నాన్నాఇప్పుడే ఏదో బ్లాగులో సఖి పాటల నోస్టాల్జియా టపా ఒకటి చదువుతుంటే మీరు గుర్తొచ్చారు. ఇందాకటి మన సంభాషణ గుర్తొచ్చింది. ఒకప్పటి "మన" రోజులు గుర్తొచ్చాయి.
మీ మొదటి స్మృతి నా మదిలో నేను మొదటి సారి ఇంటినుంచి పారిపోయినప్పటిది! లారీల హేడ్లైట్లు కళ్ళలో కొడుతుంటే ఎవరో పక్కకు లాగిన గుర్తు లీలగా మాత్రం ఉంది. "రెండేళ్ళ పసివాడివి అప్పుడు నువ్వు "ఎక్కడకేల్లావురా?" అంటే "తీతం తాగటానికి పోయ్యా తీతం" అంటూ చెప్పావురా అని నవ్వుతూ ఇప్పుడు చెప్పగలరేమో కాని ఆనాడు నేను కనపడని ఆ మూడు నాలుగు గంటలు మీరెంతగా నలిగుంటారో........
అదే ఇంట్లో...అదే "భవాని భవన్లో" కదూ చెల్లి ఇల్లుగల వారింట్లో కిచెన్ అరుగు కింద కూర్చుని ఏదో తింటే "నాన్నా పప్పీ రెడ్డి అంకుల్ వాళ్ళింట్లో తింటోంది" అని నేను మీకు పితూరీలు చెప్పింది? అదే ఇంట్లోనే కదూ పొద్దునే భవానీ బుక్ స్టాల్లో పాలతో పాటు చందమామ కొని తెచ్చుకుంటూ ఇంటికి వస్తుంటే రెడ్డి అంకుల్ తన కుక్కతో మార్నింగ్ వాక్ నుంచి వస్తూ మనకు ఎదురు పడేది? పక్కన అద్దెకున్న తాతగారు బట్టలుతుకుతుంటే "తాతగారు, బామ్మగారి
గుద్దలు కూడా మీరే ఉతుకుతున్నారా" అని వచ్చీరానీ నా మాటలకు అందరూ పడీ పడీ నవ్వుతున్నారని కూర్చోపెట్టి um bre llaa అంటూ ధ్వనిని పట్టి స్పెల్లిన్గూ స్పెల్లింగుని పట్టి ధ్వనీ పట్టుకొవతమేలానో నేర్పించింది? రెండేళ్ళు వచ్చేప్పటికే "లీఫ్, స్టెం, రూట్" అంటూ అన్నీ చెప్పే వాడివిరా అని మీరు ఇప్పటికీ గర్వంగా చెప్పుకునేది కూడా ఆ ఇంట్లోని జ్ఞాపకమే కదూ?
తరవాత నల్లకుంటలోని ఇల్లు. అందులో ఎందుకో మీవి ఎక్కువ జ్ఞాపకాలు లేవు నాన్నా. ఒకటి మాత్రం బాగా గుర్తుండి. పాపం పోకపోక మమ్మల్ని ముగ్గురినీ ఇంట్లో వదిలి మీరూ, అమ్మా సెకండ్ షో కి వెళుతూ అన్నయ్య బేబీ సిట్టిన్గ్లో పెట్టి వెళితే వాడు మీరటు వెళ్ళంగానే మాకు చెప్పటం మీరు ఇద్దరూ వచ్చేప్పటికి ఆ కామ్పవుండ్లో ఉన్న ఏడు కుటుంబాలకూ మీరు సినిమాకు వెళ్ళిన సంగతి ఏడుపు బాకా ఊది మేము చెప్పటం అయిపోయిందని తెలిసినప్పటి మీ ముఖం :-)
ఆ...మరచిపోయ్యా. ఆ ఇంట్లోనే కదూ ప్రతి వేసవి సెలవుల్లో మనమందరం జమ్బకానా పరుచుకుని మరీ తిష్టేసి పేకాట ఆడింది? డబ్బులు పెట్టి ఆడొద్దని అమ్మంటే పర్లేదు మన ఇంట్లోనే కదా ఉండేవి అని చెప్పి సీసాలో పొదుపు చేస్తున్న అయిదు, పడి, ఇరవై అయిదు పైసలను పెట్టి మరీ ఆడింది ఆ ఇంట్లోనే కదా. రమ్మీ, క్లియరెన్స్ అలా నేర్చుకున్నవే కదూ.
