పురానికి పెళ్లి చూపులకని అమ్మ, నేను, చెల్లి బయలుదేరాం. నాన్న "మీరెళ్ళి రండి రా, నాకు చేత కాదు అంత దూరం ప్రయాణం. అయినా తెలిసిన అమ్మాయే కదా." అని రాలేదు. రైల్లో కిటికిలోంచి బయటకు చూస్తున్న నేను అమ్మ మాటలతో ఈ లోకంలో పడ్డాను. "చెప్పవేం రా? పెళ్లి అయ్యాక నీకు UK లో ఉద్యోగం దొరికే దాక తనను మా దెగ్గరే పెట్టు. నీ ఉద్యోగం సెటిల్ అవగానే తీసుకెళ్ళు. సరేనా?" అమ్మ ప్రశ్న. నేను చిన్నగా నవ్వి "అమ్మా మనం పెళ్లి చూపులకు వెళ్తున్నాం. అపుడే తను కోడలు అయినట్టు మాట్లాడకు" అన్నాను. దానికి చెల్లి "ఉంచనని చెప్పలేక ఏమేమో చెప్పకురోయ్. పర్లేదులే తనను విడిచి ఉండలేను అని చెప్తే మేమేం అనుకోం లే" అని ఆట పట్టించ సాగింది.
"అయినా ఇంక సంభంధం సెటిల్ అవకపోడానికి కారణం ఎముందిరా? ఉన్న విషయం ముందే చెప్పాము. వాళ్ళకు సమయము ఇచ్చాము. వాళ్ళు ఆలోచించి వప్పుకున్నారు. ఇంక అమ్మాయిని మనం చూసాం, నిన్ను వాళ్ళు చూసారు చెల్లి పెళ్ళిలో. పైగా MBBS చదివి UK లో ఉద్యోగం చేయబోతున్న వాడివి. అమ్మాయా మంచి కళ గల పిల్లే అయినా నిజానికి రంగు నలుపే, పైగా పది వరకే చదివింది. కట్నం వద్దని కరాఖండిగా చెప్పావు. ఇంకెందుకు వద్దంటారు?" అమ్మ తర్కం. "అవునురా నాకు కూడా సెటిల్ అయిపోయిందనే అనిపిస్తోంది." చెల్లి అనింది. వాళ్ల మాటలు వింటూ కూర్చున్న నేను మనసులో వేయి దేవుళ్ళని మొక్కాను వారి మాటలు నిజం కావాలని. భోజనాల తరవాత ఎవరి ఆలోచనలలో వారు పడ్డాము. నా మనసు గత మూడు సంవత్సరాల నా జీవితాన్ని నెమరు వేయ సాగింది.
---------------------XXXXXXXXXXXXXX---------------------
మూడేళ్ళ క్రితం నా మొదటి చెల్లి పెళ్ళిలో మొదలయింది నా ప్రేమ కథ. అది పెళ్ళికి ముందు రోజు. నాన్న నన్ను మగ పెళ్లి వారి వసతులు చూడటానికి incharge గా వేయటంతో నేను మొత్తం సమయం మగ పెళ్లి వారి విదిదిలోనే గడుపుతున్నాను. వారిని రైల్వే స్టేషన్ నుంచి తీసుకు రావటం, విడిదికి తీసుకెళ్ళటం, వారికి కావాల్సిన వస్తువులు అమర్చటం లాంటి పనులతో ఊపిరి తిరగనీకుండా పని. అవును మరి పెళ్లి కొడుకు గారి బట్టల ఇస్త్రీ దగ్గర నుంచి వారి బామ్మ గారి హార్లిక్స్ వరకు చూసుకోవటం అంటే మాటలు కాదండి. అడిచేసిన వారికి మాత్రమె తెలుస్తుంది ఎంత కష్టమో.
సాయంత్రం చిన్న చెల్లి వచ్చి "చేసింది చాల్లే కాని ఇక పద. ఇక్కడ పనులు అన్నయ్య చూసుకుంటాడు. నువ్వు త్వరగా తయారవు" అని నన్ను మా విడిదికి తీసుకొని పోయింది, మా పెద్దమ్మ కోడిక్కి నా భాద్యతలు అప్పగించి.
