Monday, 13 September 2010

మొద్దు పిల్లాడా

పెదాల మీద కాదు, బుగ్గల మీద కాదు, పోనీ నుదురు మీదా అంటే అదీ కాదు. పొయ్యి పొయ్యి ఎప్పుడూ పాదాల మీద ముద్దెడతావు ఏంటిది బాస్? నఖశిఖపర్యంతం అంటూ ఏవేవో చెప్పబోతున్నట్టు అనిపిస్తుంది కాని అవన్నీ వినే తీరిక నాకెక్కడ చెప్పు? బారెడు పోద్దేక్కితే కాని లేవని నా ఈ అలవాటు మానుకోలేకపోతున్నా. "గాఢనిద్రలో నీ  మొహం చూడటం నాకెంత ఇష్టమో నువ్వలాగే లేట్ గా లెయ్ పర్లేదు" అంటూ నువ్వెళ్ళి కోడిని లేపుతావు. మనకిద్దరికీ ఎలా కుదిరిందో ?

బ్రష్ నోట్లో పెట్టుకుని బాల్కనీలో నుంచుని ప్రపంచపు ఉరుకుల పరుగుల సవ్వడి వినటం నాకిష్టం. నువ్వు చూపులతోనే చురుక్కుమనిపిస్తున్నావు అని అర్థమవుతూనే ఉంటుంది అయినా మానను. అలా నన్ను నువ్వు తాకటం ఎంత  బావుంటుందో తెలుసా? అలా నువ్వు నన్ను తాకి వేడెక్కుతున్నంతలోనే  "అమ్మో టైం అయింది" అనుకుంటూ బాత్రూమ్లో పరిగెడుతుంటే నీ నిరాశ బయట వీదులూడిచే చీపుళ్ళ సవ్వడిలో వినపడేది నాకు. అయినా ఈ మధ్య ఆ శబ్దం వినపడట్లా, మజా పోతోంది. కొంప తీసి మా ఏం సి హెచ్ వాళ్ళు అర్ధరాత్రి  చీపుల్లేయిస్తున్నట్టు నువ్వూ ఏ అపర్రాత్రో నిట్టూరుస్తున్నావా ఏమిటి?

నేను ఆదరాబాదరాగా స్నానం చేసి నీ ఎదురుగానే డ్రస్ మార్చుకుంటుంటే అలా ఎర్రబడిపోతావేంటి?  ఎప్పటి నుంచి చూస్తున్నావు నన్ను? సిగ్గుబిళ్ళ దగ్గర నుంచి, అవునా? అయినా ఇదేంటి? పైగా మగాడివి, అందులోనూ "అన్నీ" తెలిసిన వాడివి. పైగా ఏమన్నా అంటే "నేను ఎన్ని దేశాలు చుట్తోస్తే మాత్రం మారిపోతానా? నేనెప్పటికీ మారను, నేనింతే" అంటావు. అంతే కాదు   రోజూ ఎర్రబడుతూనే ఉంటావు. ఒకోసారి విసుగొస్తుంది తెలుసా ఈ కాలం అబ్బాయిలు ఇలా మొద్దు సుబ్రావ్లు ఎందుకైతారా అని.

ఆ సర్లే సాల్లే సంబడం. మా కాలం వాడివి కాదులే సత్తేకాలం వాడివే. అయితే మాత్రం వయసుతోపాటు పెరగాల్సిన ఆ అది ఏదీ? నున్నగా షేవ్. కొంచం అయినా రఫ్ మాన్లీన్స్ ఉండాలా లేదా? ఇరవయ్ నాలుగ్గంటలూ పని, ధర్మం అంటూ క్లాక్తో పాటు పరుగులు. నిన్ను చూస్తూ నీ వైపే తిరిగే పూబాలలు ఎందఱో నీకేమైనా తెలుసా? కొంచం కూడా ఫ్లర్టింగ్ రాదు. నీ కొలీగ్ని చూసైనానా నేర్చుకోవయ్యా మగడా అంటే వినవు. నీపై ఆధారబడి బ్రతికేవాడు. ఒక్క నైట్ డ్యూటీ  తప్పితే నీకంటే ఏ విధంగానూ ఎక్కువైన అవకాసం ఉన్నవాడూ కాదు. పైగా నీ అంత ఛాయా లేదు, మొహం మీద మచ్చలూ... అయినా ఎన్ని కథలలో హీరోనో, ఎందరు కలువభామల మనసు దోచాడో, ఎన్ని ప్రేమలేఖలన్దుకున్నాడో నీకు తెలీనిదేముంది?  అయినా నిన్ననేం లాభంలే ఇలా రాసిన విదాతననాలి. సరే ఇక నే వెళ్ళొస్తా మళ్ళీ సాయంత్రం ఆఫీస్ తరవాత కలుద్దాం బై.

