Saturday, 10 March 2012

కిమివ క్లథతి కాంతే.....

శిలీముఖ సమమివ వాక్యే!


అయిదేళ్ళయింది నిన్ను చూసి.

రేపు వస్తున్నానటువైపు.
పొద్దున పదికి పనయిపోతుంది, ఒక అరగంటలో అక్కడ ఉంటాను.
రాత్రి ఎనిమిది వరకు ఎదురు చూస్తా, కుదిరితే రా.

నీ బాగోగులూ, క్షేమ సమాచారాలూ, స్థితిగతులూ ఎవీ అడగను, నావీ చెప్పను. అసలు మాటలొద్దు మనకు. చాలా గాయపరుచుకుంటాం మనం.




రాను.


xxx
..... పెళ్ళని విన్నాను.
పెళ్ళికూతురు ఫోటో చూసాను.
కాళ్ళకు దండం పెట్టిన తర్వాత ఇద్దరికీ నుదుటి మీద ముద్దులు పెట్టు.
నా తరఫున.
నీ జీతంలోంచి
ఒక సఫారీ సూట్ వాడికి
పట్టు చీర కోడలికి
మీ ఇద్దరికీ జత మంచి బట్టలూ
అందరూ అన్నీ చదివించెసిన తరవాత
పంపిస్తున్న సువర్ణాక్షతలు చల్లి
కొత్త జంటకు పెట్టు
నీ జీతంతోనే సుమా
ఖచ్చితంగా నీ జీతంతోనే.


xxxxx
ఇవాళ రిటైర్ అవుతావు ఉద్యోగం చేస్తూ ఉండింటే.
రిటైర్ అవుతున్నప్పుడు విశ్రాంత జీవితం సుఖంగా ఉండాలని విషెస్ వస్తాయి,
ఇదేమిటి నాకంటే ముందు చచ్చిపో, నాకు చెప్పి చచ్చిపో అంటున్నాడు అనుకుంటున్నావా?
"నేను చనిపోయే రోజున అందరికంటే ముందొచ్చే.....స్నేహితుడివి.....అని చెపుతా"నన్న నీ మాటలు అలా ఎలా ఖచ్చితంగా "ఆ తులసాకు వేళకయినా....." అని నీ కోసం ఆరాటపడ్డ నా తలపులకు దర్పణాలయ్యాయో ఆ దగ్గరితనం తెలిపే నిఖ్ఖచ్చి మాటలవి. నువ్వూ పోతావూ నేనూ పోతాను.....తప్పక జరిగే విషయం పైకి అనుకుంటే తప్పేమిటి?


ఇందుకే నువ్వు నన్ను కోల్పోయావు.
........ అంటూ ప్రాణం తినేస్తావు.
తియ్యటి కలలు కనటమే నీకొచ్చు.
ఒక్క కలను సాకారం చేసుకునే ధైర్యం నీకు లేదు.


నిజమే ధైర్యం లేదు!!!

చివరి ఉత్తరం మోసుకొచ్చిన చీదరింపును చదువుతుంటే ఎప్పుడో చదివిన కవిత లీలగా ఙ్ఞాపకానికి వచ్చింది



నువ్వు ముందా? రాత్రి ముందా?
సాయంసంధ్యతో నా రహస్య పందెం...
ఫలితం ముందే తెలిసినట్టు
మరపునపడ్డ పాట ఒకటి తోడు కూర్చుంది!
ఆకాశదీపాలన్నీ వెలిగాక
"నీ ఆనవాలేదో"
తలుపు తోసుకుంటూ చుట్టుముడుతుంది.....

No comments:

Post a Comment