Wednesday, 17 December 2008

4. "దేవుడు అంటే ?"...రెండవ భాగం

నాకు స్వగతంగా "దేవుడు" అన్నది తెలిసినది.....ఏ కాన్సెప్ట్ ప్రకారమైనా సరే......చిన్నప్పుడు అమ్మా నాన్నా "పూజ్యాయ రాఘావేంద్రాయ" అంటూనో "శుక్లాంభరధరం " అంటూనో చెప్పిన శ్లోకాల నుంచి, నాన్న తన కంచు కంఠంతో చెప్పిన రామాయన మహాభారతాలు విన్నప్పటి నుంచి, తప్పు చేస్తె అమ్మ దేవుని పటం ముందు నుల్చోపెట్టి "దెవుని మీద ఒట్టేసి చెప్పు " అని అన్నప్పటినుంచినూ.

అప్పుడు తెలిసిన దేవుడు తప్పు చేస్తే దండిస్తాడు,మంచిగా ఉంటే మంచిని చెస్తాడు అని తప్పొప్పులు తెలిపే న్యాయ నిర్ణేత మాత్రమె. బుధ్ధితెలిసే కొద్దీ జరుగుతున్న అన్య్యాయాలు, లేని న్యాయము, ఉన్న అసమానతలు- ఇవన్నీ కలిపి ఆ కాన్సెప్టు నమ్మటం కష్టమయి, నా బుధ్ధిలో మరుగైపొయింది.

ఆ అవస్థలొ అసలు దెవుడనే వాడే లేడు అన్న అభిప్రాయం బలంగా నాటుకుపోయింది. దానికణుగుణంగా పండుగలను పబ్బాలుగా జరుపుకొవటం, తిరుపతి లాటి ప్రదేశాలను విహార ప్రదేశాలుగా చూడటం, తిరుపతి లడ్డూను ఒక స్వీటుగా చూడటం మొదలెట్టాను. పేరుకు మాత్రమే భ్రాహ్మణులం అవటం మూలాన ఇంట్లొ ఆచార వ్యవహారాలు జరగపొవటం వలన కొందరికి ఆ ఆచార వ్యవహారాల నుంచి పుట్టే “నమ్మకం” అనేది కూడా కలుగ లేదు. అందువలన "గుడ్డిగా నమ్మటం" (ఇక్కడ నమ్మే వాళ్ళు ఈ పదప్రయోగానికి క్షమించాలి... కాని అదె సరయిన పదం అని నా అభిప్రాయం) అలవడలేదు.

ఇంతవరకు పైన పేర్కొన్నవన్నీ ప్రత్యేకంగా ఆలోచించకుండా ఏర్పడిన అభిప్రాయాలు.చదువు, ఉద్యొగం, పెల్లి ఇలా మధ్య రెండు పురుషార్థాల వెంటపడి సాధించేసరికి వయసు ముప్పయికి చేరువవ సాగింది. మధ్య మధ్యలో వింటున్న భక్తి గీతాలు, తారస పద్ద ""సన్ని"హితులూ "నువ్వు చేసే పూజలు దేనికి? ఏమని చేస్తున్నావు" అని ప్రశ్నించినా "జీవిత పయనం ఆపి ఆలొచించలేను.... " అని నన్ను నేను మభ్య పుచ్చుకుంటూ పరుగుతీస్తూనే వచ్చాను.

పూజ చేసేటప్పుడు పలికే శ్లోకాలు దాదాపుగా "వ్యక్తిగత పొగడ్తలే”...అలా తనని పొగిడితేనే నీకు శుభం కలుగచేస్తాడు అంటే నువ్వు ఆ వ్యక్తిని దేవుడిగా గుర్తించవు కదా...మరి ఎందుకు ఈ పూజలూ పునస్కారాలూ" అని మనసు చురకలు వేస్తూనే ఉన్నా "సరస్వతి, లక్ష్మి, అన్నపూర్ణ,బ్రహ్మ, శివుడు, విష్ణువు.....ఇలా ప్రతి ఒక దేవతారూపము…… చదువు, ధనం, భొజనం, సృష్టి, స్థితి, లయ, ... ఇలా మానవ సమాజములొని, జీవితములొని ఒకొక్క కోణానికీ, విషయానికి గుర్తుగా ఏర్పాటు చేయబడ్డ ప్రతిరూపాలు...అవి సాధించిన మనిషి గర్వ పడకుండా నువ్వు ఒక్కడివే సాధించలేదు ఇవన్నీ.... వేరే వారి సహకారం, సహాయం, ప్రొత్సాహం..ఇలా ఎదొ విధంగా...వేరేవారి “పాలు” ఉంటెనే ఇవి నీకు సాధ్యమయ్యాయి …అన్న ఆలొచనను కలిగించటానికే సృష్టించబడ్డాయి" అని సమాధానం చెప్పుకొనె వాడిని. అయినా ఎందుకో అసహనంగా ఉండేది. ఇది కాదేమో "దేవుడు"కి నిర్వచనం అని అనిపించేది.

