ఎప్పటి రుచి?
అమ్మ గోరుతో చీరడం
నాన్న తోకెంట వేట
వీటితో మొదలి
రుధిరాభిషేకపక్షింతలు
మరణమృదంగ తాళం
అంత్యస్వరపు సన్నాయి
వీటన్నిటి మధ్యా
ఏమిటా చూపు
అయిపోయిందిగా
నేనికేం చేయలేను
అలా చూడకు
స్వనైజపు స్వార్థం
ద్వియక్ష సరసిన
మెరిసింది ఎప్పటి పాటే
ఎప్పటిలా క్షణం పాటే
ఎవర్ననను?
బతకటానికి రుధిరాన్నపు
రాత రాసిన వాడినా
ప్రతి బొట్టూ, ప్రతి అసువూ
కేక వినిపించే హృదినా?
తల్లి భూమి కంట్లో కలక
గరగరమందే తప్ప ఉబకలా
కళ్ళ కొలనుల ఎందుకనే ప్రశ్నా
బ్రతకటానికన్న మనసు తపనా
రెండూ తనవేగా.
కమలభవునిదీ కదిలిందేమో
వాగ్దేవి పాతివ్రత్యపు కొంగు
అంకానికి తెరేసేసింది
అకస్మాత్తు చీకటి రంగు
కర్మసాక్షి తలొగ్గి తొలగినా
క్షణ భంగురపు నశ్వరత్వం
కలగా మిగిలిన ఆశల సౌధం
ధగద్ధగాయమానంగా రుధిరం
జగన్నాటకమింతే
క్షమించాలి మీరంతే.

No comments:
Post a Comment