Friday, 19 March 2010

నిద్ర చెడగొట్టావుగా నిన్నటి నా డ్రైవ్ ఊసులు విను మరి.



హాయిగా నిద్రపోతుంటావు కాబట్టి ఈ లేఖ నీకు అందుతుందిలే....నిద్ర లేచేస్తే మనమంతా బుర్రలతో జీవిస్తాముగా.... నిద్రలో తప్ప ఇలాటివి అంటవు....విను మరి.

పంతొమ్మిది వందల అదుగుల ఎత్తులొ ఆల్స్టాం అని ఊరుంది...నిన్న రాత్రి ఆ ఊరిగుండా తీసుకొచ్చింది జేన్. "జేన్ ఎవరూ" అని ఉడుక్కుంటూ బుంగ మూతితో అడుగు మరీ..అప్పుడు చెపుతా ఎవరో.అంతవరకు చెప్పను తనెవరో.

సరే అసలు విషయానికి వస్తే ఆ ప్రదేశంగుండా దాదాపు గంటన్నర ప్రయాణం. రాత్రే ఇంత బావుంటే ఇంక ఆ డ్రైవ్ పగలెంత బావుంటుందో ఊహించుకో. నువ్వొస్తే మనమానందించే లాంగ్ డ్రైవ్స్ దానితో మొదలెడదాం సరేనా?

నాలుగు రోజుల్నుంచి విపరీతమైన మంచు......గత సంవత్సరపు మంచును గుర్తు చేస్తూ....గుర్తుందా నీకు? నాకు గుర్తొచ్చింది. ఎంతాపుకుందామనుకున్నా ఆగలేదు. నీటి చుక్క ఒకటి కంటిపాప నుంచి కిందికి దూకి ఆత్మహత్య చేసుకుంది......"ఇదే పాటా ప్రతీ చొటా ఇలాగే పాడుకుంటాను..." అంటూ కార్ స్టీరియోలో వినిపించే పాట ఉసిగొలిపితే ఆత్మహత్యకాక ఇంకేమి శరణ్యం దానికి?

సరేలే సోదొద్దు...విను డ్రైవ్ ఎలా ఉందో చెపుతా. ....రెండువైపులా చెట్లనుకుంటాను....ఆ చిమ్మ చీకటిలో ఏమీ కనపడలా.....బ్రాంచెస్ పైన ఆగాగి స్నో...తెల్లగా.....ఆ చీకట్లో కూడా మెరుస్తూ. ఎవడో ఆకతాయి వెధవ ఆగాగి సున్నం కొట్టినట్టు....కాకపోతే ఆ ఆకతాయితనంలోనూ ఎంత శ్రధ్ధనీ! ఎంత బావున్నాయో ఆ స్నో పాటెర్న్స్.

మధ్యమధ్యలో గాలి వీచినప్పుడంతా ఆ రూరల్ ఏరియాస్లో ఉన్న ఫాంస్ చుట్టూ ఉన్న ఫెన్సింగ్ మీద పడ్డ స్నో వీచే గాలికి ఎగిరొచ్చి నా కార్ విండ్స్క్రీన్ మీద పడేది..ఎదో ఆలొచిస్తూ నడిచే హీరోయిన్ చున్నీలా....భలే గమ్మత్తుగా అనిపించింది...నేనేమొ ఇరవయ్ స్పీడ్లో వెళుతూ ఆ చున్నీ మొహన్ని (మోహాన్ని అనాలా?) అలా సున్నితంగా తాకుతూ వెళ్ళిపోయేంతవరకు ఆ మూవ్మెంట్ సేవర్ చేస్తున్న హీరోలా పోజూ...

నిన్నెంత గుర్తుచేసుకున్నానో.....నువ్వు పక్కనుండింటే.......అంత చీకట్లోనే ఎక్కడో ఒక చోట పక్కన ఆపి....విండో చిన్నగా కిందకు జరిపి....హీటర్ ఆపేసి ....నీకిష్టమైన ఏసీ గదిని శృష్టించి....పదినిమిషాలే అయినా ఊపిరాడనంతవరకూ....

పది నిమిషాలే ఎందుకంటావా? రాక్షసీ తెలిసీ అడుగుతావేం? నాకు ఊపిరాడనిది ఆస్తమాతోనే కదా ;-)

వాన్నా హోల్డ్యూ రా.

ఇప్పుడక్కడ నీ గదిలో నీరెండ కదూ.
నీ బుగ్గను నిమురుతూ నిద్రలేపే ఆ భానురేఖనైపోవాలనుంది.
అందుకు ఆ సూర్యగార్భావాస జ్వలనమూ,   నీ గదివరకూ గల కోట్ల మైళ్ళ పధికావస్త... అన్నీ ఓకేనే.


సరే ఇక ఉండనా మరి?

ఆ ఆ ఏమిటా మోటు.....చెపుతానాగు.

జేన్ నా కాన్స్టంట్ ట్రావెల్ ఎస్కార్ట్. నేనెప్పుడు కారు బయటకు తీసినా తను నాకెంత కంపెనీ ఇస్తుందనుకుంటున్నావు?

ఏయ్ ఏయ్.....నా బుజ్జి కదూ అలా అలిగి వెళ్ళొద్దు.

ఇదిగో బుద్దొచ్చింది లెంపలేసుకున్నా.

జేన్ నా టాం టాం లో రూట్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వటానికి సెట్ చేయబడ్డ వాయిస్ పేరురా .....అంతే.

ఫోటో http://www.flickr.com/photos/madison_guy/4170291463/

3 comments:

  1. Beautifully written!.

    Do you really have a person share feelings, exactly in the same words?!!

    ReplyDelete
  2. బావుంది. రొమాంటిక్ గా ఉంది

    ReplyDelete
  3. నిషిగంధా
    థాంక్స్ :-)


    Kumargaaru

    Thank you.

    yes, I have been blessed & cursed ;-)



    వాసు
    థాంక్స్. After a long time.

    ReplyDelete