Wednesday, 31 December 2008

నా బ్లాగులో నాకు నచ్చిన టాప్ టెన్

"ఆయ్ బాబోయ్ ........మొదలెట్టేశా గాని ఏం చెప్పాలో తోచట్లేదండి. సరే ఏదో ఒకటి వాగేయటానికే కదండీ ఈ బ్లాగ్స్ ఉన్నవి. అందుకే వాగేస్తా.......... "ఈడెవడండీ బాబు తనకు తాను టాప్ టెన్ ర్యాంకింగ్ ఇచ్చేసుకుంటున్నాడు" అని అనుకుంటున్నారా.......మరేం సేసేదండి...... వీవెన్ గారు పెట్టిన ర్యాంకింగ్ల పోటీలో మరి నన్నెవరూ సేప్పలేదు కదండీ........... నాకు నచ్చిన "టాప్ టెన్ బ్లాగులు" అని రాద్దామనుకున్న వాణ్ని ...సత్ ...గాళ్ళకు రాసేదేంటి ...నాకు నేను రాసేసుకుంటే బావుంటుంది అనిపించి ఇలా డిసైడ్ అయిపోయాననమాట. మరిలేకపోతె అదేదో టపాలో ఎవరో మగాళ్ళకు బోడి గుళ్లకై తపస్సు సేసే నారీమణి టపాలో అనుకుంటా అందులో తప్ప మీరెవరూ నా ఊసెత్తరా ......ఆయ్.....మీకు ఈ సాస్తి తగిందే.

ఇంకో సిట్కా సెప్తునా? ఇనుకోండి............ఇలా రాస్తే మనం రాసినవి మొదట్లో కూడలిలో నేను కనిపించక ముందువి కూడా ........మీరంతా మళ్ళీ సూసేస్తారని...........అదన్న మాట సంగతి......"కొత్తగా మనం బ్లాగులో మొదలెట్టినప్పుడు మనది అందరు సూసేయాలంటే ఏరే వారి బ్లాగులు అన్నీ సూసేసి పరపరా వ్యాఖ్యలు రాసేస్తే తిరిగి బదులుగా మనకు ఆరూ వ్యాఖ్యలు రాస్తారు ..ఇది మన జనాలు అందరూ ఉపయోగించే ట్రిక్కే" అని ఒక పెద్దమ్మగోరు తన టపాలో అంటే ఇలా "రూపాంతరమో" ఏదో అంటారట సామీ..నాకు తెల్దు....అలా వాడేసా..... ఇక ఎక్కువ ఎకసక్కాలు, సోది లేకుండా సెప్తా ఇనుకోండి...........

౧. నాకు నచ్చిన నా ప్రక్రియ నేను కెలికిన దాంట్లో నాకు నచ్చిన మొదటిది

"మనోజ" పుట్టుకేనండీ బాబూ ....."మనోజ ఎవరూ" అంటారా అయితే మీరు నా "స్వగతాలు" సదవలేదనమాట .....ఆయ్ బాబోయ్ ...."మడిసన్నాక కూసింత కళా పోసనుండాలండీ"................. ఎంటనే ఈడ మనోజ ఎవరూ, ఎలా పుట్టింది, ఎందుకు పుట్టిందీ, ఏటి సేస్తుంది అన్నది సూడండి. నాతొ ఎలా కీచులాడిందో కూడా సూడండి.

ఇంతకు ముందెవరూ ఇలా తన మనసుకూ బుద్ధికీ జరిగే కీచులాటను ఇంత బాగా సూపించే "ప్రయత్నం" సేయలేదండి బాబూ....నన్ను నమ్మండి.