                                                              XXXXXXXXXXXXXXXXXX
ఏంటిది ఊరకే ఆఫీసులో డిస్టర్బెన్స్ ? చెప్పానా అలా మూగగా పలకరించోద్దని? రోజూ ఇదో వరసైపోయింది. నా ఖర్మ క్లాస్ మార్చినప్పటినుంచి డైరెక్ట్ లైన్ అఫ్ విషన్ కిటికీలోంచి. రోజూ నేను కిటికీ పరదా వేస్తుంటే అందరూ నవ్వుకుంటున్నారు అనిపిస్తుంది. నీకేం ఖర్మ చెప్పు ఇలా? దర్జాగా దొరికినప్పుడేమొ  ఏమీ చెయ్యలేదు కానీ.  అప్పుడేమో ఏదో పక్కింటి నెలల బాబు  పాకి వచ్చి ముద్దుపెట్టుకున్నట్టు పాదాల మీద ముద్దులు. ఇప్పుడేమో నిన్ను వదిలి ఉండలేకపోతున్నాను అంటూ ఏడుపు. ఏం నాకు తెలీదనుకున్నావా నీ బాధ. పరదా వేసింది కిటికీకి నా మనసుకు కాదుగా.
పోన్లే ఏడుస్తున్నావు కదా అని లంచికి పార్క్లో కలిస్తే ఎంతో................ధైర్యం తెచ్చుకుని ముద్దుపెట్టుకునేది నడినెత్తి మీదా? ఇడియట్.

ఆ ఆ చాల్లే వేషాలు. సారి అంటూ మెల్లగా వేలు ముట్టుకుంటావు. చల్లటి చెట్టు కింద మొత్తం శరీరం, వేలుపై మాత్రం వెచ్చని స్పర్స. ఉలుకూ పలుకూ ఉండదు. మెల్లగా వేలికోసలతో మొదలెట్టి అలా అలా పైకి పైకి జరుపుతావు. ఎన్ని సార్లు తాకినా నీ ఆ స్పర్శ మాత్రం అలవాటు అవదు నాకు. పబ్లిక్ పార్కు అన్న ధ్యాస కూడా లేకుండా నీ సరసమొకటి. మళ్ళీ ఇడియట్.

సర్లే డ్రీమ్స్లో పడిపోతే అయినట్టే. స్కూల్ బెల్ కొట్టటానికి ఇంకో అయిదు నిమిషాలే టైం ఉంది నేను వస్తా. నీకు తెలుసుగా ఆ వంద మీటర్లు నేను నిక్కుతూ నీలుగుతూ వెళ్ళేసరికి అంత టైమూ అవుతుంది. బై మరి. సాయంత్రం స్కూల్ అయిపోయింతరవాత పికప్ చేసుకో సరేనా? అలా అలగోద్దూ నా బుజ్జి కదూ.  నిన్నేమి అవమానించలేదు. అరవై వేల డొక్కు బండి కంటే అరవై లక్షల బస్సులో పికప్ చేసుకునే నా వాడే నాకు గ్రేట్. ఒకే? సరే ఉంటా మరి బై.

