సరే...ఇంత చేసి ఇంత ఉపోత్ఘాతం ఎందుకూ అంటే ....."వనజ" సినిమా పై నా నాలుగు పెన్నీలు నేను చెప్పదలచుకున్నాను ఇప్పుడు. ఎపుడో వచ్చిన సినిమాపై ఇపుడు చెపుతానంటాడేమిటీ అంటారా...మరిప్పుడేగా మా విడియో మస్తీ వెబ్ సైట్లో ఆ సినిమాను పెట్టిందీ.....ఎంత న్యాయాన్యాయాల గూర్చి "మాటాడే"వాడ్ని అయినా ఇంతవరకూ ఇలా దొంగగా వెబ్ సైట్లలో చూడటం మానేసి కొనుక్కుని చూసే అలవాటు కాలేదు.....ఇలా "చిన్న చిన్న" వాటిని ప్రతీ దానినీ పట్టించుకోవాలనుకుంటే "ఇక బతికినట్టే" అని బుద్ధి దిఫెన్స్లో పడితే మనసు నవ్వేసి ఆ విషయం వదిలేసి ఇక అసలు విషయానికి వచ్చేయమంది. మనసు మాట వినేద్దాం పదండి.
ఇతివృత్తం
ఈ సినిమా నాలో ఉన్న రెండు ఆలోచనలను బలపరిచింది.....వాటి గురించి తరవాత కాని ముందు సినిమా గురించి. టూకీగా ఈ సినిమాలో పద్నాలుగేళ్ళ జాలరి పిల్ల ఒక నాయిక. ఒక రోజు బుర్ర కథ చెప్పే అమ్మి తను పెద్ద నర్తకి అవుతుందంటే నమ్మి కూచిపూడి నృత్యం మీద ఆసక్తి పెంచుకుని, జమీందారిణి పూర్వాశ్రమంలో మంచి నర్తకి అని తెలుసుకుని, ఆమె దగ్గర పని పిల్లగా చేరి, కావాలని అష్టా చంమా ఆటలో ఓడి పోయి ఆమె ప్రాపకం సాధించి, ఆమె దగ్గర సంగీతం, నృత్యంలో శిక్షణ పొందుతూ దినదిన ప్రవర్తమానమవుతుంటే జమీందారిణి కొడుకు చేత బలాత్కరింపబడి, ఒక మగ పిల్లాడిని కని ...ఇలా పెళ్ళికి ముందే తల్లై, ఉన్న తండ్రిని తాగుడుకు పోగొట్టుకొని తరువాత తన జీవితాన్ని ఏ విధంగా మలుచుకుంటుందో అన్నది ఈ చిత్రం ఇతివృత్తం.
వనజ పాత్రీకరణ
చిత్రం చూసినంత సేపూ నాకు కలిగిన మొదటి భావన...వనజ పాత్రీకరణ చూసి...ఇంత "చాలూ పిల్లలు" కూడా ఉంటారా అని. పద్నాలుగు పదిహేడేళ్ళ పిల్ల .......తండ్రినీ, గుడి పూజరినీ, ఒక జమీందారిణిని, తన కంటే పెద్ద, చిన్న, సమ వయస్కులను.......ఒక్క తన స్నేహితురాలిని తప్ప అందరినీ...... ఎలా తన చిటికిన వేలి చుట్టూ తిప్పుతుందో కదా అని ఆశ్చర్యం వేసింది. ఎందుకో ఆ అమ్మాయి , బలాత్కారానికి గురి అయినా, నాకు ఒక "విక్టిం" అన్న భావన రాలేదు.....కారణం ఏమిటా అని ఆలోచించాను. తోచిన రెండు కారణాలలో మొదటిది నాకు "స్ట్రీట్ వైస్" అంటే తెలియక పోవటమేనేమో అని అనిపించింది.....మరీ నన్ను నేను టూ మచ్ గా అనుకుంటున్నాను అనిపించి ఆ ఆలోచన అక్కడితో వదిలేసాను.