ఎండకాలమంటే గుర్తొచ్చింది కరెంట్ పొతే గ్రిల్ రూమ్లో మేము ముగ్గురం వరుసపెట్టి పడుకుంటే "దీనికి ఒకసారి నిద్రపడితే ఇక పిల్లల సంగతే పట్టదు" అని అంటూ అమ్మను విసుక్కుంటూ మాకు గంటలతరబడి న్యూస్ పేపర్తో గాలి విసిరింది మీరే కదూ? మరలాంటి మీరే ఈరోజు "నువ్విక్కడకు వచ్చి నాకు టీ, భోజనం సప్లై చేస్తూ సేవలు చేస్తే వచ్చే ఆనందం కంటే అక్కడ ఉండి నిన్నలా "నాన్నా చాలా ఆనందంగా ఉంది ఇవాళ. పేషెంట్ కి మనం ఏదో మంచి చేస్తున్నాం అన్న ఫీలింగ్ వస్తే ఎంత బావుంటుందో నాన్నా " అంటూ ఇంకా చాలా చెప్తే బావుంటుంది అని అంటే ఎలా నాన్నా? మన ఆనందంలో మన వారి సౌఖ్యం ఉంటె అది ఇంకా ఎంత బావుంటుందో మీకు తెలీదా?
నల్లకుంట నుంచి రామంతాపూర్ డిసెంబర్లో వెళ్లామని ముగ్గురు పిల్లల్ని రెండు ట్రిప్పులు రోజూ కాలేజికి వెళ్లే ముందే స్కూల్లో డ్రాప్ చేసేవారు. గుర్తుందా నాన్నా మన హీరో మాజేస్టిక్ మోటార్ సైకిల్? చాలా రోజుల తరవాత గుర్తొచ్చింది అది ఇవాళ. ఇవాళ మనం ఏర్పోర్ట్ నుంచి ఇంటికి కారులో పక్క పక్కన కూర్చుని వచ్చినా రానీ ఆ సెన్స్ ఆఫ్ సెక్యూరిటీ మీ వెనకాల ఆ హీరో మెజెస్టిక్ మీద డబుల్స్, త్రిపుల్స్ రైడ్ చేసినప్పుడు ఉండేది.
అదే పంచకల్యాణి మీద మీరు ఆరో తరగతి ప్రవేట్ పరీక్షకు రామంతాపూర్ నుంచి హయత్నగర్ తీసుకెళ్ళి వస్తూ తాగించిన కుండలోని చల్లటి మజ్జిగ రుచి మళ్ళీ ఎక్కడా నాకు దొరకలేదు నాన్నా. మొదటి సారి కొత్తిమీర వేసిన ఆ మజ్జిగ నీళ్ళ మజ్జిగైనా ఇక్కడి ఆన్కేన్ బయోపాట్ గడ్డ పెరుగు రుచిని తలదన్నేట్టుగా ఉండేదని నాకు భలే గుర్తు. నాకు ఇంత చక్కటి జ్ఞాపకం మిగిల్చిన మీకు ఆ పరీక్షల్లో లెక్కల్లో ఇర్వయ్యారు తెచ్చుకుని ఒక్క మార్కుతో బతికి బయటపడి భలే జ్ఞాపకం నేనూ మిగిల్చుంటాను కదూ? ఏమిటో మొదటి నుండీ బట్టీ పట్టె మార్కులు తెచ్చుకోవటంతో లాజిక్కునుపయోగించే లెక్కలు అస్సలు వంటపట్టేది కాదు. మీరు ఎన్ని సార్లు స్పీడ్, డిస్టెన్స్ అని చెపితే మాత్రం ఎక్కేవా? అలాటి లెక్కలను నాకెంతో ప్రియమైన సబ్జెక్టుగా మార్చగలగటం ఒక్క కాలచక్రానికే సాధ్యమయింది.
ఆ రామాంతపూర్లో సాయంకాలం ఆ పిల్ల కాలువ పక్కన, ఇసుక మీద కూర్చుని మీరు చెప్పిన రామాయణ, భారత, భాగవత కథల పర్వం నేను నా పిల్లలతో పునరావృతం చేసుకోగలిగితే నాకు అంతకంటే అదృష్టం ఇంకోటి ఉండదేమో. మీరు అలా కథలు చెపుతుంటే అలా చేతులు ఇసుకల్లో రాస్తుంటే ఇరవై పైసలు దొరికినప్పటి ఆనందం నిజంగా ఇప్పటికీ నాకు గుర్తే. ఇరవై అయిదేళ్ళలో ఎంత మార్పు? నా ఫ్రెండ్ నిన్ననే హైదరాబాద్ వెళ్లోచ్చి "రఘూ నేను అయిదు వందల పచ్చ నోట్ల కట్ట గర్వంగా షాపింగ్ మాలుకు వెళుతూ తీసుకెళితే నాకు సిగ్గోచ్చేలా అందరూ వెయ్యి రూపాయల నోట్ల పింక్ కట్టలు తీసుకొచ్చారు. ఎంత మారిపోయిందో తెలుసా హైదరాబాద్" అనేంత.
