటికంటే నచ్చిన కవిత "అడుగులో అడుగునై...." శీర్షిక చూడగానే "ఆకులో ఆకునై....." అన్న వేటూరి గీతం గుర్తుకు వచ్చింది. అదే పాట ప్రేరణ కూడా కావచ్చు ఈ శీర్షికకు. ఈ కవిత అంతగా నచ్చడానికి కారణమైన చివరి అయిదు పాదాలు చూడండి


"నాకు తెల్సు..
వచ్చేప్పుడైనా
నీకూ అర్ధమౌతుంది..

ఊపిరి తాకినంత మాత్రాన
సామీప్యం సాన్నిహిత్యమవ్వదని!!"


చదువుతుంటే ఆ అయిదు పాదాలు చాలు....అసలు విషయం చెప్పటానికి. మిగితా పాదాలన్నీ నాయిక భావుకత తెలియచెప్పటానికి ఉపయోగ పడ్డాయి కాని అసలు విషయం ఈ అయిదు పాదాలే చెప్తాయి. అదీ ఎలాగో చూడండి!!! ప్రాధేయ పూర్వకంగా నీతో అది చేయాలని ఉంది, ఇది చేయాలని ఉంది అని చెప్పిన నాయిక, చివరికి అలా చేస్తే అయినా "నీకూ భావుకత కలిగి, సున్నిత మనస్కుడవై, ఊపిరి తగిలేంత దగ్గరగా ఉన్నా అది సామీప్యం అనిపించుకుంటుందే కాని "నాతి చరామి" అంటూ నువ్వు ప్రమాణం చేసిన సహచర్యం మాత్రం కాదు అన్నది నీకు అర్థమవుతుంది" అన్న ఆశను వ్యక్తం చేస్తుంది. అది కూడా క్లుప్తంగా, తనదైన భావుకత నిండిన భాషలో, చిన్నగా.....ఇంకా చెప్పాలంటే....మామూలు భాషలో "మెత్తటి చెప్పుతో కొట్టినట్టు" అని అనిపించింది.

ఈ "అడుగులో అడుగునై" అన్నది ఈ కవితలలో paradaigm shift లాటిది. అప్పటి వరకు తనలో తాను అతని సహచర్యం పోతోంది అని వాపోయిన నాయిక ఇప్పుడు direct action కు సిద్దపడి "అతని" ని సూటిగానే అడుగుతుంది....."సామీప్యం కాదు నాక్కావలసింది...సాన్నిహిత్యం అని"....ఈ చొరవలోనే నిషిగారు అన్నట్టు "అభిసారిక" మళ్ళీ అగుపిస్తుంది...తనకు "నచ్చిన" వాడికై చొరవ చూపటానికైనా తాను సిద్దమే అంటూ ............. నా మటుకు నాకు ఈ కవితా సంకలనాన్నే నిర్వచించే కవిత ఈ "అడుగులో అడుగునై"...ఎందుకంటే .సహచర్యమే ప్రధాన విషయంగా నడిచే ఈ జావళి "యుగళ గీతం" కావటం ఎంతో అవసరం అంటూ "సాహచర్యాన్ని నిర్వచించే కవిత ఇది".



ఇక నాకు చాలా నచ్చిన రెండో కవిత "నగల పెట్టె". ఇది చదివిన వెంటనే ఎంతో అపురూపంగా దాచుకున్న భావుకత ప్రతిరూపాలను (అనుభూతులు ) భర్త నిర్లక్షం చేస్తే నిస్సహాయంగా చూస్తూ ఉండిపోయిన నాయిక మనసులో మాత్రం "అవైతే పదేసావు కాని నా భావుకత మనసు నుండి తీయలేవు కదా" అని ఆలోచించటం అన్న దాన్ని కవితా రూపకమిది అని అనిపించింది. ఆ విషయం నాయికకు ఎంత బలాన్నిచ్చిందంటే తన అపురూపాలను కోల్పోయిన ఆ ఓటమిలో కూడా ఈ భావుకత అనేది తన ఆభరణంగా అభివర్ణించటం....దాని మెరుపుని తన విజయ దరహాసంగా చిత్రీకరించటం జరిగింది అని అనిపించింది. నాలోని పిచ్చి వైద్యుడు "ఇది passive aggression……అంత మెచ్చదగిన విషయమేమీ కాదు అని" నా బుద్ది తలుపులు తెరవటానికి ప్రయత్నించినా "చస్ ఊర్కో......ఎంతో అందంగా వర్ణించబడింది....భావుకత చూడు" అంటూ నా హృదయం బుర్ర తలుపులు మూసేసింది. ఎంతయినా పురుష సామ్రాజ్యంలో పుట్టి పెరిగిన మగవాడిని కదా...passive aggression నే నచ్చుతుంది లెండి.


