Friday, 28 August 2009

సమాజమా వినుము వినుమిక.

పరశు వేటుకు మునుపు
రేణుక మనసు మోదము
మీ గాటి సంకెల త్రెంచిన
నాపై మీకేల కలుగదు?

నేటి నా అభ్రగమనము
మీరేసిన నిచ్చెన గాదె?
మీ స్థన్య రుణము
గూడుదాటు బలము కాదె?

నలుపు తెలుపుల భేదము
తెలుపు తనము వసను బట్టి
కర్ణ మధ్యమ బంధ ముక్తి
అక్షరాభ్యాసపు మొదలు కుడిపి

కరము వీడి సాగినడుగులకు
కరతాళ తాళ లయను కూర్చి
మీ నేర్పిన తాండవము గాదె
ఈనాటి ఈ నా ఠీ ప్రవృత్తి?

మీరు చేసిన నిర్వచనాలు
వితర్కించుట నాదు ధర్మము
తీరు చూపిన మీ శిక్షలు
అనుభవించుట నాదు ఖర్మము

పునాదినణుచుట ప్రకృతి ధర్మము
అది లేనిదే లేదు హర్మ్యము
పునాదినాగుట కాదు కార్యము
గొంగడి గాదె నాదు నైజము

మదినాపుట ఇకనసాధ్యము
మదిశూన్య బంధము బహు దుస్సహము
త్రికరణము కాని కార్యము
కాదు కాదు కానేరదు ఆమోదము

మీకు వెరువను
మడమ త్రిప్పను
రెప్ప వాల్చను
బాట మార్చను

వీపు మీకే
వేటు మీదే
తీర్పు మీకే
చేటూ ఓకే

ఫలమేమన్నది
ముందేముందని
ఎవడికెరుక
లేదు కోరిక

తోచిన న్యాయము
వీడను నేనిక
క్షమనేమాత్రం
వేడడు వీడిక.

Thursday, 27 August 2009

శిలాక్రోశం-గోదారమ్మ ఘోష.

"నిన్నె"క్కడ వదిలేసావమ్మా
కడలి చేరిన గోదారమ్మా?
పరుగులేవీ, ఆ గలగలలెవీ?
ఆ సంగమంలో "నీవ"న్నదేదీ?

పచ్చని పైర్ల వన్నెలు చిన్నెలు
కలల తోటల పానుపేయగ
ధవళాచలాన నేసిన కలలూ
"జగమెరిగిన" వాని తలపుల పండిన సిగ్గులూ
బంగరుటంచుల కార్యపు వలువలై

పాపికొండల నడుమ తొలిరేయి బొమ్మవై
నెమ్మది నడకల చేరిన కొమ్మా
కలలు ఛిద్రమవ వాడి బాహువుల
కరకు కౌగిలుల నలిపి ఆపిన
ఆ వార్ధిభంగినెలా ఓపావమ్మా?

అంతెత్తు దూకినా చావుని చేరక
అఖండాణువులై, ముక్కలై, చెక్కలై
నింగికెగసినా ఆత్మ చావక, ప్రేమా చావక
ఎలా నడిచావమ్మా ఇంత దూరం?

ఏ మలుపుల చాటున
నిట్టూర్పులు దాచావో
ఏ కొండల నీడలకు
వివర్ణానన శ్యామాన్నరువిచ్చావో

బిరబిరమని పరిగెడుతూ
అలుపేదని ప్రశ్నిస్తూ
ఎంతమందిని మోసపుచ్చావో
ఎందరికోదార్పుగా నువ్వేడ్చావో

వరి చేలను తడిపేస్తూ
చేల చెలమల్లొ కన్నీటిని దాచేవా?
గడిచాయని తుడిపేస్తూ మరకేదని ప్రశ్నిస్తూ
పలక తిప్పి ఏమారుస్తే గాయం పోయినట్టేనా?

నీ వేగం లోనె
నీ దొషము వలనే
ఖండితయై విఖండితమైన
ఈ కఠిన శిల ఆక్రోశం
ఒక్క నా కోసమే కాదమ్మా

ఒకనాటి నీ కౌగిళ్ళ సాక్షిగా
నువు కడిగిన్నా మకిలి సాక్షిగా
నీ మౌన మానస రోదన
అప్రకటితమైనా.... ఈ ఆక్రొశానికి
అదే లయపేటికన్నది మరువకుమ్మా!