"ఇప్పుడేం తొందర వచ్చిందని నన్ను తయారవమని అంటున్నావు? అక్కడ పనులు ఇంకా ఉన్నాయి" చెల్లి మీద చిన్నగా విసుక్కున్నా. అది నవ్వి "ఒరే నువ్వు MBBS ఫైనల్కు వచ్చావన్న మాటే కాని ఉత్త మొద్దువిరా. ఇంకో గంటలో ఎదురుకోళ్ళు మొదలవుతాయి అని మరచి పోయావా? పో ముందు పూయి స్నానం చేసి రా" అని నన్ను బాత్రూంలోకి తోసింది. "అవునే నేను మరిచే పోయాను" అని స్నానం చేయటం మొదలెట్టా.
మాఘ మాసంలో సాయంత్రం పూట మరగ కాగిన నీళ్ళతో స్నానం చేస్తుంటే ప్రాణం లేచొచ్చింది. అలవాటు ప్రకారం చిన్న కూని రాగం తీయటం మొదలెట్టా నా గార్ధభ స్వరంతో. "ఒరే మగ పెళ్లి వారి విడిది పక్కనే. నీ రాగాలతో వారిని బెదర కొట్టకు" అని అమ్మ మొదలెట్టింది. అంతే ఫక్కుమని నవ్వు వినిపించింది. ఎవరిదో అపరిచిత స్వరం నవ్వి నవ రత్నాలు రాల్చేసి "పర్వలేదండి. ఇప్పుడు ఒకే. తాళి కట్టే టప్పుడు మాత్రం పాడకుండా చూడండి, చాలు. ఎంతైనా పెళ్లి కూతురు అన్నా గారు కదా భరించాలి మా అన్నయ్య, తప్పదు" అని చమత్కరించటం విన్నాను.
ఎవరా అని టవల్ కట్టుకొని బయటకు వచ్చి చూడగా ముదురు నస్యం రంగు పట్టు చీర కొంగు రెపరెపలు తప్ప ఇంకేం కనపడలా. "ఎవరే అది నా మీద జోక్స్ వేస్తున్నారు?" చెల్లిని అడిగాను. "కాబోయే బావగారి చెల్లెలి వరస ఆటరా. ఇంకొన్ని ఆకులు కావాలని చెప్పటానికి వచ్చింది" అమ్మ చెప్పింది. "అమ్మా, నువ్వు కూడా ఏంటే బయట వారి ఎదుట అన్నయ్యను అలా అంటావు" అని అమ్మను కసిరి " ఇదిగోరా కొత్త బట్టలు, ఇవి వేస్కో." అని నాకు నా బట్టలు ఇచ్చింది నా చిన్న చెల్లి. నా మీద ఈగ రాలనివ్వని బంగారు తల్లి.
అందరం తయారయి విడిది ముందున్న హాలులో వచ్చి కూర్చున్నాము. నా పెద్ద చెల్లి పట్టు చీరలో లక్ష్మీ దేవిలా ఉంది. మేమందరం ఎదురు చూస్తుంటే ఒక అరగంట తరవాత మెల్లగా వచ్చారు మగ పెళ్లి వారు. ముందు వరసలో బావగారు మెరిసిపోతున్నారు గ్రే కలర్ సూట్లో. అసలే మంచి రంగు. పైగా పెళ్లి కొడుకు అలంకరణ ఎంతొ బావున్నారు. పెద్ద చెల్లి ఒక సారి చూసి మేము ఆట పట్టించటంతో చూడటం ఆపేసింది పాపం.
బావ గారి పక్కన ఒక వైపు వారి సొంతం చెల్లెలు , ఇంకో వైపు ఇందాక కనపడిన నస్యం రంగు పట్టు చీర కట్టుకున్న అమ్మాయి ఇద్దరూ హారతులు పట్టుకొని వస్తున్నారు. మేము అందరం లేచి నిల్చుని రెడీగా ఉన్నాం. ఒక పది అడుగుల దూరంలో ఆగి పోయారు మగ పెళ్లి వారు. "అదేంటీ ఆగి పోయారు?" చిన్నగా అడిగా నా చిన్న చెల్లిని.