౨. నాకు నచ్చిన కథ "నస్యం రంగు పట్టు చీర పిల్ల"

పైన సెప్పిన "మనోజ పుటక" నాకు నచ్చిన ప్రక్రియ అయినా ఆ ప్రక్రియలో సాధించాల్సినంత సాధించలేదని నాకు తెల్సండి.......కానీ నా "నస్యం రంగు పట్టు చీర పిల్ల"లో ( 1 2 3) మాత్రం నా "రసనా పటిమో గిటిమో" ఏదో అంటారు కదండీ........అది సూపర్ సూపర్ అని నా మనసే నాకు సేప్తుందండి....అందులోని ప్రేమ కథ కదండీ.....పైగా మెడిసిన్ సడువేప్పుడు అందరు సీతాకోక సిలుకల మధ్య మనసు కితకితలు ఎట్టే వాతావరణంలో రాసుకునా గదండీ....అందుకని ఇది నాకు సాలా సాలా ఇష్టమండి.

చివరికి ఏడిపించే కథే అయినా జీవితమంటే అంతే కదండీ...ఏడుపు నవ్వూ సమ పాళ్ళలో ఉంది కదండీ....పైగా మహానుభావుడు ఎవరో "బాదే సౌఖ్యమనే భావన రానీవోయ్" అన్నారండి. అందుకని నా రచనలలో ఇది బెస్టండి. కాకపొతే ఎప్పుడో రాసుకున్న ఆ కథకి title ఆంత సాన్తాడంతా అయిందేమో అని కొద్దిగా బెరుకండి...మీరే సెప్పండి సీర్సిక బావుందా మార్సాలా

ఓయ్ .......అందరికీ ఇవే హెచ్చరికలు......మహేష్ గారు నవతరంగంలో వినాయకుడు దర్శకుడు ఇచ్చే స్క్రిప్ట్ పెట్టింతరవాత ఈ స్టోరీ సినిమా తీద్దామనుకుంటున్నా ...కాబట్టి ఎవరికీ దీని హక్కులు లేవు. నిర్మాతలు నన్ను మాత్రమె సంప్రదించగలరు.

౩. నాకు నచ్చిన ప్రయత్నం-పద్య కవితలు

"పార్వతీ తపస్సులో" శ్రీనాథ కవి శృంగార రసనా పాటవం, ఇంకెవరిదో (పోతన మహా భాగవతంలోదా ఏమో ???) ఇందీవరాక్షుని వృత్తాంతం అన్న దాంట్లో "అనినన్ కన్నులు జీవురింప ఆధారంబల్లల్లాడ వ్రేల్లుత్పునః పునః బృకుటీ భుజంగ యుగళీ పూత్కార ఘోరానిలంబన" అన్న శబ్దాలంకార సహిత పద్య కవిత రుసి సూసానండి ......అంతే ......... టపాల్మని పడిపోయానంటే నమ్మండి. అప్పట్నుంచి ఆంటే నా తొమ్మిదో తరగతి నుండీ .......రాయాలన్న కోరిక ఉంది...ఈ బ్లాగు మొదలెట్టే వరకు ఆ కోరిక కోరికగానే మిగిలిందండి.


నా తల్లి అని నేను నమ్మే ఆ సదువుల తల్లి పాదాల సెంత ఒక పద్యం రాసి కాని నా బ్లాగు మొదలెట్ట కూడదని ఏంటో ...ఎంతో ఇది అయిపోయి రాసిన నా మొదటి ("వృత్తము" అంటారట అండి ఈ పెద్దాలను) పద్య కవిత "ఇది" అండీ. నాకు ఈ (1, 2, 3, 4,) నాలుగు పెద్దాలు సూసినప్పుదంతా మా సెడ్డ గర్వమండి నా మీద నాకే. అలాగే మిగితా నా పద్య ప్రయత్నాలు వాటి అర్థాలు (1, 2, 3) సూడాలని ఉన్నోళ్ళు సూడండి. లేనోళ్ళు సినమాలో ఎంటోడు పేద్ద పద్దెమ్ సదూతుంటే మన ఒంటేలుకు పోతాం కదండీ ......అలా ఏదో ఒకటి సేసేసి రెస్టు తీస్కొని వచ్చేయండి.

పెద్దలు "తప్పులున్నాయి" అని సేప్పారండి.......భావకుడు కాదు "భావుకుడు" అని ఉండాలి అని సెప్పినా అలాగే ఉంచేసినప్పుడు సేసిన ఆలోసనే ఇక్కడా సేసి అలాగే ఉంచేసానండి..........."తప్పులను గుర్తుంచుకుంటేనే కదండీ మన కాళ్ళు బూమ్మీదుండేది".............అందుకని అలాగే ఉంచేసానండి.

