పోనీ నువ్వన్నది ఒప్పుకున్నా ప్రేమలో ఇవి ఉంటాయి. కాని వ్యామోహం, ఆకర్షణా, కామం వీటితో మొదలయ్యే ప్రేమలు కూడా ఉంటాయా? వాటిని ప్రేమ అనాలా?
ఎందుకంత ఆశ్చర్యం? రోజువారి ప్రపంచంలో ఏం చూస్తున్నాము? లవ్ అట్ ఫర్స్ట్ సైట్ అంటే ఏమిటి? సర్వ సాధారణంగా ప్రేమ ఎలా పుడుతుంది? అసలు ప్రేమించాలి అని ఎందుకు అనుకుంటాము? ఏదో ఆనందం కోసమే కదా. ఆ ఆనందం ఎలా వస్తుంది? మనకు నచ్చినది స్వంతమయినప్పుడే కదా? స్త్రీ పురుషుల మధ్య ప్రేమ ఆకర్షణ, వ్యామోహం, కామం లేకుండా ఎలా పుడుతుంది? ఆ ఝల్లు లేకుంటే ప్రేమ స్త్రీ పురుషుల ప్రేమ మొలకెత్తేదెలా? ఆ ఆకర్షణా, వ్యామోహం, కామం లేని ప్రేమ ఉంటె దానికీ ఇద్దరు పురుషుల మధ్య కాని, ఇద్దరు స్త్రీల మధ్య కాని ఉండే స్నేహానికి దానికి తేడా ఏమిటి? మరి దానికి ప్రేమ అంటూ ప్రత్యేకమైన హోదా, నిర్వచనం దేనికి?
అంటే ముమైత్ ఖాన్నీ, డార్లింగ్ అయిపోయిన మున్నీని చూస్తె కలిగే కామం కూడా ప్రేమేనా?
మళ్ళీ డొంకతిరుగుడు ప్రశ్న. కామం, ప్రేమ ఒకటనటం లేదు. స్త్రీ పురుషుల ప్రేమలో కామం ఉంటుంది అంటున్నా. కామంతో, ఆకర్షణతో, వ్యామోహంతో మొదలయిన ప్రేమ కూడా సాధ్యమే అంటున్నా. అసలు అవే సర్వ సాధారణమేమో కూడా.
అంటే నిజమైన ప్రేమ, అమలిన శృంగారం ఇవన్నీ కట్టు కధలేనా?
నిజమైన ప్రేమ! నిజంగా ఎంత బూటకమైన మాట ఇది.
సమాజానికి, సమాజ శ్రేయస్సుకూ చేటు అనుకున్న వాటి ప్రాతిపదికన ఏది ఏర్పడినా అది అసత్యం అనేయటం మనకేప్పటినుంచి అలవాడిందో నిజంగా నాకు తెలీదు కాని చాలా బాగా అలవడిపోయాము. నిజమైన ప్రేమ అని నువ్వనుకునే వాటి ఉదాహరణలు తీసుకో....దేవదాసు? ప్రేమ స్వంతం కాలేదని జీవితాంతం ఏడుస్తూ కూర్చున్న వాడు. సరే ప్రేమకు, ప్రేమ రాహిత్యానికీ ఎలా ప్రతిస్ఫన్దించారు అన్నది ఇక్కడ ప్రశ్న కాదు కాబట్టి ఆ ఆఖరు వాక్యం అసందర్భం. దేవదాసు కాని, సాగర సంగమంలో బాలు కాని, మజ్నూ కాని, రోమియో కాని ఎవరైనా కాని ఎందుకు అంతగా బాధపడ్డారు? కోరుకున్న వారు స్వంతం కాలేదనే కదా? అక్కడ వారు కామం, వ్యామోహం, ఆకర్షణా .....వీటి కోసమే తమ జీవితాలను అలా చేసుకున్నారు అనను...కాని ఆ భావం లేకపోతె అంత మాధనపడరు ఎవరూ. పోనీ వారు నిజమైన ప్రేమికులు కాదు, నువ్వు విరహంలో ఉన్న వారినే తీసుకున్తున్నావు ఉదాహరణగా అంటావా? ఇంకెవరు నిజమైన ప్రేమికులు? పశుపతా? దక్షయజ్ఞానంతరం ఆయన కోల్పోయిందేమిటి, మరుడు తన తనువును పణంగా పెట్టి పున్ర్జన్మించినది ఏమిటి? ఆకర్శణో, వ్యామోహమో, కామమో....వీటిలో ఏదో ఒకటే కదా? ఇంకేది నిజమైన ప్రేమ? ఎవరు నిజంగా ప్రేమించి, భౌతికంగా కోరుకోని స్త్రీ పురుషుల ప్రేమోదంతం ఒకటి చెప్పు చూద్దాము.