మూడోది "నిరీక్షణ"..............మొత్తం కవిత "ఒంటరితనం" తో నిండి ఉంది.......ఏకాంతం కాదు. "ప్రేమ అన్నది ఉత్త నీహారిక కాదు కదా" అన్నది ఒంతరితనానికే చిహ్నమేమో.....

నాకెందుకో చివరి పాదం
రేపొచ్చే ఉదయం మీద కొత్త ఆశతో
బదులు
"రేపొ"చ్చే ఉదయం మీద కొత్త ఆశతో
అని ఉండి ఉంటే మొత్తం కవిత ఆ ఒక్క పాదంలో ఇమిడేది అనిపించేది. "గోడ మీద రాసుకున్న రేపుకై ఎదురు చూపు" అన్న భావన కలిగింది ఈ కవిత చదువుతుంటే.



నాలుగోది "ఒంటరి రహస్యం". ఇందులో భావుకత లేదని "అతని" పై విసుర్లు విసరటం ఎంత రమ్యంగా చేయబడిందో. నాకయితే అది "విసుర్లు" అనే అనిపించింది...మరి మిగితా వారేమంటారో? చూడండి మొత్తం ప్రకృతి అంతా అందంగా వర్ణించి.....చివరి మూడు పాదాల్లో మాత్రం
"ఆసాంతం చైతన్య ఝరి.. తను మాత్రం నిశ్చలంగా! విశ్వరహస్యాలను భద్రపరుస్తూ!!" అన్నారు. "వెవ్వే! ఎప్పుడూ ఎంత గంభీరంగా, సీరియస్గా ఉంటావో చూడు.....చుట్టూ ఇంత అందంగా ప్రకృతి ఉంటే దానికి చలించకుండా (నిశ్చలంగా) ఏదో కొండ కట్టేలూ, కోనీటి నీళ్లు మోస్తున్నట్టు (విశ్వ రహస్యాలను భద్రపరుస్తున్నట్టు) ఎంత పోజో" అనే చిన్న పిల్ల వెక్కిరుంపుతనమే కనపడుతుంది నాకు ఇందులో.

ఇంకోటి చూడండి..."చంద్రోదయం". ఇక్కడ సూటిగా చెప్పబడింది చంద్రుని కోసం నిరీక్షణే అయినా "అతని నిరీక్షణ" గా అన్వయించుకుంటే ఇంకా ఎంత బావుందో. అపుడు "పక్షం రోజుల ఎదురు చూపులు" అన్నది "సంపూర్ణ కళ గల వాడే నా పురుషుడు, అతని కోసమే నా నిరీక్షణ, పూర్ణం కాని వాడు పురుషుడే కాదు......" లాటి భావాలు చూపెడుతుంది. తనను తాను నాయిక రాధగా ఎలా అంతర్లీనంగా పోల్చుకుందో చూడండని ఇందులో.... "డాబా మీద నీతో కబుర్లు చెబుతూ పెట్టుకోవాలనుకున్న గోరింటాకు చిన్న బుచ్చుకుని ముఖం నల్లబర్చుకుంది" అట. అంటే నల్లనయ్య రాలేదని రాధమ్మ బాధపడుతుంటే అది చూచి చెలులు కూడా మొహాలు వేలాదేసుకున్నట్టు గిన్నెలోని గోరింటాకు నల్లబడిందట....వావ్!!!!!



ఇలా చెప్పుకుంటూ పొతే ఎన్నో అన్వయాలు చేయోచ్చు. మొత్తానికి అద్భుతంగా ఉన్నాయి ఈ కవితలు. ఎన్నో తెలియని విషయాలు నేర్చుకున్నాను ఈ కవితలను చూసి, ముఖ్యంగా చెప్పాలనుకున్నది నిగూడంగా ఎలా ఉంచాలి అన్న విషయంలో. కాకపోతే ఇవన్నీ నిజంగా అందులో ఉద్దేశ్యపూర్వకంగా ఉన్నవో, లేక నేనుగా ఆపాదిస్తున్నవో తెలీదు. రచనలలో ఎన్నో కోణాలు అవగతం అవటం, రచయితా/త్రి అనుకోనివి కూడా, సాధారణమే అనుకుంటా.

పైగా ఇంకో విషయమేమిటంటే నేను దీన్ని ఒక కవితా సంకలనంగా తీసుకొని చేస్తున్న విశ్లేషణ ఇది. ఎన్నో సంవత్సరాల జీవన పయనంలో నిషిగారు రాసుకున్న వేరు వేరు కవితలను ఇలా చూడటం ఎంత భావ్యమో తెలీదు కాని నేను చెప్పిన కవితా వస్తువులే మాటి మాటికి రావటం, అవే అంతర్లీనంగా ఈ జాజులను ఒక మాలన కట్టటం వలన అది సబబే అనిపించింది.
ఈ జాజుల జావళి చదవాలనుకున్న వారు ఇక్కడ చడువుకోకగలరు.

సమాప్తం

మొదటి భాగం
రెండవ భాగం
మూడవ భాగం

1 comment: