Friday, 6 May 2011

సమానమెవ్వరు నీకిల......see in line! Actually in para.



ప్రతి పదముతో, పాదముతో అనుబంధముంది కనుక తప్పటం లేదు ఇన్లైన్ రాయటం . "ఆ ఈ మాత్రం అర్థం చేసుకోలేరా నువ్వు చేపితెనేనా తెలుసుకునేది" అని మనసు అడిగితె "కాదె. నాకూ అర్థమయ్యిందన్న సంతోషమె ఇది పిచ్చి మొహమా" అని దానికి చెప్పి ఇలా బరికేస్తున్నా. విష్ణుసహస్రంలో బేసిక్ వ్యాకరణం  అని రాయాలని ఎన్నో రోజులనుంచి ఉన్నా (అలా అన్నా ప్రతిపదార్థ, వ్యాకరణ ప్రయత్నం మళ్ళీ మొదలవుతుందేమో అన్న ఆశ) ఇప్పట్లో అది తీరెట్టు లేదు. కాబట్టి ఇలా ఈ పాటతో సరదా తీర్చేసుకుంటున్నా.

అసలు ఈ సినిమా చూడటం రిలీస్ అయిన యే మూడు నాలుగేళ్ళకో కుదిరింది నాకు. కాని మొదటి రోజునుంచీ పాటలు మాత్రం ఎంతగా ఆకట్టుకున్నాయంటే అంతగా ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా "నీ చెంతే ఒక చెంచిత ఉంటె......" తో మొదలయింది నా ఈ నవరత్నాలతో అనుబంధం. ఆ పాటను ఎన్ని వందలసార్లు ఆస్వాదించాకనో కానీ ఈ పాట పరిచయమవలేదు. ఎలా మిస్ అయ్యానో నాకు తెలీదు. ఈ పాట విన్న ప్రతీ వందల సార్లూ నా గొంతు బొంగురు పొయ్యి తీరాల్సిందే. ఎందుకంటారా? చదవండి మరి.

సమానమెవ్వరు నీకిల    
ఉమా రమణా
పాహి పా....హీ 
ఓయీ శ్రీ చరణా 
రమా వినోది వల్లభా 
నమామి స్వర సుమాభరణా
నాద సదనా శృతి ధనా
ఆ..........

"నీకిలా/నీకిల"........
ఇక్కడ ఏది పెట్టాలి?
ఈ మీమాంసలో ఎంత కొట్టుమిట్టాడి ఉంటారో రచయిత. 
లఘువు గురువుల మధ్య ఎంపికలో అంత అంతర్మధనం ఏముంది అంత్యప్రాసలన్నీ గురువులవే కాబట్టి ఇదీ ఇలా...నె అనేసుకుంటే మనసుకు పెద్దగా నొప్పలా. ధ్వని కంటే భావానికి పెద్ద పీట వెయ్యాలనిపించింది.
పైగా అసలు ఈ "ఇలా...ఇల" అనే తేడా ఉండొచ్చు అనెదీ నేను వేరొకరి ద్వారానే తెలుసుకున్నా కాబట్టి అక్కడ వారి అన్వయానికే ఓటు వెయ్యాలనిపించింది.

ఇంకో గమ్మత్తు చూసారా? ఎందుకో మామూలు పాటల బాణీలోలా కాకుండా పదాలనూ, పాదాలనూ కలగాపులగం చేసేసారు ఇక్కడ ఈ ప్రోలోగ్లో. పల్లవిలో వచ్చే వరుసలో కాకుండా వేరే వరుసలో ఈ ప్రోలోగ్ లో ఎత్తుకుంటారు. ఎందుకో మరి? సంగీతపరమైన కారణాలేమన్నా ఉన్నాయేమో!  

రమా......... వినో....ది వల్ల...భా 
ఉమా........... రమణా........ శ్రీ................చరణా
రమా......... వినో....ది వల్ల...భా 
ఉమా........... రమణా........ శ్రీ................చరణా  
నమామి నాద సదనా................................................................
నమామి నాద సదనా................................................................ 
శృతిధనా స్వర సుమాభరణా 
పా........................హీ......
పా........................హీ.......
రమా......... వినో....ది వల్ల...భా 
ఉమా........... రమణా........ శ్రీ చరణా  
రమా......... వినో....ది వల్ల...భా 
ఆ..................................

