Sunday, 30 March 2008

2. నస్యం రంగు పట్టు చీర పిల్ల-మూడవ భాగం(ending).


నిశ్చయ తాంబూలాల రోజు రానే వచ్చింది. అందరం హడావుడిగా ఉన్నాము. మద్యాహ్నం రెండు పదికి ముహూర్తం పెట్టిన పూజారి గారిపై నాకు పీకల వరకు కోపంగా ఉంది. తను నిన్ననే సకుటుంబంగా హైదరాబాదు వచ్చి వారి బంధువుల ఇంట్లో దిగిందని తెలుసు. మనసులో ఫోన్ తనకు చేయాలని ఎంతగానో ఉన్నా నిశ్చయ తాంబూలాల తరవాత సమయం అంతా మాదే కదా తనకు ఫోన్ కూడా చేయలేదు.

ఇంకొక గంటలో తను, తన వారు ఇంటికి వస్తారు అని అనుకుంటుండగా పిడుగులాంటి వార్త మోసుకొచ్చింది ఫోన్. అమ్మ ఎంటో ఫోనులో అరుస్తోంది ఎంట్రా అని బయట ఉన్న నేను లోపలికి వచ్చి చూస్తే ఏడుస్తూ అమ్మ, చెల్లెళ్ళు, గంభీరంగా నాన్న కనబడ్డారు. ఏమైందంటే ఎన్నడు కంట తడి పెట్టని నాన్న చిన్నగా గద్గద స్వరంతో "వాళ్ళు సంబంధం ఇష్టం లేదు, రావట్లేదు అని ఫోన్ చేసారు రా. నిన్న ఇక్కడ ఎవరో డాక్టర్ బందువట మాటల విషయంలో నీ సంగతి తెలుసుకొని అమ్మాయి గొంతు కోస్తున్నారు. నా కూతురైతే ఈ సంబంధం చచ్చినా ఒప్పుకోను. నేను రాను ఈ నిశ్చయ తాంబూలలకు అని చెప్పి వెళ్లి పోయాడట సకుటుంబంగా. దాంతో వీళ్ళు మళ్లీ ఆలోచించుకొని వద్దంటున్నారు" అన్నారు.

ఏదయితే జరగ కూడదు అని నేను అనుకున్నానో అదే జరిగే సరికి నోట మాట రాలేదు. కొంచెం సేపటికి తేరుకొని "లండన్కి ఫ్లైట్ ఎప్పుడు బుక్ చేసారు" అన్నాను. "ఇంకో పది రోజులుందిరా" చెల్లి జవాబిచ్చింది. "నాన్నా. మీకు తెలిసిన మీ స్తుదేంటే కదా ఏజెంట్. అడిగి రేపటికో ఎల్లుండికో బుక్ చేయ గలరా?" అడిగాను. నాన్నా మారు మాటాడక ఏజెంట్కు ఫోన్ చేసి ఆ పని చేసేశారు.

చెల్లి "ఒరే అంత తొందర ఎందుకు? పోయి అడుగుదాం. ముందే చెప్పాము కదా ఇప్పుడు ఇలా చేస్తే ఎలా అని." అని కోపంగా అనింది. నేను దాన్ని ఒక చూపు చూసి "అవసరం లేదు. ఇందుకే నేను మనం ముందే చెప్పాలి అని పట్టు బట్టింది. డాక్టర్ని కలిసి మాట్లాడండి అని వాళ్ళతో మొత్తుకున్నది. వాళ్ళిప్పుడు అమర్యాదగా ప్రవర్తించారు నిజమే. కాని సంబంధం వద్దనే హక్కు వారికి పెళ్లి జరిగే ముందు క్షణం వరకు ఉంటుంది. నా విషయం సాధారణ విషయం కాదు కాబట్టి ఇక్కడ సాధారణ పరిస్థితులలో ఉండే నియమాలు చెల్లవు. నాకు గనక ఈ సమస్య ఉండక పోయి ఉంటే, అమ్మాయికి ఒకే, అయితె ఈ క్షణం నేను వెళ్లి తనను లేపుకోచ్చే వాడిని. కాని నా పరిస్థితులు వేరు. పోనియ్యండి." అని అందరితో పలికి అమ్మ వైపు తిరిగి "అమ్మా. ఎట్టి పరిస్థితులలో నువ్వు వాళ్ళకు ఫోన్ చేసి బ్రతిమాలటం కాని, వాళ్ళను తిట్టడం కాని చేయొద్దు నా మీద ఒట్టు. " అని చెప్పి బయటకు వచ్చేసాను. అందరికి నచ్చ చెప్పాను కాని నా మనసుకు నచ్చ చెప్పాలంటే ఏకాంతం అవసరమని నాకు తెలుసు.
--------------------XXXXXXX----------------------

