ఈ కాలం పెళ్లికూతురు చీని చీనాంబరాల బరువేసుకుని రైలుబండిలో ప్రయాణం చేసి మెట్టినింటికి వస్తుందా?ఈ కాలపు స్త్రీ ఎంత సంగీతాభిమాని అయినా వీధిలో తంబుర పట్టుక్కూర్చున్న వ్యక్తిని "అపర త్యాగబ్రహ్మలా లేరు?" అని ప్రమాణాలు చేస్తుందా? మైకులో వచ్చే పాటకూ వ్యక్తి ప్రత్యక్షంగా పాడితే వచ్చే పాటకూ తేడా తెలీదా? లేకివాడు, భాధ్యతలేని వాడు, దాబ్బు విలువ తెలీని వాడు, పెద్దల పట్ల గౌరవం లేనివాడు, అది ఉన్న వాళ్ళు అస్వతంత్రులు అనుకునే వాడు", అబద్దాలాడే వాడు మొదలయిన సకలగుణాభిరాముడైన భర్తను దారిలో పెట్టటానికి అష్ట కష్టాలనూ ఓర్చే వ్యక్తి, సంగీతాభిమానంలో అంతస్తుల తారతమ్యం చూడని వ్యక్తిత్వం - ప్రేమలో ఇంత గుడ్డిదైపోతుందా? లేక పెళ్ళయిన తరవాత మార్చుకుంటానులే అన్న ధీమానో, ఆహామోనో, నమ్మకమోనోనా?
ఈ ప్రశ్నలన్నీ ఇందు వ్యక్తిత్వాన్ని, జీవితపు మలుపలనూ చూస్తె నాకు తలెత్తిన ప్రశ్నలు. ఎనిమిది దశకాలు దాటిన సూత్రధారి వృద్ధ మస్తిష్కం శరీరం సమానంగా మందగతి పట్టిందా, మందబుద్ది అయ్యిందా అన్నది వీటిని సమూలీకరించే ప్రశ్న.
ఈ ప్రశ్న వేసుకున్న మరుక్షణం నాకు నా మిత్రుడితో ఎప్పుడో జరిగిన చిన్న సంవాదం జ్ఞప్తికి వచ్చింది. "ఈ సాయిలనీ, బాబాలనీ, అమ్మలనీ, ఆనందమయిలనీ...ఇలా ప్రజలను మోసగిస్తూ బహుపట్టంగా పబ్బం గట్టుకుంటున్న వీరి వలన ఏం ప్రయోజనం వీరూ" అంటే "ఏదో ఒక ప్రయోజనం ఉండే ఉంటుంది రఘూ. నీవు ఆలోచించే "అసలైన భక్తి, అసలయిన గురువు, అసలైన ప్రవచనం" అనేటివి అవసరమే కాదనను కాని వీరి వల్ల ప్రజలకు మంచి జరగట్లేదనుకోవటం పొరబాటు. ప్రజలకు, ఎవరి స్థాయిలో వారికి, ఈ బాబాలు మొదలగు వారి వల్ల ఆలంబన దొరుకుతుంది. నువ్వు తపనపడేలా ఉండాల్సిన గురువులు అంతగా ఆ విషయ సాధనకై ప్రయత్నించే శిష్యులకు ఎక్కడో అక్కడ, ఎప్పుడో అప్పుడు తారస పడుతూనే ఉంటారు. కాని సామాన్య జనానీకానికీ ఒక ఆలంబన అవసరం కదా దైనందిన జీవితంలో. ఆ అవసరాన్ని తీర్చే వారే ఈ గురువులూ, అమ్మలూ. ఇక్కడ వారి వలన ఒనగూడే ప్రయోజనం జనానికి ఒక స్థిరమైన నమ్మకం కలగటమే. ఆ నమ్మకం పునాదిపైనే వారి వారి జీవన గతిని కొంతైనా సక్రమించుకుంటారు. అందులో తప్పేముంది?" అంటూ జరిగిన సంభాషణ నాకు ఈ ప్రశ్ననుగతంగా గుర్తురావటం యాదృచ్చికమేమీ కాదు.
If we disrobe ourselves of this emperor's robe called the Prominence of self, we are all "ordinary" people in many senses.అలా సామాన్య జీవన పాత్రదారిగా "కాశీనాధుడిలా చెప్పాడంటే ఏదో కొంత విషయం ఉండే ఉంటుంది అది ఏమిటో" అన్న ఆలోచిస్తే వచ్చిందే ఇందు జీవితానికి ఈ నా అన్వయం . అవధరించండి మరి. (మామూలు మాటల్లో చెప్పాలంటే, ఆయన వీర ఫాన్ని కాబట్టి "పైపైవి చూసి నేనేదో గూడార్థాన్ని మిస్సవ్వుతున్నాను" అని ఆలోచిస్తే ఇందు జీవితం ఎలా అర్థమయిందో చదవండి మరి.)