నువ్వెందుకు నాలిక చివర్లకు వచ్చినా సీతారాములనూ, హరి-జ్యోతిల ఉదంతాన్ని ఉదాహరించలేదు? ఏదో ప్రత్యేకత ఉంది వీరి ప్రేమలో అని అనిపించి కూడా ఎందుకు పక్క పెట్టేసావు ఉదాహరించకుండా? వారిది కాదా నిజమైన ప్రేమ?
ఏమో మన్నూ. నాకలా అనిపించటం లేదు. నీ "నిజమైన ప్రేమ"లొ స్త్రీ పురుషుల మధ్య శారీరిక ఆకర్షణ ఉండకూడదు, అది తప్పు. ఆలోచించు. సీతారాములది ఆదర్శ దాంపత్యమా ఆదర్శ ప్రేమా? నాకు నిజంగా "నిజమైన" ప్రేమ అనేది ఉంది అంటే దాన్ని నిజంగా నిర్వచించినది హరి ప్రేమే అనిపిస్తుంది. సీతారాములది కూడా కాదు. రామాయణం మొత్తం భాద్యతల, ధర్మాధర్మాల మయం. అక్కడ నాకు తెలిసినంత వరకు ప్రేమ లేదు. కనీసం నాకర్థమయిన ప్రేమ లేదు. తనయిడిగా, తమ్మునిగా, రాజుగా ఆ అన్నాదమ్ములు తమ ప్రేమను ఎక్కించని బలిపీఠం ఉందా? వాళ్ళను కించపరచటం లేదు. వాళ్ళు ఆచరించినట్టు ధర్మాన్ని ఆచరించటం సులభతరం కాదు. కాని అక్కడ ప్రేమకు పెద్ద పీట వేసారు అంటే నాకు అస్సలు నమ్మ బుద్ది కావటం లేదు. ప్రేమించారు అణు ఒప్పుకుంటా. కాని "నిజమైన ప్రేమ" సీతారాములది అంటే అస్సలు నాకు నమ్మబుద్దేయదు.
కల్పిత పాత్ర అన్న చిన్న చూపు లేకపోతె సిరివెన్నెలలొ హరి పాత్ర నిజంగా ప్రేమను నిర్వచించే పాత్ర. నువ్వన్నట్టు "నిజమైన" ప్రేమ అది అని నేనను కాని చాలా ఉన్నతమైన ప్రేమ అని అంటాను. నిజంగానే జ్యోతి హరికి తగదు. "నా మనసున వెలిగే దేవిది ఏ రూపం, నా కంటికి తాకని సూన్యం...గుడిలో దేవత ప్రతిరూపం ఈ రూపం" అని ఎలుగెత్తే ఆ మురళీ రవాన్ని శరీరపు పెనుగులాట కోసం గొంతుచించుకుంటున్న కీచురాళ్ళ ధ్వనిగా అనుకోవటం నిజంగా జ్యోతికే సాధ్యం. ఇక్కడ హరి ప్రేమనే కాదు పెళ్లిని శరీరాల పెనుగులాటగా అభివర్ణించి పెళ్లిని కూడా అవమానించింది జ్యోతి. నిజంగానే చరిత్రహీన. కాని హరి ప్రేమ? ప్రేమ దూరమయినా తన వరాన్ని పొందికగా పెంచి పోషించిన పితృ రూపం ఆ ప్రేమ. తన స్ఫందనకు ప్రాణం పోసిన స్త్రీని నిర్భీతిగా కొలిచిన పూజారి రూపం ఆ ప్రేమ. అసలు అతను ఆ అర్చనను కోరుకోవటంగా తలచటమే ఇతరులు చేసిన తప్పు. హరి కోరుకుని ఉంటె అక్కడ సహచర్యమే. అతనిలోని రసికుడు అక్కడ కోరుకున్నది తప్పక తన రాసోద్భవానికి కారణమైన ఆ చేతనా పుంజాన్నే అయి ఉంటుంది.
అవును ఆ చేతనా పుంజం పూర్తిగా భౌతికం. అందులోనూ స్త్రీ స్పర్శ ఎరుగని యుక్తవయస్కుడు తొలిసారిగా, ఎంతో దగ్గరగా స్త్రీ శరీరాన్ని అది పుట్టించే స్ఫందననూ రుచి చూసాడు. అందులోనూ తాను స్త్రీని అతని పురుషుడూ అతనిలో ఎలాటి భావాలు రేగుతాయో తెలీని స్త్రీ కాదు జ్యోతి. అలాటి ప్రౌఢ సప్తవర్నాలనూ, సూర్యోదయలానూ, ప్రకృతి పరవళ్ళనూ కబోదికి తెలియపరుస్తుంటే తనలోని మార్పుకు కారణం ఏమిటో తెలియని అమాయకుడు కాదు హరి. అదీ ఒప్పుకుంటా. కాని అతను కోరుకునేది అక్కడ శారీరిక కలయిక కాదు. ఆ ఒక్క క్షణపు అద్భుతం కోసం జీవితాన్ని పణంగా పెట్టిన పిరికివాడు అస్సలు కాడు హరి.
