
"మరింత డబ్బెలా వదిలెల్తారు?"
రాబోయే సంపాదన
తాయిలంలా చూపెడుతూ……..
స్నేహితురాలి ప్రశ్న.
"డబ్బెనక పరుగు చాలైంది"
మాత్రం చెప్ప గలిగా అప్పటికి,
తరచి చూద్దును కదా
కారణాలు ఎన్నో....
సీత నవ్వుకులా , కర్ణుని చావుకులా!
నే పుట్టిన దేశం నాది
నా రేపటి తరానిది కాదది,
రేపటి తరానికి
నా తనం తమ తనం కాదుగా
నాకొక్కడికే తెలుసు
నా తనానికి నేనెంతటి బానిసనో!!
రేపటి తరానికీ నా తనానికీ
తప్పని రేపటి యుద్దంలో
ఒక బంటును తప్పించటానికే
ఇప్పటి నా ఎత్తు ఇది.
రిటారిక్కే అయినా
“సమాజపు అప్పు తీర్చడానికై వెళ్తున్నా”
అని చెప్పుకుంటున్నా.
వివేకం తన పని తానూ చేస్తున్నా,
"నువ్వా - నీ డబ్బా
దేనవసరమెక్కువ నీ సమాజానికీ" అంటున్నా,
"నే చేస్తున్నాను" అన్న ఆత్మ సంతృప్తికై
ఆత్మ వంచన చేస్తూనే ఉన్నా....
కాల మాన పరిస్థితులకు మారలేక
నిన్నటి మాయలోనే బందీనైనా,
ఎప్పటిదో కాలాన్ని తలపోస్తూ
రేపులో దాన్ని వెదుకుతున్నా.
అదే గొప్పనుకుని
"నేనేం మారలేదు"
మంత్రం చదువుతూనే ఉన్నా……
మేమిద్దరం పూయించే
రేపటి చిగుళ్ళకు,
మమ్మల్ని చిగుర్చిన
నిన్నటి వేళ్ళకూ,
మాకై అర్థం లేని పోటీ తప్పించేందుకు
చిగుళ్ళను భూమిలో
పాతిపెట్ట సాహసిస్తున్నా.
సరిగా పెరగకపోతేనో?
మనసు బెంగ పడుతున్నా,
వాట్ యూ డోంట్ నో, డసంట్ హార్ట్ యూ
సర్ది చెప్పుకుంటున్నా……….
నాకిక్కడే సులభమైనా
తనకిక్కడే ఇష్టమయినా
నువ్వక్కడే పదిలమని
నా అక్కడ వాళ్ళన్నా
నాకు నేనిచ్చిన మాటకై
అక్కడికే పయనమవుతున్నా.
నడకయితే మొదలయింది
గమ్యం ఎక్కడో, ఎప్పుడో…………………….
మజిలీ ఇక్కడో, అక్కడో……………………
అబ్బ...అంతు చిక్కనిదీ పయనం .
Image is from www.pbase.com/msduncan/image/46018317 and all copyrights belong to them.
No comments:
Post a Comment