రెండవది "భావరహిత చిత్రీకరణ" అని అనిపించింది. రచయితా, దర్శకుడు అయిన రజ్నేష్ తెలుగు చిత్రాలు చూడక చాలా కాలమే అయి ఉంటుందన్న :-) సూచనగా అసలు మేలోడ్రామానే లేదు ఈ చిత్రంలో. చిన్నపిల్ల బలాత్కారానికి గురి అయినా ఏదో పసరు మందు కాళ్ళ మధ్యలో పెట్టుకుని కొంచం ఏడుస్తుందే కాని తెలుగు చిత్రాలు పరిచయమున్న వారు ఊహించే స్థాయిలో విషాదమే లేదు. దీనికంటే ఎక్కువ ఆ అమ్మాయి సంగీత సాధన చేస్తూ అనాలోచితంగా వేలును కోసుకున్న సంఘటనలో ఎక్కువ ఏడుపును చూపెడతాడు దర్శకుడు. ఈ పేరడాక్స్కి కారణం లేదా పేరడాక్స్ అనిపించటానికి కారణం దర్శకుడు విదేశాల్లో ఉండి, అక్కడ చిత్ర నిర్మాణం నేర్చుకుని ఈ చిత్రాన్ని తన మాస్టర్స్ థీసిస్ కోసం అక్కడి విలువలననుసరించి నిర్మించటమా, మన తెలుగు చిత్రాలలో ఉన్న మరీ మోతాదుకు మించిన మేలో డ్రామాకు అలవాటు పడిపోయిన నా మనసా, నిజజీవితంలో అలాటి సందర్భాలు ఎదురైతే అలాగే ప్రవర్తిస్తారో, "చిన్నకులం" వాళ్ళు "పెద్దోళ్ళ" అన్యాయానికి బలి అయినప్పుడు అలాగే ఉంటారో లేక దర్శకుడు ఇంకేదన్నా చెప్పలనుకున్నాడా అన్నది నాకు అర్థమవలేదు.
సంగీత నృత్య రసానుభవం
విశ్వనాథ్ వారి చిత్రాలలో, మంగళంపల్లి, ఎమ్మెస్ గాత్రంలో, చౌరాసియా వేణుగానంలో సంగీత రసాస్వాదన అలవాటయిన నాకు ఈ చిత్రం "నా రసాస్వాదన" అనే అనుభవానికి "కొత్త నిర్వచనాన్ని", "అర్థాన్ని" తెలిపింది. ఇందులో వనజ పాత్రధారిణి సరిగా సత్యం చేసిందా లేదా, జమీందారిణి పాత్రధారినికి నేపథ్యం గాత్రం చేసిన వారు సరిగా పాడారా లేదా, "సావిరహే తవధీనా" అన్న అష్టపదిని కట్టిన రాగం సరైనదా కాదా అన్నది చెప్పేంత అర్హత నాకు లేదు కాని చూస్తున్నంత సేపు అవి నిజమైన సంప్రదాయ సంగీత నృత్య బద్ధ చిత్రీకరణ, ధ్వన్యీకరణేనా అన్న ఆలోచనలు చుట్టు ముట్టాయి.
కారణం ఆలోచిస్తే అర్ధమయింది ఏమిటంటే చిత్రంలో నాకు అలవాటయిన చిత్రాల్లోలా నృత్యం చేసేది అందమైన నాయికా కాదు, నాట్యం చేసేప్పుడు వాడినవి అందమైన దుస్తులు కావు, నాట్యం చేసేది/నేర్పించేది నేను గొప్పగా "నా అస్థిత్వం" అని ఫీలయ్యే "నా కులపోళ్ళ" పాత్ర కాదు. అందుకే ఆ ఫీల్ రాలేదు అని అనిపించింది.
లేకపోతె ఈ చిత్రంలో "అయిగిరి నందిని" అంటూ మహిషాసురమర్ధిని స్తోత్రాన్ని నృత్యాన్వయం చేసేప్పుడు ఆ చిన్న బుడత చూపిన ఆవేశం నిజంగా చెప్పాలంటే "సప్తపదిలో" తాత, మామ, బావ -మూడుతరాల వారు వరుసగా నిలబడి "జాత వేదసే సునమామి" అంటూ వేదపుష్పం సమర్పిస్తుంటే, వారికి దీటుగా దుర్గా సూక్త నృత్య రూపాంజలి ఘటించిన నాయికను మించిందనే చెప్పాలి. కళాతపస్విలాటి మెయిన్ స్ట్రీం దర్శకుడు, మెయిన్ స్ట్రీం చిత్ర హంగూ ఆర్భాటం లేకపోయినా అంత మంచి ఆవేశం అభినయించిన ఆ చిన్నారి చూస్తున్న ఆ క్షణం మాత్రం నన్ను సప్తపదిలో ఆ నృత్యం ఆకట్టుకున్నంత ఆకట్టుకోలేక పోయింది. ఇలా తాపిగా ఆలోచిస్తేనే దాని గొప్పతనం అర్ధమయింది.
తరచి చూస్తే మంగళంపల్లి గాత్రాలూ, కళాతపస్వి చిత్రాలూ నాలో రేపిన రసాస్వాదన...... వాద్య హంగు పొంగులకూ, నాయిక అందచందాలకూ, కులవివక్షకు పరోక్షరూపమైన కులాభిమానాలకూ, అభిమాన దర్శకుడు గాయకుడూ అన్న అభిమానానికి, పొంగిన హృదయ కంపనమని, చిక్కని నిక్కమైన రసాస్వాదన కాదని తెలిసింది. ఎంత దారుణమైన నిజమో!