అసలయితే మొదటిసారి ఈ "రమా వినోది వల్లభా...." వినగానే నాలోని మాధవుడు "చూడు ఈ పెద్దాయనకు ఎంత బయాసో...ఎంతైనా స్మార్తుడు కదా ఎప్పుడూ జింక చర్మం వాడే...పైగా రమావినోది "వల్లభు"డట"శ్రీ"చరణుడట"  అనేసాడు అక్కసుగా. "రమావినోదికి వల్లభుడట, శ్రీ ఇతని పాదాల దగ్గరట" అన్న ఆలోచన టక్కున మదిలో మెదలగా మండమంటే మండదా? :-). 

జ్ఞాపకం మాత్రం చిన్నగా నవ్వి "యే కులమూ నీదంటే........" అని ప్రశ్నిస్తూ "అచ్చెరువున అచ్చెరువున విచ్చిన కన్నుల చూడ" తల దించుకోక తప్పలేదు.  కాశీనాథుని శివకేశవారాదన ఇంకో టపాలో.  

తల దించుకున్న నాకు "శ్రీ అంటే శుభం అన్న ప్రతిపదార్థం ఉంది కదా, అయినా శివకేశవుల భేదం నీకు తాకకూడదే.... 
నీ ప్రకారం రాముడు కృష్ణుడూ ఉట్టి మానవ మాత్రులేగా. దైవమనేదే ఉంటె అది నిర్గుణ స్వరూపమనే నమ్ముతావుగా" అని బుద్ది అనేసరికి మాత్రం నిజమే అనిపించింది. 

ఈ నా మీమాంస కనక కవి కాంచి ఉంటె ఎంతగా నవ్వుకొనే వాడో కదా? తము కన్న మాటలు చదువరుల హృద్పీటికపై  చెడుగుడు ఆడేసుకుంటుంటే, భావార్థాలు ఇరుపక్కల చిరునవ్వులొలక మధ్య జగన్నాటక సూత్రధారే కదూ కవి? 

కానీ ఈ పల్లవికి ప్రాణం సాహిత్యం కాదు. 
ఇక్కడ తప్పకుండా వాగీశ్వరి కంటే సంగీతలక్ష్మిదే పై చేయి. ఎంతయినా అత్త కదా మరి 

రమా వినోది దగ్గర కింద స్థాయితో మొదలయి (కింద స్వరాలు అనలేకపోయా....కిందస్వరాలేనా లేక కింది స్థాయిలో అన్ని స్వరాలూ ఉన్నాయా అనేది సంగీతజ్ఞలే చెప్పాలి) నమామి నాద సదనా ....దగ్గర ఎంత చిక్కగా చక్కగా పై స్థాయికి వెళుతుందో సంగీతం. How apt కదా అనిపిస్తుంది. రమావినోది (ఇక్కడ ఈశ్వరుడు వల్లభుడు (=రాజు అనేసుకుంటున్నా బ్రౌణ్యం వెతక్కుండా!) గురించి వచ్చింది కాబట్టి అంత మంద్రంగా మొదలయి ఆతని సదనం అదేనండి బాబూ హిమాలయాల నెత్తినున్న కైలాసం గుర్తుకొచ్చేలా పై స్థాయి సంగీతం. WOW!!! (కైలాస సదనా ....కాంభోజి రాగాన గుర్తు రాదూ?)

ఇందుకు కూడా కాదు నాకు ఆనందం. "నమామి నాద సదనా...................." అంటూ ఒకసారి శ్రీరాంతోనో, మధుబాలకృష్ణతోనో ఒకసారి స్వరం కలిపే ధైర్యం చెయ్యండి. (పర్లేదు. వాళ్ళెం అనుకోరు నాది భరోసా! :-) అలా వాళ్ళతోబాటే పునరావృతం చేయండి దాన్ని. ఇప్పుడు గమనించుకోండి మీ గొంతుకను. ఎండిపోయింది కదూ? 
సంగీతాభిమానులకు గొంతుకలో తిష్టవేసుకున్న ఈ ఎడారిచ్చే ఆనందం ముందు సొల్లు కారిపించే.....వొద్దులెండి.
నా మటుకు నాకు అలా గొంతు ఎండిపోయెంతగా అరవటం (పాడటం అనటానికి ఎంత టైం పడుతుందో తెలీదు) నిజంగా worth it. మొత్తం పాటకే హైలైట్ ఇక్కడి సంగీతం. 

