అయితే ఏమంటావు?
ప్రేమకు శారీరికమూ, మానసికమూ లాటి తేడావేవీ లేవు అంటాను.
ఇది ముమ్మాటికీ తప్పు. ఆకర్షణా, వ్యామోహం ఇవన్నీ ప్రేమేనా? నేను నమ్మను.
నీ నమ్మకంతో నాకు పనేంటి. అదే సత్యం.
కాదు. కాదు. కాదు. ఆకర్షణకూ ప్రేమకూ తేడా లేకపోవటమేమిటి?
ఉందా? ఉంటె చెప్పు వినాలని ఉంది.
మొదటిది ఆకర్షణ క్షణభంగురం.
రెండోది ఆకర్షణ తప్పు
మూడోది ఆకర్షణ చాలా శాతం శారీరికం
నాలుగోది ఆకర్షణ అనర్థదాయకం. వ్యక్తిగతంగా, సామాజికంగానూ కూడా
అయిదోది ఆకర్షణ చంచలం
ఆరోది ఆకర్షణ జంతు వృత్తి
నిజంగా?
అవును.
ఆకర్షణ క్షణభంగురమా? ప్రేమ చిరంజీవా?
ప్రేమకు అంకురార్పణ ఆకర్షణేగా
మరి దానికీ దీనికీ తేడా ఏమిటి?
అదేమిటి ప్రేమకు ఆకర్షణ అంకురార్పణ అవటమేమిటి?
Love at first sight వినే ఉంటావు......
ఆగాగు చాలా రకాల్లో ఆదీ ఒకటి అంటే కాని అదే ప్రేమ కాదు.
ఒప్పుకుంటా. పోనీ చూసుకోకుండా కనీసం మాట్లాడుకోకుండా కేవలం ఈ మెయిల్స్లో, ఉత్తరాల్లో, చిలక కబుర్లతో, చెలి రాయబారాలతో మొదలై, నడిచి, పాకాన పడిన ప్రేమలనే తీసుకో......ఈనాటి షాదీ డాట్ కాం లలో, జీ టాక్ లలో పుట్టే ప్రేమల దగ్గర నుంచి "ఘనుడా భూసురుడేగెనో....మార్గశ్రాంతుడై డస్సెనో......." అని వగచే ప్రేమల వరకు......"నిజమైన" ప్రేమ అని నువ్వేదనుకుంటావో ఆ ప్రేమలనే తీసుకో.....అందులో ఆకర్షణ లేదంటావా?
చూసుకోకుండా ఆకర్షణ ఎలా పుడుతుంది? నువ్వు మరీనూ.
అంటే ఆకర్షణ అంటే నీ ఉద్దేశ్యంలో ఉట్టి భౌతికమేనా? మానసిక ఆకర్షణ ఉండదా?
ఉండదా అంటే ఉండదని కాదు కాని.......
సొ ప్రతి ప్రేమలో ఆకర్షణ ఉంటుంది అవునా.....కొన్ని ప్రేమల్లో శారీరికం, కొన్ని వాటిలో భౌతికం...కొన్ని వాట్లిల్లో రెండూ....పాళ్ళు ఏవి ఎంతయినా... అన్నీ ఆకర్షణ పునాదుల మీద నిలబడ్డవేగా?
అలా అంటే అవుననే అనాలి కాని ప్రేమకూ ఆకర్షణకూ తేడా లేదంటే ఎందుకో ఏడుపు వస్తోంది.
నీ ఏడుపు ఎవడికి కావాలి. ఇంకేమన్నావు వ్యామోహం ప్రేమ కాదన్నావు అవునా?
ఇలా చెప్పుకుంటూ పొతే మనం మాట్లాడుకునే స్త్రీ పురుష ప్రేమలో వ్యామోహం ఉంటుందనే ఒప్పుకోవాలి నేను. దానికి మళ్ళీ వివరణ అక్కరలేదు.
అలా రా దారికి. చివరికి శారీరికం కాదు అన్నావు
దానికీ వ్యామోహానికి నా దృష్టిలో తేడా పెద్దగా లేదు కాబట్టి సరే ఒప్పెసుకుంటున్నా శారీరికమైన కాంక్ష లేని స్త్రీ పురుష ప్రేమ ఉండదేమో. కాని అయినా నీ వాదన ఒప్పుకోబుద్దేయటం లేదు నాకు. ప్రేమంటే కేవలం ఇవేనా? ఆకర్షణా, వ్యామోహం, శారీరికం......ఇవన్నేనా ప్రేమంటే? నిజంగా ప్రేమంటే ఇంతే అనుకుంటే ఏడుపొస్తోంది.
ఎందుకు ఏడుపు?
నేను ప్రేమను గొప్పగా ఊహించుకున్నాను.
సరే ఏమని ఊహించుకున్నావో చెప్పు? ఏమిటో గొప్ప చెప్పు....నువ్వూహించుకున్న ప్రేమలో.
ఒకరిపై అపరిమితమైన ఇష్టం ప్రేమ. ఒకరికి మాత్రమె అంకితమై పోవటం ప్రేమ. ఇంకొకరిని ఊహించుకోలేకపోవటం ప్రేమ. ప్రేమించిన వారికోసం సర్వం వదులుకోగలగటం ప్రేమ. ఎంత బాధైనా అనుభావిస్తూ ప్రేమించిన వారి మంచిని నిలబెట్టటానికి ప్రయత్నించటం ప్రేమ.....ఇలా ఊహించుకున్నాను
బేసిక్గా చాలా పెద్ద పీటంవేసి నిలబెట్టుకుని పూజ చేస్తున్న దేవి పేరు ప్రేమ అవునా?
