Wednesday, 30 January 2008

4. భాషా భూషణములేవి?

సిగనలరేటి చంపక మొసంగితివేరికినేల, దూరమౌ
తగినవననేల నీ మనము కోపము చేసి సమాస బంధువు
ల్మగువవు నేల నీవునుపమాది అలంకరణంబు లున్వది
ల్తెగువనదేల పోదువు పసందవు సంధుల న్విడిన్


చంపకమాల లాంటి పద్య గీతాల సొగసులు , ఉపమాలంకారము వంటి అలంకారాలు, సమాసములనే బంధువులు, సంధులనే పసందులు అన్నింటికీ తెలుగు తల్లి దూరం అవుతోందని బాధతో..........

4

పద్యము
సిగనలరేటి చంపక మొసంగితివేరికినేల, దూరమౌ
తగినవననేల నీ మనము కోపము చేసి సమాస బంధువు
ల్మగువవు నేల నీవునుపమాది అలంకరణంబు లున్వది
ల్తెగువనదేల పోదువు పసందవు సంధుల న్విడిన్


పదవిభజన
సిగన్ అలరేటి చంపకము ఒసంగితివి ఏరికిన్ ఏల, దూరమౌ
తగినవని అనన్ ఏల నీ మనము కోపము చేసి సమాస బంధువు/ల
మగువవున్ ఏల నీవున్ ఉపమాది అలంక రణంబులన్ వది/లి
తెగువన్ అదేల పోదువు పసందవు సంధులన్ విడిన్

అర్థము
సిగన చక్కగా ఉన్నటువంటి చంపకమనే పువ్వు (=చంపకమాల అనే పద్యమనే అలంకారము) వేరే ఎవరికో ఎందుకు ఇచ్చేసావు (ఎందుకు పోగొట్టుకున్నావు)? సమాసములు అనే బంధువులను నీ మనసు కోపంతో దూరం చేయతగినవి అని ఎందుకు అన్నావు? మగువవు కదా, ఎందుకు ఉపమా అనే అలంకారములను వదిలి, ధైర్యంతో పసందు అయినటువంటి సంధులను వీడి ఎందుకు పోతావు?

(చంపకమాల లాంటి పద్య గీతాల సొగసులు , ఉపమాలంకారము వంటి ఆభరణములు, సమాసములనే బంధువులు, సంధులనే పసందులు అన్నింటికీ తెలుగు తల్లి దూరం అవుతోందని బాధ.)


ఛందస్సు
చంపకమాల
న జ భ జ జ జ ర
III IUI UII IUI IUI IUI UIU
మొత్తం అక్షరాలు=21
యతి స్థానం=11

Tuesday, 29 January 2008

స్వగతం-1-మనోజా పరిచయం.

"స్వాగతం" మనోజతో నేను పలికిన మొదటి పలుకు. "నేనెవరు ? మీరెవరు? పరిచయస్తుల్లా అనిపిస్తున్నా గుర్తు పట్ట లేకపోతున్నా" మనోజ అయోమయం. “నీవు నా స్వగత సంభాషణా జనితవు. నా మనము నుండి నీ జననము కాన మనోజ నీ నామము" నా వివరణ.

"అలాగా? జన్మనిచ్చావు, నామకరణం చేసావు నీవు పితృ సమానుడవా?" తన అనుమానం. నా మవునమేలింది నిముషం పాటు రాజ్యం. "నాకు కాదనిపిస్తోంది. నీవు నన్ను కుమర్తెలాగా చూడతలచలేదు, స్నేహితురాలి హోదా నాది అనిపిస్తోంది అవునా ?" "అవును. ఇక్కడ నీవు నీవు నేర్వవలసిన మొదటి పాఠము ఇది. నా గురించి నీకు అంతా అవగతమే, ఎందుకంటే నీవు నా మనోజవు కనుక" నా వివరణ.

"మరైతే ఈ సంభాషణ దేనికి? నీ గురించి నాకు అన్నీ అవగతమే అయినపుడు సంభాషణా ఫలం?" "నా గురించి నీకు అన్నీ తెలుసు అన్నాను కాని నీ గురించి, అంటే నా స్వగతం గురించి, నాకు అన్నీ తెలుసనలేదే. నా గురించి నాకు తెలియచేయటమే నీ భాద్యత". "సరే జననం, నామకరణం, దిశా నిర్దేశం జరిగింది. మరి నా నైజం?" "ముకు సూటితనం. నీ మాటలకు నేను బాధ పడతానో, సంతోషిస్తానో నీకు అనవసరం".

"భావ స్వారూప్యం?" "నా మనోజవు కాన నా ideal fantasy నీవు అనుకోవచ్చు. అచ్చమైన తెలుగుతనం, సిసలైన బ్రాహ్మణత్వం, మచ్చలేని మానవత్వం, అలుపెరగని కర్మ యోగం ఇవి నీ చతుర్గుణాలు." "వయసు?" "నా సమవయస్కవు నీవు" అన్నీ చెప్పాలా అన్న విసుగు ధ్వనించింది కొద్దిగా నా స్వరంలో.

