"జాజుల జావళి" వర్గపు పేరు చూడగానే ఆకట్టుకుంది. ఆఘ్రాణిద్దును కదా సువాసనలే కాక షడ్రుచులు, సప్త వర్ణాలు అన్నీ అవగతమయ్యాయి. భావుకత "మానస వీణ" తీవెలు మీటగా జీవిత గమనంలోని ఆరోహ అవరోహాలు సప్తస్వర సమ్మేళనంగా విందు చేసాయి. నేను పొందిన ఆ అనుభూతులను పంచుకోడానికి నా చేతనయినంతలో ఒక చిన్న సమీక్ష నిషిగంధగారి "జాజుల జావళి" పై. సంవత్సరమున్నర కాలంలో ఇరువయ్యారు జాజుల పూయించిన ఈ జావళి ఇలాగె అనంతంగా, రసభరితంగా సాగాలని కోరుకొంటూ కవయిత్రికి శుభాభినందనలు.
నిజం చెప్పాలంటే నన్ను ఈ బ్లాగుకు మొదట కట్టిపడేసినవి ఈ జావళులు కాదు.... "పయనమయే ప్రియతమా" అన్న చిన్ని ఒక పేజి కథలోని ప్రథమ వాక్యం చేసిందా పని ...మీరే చూడండి "వర్షం ఇంకాస్త పెద్దదయింది.....స్వామివారిది అయిపొయింది, ఇప్పుడు మా వంతంటూ గుడి మెట్లు తృప్తిగా అభిషేకం చేయించుకుంటున్నాయి" అన్న ఈ పరిచయ వాక్యాలలోని భావుకత ఎంత అనిర్వచనీయమో. అప్పటి నుంచి అనుకుంటున్నా, కవితలన్నీ ఒక రోజు తీరిగ్గా ఆస్వాదించాలని. ఈ రోజు ఆస్వాదించిన తరవాత చిన్న వ్యాఖ్య రాసి ఊరుకోబుద్ది కాలేదు. నాకు నచ్చితే స్ఫందిస్తాను కాబట్టి నాకు నచ్చిన విషయాలు ముచ్చటిస్తాను. ప్రొఫెషనల్ సమీక్షకుడిని కాదు కాబట్టి బ్యాలన్స్డ్ సమీక్ష ఆశించేవారికి నిరాశే మిగలవచ్చని ముందే చిన్న హెచ్చరిక.
పేరులో ఏముంది?
అమ్మమ్మా అలా తీసి పారేయకండి. అసలు కవితలేమేమి ఉన్నాయా అని పేర్లు చూద్దును కదా, పేర్లతోనే నిషిగంధగారు ఎంత పరిచయం చేసుకున్నారని తన గురించి. నాకు అర్థమయిందేమంటే ఈ జాజులన్నీ "సహచర్యం" కోసం తపించేవే, "సహచర్యం" అస్వాదించేవే। కావలిస్తే చూడండి, ఇరవయ్యారులో కవితలలో "కౌముది, ఉయ్యాల, నందివర్ధనాలు, చంద్రోదయం, వాన వెలిసిన వేకువ, ఆశాకిరణం, ఆశా కుసుమం" అన్న ఏడు కవితలు తప్పితే (నిజం చెప్పాలంటే ఇవన్నీ కూడా ప్రకృతి సహచర్యమే కదా) మిగితావన్నీ సహచర్యానుభూతులే ...... "ఏకాంత వేళ"లోని "వంటరి రహస్యాలు"....... "ఏకాంత యామిని"ని "అలిగితివా" అని పలుకరింపులు...... ""ఏకాంతార్ణవం" లోని "నిరీక్షణ "....... "నీ రాక కోసమై" "ఊహా సుందరి" "నగల పెట్టి" తెరిచి సర్వాభరణభూషితయై "ఆనతి నీయరా" "అడుగులో అడుగునై" మనియెదా అని "ప్రియమైన శత్రువు" "తొలి స్పర్స" కై కన్న "నిన్నటి స్వప్నం"........