౪. నాకు నచ్చిన వచన కవితలు.

ఇవి నేను ఎక్కువగా సేసేవండి. ఇరవయ్ దాకా ఉన్నాయండి..... నాకు నచ్చినవి రెండు (1, 2) ఉన్నాయండి. మా ఇంటిది నా ఈ పైత్యంతో (అదేనండి కైతల రాయటం అనే పైత్యం) పడే బాధలు సూసి మనసు కరిగి విరిగి కన్నీరు మున్నీరై మనసు కేలికినవండి ఈ రెండు ............తనకు కవిత్వం నచ్చదని ఓ తెగ ఎడ్సేసే మనసు తన బాధ అర్థం సేసుకొని రాసిందని తెగ ఇష్టమండి ఈ కైతలంటే. (కొన్సెం మెలోడ్రామా ఎక్కువైంది కదండీ? ఆయ్ నాకు అలాగే అన్పించిందండి...... ఇక ఆపెస్తానండి.)

ఇకపొతే ఇంకోటి ఉందండి ......ఎవ్వరూ పాపం కమ్మెంటలేదు దాన్మీద...కాని నాకు సాలా నచ్చిందండి అది......ఇక్కడ సూడండి... నేను చూసిన ఒక రోడ్ కిల్ గురించండి. కొంచం గ్రాంథికం ఉందండి అందుకని జనాలకు నచ్చలేదనుకున్తానండి అది.

౫. ఒకే ఒక్క ఇంగ్లీషు కవిత

నేను రాసిన ఒకే ఒక ఇంగిల్పీసు కైత..."ఇది" కూడా యమా నచ్చేసిందండి......మా నాన్నండి "మన దేశంలో ఉన్నప్పుడు తెలుగువి రాసుకోవచ్చు అక్కడ ఉంటున్నావు "ఆ ఇంగిలిపీసువి" కూడా రాయమని" తెగ పోరే వారండి.....ఇది సూసి బావుందని అన్నారండి. కాకపొతే "ఎవర్రా ఆ ఇంగ్లీషు రోసు ?" అన్నారండి ............అయ్ బాబోయ్ అలాటిది ఏం లేదండి....( ఉంటే నా ఇంటిది నా సేమ్డాలెక్కదీస్తాదండి ...ఆయ్)

బాబోయ్ ....అది సీపురు పట్కోని వస్తోందండి ..........ఇంటి పనులు సూడకుండా ఇది సేస్తున్నందుకు .....మిగితావి తరవాత బతుకుంటే రాస్తానండి.

4 comments:

  1. మా ఇసాపట్నం బాస ఇనుకోక సాల్రోజులైందండి.తమరిగోరి టపా సూసినాక పానం జిల్లుమన్నాదండి. నిజిం సెప్పాలంటే తమరిగోరి బ్లాగులేవి నేన్సూల్లేదండి. ఉప్పుడు సూత్తా
    నండి. పోతే... అవేవో పద్దేలు గట్రా అన్నారు గదండి. అవి మనకి పెద్దగా తెల్దండి.కానీ ఎవురూ మన్ని పట్టించుకోపోతే మన ఈపులు మనమే బాదీసుకోవాలన్న మీ ఉద్దేసెం మంచిదండి. ఆయ్...మళ్ళీమాటు మీ బ్లాగులన్నీ కెలికి జాబురాస్తానని మనవిజేసుకుంటున్నానండి.కొత్తేడాది లో మీ ఇంటిదాన్నుంచి తాపులు తప్పాలని కోరుకుంటున్నానండి. మరి సెలవండి.

    ReplyDelete
  2. మేష్టారూ మనది తూగోజీనా?

    ReplyDelete
  3. :-)

    కొన్ని వచన కవితల లింకులు పనిచేయలేదు ఒక సారి చెక్ చేయగలరు.

    ReplyDelete
  4. వేణు గారు,

    సరి చేసానండి ఇప్పుడు చూడండి.

    ReplyDelete