చిన్నగా నవ్వి మనోజ "తప్పదు. రెండు సంవత్సరాల క్రితం వరకు కాగితంపై మాత్రమే సాగిన ఈ సంవాదం ఇపుడు ఈ బ్లాగ్లో బహిర్గతమవటానికి కారణం?" అని ప్రశ్నించింది. "నీకు తెలుసు ఆ సంగతి, తెలిసి మరీ అడుగుతావెందుకు?" అనగానే నాకే నవ్వు వచ్చింది. నవ్వి "అవును కీర్తి కండూతి కారణం కావొచ్చు?". "అందరు నీ రచనలు చదవాలని, అందువల్ల నీకు మెప్పు రావాలని అనుకోవటం తప్పు కాదే. ఎందుకలా పరుష పదాలు వాడుతావు ?" చిన్నగా మందలించింది.

"తెలీదు. కాని ఇతరులు మెచ్చు కొన్నప్పు డల్లా మెప్పుకు ఆనందపడుతున్నావు అని నువేగా నన్ను హెచ్చరించేది" మనోజపై నిష్టూరమాడాను. "తప్పదు. నీవు భోగివో-జోగివో నీకు నీవు అర్థమయే వరకు లేక ఏదో ఒక వైపు పూర్తిగా మొగ్గే వరకు నా ఈ హెచ్చరికలు ఆగవు" తన తీర్పు. "సరే కాని. అర్థ రాత్రి పన్నెండయింది. రేపు work place based assessmentsకు తయారవాలి. పొద్దునే ఆరుకు లేవాలి. పోయి పడుకో. మళ్లీ కలుద్దాం" అని మళ్లీ తనే పలికి కనిపించకుండా పోయింది.


"మనోజా ఆగు. సాయంత్రం నిద్ర పోయాను కదా. నిద్ర రావట్లేదు." అన్న నా మాటలకు మవునమే తన జవాబయింది. "ఇదేం ప్రారబ్ధం. చిన్నప్పుడు అమ్మ కూడా ఇంతగా నన్ను శాసించలేదు" అని గొణుగుతూ నిద్రకు ఉపక్రమిస్తూంటే లీలగా తన నవ్వు వినపడింది. ఉడుక్కుంటూ నిద్రలోకి జారుకున్నా.

1

శారదా ఉపాసన
మేల్కొనె నీ పదంబు మనమునన్జను భావుకతన్తెలుప, నే
పల్కెడు నీ రసంబునను పెన్మునిగిన్కవితల దొంతరు
ల్లెల్లను నీ పదాంబుజములన్చవి జూడ తపించు లేత పూ
వల్లరు లీ నిజాంతరము విడ్వను జూడకు మీవు శారదా

పద విభజన
మేల్కొనెన్ ఈ పదంబు మనమునన్ జానూ భావుకతన్ తెలుప, నే
పల్కెడు, నీ రసంబునను పెను మునిగిన, కవితల దొంతరు/లు
ఎల్లను నీ పదాంబుజములను చవి చూడ తపించు లేత పూ
వల్లరుల్. ఈ నిజాన్తరము విడ్వను జూడకుము ఈవు శారదా.

ఛందస్సు
ఉత్పలమాల
భ ర న భ భ ర వ
UII UIU III UII UII UIU IU
మొత్తం అక్షరాలు =20
యతి స్థానం =10

2

2. లక్ష్మీ ప్రార్థన
అగ్ర పూజలు లేవను వైరిన్ అన్యుని శాపము తీర్చేనా
గో గ్రహణ్య రణ వ్విజయున్డున్గోరు నిజాంతర వాసి. నీ
వగ్ర పూజలు లేవను కిన్కన్వీడుము పుత్రవధూ సమే
త గృపా రసమున్తరియిన్చన్తల్చెడు వాడను పద్మినీ.



పద విభజన
అగ్ర పూజలు లేవు అను వైరిన్, అన్యుని, శాపము తీర్చేన్ ఆ
గో గ్రహణ్య రణ విజయుండునున్ గోరు నిజ అంతర వాసి. నీ/వు
అగ్ర పూజలు లేవు అను కినుకను వీడుము. పుత్ర వధూ సమే/త
కృపా రసమున్ తరియించన్ తల్చెడు వాడను పద్మినీ

తాత్పర్యము
"అగ్ర పూజలు లేవు" అను వైరిన్, అన్యుని ("అగ్ర పూజకు అర్హుడు కాడు" అనే తన వాడు కాని శత్రువుని = రాజసూయ యజ్ఞ శాలలో కృష్ణుని అగ్రపూజకు అడ్డుపడ్డ శిశుపాలుని) శాపము తీర్చినాడు (చంపి జయ-విజయులలో జయుని శాపము వలన కలిగిన రెండో జన్మ అంతం చేసినాడు ) ఆ గోగ్రహణ రణ విజయుండు (గోగ్రహణం చేసిన కౌరవులను ఓడించిన వాడు= అర్జనుడు) గోరు (కోరుకొనే) నిజాంతర వాసి (మనసులో ఉండే వాడు=కృష్ణుడు). (అలాగే) నీవు (కూడా) అగ్ర పూజలు లేవని కినుక(=అలుక) వీడుము. పుత్ర వధూ సమేత (కోడలితో పాటు =సరస్వతీ తో పాటు నీ యొక్క ) కృపా రసమున మునగ తలచు వాడను (నేను) పద్మిని (ఒ లక్ష్మి దేవి.)