ఓహ్ ......నిజంగా ఎంత బావున్నాయో। తొమ్మిదో తరగతిలో ఒక పాఠము తప్పితే శ్రీనాధ శృంగార రచనలు ఇంతవరకు పరిచయం లేనందు వల్ల అచ్చ తెలుగులో (నాకర్థం అయ్యే తెలుగు అని అన్వయించుకోండి) ఆయన రచనలు ఇలాటి అనుభూతులే రేపుతాయేమో అన్న అతిశాయోక్త్యాలోచన వచ్చిన మాట నిజం.
ఉత్త "పేరు" గొప్పేనా, అసలు విషయం ఏమన్నా......
అంత సందేహమక్కరలేదు. విషయమింకా చాలా ఉంది. కవితా వస్తువులు తరచి చూద్దును కదా రెండు ముక్కల్లో చెప్పేయొచ్చు అనిపించింది......"ప్రకృతి", "పురుషుడు" అనీ...... "నానిగాడు" "బంగారు తల్లీ" తప్పితే మిగితావన్నీ ఈ రెండు కోవలలో ఏదో ఒకదానికి చెందినవే. "రెండు విషయాలే కదా" అని తొందరపడి చప్పరించేసారంటే నోట్లో ఉప్పుగల్ల వేసుకొన్నంత తప్పే.......నింపాదిగా రుచి చూసారా, ఘన షడ్రసోపేతమే.
ఈ రెండూ పైకి కనపడే కథా వస్తువులయితే అంతర్లీనంగా ఒకే ఒక రసానుభూతి....అదే ప్రధమ (శృంగార) రసాస్వాదన....ఒకొక్క జాజి పువ్వూ శృంగారరస రైకలు తొడిగిన కవితా కన్యకలే। బ్లాగుల్లో శృంగార రసాన్ని ఇంత బాగా, ధైర్యంగా పండించిన రచయిత్రులే కాదు రచయితలను కూడా నేను చూడలేదు। (నేను అన్నీ చూసాను అని అనట్లేదండోయ్---చెప్పాగా నా అనుభవ చట్రం వరకే పరిమితం ఈ సమీక్ష అనీ) అంతర్జాలంలో మామూలుగా "పోర్న్ సైట్లకే" పరిమితమై భ్రష్టు పట్టిన శృంగార రసం, ఇలా బ్లాగ్జన బాహుళ్యం మోద భరితమై చప్పట్లు కొట్టగా కవన సింహాసనం అధిరోహించటం నిజంగా హర్షణీయం। అందుకు కారణమైన రచయిత్రి ధైర్యం నిజంగా ప్రోత్సహనీయం। "కీప్ ఇట్ అప్" నిషిగంధ గారు.
నాలుగవదీ, ఆఖరుదీ అయిన కవితా వస్తువు "ఏకాంతం". ఇది నా ఊహో లేక నిజమో తెలీదు కాని కవితల నిండా నాకు ఏకాంతమే కనిపిస్తోంది। భరించరాని ఏకాంతం। "సామీప్యానికీ - సహచర్యానికీ" ఉన్న ఆ తేడా తెలియచేసేంత ఏకాంతం. అది రచయిత్రి ఊహించినదో, అనుభవించినదో తెలీదు కానీ భావుకత నిండిన మనసు కఠినమైన ఏకాంతానికి స్ఫందించిన ఛాయలు ప్రతి కవితలోనూ సుస్ఫష్టంగాను-అస్ఫష్టంగానూ కనిపిస్తాయి. ఎవరో వ్యాఖ్యాత అన్నట్టు "If this is true in someone's life, they need to work on it. This kind of feeling will make a person very depressed and has the potential to take away few years of his/her life.
If this is not true in someone's life, they are lucky and they should consider that they are blessed by god and MUST make all efforts to keep it going." ఎంత గొప్ప వ్యాఖ్య.....అనామక వ్యాఖ్యాతకు ధన్యవాదాలు.
ఈ నాలుగు కవితా వస్తువుల గూర్చి ఇంకా విపులంగా తరవాయి భాగంలో.
సమీక్ష బాగా రాస్తున్నారండీ...
ReplyDelete