అది నుదురు కొట్టుకొని "వెధవ అదేరా ఎదురుకోళ్లు అంటే. ఇప్పుడు ఈ పది అడుగుల దూరం తగ్గటానికి ఎవరు ఎక్కువ అడుగులు వేస్తే వారికి పెళ్లి అంటే అంత తొందర ఉన్నట్టనమాట. అందుకే పెళ్లి కొడుకు, పెళ్లి కూతురు ఇద్దరూ ముందుకు కదలరు. మనం అందరం వెళ్లి అవతల వైపు వారితో ఎక్కువ అడుగులు వీయించతానికి ప్రయత్నం చేస్తాము. వారు మన అమ్మాయిని అదే విధంగా ప్రోత్సహిస్తారు. చివరికి దగ్గరగా వచినా ఎవరు ముందు దండ వేయాలి అన్న దాని దగ్గర పోటి. చివరికి దండ వేసేటప్పుడు కూడా ఆయన అందకుండా నిటారుగా నుంచోడం, మనం మన పిల్లను ఎత్తుకొని వేయించటం , తరవాత అంతా ఇద్దరిని ఆట పట్టించటం ఇది ఎదురుకోళ్ళలో ఉన్న సరదా" వివరించింది.
"నిజంగా నేను వెధవనే. చదువు చదువు అంటూ ఏ పెళ్ళికి పోక పోవటం నా తప్పే" అనుకుంటూ నేను, అన్నయ్యా, పెద్ద నాన్న ముందుకు కదిలాం పెళ్లి కొడుకును ముందుకు రమ్మని ఆహ్వానిస్తూ. అవతలి వైపు నుంచి బావగారి సొంత చెల్లెలు తమ్ముడు , ఆ నస్యం రంగు పట్టు చీర అమ్మాయి నా చెల్లి వద్దకు వచ్చి హాస్యలాడటం మొదలెట్టారు. ఇలా చాలా వేడుకగా జరిగింది ఆ సంబరం. చివరికి బావ గారు "ఇంక చాల్లెండి" అంటూ తనే వచ్చి చెల్లి మెడలో మాల వేయగానే అందరం పెద్ద పెట్టున నవ్వుకున్నాం. మేమందరం మేమే గెలిచాం అన్నట్టు వారి వైపు చూస్తే ఆ నస్యం రంగు చీర అమ్మాయి ఒక మంచి నవ్వు నవ్వేసి వెళ్లి పోయింది. "అమ్మాయి నలుపైనా ఎంత కళగా ఉంది, ఎంత బావుంది ఆ నవ్వు" అని అనుకున్నా.
తరవాత ఇక ఎక్కువగా కనపడలేదు ఆ అమ్మాయి. మరుసటి రోజు తెల్ల వారు ఝామున రెండు గంటలకు ముహూర్తం. అందుకని నేను, అన్నయ్య నిద్ర పోకుండా పెళ్లి పనులు చూడ సాగాము. అర్ధ రాత్రి మగ పెళ్లి వారికి వీడి నీళ్లు పెట్టించి వస్తున్నపుడు మాత్రం ఇలా కనపడి అలా మాయమయింది. పాపం తను కూడా నిద్ర పోనట్టు ఉంది. అలసటతో వడలిపోయి ఉంది మొహం. అయినా ఆ అలసటలో కూడా ఎంతొ అందంగా కనపడింది. "ఆ ఆ కనపడుతుంది కనపడుతుంది. ఎందుకు కనపడదు. మగ బుద్ధి పోనిచ్చావు కాదు " అని మనసు కసరడంతో ఆ విషయం వదిలేసి పనులలో పడ్డాను. కాని బావగారి అసలు చెల్లి ముసుగు పెట్టినిద్ర పోతుంటే ఈ అమ్మాయి పనులు చక్క పెట్టటం చూసి "పనిమంతురాలే" అని అనుకోకుండా ఉండ లేక పోయా.
ఇక పెళ్లి యధావిధిగా జరిగి పోయింది. అప్పగింతలప్పుడు మా అందరితో పాటు ఆ అమ్మాయి కను కొలకల్లో కూడా చిన్నగా తడి మెరవటం ఆశ్చర్యంతో పాటు ఆనందం కలిగించింది. అవును మరి సున్నిత మనస్కులకు అవతలి వారి కష్టం కూడా కళ్లు చేమర్చుతాయి కదా. తర్వాత చెల్లిని అత్తవారింట్లో వదిలి రావటం, నేను నా దైనందిన జీవితంలో పడటం జరిగినా అపుడపుడూ ఆ అమ్మాయి నాకు గుర్తుకు వచ్చేది. అమ్మాయి పేరు ప్రియ అని తరవాత తెలిసినా నాకు మాత్రం తను నస్యం రంగు పట్టు చీర పిల్ల గానే గుర్తు.
-----------------XXXXXXX---------------------
( ఇంకా ఉంది )
It is an excellent piece of work. please visit our blog http://beyondindia-telugu.blogspot.com
ReplyDelete