ఛందస్సు
చంద్రకళ
RA SA SA TA JA JA GA
UIU IIU IIU UUI IUI IUI U
మొత్తం అక్షరాలు =19
యతి స్థానం =11

3

3. నరసింహున్డిలవేల్పు మాధవమునన్జన్మంబు మేల్వెల్గెడీ
భరతంబున్గల ఆంధ్రనాదరమునన్బెర్గం దివిన్మెర్యు నా
శిరసా మ్రొక్కెద నేను పంచఋషుల న్శ్రీవత్సగోత్రస్థునై
మరు జన్ముండినc గోరెద న్దిరిగి మేల్మేలైనీ తల్దండ్రులన్.


పద విభజన
నరసిహుండున్ ఇలవేల్పు, మాధవమునన్ జన్మంబు, మేల్ వెల్గెడీ ]
భరతంబున్ గల ఆంధ్రన్ ఆదరమునన్ బెర్గన్, దివిన్ మెర్యున్ ఆ
శిరసా మ్రొక్కెద నేను పంచ ఋషులన్ శ్రీవత్స గోత్రస్థు నై
మరు జన్ముండినc గోరేదన్ దిరిగి మేల్ మేలైన ఈ తల్ దండ్రులన్

మత్తేభము
స భ ర న మ య వ IIU UII UIU III UUU IUU IU
యతి స్థానం= 14 మొత్తం అక్షరాలు=20

నా పరిచయం

నరసింహున్డిలవేల్పు మాధవమునన్జన్మంబు మేల్వెల్గెడీ
భరతంబున్గల ఆంధ్రనాదరమునన్బెర్గం దివిన్మెర్యు నా
శిరసా మ్రొక్కెద నేను పంచఋషుల న్శ్రీవత్సగోత్రస్థునై
మరు జన్ముండినc గోరెద న్దిరిగి మేల్మేలైనీ తల్దండ్రులన్.

వాగ్ధేవి-శ్రీలక్ష్మి స్మరణ తరువాత నా పరిచయం ఈ మూడో పద్యం

Saturday, 26 January 2008

లక్ష్మీ ప్రార్థన

అగ్ర పూజలు లేవను వైరిన్ అన్యుని శాపము తీర్చేనా
గో గ్రహణ్య రణ వ్విజయున్డున్గోరు నిజాంతర వాసి. నీ
వగ్ర పూజలు లేవను కిన్కన్వీడుము పుత్రవధూ సమే
త గృపా రసమున్తరియిన్చన్తల్చెడు వాడను పద్మినీ.


అగ్ర పూజ వాగ్దేవికి కాగా "శ్రీ"లక్ష్మి అలిగి ఎక్కడ ఏకాకిని చేస్తుందో అని కలిగిన వెఱపుకు ప్రతి రూపమీ పద్యం .

Wednesday, 23 January 2008

1. సంధి కాలం మనుషులు

"ఛా అప్రాచ్యుడా. సంధ్య పూట ఏంటా మాటలు?" అమ్మ మొదలెట్టింది. "ఇప్పుడు నేను ఎమన్నానే? ఈ కాలం మనుషులు, ముఖ్యంగా నేను,సంధి కాలం మనుషులం అన్నాను అంతే కదా" అన్నాను అమ్మను ఉడికించటానికి. "వయసు పెరిగితే ఏం లాభం ఎప్పుడు ఏం మాట్లాడాలో, ఏం మాట్లాడ కూడదో తెలీనపుడు" అమ్మ చిన్నగా గొణుగుతూ వంటింటి వైపు వెళ్ళింది. నేను నవ్వుతూ మిత్ర గణం వైపు తిరిగా.

"ఎందుకు రఘు అమ్మను అలా ఏడిపిస్తావు పాపం?" అంది వసూ. "అసలు రఘు అలా ఎందుకన్నాడో చెప్పని వసూ, తరవాత తనను అడుగుడువు కాని" నాకు వంత పాడింది శిరి. అవును మరి, నా మిత్రులలో అందరికంటే ఎక్కువగా నన్ను ఇష్ట పడేది తనే మరి. వీరిద్దరి మాటలకు చిరునవ్వు చిందిస్తూ మౌనంగా కూర్చున్నాడు వీరు. మొహంలో ఏ భావం లేనిది పవన్ ఒక్కడిదే, నిశ్చలంగా ఉన్నాడు.