రసాభినయం
వనజ పాత్రధారి ఎంత హృద్యంగా ఎన్ని రకాల రసాలను అభినయించిందో ఈ చిత్రంలో.
పైన చెప్పినట్టుగా మహిషాసుర మర్ధిని స్తోత్ర నృత్యంలో చూపిన ఆవేశం నిజంగా భేష్.
పోస్ట్ మాన్ అయిన తన జత కుర్రాడితో సరసాలాడుతున్నప్పుడూ, నాటుగా "నీది చూపించు నాది చూపిస్తా" అని అన్నా, నీటుగా "సావిరహే తవధీనా" అంటూ పిలిచినా శృంగార రసాన్ని తన వయసు, అభినయానుభవాన్ని మించి ఒలికించింది.
తండ్రి మాటి మాటికీ "చస్తా చస్తా" అంటుంటే "ఎందుకు మాటి మాటికి చస్తా అంటావ్...థూ" అంటూ చీత్కరిస్తూనే చూపించే కంట్రోల్ ఉన్న బేలతనం, పాత చిత్రంలో అన్నట్టు తన తరుఫున "సాక్షీకం" (అబద్దందే) చెప్పటానికి వచ్చి చివరికి ప్లేటు ఫిరాయించిన పోస్ట్మాన్ కుర్రాడి గల్లా పట్టుకుని "విన్నానని చేప్రా" అంటూ అడిగే కంట్రోల్ తప్పిన బేల తనం నిజంగా అద్భుతమైన కాంట్రాస్ట్.
తన కొడుకును జమీందారిణి దగ్గరకు పంపేస్తూ కూడా కన్నీరు కార్చకుండా తన వైపే సంకోచంగా చూస్తున్న తండ్రిని "ఎందుకలా నా వైపు చూస్తావ్ ...తొందరగా తీసుకుపో" అని అనటంలో ఉన్న విషాదంలోని గొప్పతనం నిజానికి రచయితా దర్శకుని ఖాతాలో చేరాల్సినదయినా ఆ అమ్మాయి చూపిన కంట్రోల్ నిజంగా బావుంది.
ఇంకా చాలా రసాలు ఉన్నాయని గాట్టిగా తెలుసు....కాని గుర్తు లేదు.....అయినా అన్నీ నేను చెప్పేస్తే మీరేం చేసేట్టు? మీరు చూసి (videomasti.net లో ఉంది ఇవాళ) ఆనందించండి.
మెయిన్ స్ట్రీం చిత్రాలు మరియూ ప్రేక్షకులూ నేర్వాల్సిన గొప్ప పాఠం
ఒక "విశిష్టత"గల పాత్ర కానీ, ఒక "విశిష్టత" గల పాత్రీకరణ గానీ ("గొప్ప" ఫైటరూ , "గొప్ప" సింగరూ, "మాంచి" అందగత్తె, "ఆహా" అనే ఫిగరూ, "ఎంతో గొప్ప" గాయకుడూ, "పేద్ద" పేరున్న నృత్యకారిణీ, "యమా క్రేజీ" పాపులారిటీ గల స్టారూ, "యమా" చెడ్డ విలనూ) లేకుండా నేటి చిత్రాలలో, నవల్లో నాయికా నాయకులు కనపడరు.
ఇలాటి "గో.......................ప్ప" పాత్రలనే మనం మరీ మరీ చూపించటం, చదివించటం వలన, ఆమోదించటం వలన, వారినే ఆరాధించటం వలన ...............మన జీవితంలో అలాటి "వి....శిష్ట" వ్యక్తులకై ఎదురు చూడటం, వారినే గౌరవించటం జరుగుతుంది.
దాని వలన మన జీవితాల్లో "బ్లాక్ అండ్ వైట్" ఆలోచనలు ఎక్కువైపోయి.................సగటు మానవుడు "అన్ని రకాల
గ్రేస్" లోనే ఉంటాడని మరచి.....మన చుట్టూ ఉన్న "గ్రేస్" ని చూసి నిరాశ చెందటం, వారిని నిర్లక్షం చేయటం, వారికి నిరుత్సాహ పరచటం చేస్తాము. దీని వలన ప్రతి "గ్రే" లోని "వైట్" చూడటం మరిచిపోతాము.
అలా చేయకుండా సాధారణ వ్యక్తుల్లో సాధారణ మస్తత్వాన్ని, సాధారణ బిహేవియర్ ని, సాధారణ శక్తినీ సెలబ్రేట్ చేసే ఈ వనజ చిత్రమే నిజమైన అసాధారణ చిత్రం.