సంక్రాంతికి మీరు కొనిచ్చినా గ్రే కలర్ సఫారీ సూట్, కనుమ సాయంత్రం ఆరుకు కూడా చివరి గీటీ మాంజాకు మీరిచ్చిన అయిదు రూపాయలూ, కాలేజీ నుంచి తెచ్చిచ్చిన ట్రెషర్ ఐలాండ్, కొనిచ్చిన సహస్ర శిరచ్చేద అపూర్వ చింతామణి పుస్తకం, అందులోని నర్షి, మహా, శిమ, వాల, యాబ నగరాలూ నిజ్జంగా గుర్తే ఇప్పటికీ.
మ్మ్....సంక్రాంతి అంటే గుర్తొచ్చింది. "వాడు అమ్మాయిలతో తిరిగితే పాడయిపోతాడు, చదువుపోతుంది" అంటూ ఇంటికొచ్చి మరీ నన్ను బయటకు తీసుకెళ్ళే పింకీ, మకరంద్, కిరణ్, హరిప్రియ వాళ్ళను అమ్మతో చెప్పించి మరీ ఇంటికి మరోసారి రాకుండా చేసింది కూడా అక్కడే కదూ? ఏమో ఇలాటివే అనుకుంటా నాన్న ఆడా, మగా అంటూ తేడాలు ఎత్తి చూపించి ఎడం పెంచి మరీ ఆ ఆ ఆకర్షణను మరింత బలం చేసేవి. ఈ ఒక్క దానితో మాత్రం మీతో ఇప్పటికీ ఏకీభవించలేను.
రెండవ సారి కూడా ఏమ్సేట్లో రాంక్ రాలేదని నేను బాధపడకూడదని "రిసల్ట్స్ కోసం చేంతాడంత క్యూ ఉందిరా నుంచునే ఓపిక లేదు అందుకని తీసుకురాలేదు" అని మీరంటే నమ్మేసిన నన్ను మరుసటి రోజు పేపర్లో చూసి "ర్యాంకు పదిహేనొందల చిలుకు నాన్నా" అని మీతో చిన్నబోయిన ముఖంతో చెపితే "అక్కడ దాకా వెళ్లి రాంక్ తెలుసుకుని రాకుండా ఉంటానని నేను చెపితే మాత్రం ఎలా నమ్మావురా" అని మీరన్నప్పుడు నేర్చుకోవాల్సింది ఆలోచించటం అంటే మునుప్పరిచాయ వాక్యాల పునశ్చరణ కాదనీ, సాక్షం లేకపోయినా, వ్యతిరేకంగా సాక్షం ఉన్నా మనసు చెప్పేదే నిజమని అనుకోవటమే నమ్మకమనీ. ఆ రోజే ఆ మాట నేర్చుకోనుంటే ........
But I think I repaid the confidence on the day we celebrated my 199th rank. I certainly remember the happiness on your face. And it is on recollection of these occasions that I wonder why is it that men or precisely ఫతేర్స్, get so short changed by people who write about emotions or mothers. I think that's a necessary cross we men have to bear for being the strong one in the parental pair and playing the part of bad cop to the maternal good cop. It is then that I feel jealous of women.
సంతోషం అంటే గుర్తొచ్చింది. మీరు అమ్మతో "ఏమే నీ కొడుకు ముద్దేట్టాడు" అంటూ మెరిసే కళ్ళతో చెపితే కాని అర్థమవలేదు మీకు ముద్దు పెట్టిన సంగతి. నిజంగా నాకు తెలీదు అప్పటికి నాకు పాటలంటే అంత ఇష్టమని. లేకుంటే ఇంటికి టేప్రికార్డర్ కొని తీసుకొస్తే మీకు ముద్దు పెట్టానంటే నాకు ఇప్పటికీ ఆశ్చర్యమే. As is typical with all male-male relations, we never had any touchy feely kind of రేలషన్శిప్ ఇస్ ఇట్ నాట్?
ఆ టేప్ రికార్డర్లో ముకేష్ పాటలు, రాజ్ కపూర్ సినిమాల్లోటివి వినాలని నేను కిటికీలేసేసి, లైట్లార్పేసి చీకటి గదిలో ఒక్కడినే "దోస్త్ దోస్త్ నా రహా"నో, "కిసీకే ముస్కురాహటోన్ పే హో నిసార్ " అనో పాడుతూ అటూ ఇటూ గంటల తరబడి పచార్లు చేస్తూ ఉంటె మీరు నుదురుకోట్టుకోవటం గుర్తుందా? అయినా తప్పంతా మీదే "మేము ఆ సినిమా టాకీస్ బయట కూర్చుని వినే వాళ్ళంరా" అని "ఏడుకొండలడా వెంకటారమణా" అంటూనో, "సడిసేయకోగాలి సడిసేయబోకే" అంటూనో ఉగ్గుపాలుపోస్తే మరి అలా కాకుండా ఎలా రియాక్టవుతా చెప్పండి ముఖేష్ గొంతులోని విషాదానికి, మజ్రోహ్ సుల్తాన్పురి కలంలోని భావసౌందర్యానికి?
(సశేషం)