నేను, వసూ, శిరి, వీరు, పవన్ అందరం వైద్య విద్యార్థులం. వృత్తితో పాటు ప్రవృత్తులు కలవటం మూలాన ప్రాణ స్నేహితులం కూడా. విద్యాలయానికి మా ఇల్లు దగ్గరవటంతో అది మాకు ప్రధాన కూడలి. అమ్మ, నాన్న, చెల్లెళ్ళు అందరు కలిసే వారు మా ఇలాంటి చర్చల్లో. ఇవాళ అమ్మ ఒకటే ఉంది మా చర్చా సమయంలో.

నేను సర్దుకుని కూర్చుని చెప్పటం మొదలు పెట్టాను "ఉదాహరణకు మన వివాహ వ్యవస్తనే తీసుకుందాం. మనం ఎంత మంది మన స్నేహితులను చూడలేదు పెళ్ళిళ్ళ వెబ్ సైట్లలో అభిరుచులు కలిసిన వారిని వెతుక్కొని మిగితా కర్యక్రమమంతా పెద్దలకు అప్ప చెప్పటం. అంటే వారు మధ్యే మార్గంగా ఈ arranged love marriages చేసుకున్నారు అనమాట. దీన్నే నేను సంది కాలం ప్రవర్తన అంటాను."

"కాని అందులో తప్పేంటి రఘు. అరగంట పెళ్లి చూపులలో చూసుకొని, ఒక రెండు మూడు సార్లు తరవాత మాట్లాడుకొని, నూరేళ్ళు కలిసి జీవించే వ్యక్తిని ఎన్నుకోవటం కంటే, పరిచయం చేసుకొని, అభిరుచులు కలుపుకొని, పెద్దల ఆధ్వర్యంలో, వారి ఆశిర్వాదంతో పెళ్లి చేసుకోవటంలో తప్పేమీ లేదు కదా." వసు అనుమానం. "అందులో వెబ్ సైట్స్, ఇమైల్స్ ద్వారా అయితే అమ్మాయిలకు సేఫ్, అబ్బాయిలకు ఖర్చు ఉండదు, తల్లి తండ్రులకు మనశ్శాంతి" శిరి మాట సాయం చేసింది.

"ఇక్కడ తప్పొప్పుల ప్రసక్తి ఎక్కడ ఉంది" మొదటి సారి నోరు విప్పాడు పవన్. ఒక మాట కూడా పొల్లు మాట మాట్లాడక, ఆలోచించి మాటాడే నిండు కుండ. పవన్, వీరు ఇద్దరు "విపాసన" అనే యోగ లేక ధ్యానం సాధన చేస్తారు. ఇది మనం పీల్చి వదిలే గాలి దగ్గర నుంచి , మనం మాటాడే ప్రతి మాటకు, జరిగే ప్రతి సంఘటనకు మన శరీరం, ఆ పై మనసు ఎలా స్ఫందిస్తాయో గమనించటం, తద్వారా ఆ స్ఫందనలకు కళ్ళెం నేర్పుతుంది అని, సాధన చేస్తే మన జీవితంలో జరిగే ఏ సంఘటనకు చలించకుండా మనసును రాగ ధ్వేష రహితంగా మలచుకొని జీవించటం నేర్పే అద్భుత విద్య అని ఈ ఇద్దరిని చూసిన తరువాత అర్థం అయింది మాకు.

"మరి లేక పొతే ఏంటి పవన్. మనం సంది కాలం మనుషులమా? తులసి తీర్తానికి కాచుకున్న వాళ్ళమా?" అమాయకంగా అడిగింది శిరి. తనలో నాకు నచ్చిన విషయాలలో ఇది ఒకటి. తనకు తెలియని విషయం ఏదైనా కించ పడకుండా అడిగి తెలిసుకుంటుంది. అలా అడిగేటపుడు పెద్దవయే ఆల్చిప్పల్లాంటి ఆ కళ్లంటే మరీ ఇష్టం. అలా ఎంత సేపైనా ........


"చూసింది చాల్లే కాని చెప్తావా రఘు" వసు దాబాయింపు. "చెప్పుకోండి చూద్దాం" అన్నాన్నేను. "సంధి కాలం అంటే అసలు ప్రాణం పోయే కాలం అని కాదు అర్థం. రెండు వేర్వేరు స్థితుల మధ్య ఉండే ఆ transition period అన మాట. ఉదాహరణకు పగటికి రాత్రికి మధ్య ఉండే సంధ్యా కాలం, నువ్వు అన్నట్టు జీవనం-మరణం మధ్య ఉండే ఆ కాలం ఇవన్ని సంధి కాలానికి ఉదాహరణలే" వివరించటం ఇప్పుడు వీరు వంతు అయింది. ఎక్కడో నాకు భాష ఎక్కువ వచ్చు అని నేను పడే చిన్న మొత్తం గర్వం పోయే గుణాలున్న వాడు వీరు. ఎక్కడో చిన్న పల్లెలో పుట్టి, కష్టాల మధ్య పెరిగినా కూడా, పుస్తకాల ద్వారా, స్నేహితుల ద్వారా మంచి భాష, జ్ఞానం, తత్వ చింతన అలవరచుకొని, రాగ ధ్వేషాలను విడనాడి, అందరిలోనూ మంచి తనం ఉంది, నేర్చుకోనేవి ఉంటాయి అని నమ్మి ఆచరించే వాడు మా వీరు. నా దృష్టిలో అసలైన బ్రహ్మత్వానికి నిదర్సనం.