ఈ మధ్య ఒక సంవత్సరం క్రితం ఏదో ఒక "గుంపు"లో దేవుడంటే ఏమిటి? అన్నా దాని మీద దాదాపు రెండు మూడు వందల మంది తమ అభిప్రాయాలు చెప్పారు.....వారి ప్రకారం అమ్మా నన్నల దగ్గర నుంచి మంచి పనులు చేయటం వరకు ఉన్నాయి "దేవుడు" అంటే. ఇక మన బీజేపి వగైరాలు చెప్పిన నిర్వచనాలు మనకు తెలుస్తూనే ఉన్నాయి "దేవుడు" అంటే "ఒక గుడిలో ఉండే జడ పదార్థం. ఆయన గుడిని వేరే వాళ్లు విరగ్గొట్టి మసీదు కడితే మనం దాన్ని విరగ్గొట్టి, ఆ మతస్థులను చంపి, అరాచకం సృష్టించి ఆ ఆలయాన్ని కడితేనే మనం నిజమైన భక్తులం, మనం అలా చేస్తే సంతోషించే వాడే లేదా కనీసం చూసీ చూడనట్టు ఊరుకొనే వాడే దేవుడు" అని అర్థమయింది నాకు. ఇవన్నీ చూసిన తరువాత నాకు అర్థం అయింది ఒకటే......"దేవుడు" అన్న దానికి ఇది అంటూ ఒక్క స్థిరమయిన నిర్వచనం అంటూ లేదు. "ఎవరికీ వారే యమునా తీరే" అన్నట్టు ఎవరికి ఇష్టమయిన నిర్వచనం, తమ తమ జీవిత అనుభవాల నుంచి వచ్చిన అర్థం, అన్వయించుకోవచ్చు, ప్రచారం చేయొచ్చు. అసలు దేవుడు అంటే ఇది అని నిర్వచించి ప్రవచించాల్సిన వారు చాలా మంది హత్యలు, మాన భంగాలు, అరాచకాలు మొదలగు వాటిలో ఊపిరిసలుప కుండా కృషి చేస్తూ అసలు పని చేసే కొందరిని అవహేళన చేస్తూ గడిపేస్తున్నారు.

ఒక్క ముక్కలో చెప్పాలంటే నా ప్రకారము బ్రహ్మాస్త్రాలు పాశుపతాస్త్రాలు ప్రయోగించే దేవుళ్ళు లేరు, అంత శక్తి ఇప్పటి వరకు మనుషులు చూడలేదు. "అయితే ఇంతకు ముందు తరాల వారు అణు బాంబులను చూడలేదంటే ఆ విద్య లేదనేనా అర్థం లేక మనకు తెలియదు అనా అర్థం" అని ప్రశ్నించే వారికి "నిజమే మీరు చెప్పిన తర్కము నిజమే. కాని తర్కం పై నా నమ్మకము ఆధారపరుచలేను" అని నా జవాబు.

"పోనీ వారు చెప్పినట్టు సాధన (తపస్సు) చెయ్యి ప్రత్యక్షమవుతాడట కదా” అని చాలెంజ్ చేసే వాళ్ళకు "ఒక నమ్మకం అనేది ఒక అనుభవం మీద ఆధార పడి ఉంటుంది....ఆ అనుభవం లేకుండా నమ్మటం .....అనుభవం కోసమే అయినా....అది గుడ్డి నమ్మకమే.....ఆ గుడ్డి నమ్మకాన్ని సాధించేందుకు నా విలువయిన జీవితాన్ని దారపోయలేను ...నాకు ఇంకా చాలా పనులు ఉన్నాయి" అన్నది నా సమాధానం.

ఇలా అన్నానని నేను వేరే వారు ఆ నమ్మకంపై జీవితాన్ని ఆధారం చేసుకుంటే అవహేళన చేయను, నిరుత్సాహ పరుచను..... ఆ నమ్మకం వల్ల ఇతరులకు, సమాజానికి నష్టం కలిగించనప్పటి వరకు.....ఎంతైనా "మతం" అంటే "నమ్మకం" అనేగా అర్థం. కానీ ఆ లక్ష్మణ రేఖ దాటి ప్రవర్తించే వారిని అడ్డకుండా ఉండకూడదు అన్నది నా నిశ్చితాభిప్రాయం. ఇదండీ "నా దేవుని" కథా కమామిషు.


మొదటి భాగం ఇక్కడ
ఇదే విషయంలో ప్రదీప్ గారు ఇంకో కోణంలో రాసిన టపా ఇక్కడ

1 comment:

  1. మొట్టమొదటి అడుగు - నెత్తిలో వెతకడం మానెయ్యాలి :)
    రెండవది ....

    ReplyDelete