తప్పకుండా. అసలయితే బుద్ది ప్రేమించగలిగిన స్థితి వచ్చినపుడే తారాస్థాయేమో.
మనసుదేముంది కాలుతున్న పెనం మీద నీళ్ళు పడితే చాలు చు..య్ మన్నట్టు అది స్ఫందిస్తూనే ఉంటుంది
కాని ఆ మనసుకు లంగరేసి నిశ్చలం చేసే పని బుద్దిదే.
ఆ బుద్ది ఒకరి మీద లగ్నమవటమే లగ్గమేమో
అలాగా? మనసులో ఆ ఉధృతిలేకపోయినా, ఆ ఉధృతి తగ్గి యుగాలయినా...పరిస్థితులకు తల ఒగ్గి దూరమయిన ఒక మూర్తిని ప్రతిష్టించేసుకోవటం నీకయితే తపములాగా ఉందేమో నాకయితే ....ఏకవస్త్రను, నిర్మానుష్యమే అయినా, సభాస్థలి మధ్యంలో వివస్త్రను చేసే దుశ్శాసనుడే గుర్తుకొస్తాడు ఆవేశం లేని ప్రేమను నిలుపుకునే వాళ్ళను చూస్తె.
సీతమ్మ అశోకవనిలోనూ, వాల్మీకి పంచనూ నిజంగా ఆవేశం అనుభవించి ఉంటుందంటావా?
నీకూ సీతమ్మకూ పోలికా?
కాదులే పిపీలకాన్నే. కాని ప్రశ్నను సైద్ధాంతికంగా తీసుకో.
ఏమో..రామాయణం తెచ్చిపెట్టుకున్నావు కాని చదివిందెపుడూ? సరే నువ్వనుకున్నట్టే జానకీ దేవి ఆవేశంలో లేదు అనుకుందాము. కాని వారు భార్యా భర్తలు. సంసారంసప్తకంలో ఆవేశం మొదటి అడుగుమాత్రమే. వారు ఆ స్థితి దాటి ఎన్నో ఏళ్లు అయి ఉంటుంది. కాని దగ్గరవ్వని ప్రేమికులకు ఆ అదృష్టం లేదుగా. ఆవేశం స్థాయిలోనే విడిపోయే వారు ఆ ఆవేశాన్ని నిలుపుకోలేకపోవటం ప్రేమ లేకపోవటమే. ప్రేమలేనప్పుడు మంకుతనంగా తన మనసున కొలువైన దేవినైనా తలచుకోవటం కీచకపర్వమే. వలలుడు లేని విరాట కొలువు మనసు కాబట్టి అంతగా విర్రవీగిపోతారు ఈ పరితప్త వియోగులు.
ఎంత అహం? ఎంత పొగరు? ఎంత కావరం?
ఏమన్నావు పాణిగ్రహణం చేయని స్త్రీ పురుష ప్రేమ అనుబంధం కాదా? దానికి పరిణామక్రమముండదా?
అది ఆవేశం స్థాయి దాటకుండా నిలిచిపోయే జడమా?
భౌతికంగా దగ్గరకాని జంట సంసారం చేయలేదా?
సంసారపక్షమైన స్థిరత ఆ జంటకు ఉండదా?
కాబట్టి ఆవేశమే ఆ జంట అస్తిత్వమా?
తెల్లటి పువ్వును పిప్పి చేసి, ఆ పిప్పిని పేని పలుపుతాడు చేసి, ఆ పలుపుతాడును పసుపు తాడు చేసి, అందరి ఎదుటా గొడ్డుకు మచ్చపొడిచి ఈ గొడ్డు నాది అంటూ పదుగురుకు దండోరా వేస్తె తప్ప అది సంసారం కాదు. మూడు ముళ్ళూ, ఏడు అడుగులూ, జిలకరా బెల్లం వంటి చిహ్నాలే వ్యవస్థ అస్థిత్వం అయిపోతున్న ఈ రోజుల్లో అలా అనుకోవటంలో తప్పేముందిలే. కలిసి ఉంటేనే సంసారమూ, భౌతికంగా కలిసి ఉంటేనే ఆ సంబంధపు పరిణామక్రమపు అడుగులు పడేవి అని ఈ తరం మనిషివైన నీవనుకోవతంలో తప్పేముంది.
కాని అది తప్పు. ఆవేశంతో జనించినదే ప్రేమ అయి ఉండొచ్చు. కాని ప్రేమకు ఆవేశమొకటే చిహ్నము, సంసారం చెయ్యకుండా ఆ ఆవేశం తగ్గటం పరిణామానికి కాదు పతనానికి చిహ్నం అనే నీలాటి వారిని చూస్తె ఏమనాలో అర్థం కాదు.
ఎలా చెప్పాలి మీలాటివారికి మానసిక సంసారం ఒకటుంటుందని? మానసిక వ్యభిచారం అంటూ అంతెత్తు లేచే మీరు మానసిక సంసారం ఉంటుందని ఎందుకు నమ్మరు? ఆ సంసారంలోని ఆవేశం, ఆవేశం నుంచి అనుబంధం, అనుబందానుగుణ పాశం......ఇవన్నీ ఏర్పడగలవనీ, ఆ పరిణామక్రమం భౌతికపరమైన ఏ సంబంధ పరిణామక్రమానికీ తక్కువ కాదనీ ఎలా మిమ్మల్ని నమ్మించటం?
No comments:
Post a Comment