ఈసారి ఆరాధనగా కళ్ళు అప్పగించి చూడటం వసు వంతు అయింది. వీరుని కళ్ళల్లో పెట్టుకొని పూజించే మూగ ప్రేమికురాలు. "చూడు చూడు" అన్నట్టు కనుబొమలెగరేసి చూపింది శిరి. "ఉష్ ఉర్కో " అని నేను కళ్ళతోనే వారించి చెప్పటం మొదలెట్టాను. "ఇక్కడ నేను సంధి కాలం అన్నది విమర్శగా కాదు. ఒక చిన్న observation మాత్రమే చేశాను. కాకపోతే వాడుకలో "సంధి వాగుడు" లాంటి మనకు నచ్చని వాటికి ఉపయోగిస్తాం కాబట్టి మీరందరూ నేను అభ్యంతరం చెప్తున్నా అనుకున్నారు."

"ఇంతకూ ఈ ఆలోచన నీకు ఏ సందర్భంలో వచ్చిందో తెలిస్తే ఇంకొంచం విశ్లేషణ చేయ వచ్చు" అన్నాడు పవన్. "చెప్పనా" అన్నట్టు శిరి వైపు చూసా. "చెప్పు ఇక్కడ పరాయి మనుషులు ఎవరు?" నిర్మలంగా శిరి జవాబు. "ఏం లేదు. నిన్న మేము ఇద్దరం SPM (Social and Preventive Medicine) క్లాసు ఎగ్గోట్టింది ఇది చర్చించటానికే. మీకు తెలుసు కదా మా అమ్మ స్మార్థ, నాన్న మధ్వ అని. ఇవి బ్రాహ్మణులలో ఉన్న సవా లక్ష విభాజనలలో రెండు. అసలే నేను ఎవరిని? మధ్వనా స్మార్థనా అని ఇప్పటివరకు తీరని identity crisis లో ఉన్నాను. ఎందుకంటే అన్ని అమ్మ నేర్పిన స్మార్థ ఆచారాలే ఇంట్లో పాటించేది కాని ఎంత నేర్చినా, మనసులో ఎక్కడో దాగి ఉన్న నా పురుషాహంకారం, ఈ పితృ స్వామ్య వ్యవస్థ రెండు నన్ను స్మార్థ అని వప్పుకోవు.

ఆ పైన శిరి మళ్లీ స్మార్థ. అంటే మాకు పుట్టబోయే పిల్లలు ముప్పాతిక శాతం స్మార్థలె. అయినా నా పురుషాహంకారం వలన, ఈ పితృ స్వామ్య వ్యవస్త వలన వారిని మధ్వలుగా పెంచటం ఎంత వరకు సమంజసం?" ఆవేదనగా ఆవేశంగా చెప్పాను నా మథన. నన్ను శాంతింప చేయటానికి పండిన గోరింటాకుతో ఎర్రగా మెరుస్తున్న తన ముని వేళ్ళతో నను తాకింది శిరి. ఒక నిమిషం మౌనంగా ఉండి మళ్లా చెప్పటం మొదలు పెట్టాను, "ఇది మాట్లాడుకొంటున్నపుడు టక్కున ఈ ఆలోచన వచ్చింది మెదడులో, ఇలా ఇన్ని రకాలుగా ఈ మారే కాలంలో మనం అందరం సంధి కాలం వాళ్లమని." ముగించాను.

"అవును రఘు. నీవన్నది కూడా నిజమే. నిన్న అన్నయ UK నుండి ఫోన్ చేసినపుడు అక్కడి తన సహోద్యోగుల గురించి మాటల వరసలో చెప్పాడు, అందరు ఇలాంటే వారే ఆట అక్కడ. తెల్ల-నల్ల జంటలు, మన దేశం-పరాయి దేశం జంటలు, ఉత్తర-దక్షిణ భారత జంటలు, కన్నడ-అరవం జంటలు, తెలుగు-మలయాళం జంటలు ఇలా చాల మంది ఉన్నారట. వాడి భాషలో వాళ్ళ పిల్లలంతా Hybrids అంటాడు " వసు మాటలతో మనసారా నవ్వుకున్నాం అంతా. "అందరు రఘు లాగ మధన పడుతుంటారా ?" వీరు ప్రశ్న. "ఏమో, ఆ సంగతి తెలీదు" వసు జవాబు.