Tuesday, 4 August 2009

Deleted memories

Can't wish you the complete love
such is my profound selfishness
for if you find that completeness
i can't imagine where i shall be

but....but,
i can do nothing but accept
you are worth thousand complete loves
for the care and pride you show
even to the tiny transient uncountable masses
of seconds that tick by, in your company
unkown to all but you
each is a priceless little diamond

lost in your smile
we note not their brilliance
lost in your embrace
we know not their warmth

till the day everything is
cold and dark, cold and dark
then we remember their light and heat
those countless friends we lost and desperately need

so here is a little ode
to you and your pride
in the company you share
and the sorrow when we delete it.

చేజార్చుకున్న మధురాలు.

మన ఏకాంతానికి భంగం కాకుండా
నిశ్శబ్దంగా కదిలిపోతున్న సమయం
కుదురైన మన ఒద్దిక చూసి
ఆపరాని తన ఆ చలనం
అక్షరంగా మలిచి పదిల పరిచిస్తే
మన కిచ్చిన ఆ బహుమానం
నే పారేసుకున్న ఆ నిర్లక్ష వైనం!

సువాసనల సుమబాలలుగా
ప్రేమతో నీవు నాకభిషేకం చేస్తే
తలంబ్రాలే అనుకున్నానా క్షణం
అసంఖ్యాకంగా ఒడిలో ఒదిగితే
మధుర కౌగిలిగా తలిచానా క్షణం
ఇంతా చేసే నే వెళ్ళాల్సొస్తే
నిర్లక్షంతో కాళ్ళ నలిగాయా విరులు
ఎంతేడ్చావో కదా?
ఇప్పుడు తెలుస్తోందిలే ఆ బాధ!

శిశిరంలో బోడివై, అందహీనవై, నీవు
నిన్నలా చూడలేక జ్ఞాపకాలూ లేక నేనూ!
వసంతమొచ్చేదాకా నాకెవరు తొడు
ఇక్కడకూడా నా స్వార్థమే చూడు

అప్రయత్నంగా చెరిపేసానమ్మా
నువ్వున్నావన్న ధీమాతో...ఆ మన జ్ఞాపకాలను.

ఏం చేస్తే తిరిగొస్తాయి
నే పారేసుకున్న ఉత్తరాలు?
ఎంత వెతికినా మరి జాడేదీ
ఆ క్షణపు మధురాలు?

Sunday, 2 August 2009

స్నేహమంటే ఇదేనేమో...

కలిసుండటానికి కారణాలు కావాలా?
విడిపొవటానికి వాదనలు కావాలా?

అవసరాలు తీర్చుకునే అవసరం కాదు మన స్నేహం...
నిన్నటి వరకూ నేను నీ ప్రాణ స్నేహితుడినే, కాదనను
కానీ ఈ రోజు ప్రానమే మిగిలింది స్నేహం కాదు
కలిసి రాని కాలం కన్నీటి సాక్షిగా
మరపు రాని మన స్నేహాన్ని గతంగా మార్చేసింది
మనం విడిపోయినప్పుడు ఆగిపోయిన నిమిషాల ముల్లు
ప్రతీ క్షణం నీవు లేని లోటు తెలుపుతూనే ఉంది

కలిసుండటానికి కారణాలు కావాలా?
విడిపొవటానికి వాదనలు కావాలా?

కష్టమొచ్చినప్పుడు కన్నీటి కంటి ముందు నేనున్నానని గుర్తుంచుకో.............
మనుషులు విడిపోవచ్చు, మనసులు ఓడిపోవచ్చు
మమతలు మాసిపోవచ్చు, మారనిది స్నేహమొక్కటే.
నిజమే ఇప్పటికీ ఏం మారలేదు....నువ్వు గుర్ర్తొచ్చినప్పుడు
చిరుగాలికన్న చల్లని నీ చిరునవ్వు నన్ను పలకరించిపోతుంది
స్నేహమంటే ఇదేనేమో.

(ఎవరిదో ఈ కవిత...అర్థం కాని ఆర్తితో తడిపేసింది . యూ ట్యూబ్లో "జోడీ" పాట ఒకదాన్ని వింటూంటే అందులో ఉన్నా ఒక ఫోటో పై రాసుంది.....ఇక్కడ చూడండి అది...http://www.youtube.com/watch?v=_0wBDOXgbHE)
2.42 లో చూడండి.