ఎంతగా గుర్తొస్తున్నావో తెలుసా.
నిన్ను తలచుకోగానే రామప్ప దేవాలయం గుర్తొచ్చింది. చిన్నప్పుడు రామప్ప దేవాలయానికీ, వరంగల్లోని వేయి స్థంబాల గుడికీ వెళ్ళిన విహార యాత్రలో వచ్చేస్తున్నఫ్ఫుడు చివరి చూపుగా నా హృద్పీఠికన నిలిచిపోయినా చిత్రమే గుర్తొచ్చింది.
ఎంతని వయసప్పుడు? పట్టుమని పదునాలుగేళ్ళేమో....అయినా ఎంత స్ఫందించిందనీ ఆ దృశ్యానికి మనసు. సాయం సంధ్యలో అదేదో తెలియని నదికి ఇటువైపు ఎత్తైన కట్ట. కట్టపై తెల్లని ఇటుకలతో రామప్ప గుడి అని రాసున్న అక్షరాలు. ఇటువైపేమొ జీర్ణావస్థలోని ఆ దేవాలయం. ఏటవాలుగా రాలుతున్న నులివెచ్చని సంధ్యారుణ కిరణాలు.
ఎన్ని కలలు కనేవాణ్ణో తెలుసా ఆ ప్రదేశానికి మళ్ళీ వెళితే నా సోల్మేట్ తో వెళ్ళాలని.
ఎందుకో ఆ ప్రదేశం, ఆ నులి వెచ్చని స్పర్శ ప్రశాంతత, ఆ భావుకత, ఆ వంటరితనంలోని హాయి, ఆ విషాదంలోని సుఖం గుర్తొచ్చాయి అప్రయత్నంగా నీ తలపు రాగానే. నా వెంట నువ్వుంటే ఎంత బావుంటుందో ఆ ప్రదేశంలో. ఎవ్వరూ రాని ఆఫ్ సీసన్లో వెళ్ళాలి మనం. అదీ సాయంత్రం పూట. తెల్లని చీరలో నువ్వు. జడలో సంపెంగ, ఒంటిది. ఆ... ఒంటిదెలా అయ్యింది జంటగా నా చూపులెంటబడుతుంటే....వంటింది కాదులే. నేనేమో నీకిష్టమయిన నల్లని చొక్కా, ఆ తెల్లని పాంటూ, బయట మనిద్దరికీ ఇష్టమయి కొన్న కారులోంచి మృధుమధురంగా సంగీతాలాపన. ఒక్క మాట కూదా మాట్లాడకోకూడదన్న నియమం మనిద్దరినీ దూరం చేస్తుంటే, ఒక్క నిమిషం కూడా విడిగా ఉండలేని మన మనస్సులు ఒక్కటి చేస్తుంటే, నీ వైపు చూడనైనా చూడకుండానే నేను ఆ రమణీయ దృశ్యాన్ని నా చేతి పట్టు బిగింపులో నీకు వర్ణిస్తూంటే, ఆ చేతి బిగింపులోని స్ఫందనకు ప్రతిధ్వనిగా నీ ఊర్పులు లయబద్దంగా గాత్రం చేస్తుంటే..............నిజం చెప్పు అలాటి సమయమే కదా వేయి కలయికల కంటే మరింతోన్నత శిఖరాధిరోహణ చేయించే అమృతఘడియ. అలా తారాస్థాయికి చేరుకున్న అనురాగానికాగలేక నువ్వొకే ఒక్క చుంబనంలో నీ ఆత్రాన్నీ, ప్రేమనూ, దగ్గరితనాన్నీ నాకందిస్తే ..........ఓహ్! ఇక ఊహించుకోలేనురా. ఊహల్లో అయినా ఆశకు హద్దుండాలి అని బుధ్ధి మందలిస్తోంది.