"నేను అనుకోవటం రఘులాగ ఆలోచించే వాళ్ళు కొద్ది మందే. ఎందుకంటె వాడు వాడన్నట్టే సంధి కాలం మనిషి. ఇటు పూర్తిగా సంసారి కాదు "నా పెళ్ళాం బిడ్డలు నేను చెప్పిన మాటే వినాలి, న్యాయం ఎటు వైపు ఉన్నా" అనేందుకు. ఎందుకంటే న్యాయం గూర్చి ఆలోచిస్తాడు కనక. అటు పూర్తిగా విరాగి కాదు పిల్లలు ఎలా పెరిగినా పరవాలేదు, నా కోర్కెలను నేను లెక్క చేయకూడదు, న్యాయమైనది చేసేయాలి అని చెప్పేందుకు, ఎందుకంటె ప్రాపంచిక విషయాలపై మక్కువ ఇంకా ఉంది కనుక. ఇంకో ఉదాహరణ చెప్పనా? ఎంత శ్రద్ధగా, ఇష్టంగా మంగళంపల్లి పాటలు వింటాడో, అంటే ఇదిగా మాలతి పాడే మాస్ పాటలు కూడా ఇష్టపడతాడు. ఇలాంటి త్రిశంకు మనిషితో నెట్టుకు రావాలంటే నీకు చాలా ఓర్పు ఉండాలి." వీరు ముగించాడు.

"అంతే కాదు శిరి, చాలా Indecisive కూడా. ఇంత బాధ పడుతున్నడా ఈ విషయం గురించి? నేను పందెం వేయగలను దీని గురించి నీకు Propose చేసి, మీ వాళ్ళను ఒప్పించి నీతో మనసు ముడివేసుకున్న ఈ గత మూడు సంవత్సరాల నుంచి ఇలా బాధ పడుతూనే ఉండింటాడు. సరే ఇది సమస్య, ఇవి పరిష్కారానికి ఉన్న మార్గాలు, ఇది నాకు నచ్చినది లేదా ఇది సరైనది అని ఒక నిర్ణయం తీసుకోవటానికి చాలా సమయం తీసుకుంటాడు. ఇలాంటి చిన్న విషయమైతే పర్లేదు కాని రేప్పొద్దున పెద్ద పెద్ద విషయాలలో ఈ ఆలసత్వం నష్టం చేయొచ్చు, జాగ్రత్త. సమయం వచ్చింది కాబట్టి చెపుతున్నా." స్వభావ విరుద్ధంగా చాలా సుదీర్ఘ భాషణ చేసాడు పవన్. ఎంతగా చదివాడు నా స్వభావాన్ని, వ్యక్తిత్వాన్ని? ఇంత నిక్కచ్చిగా, సున్నితంగానే ఖచ్చితంగా నిజం చెప్ప గలిగిన స్నేహితులను పొందటం నిజంగా నా అదృష్టం.

ముని వేళ్ళతో తప్ప నన్ను ఇప్పటి వరకు తాకి ఎరుగని శిరి నా వెనుకకు వచ్చి, నా భుజాల మీద రెండు చేతులు ఆన్చి ఉద్వీగంగా చెప్పటం మొదలెట్టింది "మీరు చెప్పింది నిజమే. రఘు రెండు విలువలల మధ్య ఊగిసలాడే మనిషే. దీని వలన కొంచం ఆలసి కూడా. అయితే ఏం? ఎంత మంది మగవాళ్ళు అసలు ఆలోచిస్తారు ఇలా? అంతగా ఆలోచించే విలక్షణమైన వ్యక్తిత్వం కలవాడు కాబోయే నా భర్త.

పైగా ఇలాంటి సమస్యా పరిష్కారానికి కృషి చేసే భాద్యత తన ఒక్కడిదే కాదు, కాబోదు. ఎలా తన ముక్కు పిండి మరీ ఇంటి పనిచేయిస్తానో, పిల్లల బరువు భాద్యతలు అప్ప చేపుతానో అలాగే సంసార సమస్యా పరిష్కారాలకి నా వంతు సగం భాద్యత ఉంటుంది, తప్పక నేనూ అందుకు కృషి చేయాలి, చేస్తాను. తను ఎన్నటికి వంటరి కాడు. పైగా మా వ్యక్తిత్వాలు ఇంతగా తెలిసిన మీ లాంటి మిత్రులు ఉన్నంతవరకు ఎన్ని సమస్యలు వచ్చినా ఫరవాలేదు" ముగించింది శిరి.

ఇంతవరకు లోపలి నుంచే విన్న అమ్మ, వంటింటి నుంచి చేతులు తుడుచుకుంటూ వచ్చి "ఉద్యోగం చేయటం మా హక్కు, చేస్తున్నాం కనుక ఇంటి పని చేయటం మీ భాద్యత అని తమ హక్కులు సాధించుకోవటమే కాక, ఇంటి అన్ని భాధ్యతలలో సగం మావే అనే మీ లాంటి నవతరం వాళ్లున్నప్పుడు ఏ సంధి కాలమైనా మీ ముందే బలాదూరే" అని నుదిటిన ముద్దు పెడ్తే సిగ్గుల మొగ్గే అయింది శిరి, మా ఇంటికి నిజమైన సిరి.

