అయితే ఇది ప్రేమేనంటావు?
ఏం నమ్మకం లేదా?
నిజంగానే లేదు.
ఎందుకో చెప్పు
నీ ప్రేమ ఏమిటో అర్థం కాదు నాకు
చిన్నప్పుడు ఇష్టపడటమే ప్రేమ అనుకున్నావు
పెద్దయ్యాక ఆకర్షణ ప్రేమనుకున్నావు
ముడిపడిన తరవాత బంధంలో ప్రేమను చూసావు
ముడులే తప్ప ఇంకేమీ లేదని తెలిసినప్పుడు భాధ్యతలో ప్రేమను చూసుకున్నావు
తరవాత అభిరుచుల, వ్యక్తిత్వపు కలయికల డోలికను ప్రేమనుకున్నావు
అందులో ఆవేశాన్ని ప్రేమగా తలిచావు
ఆవేశం శాపమైతే భాద్యతను ప్రేమగా మలిచావు
భాద్యత కోసం త్యాగాన్ని ప్రేమగా నిర్వచించావు
ఇప్పుడు విరహాన్ని ప్రేమగా అభివర్ణిస్తున్నావు
బాధను అక్కున చేర్చుకుని అదే ప్రేమ ప్రతిరూపంగా చూస్తున్నావు
నిన్ను నువ్వు పూర్తిగా కోల్పోవటమే ప్రేమ అంటున్నావు
చరిత్ర ఉదాహరణల రంగులద్దిన పిండి బొమ్మ దాస్యంలో ప్రేమ రూపాన్ని కాంచన సీత అంటున్నావు
ఎప్పుడూ శరీరం
ఒకసారి మనసు
ఒకసారి బుద్ది
ఒకసారి ఆశల కోక ధరించిన చిత్తం
తన అస్తిత్వాన్ని వదిలేయటానికి కూడా వెరువని అహం
ఇష్టమొచ్చినప్పుడు ఇష్టం వచ్చిన దానికి ఆపాదిస్తున్నావు ప్రేమను
వీటన్నిటినీ లోపల దాచుకుని ఇంకొకరి శ్రేయస్సు కోరే ప్రవర్తన.
అలా అని అది పూర్తిగా త్రికరణమా అనుకుంటే కాదు
నీ ప్రేమ అనేది నీకే అర్థం కాదు ఇక దానిపై నీకెలా నమ్మకం వస్తుంది? రాదు!
నమ్మకం లేకపోవటమే నమ్మకం అని కొత్త నిర్వచనాలు మొదలెడతావు
శరీరంపై పట్టు లేదు, వాక్కు పట్టులో లేదు, చిత్తం పట్టులో లేదు, బుద్ధిని పక్కన పెట్టేసావు,
సామాజిక కట్టుబాట్లు, దగ్గరివారి ఇష్టాయిష్టాలు, వారి మంచి, వారి సుఖం పట్టక ఎన్ని యుగాలు?
మనసుకొకదానికి మకుటం పెట్టావు.
No comments:
Post a Comment