అయినా చూసావా హరి ప్రేమలో కూడా ఎలా ఆకర్షణా, వ్యామోహం, కామం ఉందొ? అసలు నిజాయితీగా నిఖార్సుగా మాట్లాడుకుంటే అదే గుడ్డోడికి "ఆహా ఊహూ అంటున్నది ఇది ఆహా ఆహా ఓహో ఓహో అంటున్నదీ" అని పిచ్చిగంతులు వేసే స్నేహితుడు సూర్యోదయాలను ప్రకృతి పులకిన్తలనూ స్పర్సానుగతంగా తెలియ చేసి ఉంటె ఇంత సిరివెన్నెల కురిసేదా? ఆ రసికుడు తన మురళీరవాన నింపిన స్వరమాదురికు కారణమైన స్ఫందనలో నిజంగా స్త్రీ పట్ల ఆకర్షణా, కామం, వ్యామోహం లేవని, ఉండవని, ఉండకూడదని గుండెల మీద చెయ్యేసుకుని చెప్పగలమా మనం? లేదు. ఇక్కడ కూడా ఇంత "నిజమైన" లేదా "ఉన్నతమైన" ప్రేమ కూడా ఆశారీరికం కాదు.
అంత కలగాపులగంగా మాట్లాడతావు. ఇప్పుడేగా ఒక పెరాగ్రాఫులో హరిది శారీరిక కలయిక కోసం పరితపిస్తున్న ప్రేమ కాదు అన్నావు. మళ్ళీ అదే పేరా కిందలో అది సారీరికమే అని ఖరారు చేస్తావు. నీకు నిజంగా గుమ్మడి కాయంత వెర్రి.
:) అదెం కాదమ్మడూ. అర్థం చేసుకో. హరి ప్రేమకు పునాది కూడా స్త్రీ పురుషుల మధ్య ఎగిరిపడే ఆ భౌతికమైన మిణుగురులు అమర్చిన జ్యోతే అన్నాను రెండో పేరాలో. కాని ఆ జ్యోతిని నిరంతరం అలా వెలిగించేది మాత్రం ఆ వాంచ కాదు అంటున్నాను.
పోనీ అదే అనుకుందాము. ఎందుకు స్త్రీ పురుషుల సమాగమనం అంటే అంత హేళన అందరికీ. ఎందుకు దానిని అంతగా వేలేస్తారు దానిని? సృష్టి కార్యం, పరమం పవిత్రం అంటూ దానికి పవిత్రత తొడుగు కప్పాల్సిన అవసరం లేదు. సృష్టి కార్యానికని మొదలయిన ప్రయాణంలో అంతులేని వింతలు సృష్టించుకున్నాడు మానవుడు. ఆ వింతలూ, వినోదాలు, ఆ ముద్దు మురిపాల కోసమే అన్నది జగత్విదితం. కాని దాన్ని కేవలం ముద్దూ మురిపెంగానే కాక తమ ప్రేమ వ్యక్తీకరణలొ అధిరోహించే, అధిరోహించాల్సిన ఆఖరు సోపానం అనుకునే వారు ఎంతో మంది. అంతటి మధురమైన ఘట్టాన్ని ఎందుకు బూతనే పరదా మాటున మగ్గే లంజను చేయటం?
నోరు జారుతున్నావు...పడుపు వృత్తి వారంత దిగాజారారా నీ కళ్ళకు?
నీ కళ్ళలో ఎరుపు జీరలు వచ్చినా భయపడే వారు లేరిక్కడ. అమలిన శృంగారమట అమలిన శృంగారం. శృంగారమంటేనే ప్రేమైక అనురాగైక్యమైన రతీ కార్యం. అది మాలిన్యం ఎలా అయ్యింది? పోనీ నీ కంటికి శృంగారానికి, రతీ కార్యానికి తేడా లేదనే అనుకుందాము. తెలుగులో చెపితే బూతట, సంస్కృతంలో శృంగారమత. అలాగే ఇదీ అనుకుందాము. నీ ప్రకారం ఏవి మలినాలు?