Tuesday, 22 January 2008

అంతర్యుద్ధం

మనసూ బుద్ది నిత్య వైరులైతే జీవితం ఇంతే

అందమైన అమ్మాయి-నచ్చిన వ్యక్తిత్వం,
మెచ్చిన చిత్రం-చక్కని సంగీతం.

"నాది, నాకు" మనసు ఆరాటం,
అనుభూతులకై అర్రులు జాచటం.

"శరీరం బూడిదే, మరణం తధ్యం",
చెళ్ళున చరిచె మనం, మరుక్షణం.

భోగినో, జోగినో- అర్థం కాదే
త్రిశంకు జీవితం- పెద్ద బాధే.

Sunday, 20 January 2008

నా 2008 డైరీ మొదటి పుట

నిన్న-నేడు-రేపు

నిన్న సూన్యం-తిరిగి రాదు,
రేపు మాయ-ఎవరికెరుక,
ఉన్నది ఒకటే నిజం,
"నేడు" ఉన్న సమయం .

గడిచిన వాటికి వగవకు,
వచ్చే వాటికి వెరవకు,
"ఇప్పుడు"లో బ్రతకటం మరవకు.

నిన్నటి నుండి నేర్చుకో,
రేపటికి దాచుకో.

జీవించేది మాత్రం "ఈరోజు" అన్నది మరువకో.

నేను ఎవరు ?

ఒక బ్లాగ్లో నా signatureలా వాడుకున్న నా పరిచయం.

ఏమని చెప్పేది నేనెవరంటే ?
ఎందరి భావాల కలయికో నేనంటే.

శంకర శాస్త్రి-సిరివెన్నెల,
మంగళంపల్లి-సూర్య దేవర.

సినిమా పాటలు-చదివిన నవలలు ,
పొందిన అనుభూతులు-చేసిన స్నేహాలు.

తల్లి తండ్రుల నేర్చిన సంస్కారాలు,
స్ఫందించే మనసు గుప్పెడు.

నేనంటూ విడిగా లేనే లేను,
పైవన్నీ కలిస్తేనే నేనంటూ ఉంటాను.

పతనమా లేక పరిణామమా ?

మన తెలుగు భాషలోను, సాహిత్యం లోనూ, జన జీవనం లోనూ వస్తున్న మార్పులని దిగాజారటం అని అనుకునే నేను, దాని గూర్చి ఆలోచిస్తూ పడ్డ మధనకు ఇది అక్షర రూపం. ఇది వ్రాయటానికి నన్ను తన ఆవేదనతో తెలికుండానే ప్రోత్సహించిన కలం స్నేహితురాలికి కృతజ్ఞతలు.

పతనమా లేక పరిణామమా ?

"బండి ర" ను జనం మరచి పోతున్నారని మధనపడే నేను
నేర్వని "లు లూ "ల ఉసే మరిచాను
"షంకర" అని బాలు కూడా ఖూని అరచేను
రోజు నేను చేస్తున్న ఖూనిల ఎరుకే ఎరగను

స్నానం చేయకనే వంట చేసే శ్రీమతిపై మండేను
కానీ తలవీడిన "శిఖను" తలవను
పూజలు పునస్కారాలు చేసే నేను
"చిత్త సుద్ధి లేని------" అన్న నానుడి మరచాను

భాష లోపించింది అని ఘోషించే మిత్రమా
నిజంగా అది లోపమా ? పరిణామమా?

ఎక్కడ రాజులు? ఎక్కడ పోషకులు? ఎక్కడ భ్రుతి?
పోషణ లేని కళలు ఎలా బ్రతికేను ఈ జగతి ?
లేకపోతే రాజ రాజ నరెంద్రుని ఆస్థానం
ఉండేదా అప్పటి నన్నయ కృతి ?

ప్రజాస్వామ్యం వచ్చిందని సంతసించే మనం
కొంత మూలం చెల్లించక తప్పదని మరిచాం
ఉండుంటే ప్రజాస్వామ్యం, కులికేనా
శ్రీనాధ కవి ఒక్కడు ముత్యాల పల్లకీన.


గుర్తు పట్టకలవా నేస్తం రాయల నాటి మన తెలుగు అక్షరం ?
అ"క్షరం" అంటూనే చూడమా దాని పతనం?
ఏడుస్తూనే కూర్చున్నామా మనం ?
లేదే, అక్షరాన్ని సర్దుకొని మరీ ముందుకు పోయాం.

అంటావు సాహిత్యపు విలువలు తరిగాయి
కానీ ఏది విలువల గీటురాయి?
అంటావు కళామతల్లి వలువలు మాసినవని
అందరు మెచ్చే వాటిని కాదనటం మనం ఎవరిమని?

నీకు నచ్చిన భాష వాడు, మెచ్చినవి ఆచరించు
మిగితా వారు అలా లేరని వగవకు నేస్తం
"తన కోపమే తన శత్రువు ----"
మరువకు ఈ సుభాషితం

అలా కాదని అంటావా, నీ ఇష్టం
కదులుతూనే ఉంది కాలం క్షణం, యుగం
జరిగే పరిణామం జరుగుతుంది
చివరక నీకు అశాంతే మిగిలేది.

