Sunday, 28 December 2008

5. స్వగతం--అవును నేను బ్రాహ్మణుడినే ... అది నా అస్తిత్వంలో భాగమే. Part-1

"ఏంటి రఘూ దీర్ఘంగా ఆలోచిస్తున్నావు?" అని వినిపించగానే ఎవరన్నది కూడా పట్టించుకోకుండా "ఆ ఏమీ లేదు ...మా ఇంటికీ, గొడ్ల చావడికీ, పై కప్పు ఏం వేద్దామా అనీ" అని "ఇందులో ఆలోచించటానికి ఏముంది....చార్మినార్ రేకులు వాడితే సరి అని... నువ్వు కూడా చచ్చు జోకులు పెల్చొద్దు నాలాగా" అని మళ్ళీ నేనే అన్నాను వచ్చింది మనోజ అన్నది గమనించి.

 

రాసుకుంటున్న నా టేబుల్ దగ్గర ఉన్న కుర్చీలో కూర్చుంది మనోజ వచ్చి. నవ్వి "అననులే, ఎందుకో చికాగా ఉన్నావు?" అనింది. "నీకు తెలీదా?" నేను చికాగ్గానే జవాబిచ్చాను. "నువ్వు దేని గురించి ఆలోచిస్తున్నావో తెలుసులే. కానీ ఎందువల్ల చికాకు, బాధ పడుతున్నావో అర్థం కావట్లేదు." మనోజ సౌమ్యంగా వివరించింది.

 

తలెత్తి తన వైపు చూసాను. మొహంలో కూడా వెటకారమేమీ కనపడలేదు.....నిజంగానే తెలీక అడుగుతోందని అర్థమయింది. అంటే నా అంతకు నాకు నేను ఎందుకు చికాకు, బాధ పడుతున్నానో ఇంత వరకు అర్థం కాలేదన మాట.

 

స్వగతంలో అనుకుంటునట్టుగా పైకే చెప్పసాగాను "ఇది అంతా మొదలయింది పిల్లలకు ఏం పేరు పెట్టాలా అని నేను, శ్రీమతీ ఆలోచిస్తుంటే...నాకేమో నాన్న సమాజానికి భయపడి నాకు పెట్టని ఆచార్యులు అన్న ఇంటి పేరు నా పిల్లలకు పెట్టాలని కోరిక. తనకేమో అది ఇష్టం లేదు. దాని మీద చిన్న వాదన. చివరికి మీకు కుల వివక్ష ఎక్కువ అందుకే అలా పెట్టాలనుకుంటున్నారు అనేసి వెళ్లిపోయింది." బాధగా అన్నాను.

 

మళ్ళీ నేనే చెప్ప సాగాను "ఇదొక్కటే కాదు ....మొన్నామధ్య బ్లాగుల్లో కూడా ఎక్కడ చూసినా దీని గురించే చర్చ....... సరిగ్గా ఇప్పుడు గుర్తు లేదు కాని ఒక టపాలో రచయిత్రి తమ వంశం నీళ్ళను కూడా కడిగి వాడుకునే వంశం అని చెప్పి ...కుల వ్యవస్థను, ఆచారాలను రూపుమాపాలి అన్న తన ఆకాంక్షను వ్యక్తం చేస్తూ టపాను ముగించారు......ఇంకొక చోట ఎక్కడో చదివిన వార్త... ఎవడో ఒక రాజకీయ నాయకుని పరిష్కారం ఏంటో తెలుసా కుల వివక్షకు?.....బలవంతంగా అన్ని వర్ణాల వారిని అన్ని వర్ణాల వారికిచ్చి వివాహాలు చేయాలట .... ఎంత దారుణం?....చివరికి ఆర్కుట్ లోని కవితా సమూహాల్లో కూడా "కులం తోక ఈకలు పేరు చివరన తగిలించుకొని కులుకుతారు" అన్న ఆక్షేపణ ఎదురయ్యింది ఈ ఆచార్యులు, శర్మ, రెడ్డి అన్న వాటి గురించి.....అందుకే నా అస్థిత్వం గురించి ఆలోచించటం మొదలెట్టాను." అంటూ ముగించాను.

 

"ఇవన్నీ నాకు తెలుసు అని చెప్పానా...ఇవి నువ్వు ఆలోచిస్తున్నవి, నీకు జరిగినవి...సరే..చికాకు, బాధ ఎందుకో చెప్పవోయ్" కొంచం విసుగు ధ్వనించింది మనోజ గొంతులో.

 

"అంటే ఇలా నేను అనుకోకపోయినా నా భార్యే నా మీద నింద వేయటం, లేని ఆలోచనలను అంటగట్టటం చేస్తే బాధపడకుండా ఉండమంటావా? నా కులం పేరును, అనాదిగా వస్తున్న పేరును, మా నాన్న రివర్స్ కుల వివక్షకు భయపడి నాకు పెట్టకపోవటం అనే పరిస్థితి వచ్చినందుకు బాధ పడకూడదా ? అలా పెట్టుకుంటే తోక ఈకలు పెట్టుకొని మురిసిపోయిన వాళ్ళమా? అలా అని ఇప్పుడు "ఎదుగుతున్న" కులాలవారిని ఆక్షేపించే దమ్ము ఉందా బ్రాహ్మణులను, రెడ్లను ఆక్షేపించే వారికి?

 

ఏమిటి? బలవంతంగా అందరినీ అందరికీ ఇచ్చి పెళ్లి చేస్తారా? అంటే సోషల్ ఇంజనీరింగ్ వయా బయాలజీ? ఎంత నఖరాలు కొడుతున్నారు ఊర్కుంటుంటే ఇలాటి వారు. సినిమాలో హీరోయిన్ని బలవంతంగా సొంత అబ్బ ఇంకొకడికి కట్టబెడితే సహించని వారు సామాజిక న్యాయం అన్న నెపంతో ఇంత దారుణం పరిష్కారమంటారా? ఏం, ఎందుకు ఇలా వచ్చింది పరిస్థితి?" ఆక్రోశంగా అరిచాను.

 

"నువ్వు ఓవర్ రియాక్ట్ అవుతున్నావు  రఘూ.....వీరంతా చెప్పినవి ఎక్స్త్రీమ్స్ ...కానీ వారు కోరుకొనే అసలు సమాజంలో తప్పేమీ ఉంది? ఇంత వరకు వివక్షకు గురయిన జనం, కులాలు, తమ బలం తెలుసుకొని తమకు నచ్చిన విధంగా సమాజాన్ని రూపుదిద్దుకుంటాము అంటే నీకు వచ్చిన చిక్కేంటి?" శాంతంగా పలికింది మనోజ.

మూడవ భాగం రెండవ భాగం

No comments:

Post a Comment