                                               XXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXX
నేను నీ పక్కన కూర్చోలేదని అంత అలకా? ఏం చెయ్యను విండో సీట్ దొరకలేదు మరి. అసహనంగా ఉన్నట్టున్నావు ఏమయ్యింది? డ్యూటీలో ఏమన్నా ప్రాబ్లామ్సా? నీకూ ప్రాబ్లామ్సా? పీత కష్టాలు పీతవిలే సరే. నీ కష్టాలు తరవాత వింటాను కాని ముందిది చెప్పనీ స్కూల్ వాళ్ళు ప్రతి సంవత్సరం కొంతమందికి ఆపరేషన్ స్పాన్సర్ చేస్తారు అని చెప్పానా? నాకు స్పాన్సర్ షిప్ ఇచ్చారు ఈసారి. యూకేకి. ప్లేన్ టికెట్ల దగ్గరనుంచి స్తే వరకూ అన్నీ స్పాన్సర్డే. ఎంత ఆనందంగా ఉందొ తెలుసా. ఓయ్ ఏమిటది అలా కన్నీరు కార్చేసావు? అబ్బబ్బా. ఈయనకు ఏ ఎమోషన్ వచ్చినా తట్టుకోవటం కష్టం. పురుషోత్తమా అలా కురుస్తూ అందరినీ ఇబ్బంది పెట్టొచ్చా? అలా చూడు జనమంతా ఎంత అసహనంగా చూస్తున్నారో. ఆపేయ్ నా బుజ్జివి కదూ ఆపేయ్. గుడ్ అలా నవ్వాలి. నువ్వు అలా మంద్రంగా చాలా నవ్వితే బావుంటావని మా ఆఫీస్లో లేడీ స్టాఫ్ అందరూ అంటారు తెలుసా.  సిగ్గు పడుతున్నావా? పడుతూనే ఉండిన్తావులే.
                                                  XXXXXXXXXXXXXXXXXXXXXXXXX
నువ్వు లేనప్పుడు కానీ నీ విలువ తెలీటం లేదు. పొద్దున్న నీ వెచ్చని మేలుకొలుపు లేదు. రాత్రుళ్ళు వేల మైళ్ళ అవతల ఉన్నా నీ ప్రేమ ప్రతిఫలిస్తూ బయట కనిపించే ఆ చందమామను ఆస్వాదిద్దామన్నా రక్తం గడ్డ కట్టించే చలి, రూమ్లో నుంచి బయటకు రాలేను. నువ్వు లేకపోతె ఎలాగో పిచ్చిగా ఉంది. ఏడుపొస్తోంది.

ఎంత దుప్పటి కప్పుకుంటే మాత్రం నీ వెచ్చతనం వస్తుందా? వెచ్చతనం వచ్చినా ఆ దగ్గరితనమేది? నా ఆలసత్వం నా విసుగూ నా అలకలూ అన్నీ భరించే ఆ తోడేక్కడినుంచి వస్తుంది ఈ దుప్పటితో. నా కొంగు పట్టుకుని రోజంతా నువ్వు తిరుగుతుంటే నాకు తెలీలేని ఆ సహచర్యం ఇక్కడ వినపడని తొలిపొద్దు కోడికూతలు,మలిసంధ్య కిలకిలారావాలూ నువ్విచ్చే నడి నెత్తి మీది ముద్దులు గుర్తుచేస్తున్నాయి. I miss you. I miss you a lot. కాని తప్పదు. ఒక పని చెయ్యాలని అనుకోక ఆగిపోవటమే కాని  చెయ్యలేకపోవటం వల్ల ఆపేయటం నీ దేవికి అసలు అలవాటు లేదు. భరిస్తా. ఎలా అయినా భరిస్తా.నా మంచికేగా ఈ అరణ్యవాసం.


                                              XXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXX

స్వామీ
తిమిర సంహారా
పరాయి దేశంలో నీ తొడు లేని ఒంటరితనం నల్లటి దుప్పటిలా (అప్పుడే వర్ణాలూ స్వాధీనం అయ్యాయి చూసావా) కప్పే దాకా నీ విలువ తెలీలేదయ్యా. పరాచికాలాడుతూ నీ స్నేహాన్ని తేలిక చేసేసాను. ఆకతాయితనంగా అల్లరి చేసాను. మది బరువయితే మనసును దూదిపింజను చేసే నీ మంత్రదండపు ధగధగల శక్తి తెలిసింది. కళ్ళు తెరిపించావు. ఇవాళ మళ్ళీ నీ కీర్తి కెరటాలతో ధగధగలాడే దేశానికి వచ్చేసా.  సమస్త జన జీవన స్రవంతిని జాగృతం చేసే నీ కాంతి కిరీటం నా కళ్ళల్లో ఎప్పుడూ మెరిసేలా ఆశీర్వదించు తండ్రీ.




అందరూ మచ్చల మామకు రాసేవారే అన్న అక్కసుతో ;-)
Pic from http://vandeneynden.biz/blog/wp-content/uploads/2009/03/rays-of-sun-in-black-sky.jpg

3 comments: