Tuesday, 1 December 2009

అప్పటికీ ఇప్పటికీ ఒకటే ఛాయ ....కాని!

జారిన నా కన్నీటి చుక్క విలువ తెలుసా
అత్యాశతో నువు జార్చుకున్నఈ నల్ల ముత్యమంత
మత్సరమున్నా నా విలువెంతో తెలుసా
సీతమ్మ మెడలో పచ్చల పేరంత
నా చక్షు క్రోధారుణిమ చురుకెంతో తెలుసా
అమ్మోరి శిరను మెరియు మాణిక్య తునకంత
నా మనసు చల్లదనమెక్కడిదో తెలుసా
రసాస్వాదన చేసి కరిగిన చంద్రశిలదది
నువు చేసిన పాషాణహృది పదునెంతో ఎరుకా
సురేశుని పెన్వజ్రపు ఖటికంత
నా బాధ తప్త భావావేశ వర్ణమేంటో తెలుసా
మహార్ణవ లోతులూ సరికాని ఇంద్రనీలమంత
నువు రాని నా జీవితపు గుణమేమిటో తెలుసా
సత్వ గుణాభి సూచిక సుమౌక్తికపు ఛాయే
నువు వీడిన నేటి జీవితమేమిటో తెలుసా
వర్ణాలన్నీ వెలేసిన వెధవ ముండ తెలుపు.
అప్పటికీ ఇప్పటికీ ఒకటే ఛాయ
కాని విలువల్లోనే తేడా అంతా!


ఇదీ ఎప్పటిదో పాతది.

చెంత చేరగనే శిలయైతి!

వత్సర కాలపు విరహ వేదనన
మది నెమ్మదించ
షడృతు సమాహార సౌరభం
విసిగి వేసారించ
శరత్పూర్ణిమలూ నిశ్యమావాస్యలూ
ఏకవైరులైన చూపు మందగించ
దర్శన భాగ్యం లేక చక్షుద్వయం
శ్రవణ భాగ్యమొందిన స్వవీనులనసూయబడ
దవ్వునధిగమించ అడుగు వేగిరబడ
కలుగు పొందు సుఖమాయా పరవశయై
మనసూహను మురియు వేళ
నీ చెంత చేరిన విషయమే తెలియక
సర్వాంగము ల్సర్వేద్రియము ల్నిష్చేష్ట లయ్యె న్చెలీ
మరింక నేమియు లేదు నా స్థితికి కారణంబు
గూరిమి గొప్ప రసానుభూతియందురు
మరిదియేమి చెంత చేరగనే శిలయైతి?
కలయికింత భావత్యజితమని మున్నెవ్వరూ తెల్పలేదే!


భావావేశంలో ఏం రాసుకుంటామో ఒకోసారి రాసిన వారికే అర్థం కాదు. అయిదు నుంచి ఎనిమిది వరకు పంక్తులను ఏమనుకుని రాసానో నాకర్థం గుర్తురావట్లేదు.రాసి చాలా రోజులయింది. మీకేమైనా అర్థమయితే చెప్పండి. :-)