"చక్రీ. నన్ను పోషించగలవనే నమ్మకం కుదుర్చటానికి ఈ నగలు (నకిలీవి) అమ్మా నాన్నకు చూపించావు. అందరూ నిన్ను నమ్మారు. అక్కడితో వారి పాత్ర మిగిసిపోయింది. కాని నేను? జీవితాంతం నీతో కాపురం చేయవలసిన దాన్ని. దానికి నువ్వేసిన పవిత్ర బంధం ఇదైనా (తాళి) అసలు బంగారమేనా లేక కాకి బంగారమా?" ఈ ఒక్క సం భాషణతో ఇందు కు.........వరుని ఎంపికలో పెద్దల భాద్యత ఎంత, వారు చూడాల్సిన (వరుని ఉద్యోగ, సంపాదనా స్థాయు మొదలగునవి) వారు ఏ దృక్పదంతో చూడాలి, ఆలు మగల సంసారమో తల్దండ్రుల ప్రమేయం సీమ ఏమిటి .........అనేవి ఎంత చక్కగా అవగాహ్యమయ్యాయో మనకు తెలిసిపోతుంది.
"అరె పెళ్ళే మోసం ప్రాతిపదికన చేసుకున్న వ్యక్తి ఇక ముందు ముందు మోసం చెయ్యడన్న నమ్మకమేమిటి? ఎలా సహించగలిగింది ఈ కాలం స్త్రీ ఇందు" అని ఆలోచిస్తే "అదే కదా మరి పెళ్లి అన్న బంధం పట్ల ఇందుకున్న కట్టుబాటు. ఈ ప్రపంచంలో ఏ విషయంలోనూ గ్యారంటీలు ఉండవన్న సత్యాన్ని చూచినా వ్యక్తిత్వపు అలవాలు" అనిపించింది నాకయితే. "ఆ ఆ అలాగే అనిపిస్తుంది మొగ పుంగవులకు. అలాటి వారే పతివ్రతలు మీ దృష్టిలో. అలాటి వారే ఆమోదయోగ్యులూ, శ్లాఘనీయులూ ఈ పురుషాధిక్య సమాజానికి" అనే నా అంతరాత్మలోని ఫెమినిజానికి నేను చెప్పుకున్న సమాధానం ఒక్కటే "భార్యలలో కూడా ఇలా ఎంత పేద్ద తప్పులనైనా క్షమించగలిగే సోదారులు ఈ మధ్య భర్తలలో కూడా ఎక్కువవుతున్నారు అన్నది సోదాహరణంగా తెలిసిన నువ్వు ఇలా మాట్లాడటం సబబు కాదు. పైగా ఆర్ధిక స్వాతంత్ర్యం, దాని వల్ల వచ్చే ఇతర స్వాతంత్ర్యాలు ఉన్న ఈనాటి స్త్రీని, ఆమె సత్వాన్నీ ఇంకా పురుషాధిక్య సమాజం అంటూ చిన్న చూడటం తగదు" అంటూ.
డోలీ అద్దేగ్గొట్టి తప్పు చేసింది తామే అయినా బయటి వారికి తామెప్పుడు ఇద్దరం కాదు అన్నట్టు తన ప్రవర్తన నాకైతే "ఆ పరవశమంతా మనదే....మన ఒక్కరిదే " అనే ప్రేమకు స్వారూప్యమె అనిపించింది. (చిన్నప్పుడు టీచరు తిట్టారని ఇంట్లోంచి పారిపోయింది నేనయినా పాపం ఆ టీచరుని దబాయించేసిన మా నాన్నగారూ గుర్తొచ్చారు అది వేరే విషయం లెండి :-) ఇలా ఇందు దృష్ట నాయక గుణ సంహిత.
ఆ దబాయింపులో కూడా నవ్యతే చూడండి. "పచ్చి నెత్తురుతో పానకం తాగే మనిషి" అని మంచం చాటును వెతుక్కుంటున్న తన వాడిని రెండు బిందెల నీళ్ళూ, పసుపు ముద్దా చూపకుండానే ఖడ్గ తిమ్మనను చేసిన నవ్య చానమ్మ కదూ ఈ దేవేరి? (నిజంగా ఆ సమయానికి హరిద్రావర్ణాంబరధారణ యాదృచ్చికమేనంటారా?)
పైగా "ఆంజనేయ భళారే మహా దేవ భళారే" అన్న చిందు (అది చిందేనా?) తాళానికి తీన్మార్ ఆడుతుంటే "ప్రాజెక్ట్ లీడర్ లేడు అందుకే అలా కొంచం సేపు ఆఫీసు నుంచి జంపు జిలాని" అనే మా తెలంగాణ సాఫ్ట్వేర్ పడతుల ఉభయ సుభగత్వం తోచింది.