సంక్రాంతి పై మరోటి

సంక్రాంతి పై నేను ఒక గుంపులో రాసిన మరో చిన్న కవిత. ఆ గుంపులో ఇతరుల జ్ఞాపకాలు చదివితే హైదరాబాద్లో పెరిగి మేము ఏం కోల్పోయామో అర్థమయింది. మాకు గాలిపటాలు, తిండ్లు, ముగ్గులు తప్పితే ఇంకోటి తెలీవు సంక్రాంతి సంబరాలు.


మీ అందరికి సంక్రాంతి శుభాకాంక్షలు
గుర్తుకోచాయి చిన్నప్పటి సంక్రాంతి విశేషాలు


డాబా మీద గాలి పటాలాటలు
"అర గీటి" "గీటి" అని మేము కొన్న "మాంజాలు "
గుల్జార్ హౌసులో వాటికి వెతుకులాటలు
మా గాలి పటాలని ఆపే కరెంటు తీగలు
"కాటే కాటే " "డీల్ డీల్ అనే అరుపులు
అంబరాన సాగే పోరాటాలు

ఎప్పుడూ చూడని భోగి మంటలమీద ఫ్యాన్టసీలు
ఎప్పుడో ఒక సారి చూసిన హరిదాసు గీతలు
కొన్ని సార్లు చూసిన డూ -డూ బసవన్నలు
ఎప్పుడూ చూస్తూనే వున్న రథం ముగ్గులు , గొబ్బిళ్ళు

గుర్తుకొచ్చాయి చిన్నోల్ల భోగి పళ్ల సంబరాలు
కింద పడగానే ఎరుకునే రేగుపళ్లు , చిరు పైసలు


మీకందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు
మధుర స్మృతుల , మధుర అనుభూతుల ఆశింపులు.

సంక్రాంతి శుభాకాంక్షలు

పండుగ అయిపోయాక ఇప్పుడేం శుభాకాంక్షలు అంటారా? మొన్న సంక్రాంతికి నేను పంపిన శుభాకాంక్షలు ఇక్కడ జత చేస్తున్ననండి అంతే. ఇది దేశం బయట ఉండి మేము ఏదో కోల్పుతున్నాము అని అనిపించే నా భావనకు దర్పణం.




ప్రియమైన మిత్రులకు సంక్రాంతి శుభాకాంక్షలు

ఆనందపు ఎద సదులే సన్నాయి రాగాలు
పులకించే మనసు వేచ్చాతనాలే భోగి మంటలు
సైబర్ వీధిన ఎగిరే మేసజిలే గాలి పాటలు
మనకు అర్థం కాని ఈ విదేసీయులే డూ డూ బసవన్నలు
మనం వండుకునే ఫ్రొజెన్ ఫుడ్డే జొన్న రొట్టెలు , పులగాలు
ఇలా జరుపుకుందాం మన తలపులలోనే సంక్రాంతి సంబరాలు

ప్రియమైన మిత్రులకు సంక్రాంతి శుభాకాంక్షలు

పరిచయం

చతుస్సాగర పర్యంతం గో భ్రాహ్మనేభ్యో శుభం భవతు.

భార్గవ చ్యవన ఆప్లవన అవురవ జామదగ్న్య పంచ రుషేయ ప్రవరాన్విత శ్రీవత్సస గోత్రోత్పన్నోహం రాఘవేంద్ర శర్మన్యహంభో అభివాదయే.


(ప్రవర చెప్పటం పరిచయం చేసిన అవధానుల భాస్కర శర్మ గారికి కృతజ్ఞతలు. Transliteration కుదరక కొన్ని అచ్చు తప్పులు దొర్లిన మాట నిజమే, క్షంతవ్యుడిని.)

ప్రస్తావన

చిన్నప్పటి నుంచి ఏవో గెలకటం అలవాటు. వాటిని నలుగురితో పంచుకోవాలనిపించింది. ఆ కోర్కె ప్రతి రూపమే ఈ నా చిన్న ప్రయత్నం. అమ్మ కటాక్షం ఉన్నంతవరకు ఇది సాగుతుంది. వాదనకు, తర్కవితర్కాలకు తేడా తెలిసిన వారి విమర్శ సదా స్వాగతం.

నాంది

శారదా ఉపాసన

మేల్కొనె నీ పదంబు మనమునన్జను భావుకతన్తెలుప, నే
పల్కెడు నీ రసంబునను పెన్మునిగిన్కవితల దొంతరు
ల్లెల్లను నీ పదాంబుజములన్చవి జూడ తపించు లేత పూ
వల్లరు లీ నిజాంతరమునున్విడ జూడకు మీవు శారదా!



ఇప్పటి నా సుస్థితికి కారణమైన ఆ వాగ్దేవినే మొదట తలిచేది.