నిన్న రాత్రేమో నాకెంతో ఇష్టమయిన మైలాపురం ఆలయానికి వెళ్ళొచ్చాను నీతో కలిసి. ఎక్కడో కథలోచదివినట్టు ప్రదక్షినాలు చేస్తూ గుడి వెనకాల ప్రదేశానికి వెళ్ళినప్పుడు నిన్నేమేమొ చెయ్యాలన్న ఆలొచనలకు చిత్తసుధ్ధి కరువవుతూంటే అమ్మవారిని క్షమాపణలు వేడ్కోని ప్రదక్షిణాలు వేగంగా నే ముగించుకోస్తే విషయం తెలియని నువ్వు "మీరూ అందరి మగాళ్ళలానే అని ఋజువు చేసుకున్నారు. మీ మగాళ్ళకెఫ్ఫుడర్థమవుతుంది చేయి కలిపి తీసుకొచ్చిన ఆడదాన్ని జీవితకాలం పాటు చేయి విడవకూడదని" అంటున్న నీకు అసలు విషయం చెపితే నీ బుగ్గల్లో నిజంగా అరుణిమలు కనిపించలేదు కాని ఎంత సిగ్గో. ఆ దృశ్యం వర్ణించటం నాకు సాధ్యమా? "చాల్లేండి అల్లరి. రండి అలా మంటపంలో కూర్చుందాం" అంటూ మనం వెళ్ళి ఎన్నో ఏళ్ళ నాటి ఆ మంటపంలో కూర్చుంటే మనం చూసిన దృశ్యాలెన్నని?
చిన్ని పిలక బాపనయ్య నీళ్ళు మోస్తూ కూడా ఆ మిట్టమధ్యాహ్నం వేళ ఏం మంత్రాలు బట్టెపడుతున్నాడో విన్నా అర్థం కాలేదు కాని ఎంతగా హత్తుకుందా దృశ్యం. పక్కనే గోశాలకు వెళ్ళొస్తున్నా గిరిజన మహిళ ఎంత పవిత్రంగా అనిపించిందో కదా ఆ వేళ. తమిళ ఆచారాలకు అద్దం పడుతూన్నట్టుగా ఎదో ప్రత్యేకత సంతరించుకున్న ఆ దేవాలయపు గోపురాన ఉన్న శిల్పాలను గుర్తుపట్టాలని మనం చేసిన విఫల ప్రయత్నమూ, ఆకలేస్తోందంటూ అక్కడికాక్కడే మనం ఖాళీ చేసిన ఆ సగం కొబ్బరి చిప్పా, "ఇంకొంచం కావాలా" అనడిగితే అవునటూ నువ్వు తల ఊపితే, నే మళ్ళీ కొబ్బరికాయ కొని దేవునికి సగం లంచమిస్తూంటే ఆ పూజారి పెదాల్లో "మీ సంగతి తెలుసులెండి" అన్నట్టు నాకవుపించిన చిరునవ్వూ, ఆ రెండవ చిప్పను లాగించేసింతరవాత నీ కళ్ళలో కలిగిన తృప్తీ చూసి అదేదో మౌంట్ ఎవరెస్ట్ ఎక్కినట్టు పొంగిపోయిన నా హృదయం.....అబ్బా ఎన్ని మంచి ఊహలో తెలుసా.
చల్లటి చలువనిస్తున్న ఆ మంటపం కట్టించిన కృష్ణరాయలను తలచుకుంటూ మనం మాట్లాడుకున్న కబుర్లెన్ననీ? ఎందుకో తెలీదు కాని గుళ్ళలో జరిగే ఈ రోమాన్సులంటే నాకెంత ఇష్టమో. అంతు చిక్కని ఎదో పవిత్రత కనిపిస్తుంటూంది ఈ ప్రణయాల్లో. ఏయ్... ఆగాగు అలా కోపంగా చూడకు. ఇంతవరకలాటి అనుభవాలేమి లేవు. అన్నీ ఊహల్లోనే. అదీ ఇలా ఒకరితో విస్ఫష్టంగా ఊహించుకున్నది ఇదే మొదటిసారి.
అలా ఆ మిట్ట మధ్యాహ్నం వేళ బస్సు కదిలిపోతోంది అన్న అనౌన్స్మెంట్ విని కూడా పోతే పోనీ అనుకుని మనం అక్కడే తిష్టేయటం, ఆత్మారాముని అనంత రీతుల వింతలు తగ్గి హాయిగా నిద్రాదేవి నా దేవిని తన కౌగిల్లో తీసుకుని లాలిస్తూంటే అసూయతో నేను నిన్ను నా ఒళ్ళో పడుకోబెట్టుకున్నాట్టూ.......అనుకుంటూ ఉండగా వెధవది అలారం మ్రోగింది, కల అసంపూర్తిగా మిగిలిపోయింది.....జీవన ప్రతిబింబంలా.
చక్కటి రాత. మళ్ళీ మళ్ళీ చదవాలనిపించేలా.
ReplyDelete