పండిత పామర జనరంజకంగా పాట రాయగలగటం అనేది పుట్టుకతో వస్తుందో, సాధనతో వస్తుందో నాకు తెలీని విషయం కాని, ఎలా అబ్బినా ఆ మెళకువ వచ్చిన కవి జన్మ సార్థకమయినట్టే అని నా భావన. సీతారామ శాస్త్రి గారు అలా పండిత పామర జనరంజకంగా పాటలు రాయటంలో దిట్ట అనేది జగమెరిగిన సత్యమే కదా. అయినా, ఆయన కవితా పాటవం ప్రత్యక్షమైన ప్రతీసారీ అబ్బురపడవలసే వస్తోంది.
చాలా రోజుల కిందట ఎపుడో, శాస్త్రి గారి పాటలకు, ఆయన మాటల్లోనే రాసిన భాష్యం ఎక్కడో చదివాను. నేను ఆనుకున్న భావానికీ, ఆయన భాష్యానికీ పొంతన కుదరకపోవటం, ఆయన చెప్పిన భాష్యం నేను చెప్పుకున్న భాష్యం ఇచ్చినంతగా ఆనందం ఇవ్వకపోవటం చేత అటు తరవాత ఆయన స్వభాష్యాలు చదవటం మానేసాను. (ఎంత అహం, స్వార్థమో కదా!) అయితే నేను ఇంతవరకు ఏమి కోల్పోతూ వచ్చానో అన్నది ఇవాళ అనుకోకుండా "చక్రం" చిత్ర రూప కల్పనకు ప్రేరణ అయిన "జగమంత కుటుంబం నాది" అనే కవితకు కవి స్వభాష్యం విన్న తరువాత అర్థమయింది.
శాస్త్రి గారు తన భాష్యంలో పండిత పామర భేదం లేదన్నా, వారి భావంతో నేను విభేదిస్తూ ఇక్కడ వారిరువురినీ నేను విడిగానే ఉటంకిస్తాను. ఈ పండిత పామర విభేదంపై నేను ఇంకా రాయాల్సినది ఉంది. అది ప్రస్తుతం అప్రస్తుతం. ఈ కవితకు నేను చెప్పుకున్న భాష్యం, శాస్త్రి గారు చెప్పిన భాష్యం రెండూ చూస్తె, ఈ పండిత-పామర తారతమ్యం ఇంకా స్ఫష్టమవుతుంది.
తన భాష్యంలో కవి ఒక మాట చెప్తారు-సోదాహరణంగా. "ఏ పాటనైనా ముందర జనం అనుభవిస్తారు, దానికి అర్థం అవసరం లేదు" అని. అందుకు ఉదాహరణగా తన మొదటి సినీ పాటను చెపుతారు. మిగితా వారి విషయం ఏమో కాని నా మటుకు నాకు నిజంగా ఇది స్వానుభవం. "ప్రాక్దిశ వీణియ పైన, దినకర మయూఖ తంత్రుల పైనా.... " అన్నా సాహిత్యాన్ని అర్థం చేసుకొనే భాషా ప్రావీణ్యతా, భావ ....... (మేచురితీ ని మాతృ భాషలో ఏమనాలో తట్టటం లేదు-ఎంత దురదృష్టం.) నాకు ఆ చిత్రం విడుదలైన రోజుల్లో లేదని ఖచ్చితంగా చెప్పగలను. (ఇప్పటికీ ఉందొ లేదో అన్నది కూడా అనుమానమే!) కాని విన్న మరుక్షణం పరవశుడిని చేసిందన మాట మాత్రం పచ్చి నిజం.
ఇక విషయానికి వస్తే "జగమంత కుటుంబం నాది" అన్న ఈ పాటకు నేను చేపుకున్న భాష్యం చాలా "కాంక్రీట్ థింకింగ్" అన్న విషయం శాస్త్రి గారి భాష్యం అర్థం అయింది. ఆయన భాష్యం మొత్తంలో నేను ఇంటికి తీసుకెళ్తున్న విషయాలు ఇవీ
౧. కవి తన కవితకు తనదైన భాష్యం చెప్పటం చాలా అవసరం.
౨. రచనపై వచ్చే విమర్శలు చాలా వరకు కవి కోసం, పాఠకుల కోసం కొంచమే.
౩. స్ఫష్టంగా కనపడే భావమే కాక నిగూఢ భావాలను వెతకటం అలవాటు చేసుకోవాలి కవితానుభవ సారం కావాలంటే.
౪. మనకు కలిగే భావావేశాలు ఇతరుల వలన కావు, మన ఆలోచనల ప్రతి రూపాలే అవి.
ప్రతి సంఘటనకు ప్రతి ఒక్కరూ ఒక్కొక్క భాష్యం చెప్పుకుంటారు, ఇతరుల భాష్యం అవసరం అనవసరం అని తెలిసినా, "స్ఫందించిన ప్రతీ క్షణాన్నీ, కరిగిపోకుండా చేయటం కోసం తెల్ల పుటలపై నల్ల సిరాతో ఆజ్యం పోస్తూ, ఆలొచనల హవిస్సుని ప్రజ్వలింప చెసే వాడే రచియత" అని స్వాతిశయంగా నాకు నేనే చెప్పుకుంటూ నాలో కలిగిన భావాలను ఇక్కడ ఇలా కేలికేసాను.
ఇక నా సోది ఆపేస్తాను, శాస్త్రి గారి ప్రసంగాన్ని చూసి ఆనందించండి.
No comments:
Post a Comment