Thursday, 27 August 2009

శిలాక్రోశం-గోదారమ్మ ఘోష.

"నిన్నె"క్కడ వదిలేసావమ్మా
కడలి చేరిన గోదారమ్మా?
పరుగులేవీ, ఆ గలగలలెవీ?
ఆ సంగమంలో "నీవ"న్నదేదీ?

పచ్చని పైర్ల వన్నెలు చిన్నెలు
కలల తోటల పానుపేయగ
ధవళాచలాన నేసిన కలలూ
"జగమెరిగిన" వాని తలపుల పండిన సిగ్గులూ
బంగరుటంచుల కార్యపు వలువలై

పాపికొండల నడుమ తొలిరేయి బొమ్మవై
నెమ్మది నడకల చేరిన కొమ్మా
కలలు ఛిద్రమవ వాడి బాహువుల
కరకు కౌగిలుల నలిపి ఆపిన
ఆ వార్ధిభంగినెలా ఓపావమ్మా?

అంతెత్తు దూకినా చావుని చేరక
అఖండాణువులై, ముక్కలై, చెక్కలై
నింగికెగసినా ఆత్మ చావక, ప్రేమా చావక
ఎలా నడిచావమ్మా ఇంత దూరం?

ఏ మలుపుల చాటున
నిట్టూర్పులు దాచావో
ఏ కొండల నీడలకు
వివర్ణానన శ్యామాన్నరువిచ్చావో

బిరబిరమని పరిగెడుతూ
అలుపేదని ప్రశ్నిస్తూ
ఎంతమందిని మోసపుచ్చావో
ఎందరికోదార్పుగా నువ్వేడ్చావో

వరి చేలను తడిపేస్తూ
చేల చెలమల్లొ కన్నీటిని దాచేవా?
గడిచాయని తుడిపేస్తూ మరకేదని ప్రశ్నిస్తూ
పలక తిప్పి ఏమారుస్తే గాయం పోయినట్టేనా?

నీ వేగం లోనె
నీ దొషము వలనే
ఖండితయై విఖండితమైన
ఈ కఠిన శిల ఆక్రోశం
ఒక్క నా కోసమే కాదమ్మా

ఒకనాటి నీ కౌగిళ్ళ సాక్షిగా
నువు కడిగిన్నా మకిలి సాక్షిగా
నీ మౌన మానస రోదన
అప్రకటితమైనా.... ఈ ఆక్రొశానికి
అదే లయపేటికన్నది మరువకుమ్మా!

No comments:

Post a Comment