బ్రిటిష్ ఎయిర్ వేస్ విమానంలో కూర్చున్న నేను నా హ్యాండ్ లగేజి సర్దుతుంటే కనపడ్డాయి నాకు ఎంతో ఇష్టమైన రెండు వస్తువులు. మొదటిది నేను అపురూపంగా కొన్న మొదటి ప్రేమ కానుక-అదే చెన్నైలో కొన్న తన పేరు మొదటి అక్షరం గల గవ్వతో చేసిన కీ చేయిను, ముత్యాల సెట్టు ఉన్న పెట్టె. "ఎంత అందంగా ఉందొ తన లాగ" అంటున్న మనసును బలవంతంగా దారి మళ్ళించి నాకు అతి ప్రియమైన ఆ రెండవ వస్తువును చేతిలోకి తీసుకున్నా. అది నా ప్రియతమ నేస్తమైన 2003 డైరీ. అందులో నేను రాసినది చెమర్చిన కళ్ళతో చదివా.

"ఈ రోజు ఎప్పటికీ మరువలేనేమో. ఎంతొ ఆనందంగా జీవితాంతం గుర్తుండాల్సిన ఈ రోజు, ఎప్పటికీ గుర్తుంది పోతుంది కాకపొతే విషాదంగా. నాకు తెలుసు ఆ డాక్టర్ చేసిన పని అతని దృష్టిలో మంచిదే అని. కాని అతను చేసిన విధానం పైనే నా కోపమంతా. తను వివరాలన్నీ చెప్పి నిర్ణయం తనకు, వల్ల కుటుంబానికి వదిలేయాలిసింది. అలా కాక అంత నాటకీయంగా అతను వెళ్లి పోవటం ద్వారా తన అనవసర భయాన్ని రేకేత్తించాడు. నేను అలా తయారవకుండా జాగ్రత్త పడాలి. "వైద్యో నారాయణో హరి" అన్న నానుడిని నిజమే అనుకుంటూ నేను భగవంతుడిలా ప్రవర్తించను. నేను నిర్ణయాలు తీసుకోను. నా రోగులకు, వారి కుటుంబాలకు ఆ నిర్ణయాధికారం వదిలేస్తాను.

అయినా సరే. ఈ జీవితంపై, మనుషులపై నాకు ఉన్న నమ్మకాన్ని పోగొట్టుకోను. దేవదాసులా మందుకు బానిసవను. ప్రేమకు దూరం కాను. జరిగినది ఒక తీపి గుర్తులా కల కాలం గుర్తుంచు కుంటాను. అలా అని ఆ జ్ఞాపకాలతోనే జీవించను. రాబోయే నా సహధర్మచారిణి-తను ఎవరైనా సరే, నా ప్రేమకు పూర్తి హక్కుదారు. ఒకసారి వేరే ఒకరిని ప్రేమించాను కదా నా భార్యను ప్రేమించటం మానను."

ఈ పై వాక్యాలు రాసిన తేది చూసి బాధగా నవ్వుకున్నా. అది february 14th.

2 comments:

  1. మీ కథ చాలా బాగుంది.

    ReplyDelete
  2. బాగుందండి మీ కథ.
    మీరు వాస్తవానికి దగ్గరగా రాస్తారండి..
    బాగా నచ్చింది.

    ReplyDelete