Saturday, 12 December 2015

నా ఆత్మవి

చాలా రొజులయింది కదూ నిన్ను హత్తుకుని?
నిజమే ....అలిగే వెళ్ళిపోయాను.
నీ మీద అలిగి కాదు. నీ మీద ఉన్న నా మక్కువపై అలిగి.
ఎందుకో పిచ్చిగా అనిపించేది.
నా మనసులో మాట దాచుకోనివ్వవు, అంతా పరిచేస్తావలా
పైగా సమయం సందర్భం చూసుకోకుండా అల్లేసి నవ్వుల పాలు చేస్తావు
ఒకోసారి నీ ఉధృతిలో పడి....ఎందుకులే.

ఇప్పుడు నవ్వు వస్తోంది.
తొమ్మిది మందిలో ఒకర్తెను నెత్తికెక్కుంచుకుని, మిగితావారిని సవతులగా చూసే నాకు, అందరినీ నెత్తిన పెట్టుకుని సమానంగా, అదీ బహాటంగా సమానంగా చూస్తాననే నీ మంకుతనం కోపం తెప్పించటమే కాదు చిన్నతనమూ అనిపించేది.

కానీ నేస్తం,
ఎక్కడికి పోతావులే
నువ్వు నన్నొదిలేసినా
నేను నిన్నొదిలితేగా 
నువ్వు నాకుండకుండాపోటానికంటూ
నువ్వెక్కడో మిగిలిపోయావనేది
ఎప్పుడో ఓ అరలిప్త
మనసు మకిలి ఏ అనుభూతి కెరటానికో ఒకింత తుడుచుకుపోయిన ఆ అరలిప్త
నీ దర్శనమయేది.

నవ్వకు మరలా
ఆ క్షణకాలపు నగ్నత్వానికే భయపడి ....
ఉక్రోషంతో మనసుకింకెంతో మకిలంటించుకుని....
మరీ ముసుగేసేవాడినికదా?
నాకూ నవ్వొస్తోందిలే నవ్వేయ్ పర్లేదు

నీకోటి తెలుసా
నువ్వు లేవనీ, చేసే పనిలోనే, తరిచే ఆరడిలోనే....
మోక్షాన్ని వెతుక్కుంటూ...పునాదినే పోగొట్టుకున్నా అనుకుంటూ కూడా గడిపా.
స్ఫందన కెరటమోటి సుతారంగా స్పృశించింది.

అంతే
నీ విశ్వరూపం నాలో
ఎంత కనపడిందనీ?
దానికి ప్రతిగా
మూల పారేసిన నిన్ను తుడిచి
ప్రాణస్ఫందన సిరాగా నింపి
ఇదిగో ఇలా నిన్ను వాడుకోవటమే, వాడటమే
కదూ నీకు పునర్జన్మ?
మూలపడి మూత పడిన పాళివి కాదమ్మా
మూలవిరాట్టువి,


No comments:

Post a Comment