How I wish there were some panditas who can appreciate and inspire the pamara rasikas like me by providing the notations of songs like this.శుశ్రూష చెయ్యటానికి నేను భవసాగరం పాట ఎత్తుకుని రాలేను కాని నిజంగా పాటకో నెల రోజుల చొప్పున యే చాకిరీకి అయినా నేను రెడీ, మ్యూసిక్ నోటేషన్ ఇస్తానంటే.     
పైగా ఉన్నత శిఖరాలను వర్ణించి మళ్ళీ "పా............హీ, పా.....హీ" అనే చోట మళ్ళీ ఎంత కిందికి వస్తుందో (కిందివె కదూ ఆ స్థానాలు?). అసలా transition పట్టుకోటానికి ప్రయత్నించండి ఎంత సంతోషమేస్తుందో. ఎలాటి సంతోషమో తెలుసా? cliffhanger లాటి రైడ్స్ ఉంటాయి చూడండి freefall మనకు అనుభావమిస్తూ మన గుండెగొంతులో వచ్చే ఆ ఫాల్ అనుభవమవుతుంది ఆ రెండిటీ మధ్య సమయంలో (నాద సదనా....................end చేసి పాహీ start చేసే ఆ transition లొ.) (hey btw, this post is meant for the ametuers. అంతే కాని ఏళ్ల తరబడి నేర్చుకుని ఏముంది ఆ transition లొ అని చప్పరించే వాళ్లకు కాదు)

పైగా how apt అనిపించదూ పాహీ పాహీ అనటం అలా మంద్రంగా అనటంలో....నిజంగా ఎంత ఔచిత్యం కదూ?


ప్రాణగానమాలాపన చేసి 
స్వరసోపానములధిరోహించి 
ప్రాణ గాన మాలాపన చేసి 
స్వర సోపానములధిరోహించి 
ప్రణవ శిఖరిపై నిను దరిశించి 
ప్రణవ శిఖరిపై నిను దరిశించి
ఇక్కడ కూడా నాకు మళ్ళీ అదే ఔచిత్యం, అదే ఆరోహ అవరోహాలు కనపడతాయి. 
"ప్రాణగానమాలాపన చేసి".......నుంచి "ప్రణవ శిఖరిపై"...................వరకూ ఎంత చక్కని ఆరోహణమొ.


చిదంబరా
నా హృదాంబుజమ్ముల
నీ పదాంబుజమ్ముల ధ్యానించి 

శుభంకరా 
నవ రసాంబు దారల 
ప్రభాతాభిషేకములు 
చేతురా

పా...హీ....
పాహీ......
పా.....హీ
పా....హీ...
నిను దరిశించి"న హృదయ చలనమెట్టిదో తెలియునా శివా అంటూ హెచ్చిన గుండె వేగాన్ని తెలిపేట్టు
"చిదంబరా" నుంచి "........సేతురా......." వరకూ ఎంత తీవ్ర గతో (తీవ్రగతి అంటే fast tempo నె కదా?)
wow. పైగా గతి తీవ్రతే కాదు ద్వని తీవ్రత కూడా.

ఎప్పుడైనా మీరు అతి ధైర్యంగా (ధైర్యం తెచ్చుకోవాల్సిన అవసరం వచ్చిందంటే ......అంటే మీరే మీరు చేస్తున్న పని తప్పు అని ఒప్పుకుంటూనే అది చెయ్యకుండా ఉండలేను అన్నది ఆలోచనకు తట్టకుండానె వివశమై చేసేసిన ఏదో ఒక పని సందర్భాన్ని గుర్తు తెచ్చుకోండి). నోరు తడారి పోవటం నిజంగా ఎప్పుడైనా అనుభావమయిందా? literally did you need a glass of water to speak normally any time? those who have experienced this only can really appreciate the beauty of this part అనిపిస్తుంది నాకు. అలాటి ఆనందం (మరి మీకిష్టమయ్యే కదా ఆ పని చేస్తున్నారు), భయం (మీ బుద్ది కూడా ఇది తప్పు అనే చెపుతోంది మరి భయం కలగదూ?) కలగలిసి ముట్టడి చేసిన వేళ మీలో లయకారిణి ఎంత గట్టిగా (వేగంగా కాదు గట్టిగా) కొట్టుకుంటుందో ఎప్పుడయినా అనుభవమేనా? చెవుల్లో గుండె కొట్టుకుంటుందా అన్నట్టు అనిపించేలా "చిదంబరా, హృదంబుజమ్మూ, పదంబుజంబుల" "శుభంకరా, రసంబుదారాల, ప్రభాతాభిషేకములు".......ఈ ఆరు పదాల గతి, ధ్వని ఎంత బావుంటుందో.   