హేవిటో. ప్రధాన పాత్రధారులందరూ ఇలా "ఎంతో విశాలత్వం" ఎందుకు చూపెడతారో. డోలీ మోసే వాడు పాణిగ్రహణ ఉత్సాహంలో "ఇంతకంటే మంచి ఉద్యోగం వెతుక్కుంటాను" అంటుంటే "అయ్యో అదేం పనండీ. ఎంచక్కా ఇప్పుడున్న ఉద్యోగానికేం? హాయిగా మనుషులను మోసుకుంటూ వెళ్ళే ఉద్యోగం ఎంత పుణ్యం" అంటూ తన అతి మంచితనంతో తన వాడి పురోగమనానికి తానె అడ్డుపుల్ల వేస్తున్న సంగతి గమనించుకొదెం? అనే మనసుకు మాత్రం సమాధానం చెప్పలేకపోయ్యాను :-)
"మీరెంతో పుణ్యం చేసుకున్నారమ్మా. జరిగిపోయింది తప్పయినా, ఒప్పయినా ఇంటి గుట్టుని కడుపులో పెట్టుకునే అమ్మాయి నీ కడుపులో పుట్టింది" అంటూ తన స్వాభిమానాన్ని స్వాతిశయం లేకుండా చెప్పుకోగలిగిన ఇందు నిజంగా నాయికే కదా. (మెట్టినింటినీ, పుట్టినింటినీ ఇలా సవ్యసాచ్యంతో నెగ్గించే ప్రతి పడుచూ నాయికే అసలు.....అయినా వారిని "ఆడ"పిల్లలు అని ఇరువైపు వారు దెప్పటం......ప్చ్. పైగా నొప్పింపక తానోవ్వని ఈ లౌక్యం అందరినీ నొప్పించే సత్యసంధత కంటే మెండే కాదంటారా?)
ఇలా రెండింట్లా, బయటా గెలిచింది కనుకే "ఏమిటీ మీరు ఆశీర్వదించరా" అని మొహమాటానికి అడిగినా తన శిరోక్షింతల ధారతో తన వాడిని ఆశీర్వదించే అధికారం స్వాధీనం చేసుకుంది ఇందు (నాకయితే ఇది కూడా యాదృచ్చికం అనిపించలా!) అలాటి దేవిని భర్త నెత్తిన పెట్టుకు ఊరేగిస్తే తప్పేమిటి? "కలియుగ సావిత్రీ ధర్మాచరణే" కదా ఇది కాకపొతే role reversal జరిగింది అంతే :-)
ఒకటి మాత్రం నాకెప్పుడూ అంతుపట్టదు. వేరే ఎవరో కోసం అంతగా కన్నీళ్లు పెట్టటం స్త్రీకెలా సాధ్యమో. ఇది తలుచుకుంటే మాత్రం కాళిదాసు పద్యం "రమ్యాణి వీక్ష్య మధురాంశ్చ నిశమ్య శబ్దాన్...." అనేది గుర్తుకు వస్తుంది. అర్థం, పద్యం ఇక్కడ రమ్యమైన దృశ్యాలూ, మధురమైన శభ్దాలే కాదు ఒకోసారీ పూర్వ జన్మ ఆపేక్షలు అపరిచిత వ్యక్తుల ద్వారా కూడా కలుగుతుందనుకుంటా. పెద్దాయన వెళుతుంటే ఇందు కన్నీళ్లను కూడా ఇలాగే అనుకోవాలి మరి.
"ఓరిమి చాలమ్మా ఓ భూమాతా" అంటూ స్త్రీ సహనానికీ హద్దుందని పోటెత్తిన ఓ స్త్రీ ఆల్టర్ ఇగో మాత్రం "........క్షమయా ధరిత్ర"న్న ఆర్యోక్త్యానుసారిణిగా తన ధర్మం తాను నిర్వర్తించింది ఇందు రూపంలో. చిరునవ్వుతో శుభప్రదంగా.
(మొదటిసారి చూసినప్పుడు నిజంగా కోపం వచ్చింది విశ్వనాథ్గారి మీద చెత్త సినిమా అని....విశ్రాంతి తీసుకొండిక సార్ అని ఉత్తరం రాద్దామన్నంత కోపం....కాని ఇవాళ ఈ టపా కోసం చూసినప్పుడు నిజంగా చాలా ఎంజాయ్ చేసాను పిక్చర్ను.)
Photo from http://1.bp.blogspot.com/_7ZPb9dcb3aI/TE5IGIucgyI/AAAAAAAAMw8/qJhsgyvjxow/s1600/subhapradam_157.jpg

No comments:
Post a Comment