అయితే అంత అసాధారణ చిత్రం కాబట్టే బయట ఎన్ని బహుమతులు గెల్చిన మన భారత దేశంలో ఒక్క థియేటర్లో కూడా విడుదలకు నోచుకోని ఈ చిత్రాన్ని చూసి మెయిన్ స్ట్రీం చిత్రాల వాళ్లు ఏం నేర్చుకుంటారో మనకు బాగా తెలిసిందే కదా!
(ఈ "వనజ" సినిమా గురించి రాయాలనుకోటానికి కారణం ఎప్పటినుంచో నాలో మెదులుతున్న ఈ "సాధారణమే ఆమోద యోగ్యం" ఆలోచన ఒక కారణమైతే....ఇవాళే జాలంలో ఒక మిత్రుడు తన ఆర్కుట్ అకౌంటులో "నేను ఏ కుల సంబంధిత సమూహాల్లో లేను....మరి మీరో? " అని రాసుకుని పెట్టిన చెంపదెబ్బ ఒక కారణం.
చిన్నదే అయిన ఎందుకో మనసులో ముల్లు గుచ్చుకున్నట్టయింది.....ఆ వాక్యం చూసే సరికి. దొంగగా అదే ఆర్కుట్ అకౌంటులో కుడి పక్కన నా "అస్థిత్వాన్ని" తెలుపుతూ ఉన్న "నా కుల" సమూహాలు కనపడ్డాయి. ఇంతకు ముందుకులా "అవును నేను ఈ కులపు వాడినే, అది నా అస్థిత్వంలో భాగమే" అని నిశ్చింతగా చెప్పలేక పోతున్నా
ఈ మధ్య ....ఎందుకంటే......"కులాలు పోవాలని కాదు కుల వివక్ష పోవాలని ప్రయత్నించాలి" అంటూ టపా రాసిన నేను ఈ మధ్యనే సైకాలజీలో చదివిన కొన్ని ప్రయోగాలు గుర్తుకొస్తాయి కుల వివక్ష-కుల అస్థిత్వము అన్న చర్చ వచ్చిన ప్రతీ సారి....టూకీగా ఆ ప్రయోగాలు కనుగొన్నవేంటంటే....మనిషన్న వాడు, "ఒక సమూహానికి చెందిన వాడిని" (just an identification with a group is enough ....it seems) అని అనుకుంటే చాలట... సమూహ వివక్ష చర్యలు (group discrimination behaviours) తనకు తెలియకుండానే చేస్తూ ఉంటాడట. ఇది ప్రామాణికంగా రుజువయిన నిజాలు. తనకు అంతవరకు పరిచయం లేని ఉట్టి సమూహ పరిచయ భావనకే మనిషి ఇలా అయిపోతే మరి మన సమాజంలో వేళ్ళూనికొని పోయిన ఈ కుల సమూహ భావనలు, మనిషి ఎంత బుద్ది పూర్వకంగా వివక్ష రహితంగా ప్రవర్తించినా అప్రయత్నంగా వివక్షా పూర్వక చర్యలకు రేకేత్తించకుండా ఉంటాయా అని అనిపిస్తూ ఉంటుంది....అందుకే ఈ నా అస్థిత్వమంటే నాకు ఈ మధ్య భయం పట్టుకుంది!)
bavundandi. intakee orkut lo meeru cheppina communities lonchi bayataki vachestunnaaara?
ReplyDeleteభాస్కర్ గారు,
ReplyDeleteఏమోనండీ ఆ క్షణం నచ్చింది...నిజమే....కాని మళ్ళీ చూసి/గుర్తు పెట్టుకునే స్ఫందన రాలేదు నాకు. కారణం కింద వాసుకిచ్చిన జవాబులో దొరుకుతుంది మీకు!
vasu,
सुनके हमारी कुब्ल-ए-गलती
यार ने पूछा किया क्या अमल?
हम हँस के चल दिए, सोचते मन ही मन
अमा जनाब, इतनी आसां होती सफर
इक पड़ाव से दूसरी तक
पहुच नहीं जांते क्या मंजिल अब तक?
अभी पहुंचें हैं पड़ाव-ए-कुब्लीयत
थोडा मौज करने दो इस मंजर में
फिर सोचेंगे उस पडाव-ए-अम्ल पर
तै करना भी है ना सफर के फायदे
दूसरों के ही नहीं, हां खुद का भी.
अपनी फायदे की विशवास होने दो
फिर दौड़ पड़ेंगे उस सफर पर.
ఒక్క ముక్కలో..."లేదు"...బుద్ది చెపుతున్నా.....మనసు ఇంకా లాభ నష్టాల బెరీజులోనే ఉంది!
బాగా చెప్పారు
ReplyDelete