మళ్లీ అదే transition "పాహి పాహి" దగ్గర అని చెప్పక్కరలేదు కదా?

రమా వినోది వల్లభా 
ఉమా రమణా శ్రీ చరణా
రమా వినోది వల్లభా 
ఉమా రమణా శ్రీ చరణా 

ఇక 
గమక గమనముల స్వరఝరులే
జడల అడవిలో సుర ధునిగా....
మురిస ముక్కనుల కవళికలే
ముజ్జగాల సంగతుల జతులుగా....... 

నాదములే నాగాభరణములై 
యోగములే వాగర్థాకృతులై 
  ..........లీలా కరణములై 
సామములే మధు గాంధర్వములై 

గంగాధరా......
శంకరా.......
సంగీత సాకారా.......
అడవిలో దారి తప్పితే ఏం చేస్తాము? ఏదైనా జలపాతం వినిపిస్తే పరిగెత్తుకుంటూ పోము? జలపాతపు హోరు మార్గదర్శకం చేయదూ? అదే హోరు, ఆ హోరు ఝోరు గమక గమనముల స్వరఝరులే జడల అడవిలో సుర ధునిగా.... అనే పాదంలో వినపడితే, మన ఆ హోరు చోటు చేరాలంటే ఆ ముక్కంటి ముక్కవలికళ (ముక్కంటి దయ కాదు ముక్కంటి కవళికల దయ....అర్థమవుతోందా తేడా?) దయ మన గతులకు (నడకకు) జతులట (తోడట). 

తరువాత నాలుగు పాదాలలో ఒక పదమూ (లీలాకారణములై ముందుది), చివరి మూడు పాదాల భావమూ, యోగమనే పదానికి అర్థమూ నాకు సరిగా దొరకలేదు :( ఇంకేం చెప్పగలను? బావుంది అని మాత్రమె చెప్పగలను.

మళ్లీ గంగాధరుని ఎత్తున సంగీతం.


రమా వినోది వల్లభా 
ఉమా రమణా శ్రీ చరణా 
రమా వినోది వల్లభా 
ఉమా రమణా శ్రీ చరణా 


ఈ పాట వీడియో ఇవాళ చూసాను. మొత్తంగా. 
నాకు కొంచం లేట్గా బల్బ్ వెలుగుతుంది అన్నది ఇవాళ మళ్లీ రుజువయింది.
ఎందుకబ్బా ఇతనిలా గెంతుతున్నాడు తిక్కోడిలా అనిపించేది.
There was a sense of incongruence in the fact that a grown man, however he might be enomoured by the respect to the two brothers, can dance like that in the airport అని.
ఇవాళ ఈ పాట చూస్తుంటే అర్థమయింది ఆ పాత్ర, ఆ పాత్రాభినయ ఔచిత్యం 

అనుజుడై లక్ష్మణుడు అంటూ శ్రీనివాసాచారిని, రంగాను రామలక్ష్మణుల చేస్తే మరి వారి అనుంగు బంటు కోతి గెంతులేయక ఇంకేమి చేస్తాడు. అక్కడ చిందులేస్తున్నది మన నాగరీకుడూ అనుకుంటే మనకలా incongruence తప్పదు. ఆ మనిషిలో మనం వాతాత్మజుడిని చూస్తె భక్తి పారవశ్యంలో చిందులేస్తున్న "పిల్లకాయలొ" పరమాత్ముడు కనపడతాడు.

సర్ జీ, మాన్ గయే. 



No comments:

Post a Comment