Sunday, 14 September 2008

సీత నవ్వు.....


అందరున్న వేళ,
ఉత్సాహమురకలేయ
స్ఫందిన మనసిలా
జాలువార్చే మాట......

"చూసానీవేళ
అద్భుత దృశ్యమిలా......
సన్నని పరదా మాటున
దాగిన అందమిల మిల.


గుండ్రంగా, తెల్లగా ....
మధ్యనుండిన
మచ్చలెవా? అనిపించేలా...
అందంగా మిల మిలా.....

అర్థమయిందిలా.....
కనీ కనపడనిదే
నిజమైన అందమెలా
అయిందనే విషయమంతా"


సాగుతున్న రసఝరిలొ
పానకంలో పుడకలా
వినపడింది చిన్నగా
"వెధవ, నీ కళ్లు పేలా "

ఎవరాయని చూడగా .......
కాన వచ్చే"ఘన" చందనాంగన.
సర్దుకుంటూ పయ్యెద,
నా వంక కోపంగా చూడగా.


గతుక్కుమని చూపులు తిప్పానా......
కాన వచ్చేనింకో ఇందువదన.
"నాకు మచ్చల్లేవు చూసుకో" అన్నట్టు
తప్పిస్తూ తన మేలి ముసుగు కొంత.

ఇంతలొ ఫక్కుమని నవ్వు విన
చూసానటు పక్కన-
ఓ కోమల కమల నయన
చల్లని చిరునవ్వున.

"ఎందుకా నవ్వ"ని నేననగా
పక్కకు జరిగి చూపే గగనమలా....
జలతారు పరదా జరిపి
మేడ మీది కిటికీగుండా.

"మేఘము కప్పిన చందమామ-
మీరు చేసిన ఆ వర్ణనంత,
అవునా?" అంటూ కోయిల స్వరాన
అసలు గుట్టు విప్పెనిలా.


చల్లని పిల్లతెమ్మెరకో...
చక్కని చుక్క నవ్వుకో...
ఎందుకో తెలీదు కాని,
శరీరమంతా చిన్న పులకింత.

"అవున"ని తల ఊపి
ముందుకు కదిలినా....
రమణీయ సంఘటనంతా
మదిన పదిల పరిచినా.

కారులో వెళ్తూ చూసిన అందమైన చందమామ స్ఫూర్తిగా వచ్చిన చిన్న చిలిపి ఊహకు అక్షర రూపమీ కవిత.

"ఒకానొక పార్టీలో, నేను నాకు నచ్చిన దృశ్యాన్ని వర్ణిస్తూంటే, అక్కడున్న ముగ్గురు పడతలు ఆ నిగూఢ వర్ణనను వివిధాలుగా అన్వయించుకోవటం జరిగితే ఎలా ఉంటుంది" అని ఊహించి రాసినది ఇది.
అలనాటి రాజ్యాభిషేక సమయమున "సీతమ్మ వారి నవ్వును " రామ, లక్ష్మణ, సుగ్రీవ, హనుమంతాదులు తమ అవస్థలు చూసే ఆ నవ్వు అని తమకు వివిధాలుగా అన్వయించుకోవటం తలపించింది ఈ ఇతివృత్తం-అందుకనే ఈ శీర్షిక.

No comments:

Post a Comment