అవును
కాని నువ్వు పైన చెప్పినవన్నీ చర్యలు కదా?
అవునూ అయితే?
ప్రేమ ఒక ఎమోషన్ అని కదా నీ నమ్మకం?
అవునూ అయితే?
మరి ఒక ఎమోషన్ వలన ఏర్పడే చర్యలను ఆ ఎమోషన్ అస్తిత్వంగా నిర్వచిస్తావెం?
అంటే?
ప్రేమ పుట్టిన/ప్రేమించిన తరవాత చేసే చర్యలు ప్రేమను ఎలా నిర్వచిస్తాయి?
ప్రేమ ఏమిటో అర్థం చేసుకోవాలంటే దాని జననం ముందు కదా మనం పరికించాలి.
అంటే ప్రేమకూ వేరే ఎమోషన్కూ తేడా ఏమిటి అని ఆలోచిస్తేనే కదా ప్రేమ స్వరూపం బోధపడేది.
అంటే?
ప్రేమకు అతి దగ్గరయిన ఇంకో ఎమోషన్ ఏమిటో చెప్పు?
మ్మ్.....స్నేహం?
సరే దాన్నే తీసుకుందాం. స్నేహానికీ ప్రేమకూ ఉన్న తేడా చెప్పు. స్త్రీ పురుషుల మధ్య ఎమోషన్ గురించి మనం మాట్లాడుకుంటున్నాము అని మరవద్దు.
స్నేహం......మ్ నాకయితే స్నేహానికీ ప్రేమకూ తేడా ఏమిటీ అంటే అవతలి వారు నాకు కావాలి అని కోరుకోవటం, శారీరిక వ్యామోహం లేకపోవటం, వేరే వారితో పంచుకోలేను అనే స్వార్థం లేకపోవటం, అవతలి వారి ముద్ర మన ప్రతి క్షణం పెదవిపై పడాలని లేకపోవటం...ఇవీ స్నేహానికీ ప్రేమకూ ఉన్న తేడాలు.
మళ్ళీ ఇవన్నీ ప్రవర్తనలే. మానసికంగా....భావోద్వేగంలో తేడా ఏమిటి స్నేహానికీ ప్రేమకూ? రెండూ ఇష్టపడటాలే.నువ్వు చెప్పినట్టు హద్దుల్లో ఉండే ఇష్టం స్నేహం. హద్దులే లేని ఇష్టం ప్రేమా? హద్దులే స్నేహానికీ, ప్రేమకూ మధ్య ఉన్న తేడానా?
నాకింకేం కనిపించటం లేదు మరి.....ఆ స్నేహానికీ, ప్రేమకూ హద్దులే కాదు తేడా తీవ్రతలో కూడా తేడా ఉందేమో? అతి తీవ్రమైన ఇష్టం ప్రేమ. కొంచమే ఇష్టం స్నేహం......అనిపిస్తోంది.
ఏమో నాకైతే అంతగా అర్థం అవదు. తీవ్రత, హద్దులూ ఇవే స్నేహానికీ, ప్రేమకూ తెడాలయితే రెండూ సంకల్పితాలే. మనం పెరగనిస్తే.....తీవ్రత పెరుగుతుంది. మనం అనుమతిస్తే హద్దులు దాటుతాము. రెండూ సంకల్పితాలే. మరి ప్రేమ అసంకల్పితం అనుకుంటాముగా అది తప్పేమో......
అంతేనా ప్రేమంటే? అంటే స్త్రీ పురుషుల మధ్య ఇష్టం ఏర్పడితే అది తీవ్రంగా మొదటి నుండీ ఉంటె అది ప్రేమ లేదంటే స్నేహం. మొదటి నుండి తీవ్రంగా లేకపోతె అది తీవ్రమయినపుడు ప్రేమగా మారుతుంది. లేదా ఇష్టం వలన వచ్చే భాద్యతల, హక్కుల, ఆశల, కోర్కెల రేఖాతిక్రమణం జరగనంత వరకు స్నేహం అది జరిగాక ప్రేమ......ఇంతేనా ప్రేమంటే?
ఇంకోముంది చెప్పు? ప్రేమంటే ఇష్టం. స్నేహమంటేనూ ఇష్టం......రెండూ ఇష్టాలే. కాకపొతే రెండూ రెండు వివిధ రకాలయిన సామాజిక వృత్తాలకు కట్టుబడి "ప్రవర్తిస్తాయి". ఏ సామాజిక వృత్తంలో ఉండాలో, ఆ వృత్తాన్ని ఎప్పుడు చెరిపెయ్యాలో అన్నది ఆ మనిషి నిర్ణయించుకునేది.....సంకల్పితంగా కాని, అసంకల్పితంగా కానీ........అది నిర్ణయమే. కానీ రెండూ ఇష్టాలే. వాటి స్వరూప, గుణ, నైజ నిర్ణయం మాత్రం సామాజికం.
సో ప్రేమ, స్నేహం రెండూ సామాజిక నిర్వచనాలే.
No comments:
Post a Comment