నిన్నలంకరించాలనీ
అందంలో నే పండాలనీ
నీకు నడకలు నేర్పాలనీ
హోయలనుగమించాలనీ
నీకు చెణుకులు నేర్పాలనీ
మెళుకువలారాదించాలనీ
నీకు భాష్యం చెప్పాలనీ
భావం భాగ్యం నాదనీ
నీ లయకు తాళమై
నీ స్వరాలకు గాత్రమై
నీ విరుపుల ప్రణవమై
నీ లక్షణ లక్షమేనై
సలక్షణవై
సుభిక్షితవై
సుశోభితవై
సగర్వమై
నువ్వెల్గ నేన్గెల్వాలని ఉంది!
కానీ.........
అలంకారాలూ, అందాలూ
విరుపులూ, మెరుపులూ
నడకలూ, నాట్యాలూ
లక్షణమూ లక్షమూ
ఇవన్నీ.......
బూటకాలనీ చీదరాలనీ
చెదలనీ వెతలనీ
చీత్కరిస్తున్నారమ్మా
వెలివేస్తున్నారంతా
భావమొక్కటి చాలంటూ.......
కొండపల్లి బొమ్మకు
రంగులొద్దన్నారమ్మా
పుత్తడి పూర్ణమ్మకు
తెల్ల చీరిచ్చారమ్మా!
ఇపుడే...ఇప్పుడిపుడే.........
చెక్క వెతకటం
బెరడు తీయటం
రూపు చెక్కటం
బొమ్మ చేయటం
అన్నీ, ఇవన్నీ.....
చూస్తున్నా
చేస్తున్నా
చేయి వేస్తున్నా
కాల్చుకుంటున్నా!!!
అంతలోనే, ఇంతలోనే........
గడులెందుకు
గదులెందుకు
ఇరుకెందుకు
బెరుకెందుకు
అని అరచీ కరచీ............
బొమ్మకు భావం ప్రాణం పోసీ
విరుపు మెరుపుల వలువలు కట్టీ
మాత్రల సొగసుల ముత్యపు సరాల
ఛందపు గంధపు నిగనిగల వరాల
తండ్రినై
అన్ననై
ప్రియుడినై
మరుడినై
తాన్వెల్గ, నేన్గెల్వాలనుంది!!!
మీ పరిచయం చాలా బావుందండీ ...మీ కవిత కూడా !
ReplyDeleteచాల బాగుంది.
ReplyDelete