ఒకరి కంటే ఎక్కువ మందితో కూడటమా మాలిన్యం? మరి బహు భార్యత్వం ఒకనాడు సభ్యసమాజామోదముద్ర పడిన ఆచారమేనే. జీవికకోసం తమకున్న దానిని పెట్టుబడిగా చేసి వ్యాపార వస్తువుగా మారిన మరుకాన్డనా నువ్వు మలినం అంటున్నది? కనీస అవసరాలకు భత్యమివ్వలేని రాజరీకం, మానప్రాణాలకు రక్షణ ఇవ్వలేని సమాజం, సమస్య ఉంది దానిని పరిష్కరించాలి అనుకోవటం పోయి చెత్తకుప్పల మీద మనుషులను పడేసి వారిని అసహ్యించుకునే సభ్య సమాజపు వ్రణరాజాన్నా నువ్వు మాలిన్యం అంటున్నది? తెలిసీ తెలియని వయసులో, భాద్యతగా చూసుకునే మగతనానికీ - నలిపి, నమిలి ఊసేసే పక్కిరితనానికీ తేడా తెలియని వయసులో సభ్యసమాజపు ఒరవళ్ళ వేగంలో కొట్టుకుపోతూ తప్పటడుగులు వేసిన వారినా నువ్వు మాలిన్యమనే కొరడా ఝుళిపించి జీవితాంతం కలంకితం చేసేది? విధి వాతపడి కనీస శారీరిక అవసరాలను తీర్చలేని వారిబారినపడి ధర్మమనే గాటికి కట్టుపడి ఉన్నా శారీరిక ధర్మానికి తలొగ్గిన పడతులను మాలిన్యమని తీసేసే మన సమాజం అదే మగ పుంగవుల దగ్గరకొస్తే "మరి ఉప్పూ కారం తింటున్న మగాడు పడక సుఖం లేకుండా ఎన్నాళ్ళు ఉంటాడు" అంటూ వెసులుబాటు కల్పిస్తే నిజమైన మలినాలు ఎవరివి?
నువ్వనుకునే విధంగా ఒళ్ళు కొవ్వెక్కి ప్రవర్తించే వారు ఎంతమంది? ఆ ఇంతమందిని పట్టుకు ఎందుకు మనం ప్రకృతిలో అత్యంత రమ్యమైన క్షణాలను గాడిద మీద ఊరేగిస్తున్నాము. ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగే ఈ సమారాధనకు పసుపూ కుంకుమలు సమర్పించుకోక ఎందుకలా సున్నపు బొట్లు పెడుతున్నాము? పైగా ఆ ముహూర్తానికి ఎదురు చూసే ప్రతి చినుకు బొట్టుకూ స్వాతీ నక్షత్రమే అనువైన తిధి అని అడ్డంకులు పెడుతున్నాము?
నువ్వు మరీ అంతగా ఫీలయిపోకు. తాగిన మొగుళ్ళను పక్కపైకి రానీకండి అని చెప్పటానికి కష్టపడే పెంటమ్మ ముఖం నేను పెట్టాల్సి వస్తుంది. (గుర్తుందా రుద్రవీణలొ పెంటమ్మ మొహం? :) మళ్ళీ నువ్వే యాక్ అంటావు. నువ్వు చెపుతున్నట్టు శృంగారానికి మనసులో అంత పెద్ద పీట వేసుకునే ప్రేమికులు ఎంతమంది చెప్పు? అసలు ప్రేమంటే అని ఆలోచించే వారెంతమంది? అనుభూతులను అలా అనుభవించేస్తూ వెళ్ళేవారే కాని ఎంతమందికి తెలుసు తమకు కలుగుతున్న అనుభూతి ఏమిటో, ఎందుకో?
మళ్ళీ మొదలుకోస్తున్నావు. మళ్ళీ నానుంచీ అదే ప్రశ్న వస్తుంది ఇలా పునరుక్తులు చేస్తే. అసలు నీకెందుకు ప్రేమ నిర్వచనాలు, దాని సూత్రాలు? నిర్వచనాలూ, పరిమితి వృత్తాలూ తెలిస్తేనే అనుభవించాలా? రవికిరణం ఏ అణువిస్ఫోటన గర్భఫలితమో అని ఆలోచిస్తూ కూర్చుంటే ఇక పద్మమిత్రునికి నెచ్చెలి అరవిరిసిన ఆపేక్ష చూసే అదృష్టం కలిగేనా?
మరైతే నువ్విప్పుడు చేస్తున్నదేమిటో? ఎందుకీ నిర్వచనా శోధనా వ్యాసంగాలు?
"-"
ఏమిటో మూగనోము?
కొన్నిటికి సమాధానాలు ఉండవంతే!
No comments:
Post a Comment