Friday, 5 December 2008

Road Kill


శశాంక విహిత నిశి
విరహిణియై, శోక హృదయై
అబంధ ఛాయా వేణీ ధారిణియై
జగమును నిశ్శబ్ద కౌగిట బిగిచె.


నిర్మానుష్య రహదారి
అచలిత పయనమాపకనే
జరగబోవు ఘోరమునకు
మూగ సాక్షిగా నిలిచె.


దినకర ద్వయ చక్షుధారి
వికటాట్టహాస అహంకారి
భీకర శకట పద ఘట్టనమున
ప్రాణి జీవములే హరి.


ఏమిటీ ఘోర కలి?
సహచరి ముంగిట
రూపు రేఖ విలాసముల్బాసి
విగత జీవియయ్యె శశము


ప్రియుని చేరబోయిన
శకట మూకలున్ కోరలు జూపె
ప్రతి రాకాసి శకట పోకడతో
అనుంగుడు అనంగుడు కాబట్టె.


చెలి దుఖాశ్రువులకు కరిగి
దినకరుడెగబాకే గగనముపై
వేడి నిట్టూర్పులు
శరీర చేతనమీయ.


ఇన మయూఖ స్పర్శ
సుషుప్త సమాప్తము సేయ
తరచి చూచిన అర్ధ భాగుని
స్థితియే అర్థమవదాయే


"ఏదీ ఆ తుషార జిత ధవళ వర్ణము
ఏదీ ఆ సుందర ముఖ మండలము
ఏదీ ఏదీ కానరాదే
నా ప్రియుని చిహ్నమొకటియు"


యని వగచు సతిని చూచి
ముఖము జెల్లక దినపతియు
మబ్బుల మాటున దాగె
తప్త హృదయ తపన జూచి
పవనుడాపె చలనము
కరిగి కురిసె వరుణుడు
పొంగి పొరలెనీ వాక్యముల్
జూచినచట నేనొక "రోడ్ కిల్"

Image taken, with thanks, from http://madscottsman.files.wordpress.com/2008/02/rabbit-roadkill.jpg
All copy rights of image belong to that website

1 comment:

  1. మెచ్చిన మిత్రులకు అభినందనలు.

    ReplyDelete