సమాధి చేస్తే
ఏకాంతంలో
వంటరిననుకుని
జ్ఞాపకాల దుప్పటిస్తే
కన్ను కానని
వేలు పోటని
అచేతన లాలిలో
సులువైన మృత్యువులో
బ్రతికేస్తున్న నాలో
ఏదో కదలిక......
వెచ్చని దుప్పట్లో
మరిగిన రక్తం
ఫలం తెలీని
రేపటికై సత్తువనిస్తే
కరుకు పలుకుల
పక్కన పాకి
టన్నులెత్తకనే
సమాధి చీల్చే నేర్పు
వివర్ణంలో చిరుపచ్చ
చిట్లించింది
సమాధిని
పునాది వేసే
తపమనుకునే
నైజమిచ్చిన
జన్మకారకుల
నమస్కరిస్తూ
కైమోడ్పే అంకంగా
అంతరాలలో
నమ్మకపు అంకురార్పణ
పెదాలపై పల్లవిస్తే
పాపం పిచ్చి మనసు
దూది పింజయ్యింది
"వాటిని చంపెయ్య"మనే
కరకు స్వరాలు కాక
కిలకిలధ్వానాల
ఉషోదయం మళ్ళీ తెచ్చింది
రేపటి మన బంధం
ఏ రూపో తెలీదు
నామకరణమేదైనా
"మన ఫలమది"
అనుకుంటుంటే
గర్వంగా ఉంది
ఇకపై నే కార్చే
ప్రతి బొట్టూ
ఆణిముత్యమే సుమా
ఎప్పటికప్పుడు
నవమోద విభవానికవి
తలంబ్రాలేగా
నవరసాలు పండించే
నవధాన్యాల అంకురార్పణ
ఇవాళే చేద్దాం
పక్కని లేకపోతేనేం
లోనున్నావుగా.
పప్పన్నం వండేస్తా
ఎప్పుడని అడిగే వాళ్ళెందుకు
నేనూ ఆత్మారాముడూ
చాలదూ సాక్షం?
కణ్ణా
ఆలోచించటం అంటే మునుప్పరిచయ వాక్యాల పునశ్చరణ కాదని
నమ్మకం అంటే మనస్ఫురిత అన్వయానికి భోతిక సాక్షాలవసర లేదనే ధీమా అని
తపమంటే వస్తుందో లేదో తెలీని దానికై ప్రయాసలెన్నో ఓర్చే గాట్టి ప్రయత్నమని
నిర్వచించిన మన బంధాన్నీ నైరాశ్యంతో ఇక అవమానించను.
ఇక ఈ లేబుల్ వాడాల్సిన అవసరం ఎన్నటికీ రానివ్వను.

No comments:
Post a Comment