ఎంత స్వార్థమో చూసావా? చివరికి ఓడిపోయాను. మళ్ళీ నీకు నా నివేదనను ఆపలేకపోయాను.
తెలుసు. నేనిలా చేసిన ప్రతీసారి నీ హృదయం ఎన్ని వేల ముక్కలవుతుందో తెలుసు.....అయినా ఆపుకోలేను
నిన్ను నిలుపుకోవాలంటే నీకు దూరంగా పోవాలి, ఎంత దూరంగా పోవాలంటే నిన్ను నిలుపుకోవాలి అన్నది మరి ఉండకూడదు మనసులో. అప్పుడే నువ్వు నాకు మిగులుతావు. ఈ పారడాక్స్ ఎలా చెప్పను నీకు?
చిత్రం చూశావా?
ఈనాడూ ఇద్దరం ఎలా నిర్వర్తిస్తున్నామో మన భాధ్యతలను.
నా భవిత కోసం నీ ప్రయత్నాలు
నీ ప్రస్తుతం కోసం నా ప్రయత్నాలు
కాని ఒకటే బాధ
ఈ గాటలకు కట్టేసిన పలుపు తాళ్ళు...(ఫ్రూడియన్ స్లిప్ నువ్వన్నట్టు నా మనసులోనే దాచుకున్నా....సమర్దుడినే కదా?)....ఎంతగా మెడకు బిగుసుకుంటున్నాయంటే కోయిల పాటలు ఆగిపోయాయు. గోరుముద్దలు తినిపించే వేళ్ళకు గోరుచుట్టలు మొలిపిస్తున్నాయి ఈ బాదరబందీలు. కనురెప్పలను బలవంతంగా తెరిచి ఉంచుతున్నాయి ఈ కరకు చేతులు....మరిక కొత్త బంగారు లోకాలు ఎలా కనపడతాయి?
ఎందుకు లోకం, నువ్వూ సమర్ధించలేరు ఈ నిర్ణయాన్ని?
నిజమే పెళ్ళంటే ఈ కాలంలో ముసలితనంలో "పని"కోచ్చే తోడు ఉండే డివిడెండ్ కోసం ఇప్పుడు చేసే ఇన్వెస్ట్మెంట్
నిజమే పెళ్ళంటే ఈ కాలంలో ముసలితనం "అవసరాలు తీర్చే" మనుషుల కాపిటల్ గైన్స్ కోసం చేసే ఇన్వెస్ట్మెంట్
నిజమే పెళ్ళంటే ముసలితనంలో వంటరితనం అనే బూచి బాధపెట్టకుండా ఇప్పటినుంచె కట్టె ఇన్సూరెన్స్ ప్రీమియం
నిజమే పెళ్ళంటే వయసొచ్చాక చేసుకునే ఒక రొటీన్ కార్యక్రమం మరి హార్మోన్ల రేజ్ ఆపటానికి ఇదే ఆమోదమైన మార్గం
కాని, కాని నువ్వూ నన్ను అలా అందరిలో కలిపేస్తే ఎలా?
నాకు పెళ్ళంటే ఒక పయనం అంతేగా. పెద్దగా ఏమీ ఫాంటసీలు లేవు పెళ్ళంటే
ఒకటే ఒక కోరిక మాత్రం ఉంది చేతిలో చెయ్యి వేసిన మనిషి ఇదిగో ఇలా మనలా బంధం నిలపగలగాలి
ఎంత అవమానించాను నిన్ను? అయినా ఎంత తాపత్రయపడతావు నా కోసం?
ఎంతగా పోడిచావు నన్ను? అయినా ఎంతగా నిలబెట్టాను నిన్ను?
ఇది అసలైన సంసారం
మనం అసలైన ఆలూ మగలం.
ఎందుకు కాదో చెప్పు?
జ్యోతి భయపడ్డట్టు పెళ్ళంటే రెండు శరీరాల పెనుగులాట అస్సలు కాదు నా దృష్టిలో. జ్యోతితో హరి మనువు, సంసారం జ్యోతి పునరాగమనానికి మునుపు లేదా? సమాజపు సాక్షం ఉంటేనా మనువూ సంసారం? భౌతికంగా ఉంటేనేనా మనువూ సంసారం? అవి లేకపోతె మనువూ సంసారం పూర్ణమవవూ అను ఒప్పుకుంటా కాని అవి లేకపోతె అసలు మనువూ, సంసారం శూన్యమైపోతాయంటే మాత్రం ఒప్పుకోను.
ఎందుకు నీకింత ఆదుర్దా ఈ మనసులు లేని, మరమనిషి మనువుల మీదా, అవి తెచ్చే వడ్డీ, చక్రవడ్డీల మీదా?
సప్తపదిని నిర్వచించే నాటకంలో భాగంగా హేమను "నేనో కోరిక కోరుతా తీరుస్తావా? నువ్వు జీవితాంతం కన్యగానే ఉండిపో" అని కోరిన ఆ హరిజనుడు నిజంగానే అంటరానివాడా? పోనీ హేమే తనకుతానుగా "
"తిన్నగా వెతికి తెలిసికొంటినయ్యా...నిన్నె గాని మదినెన్న జాలనొరుల"నన్నది త్రికరణంగా పాటించగలిగిన స్వతంత్రురాలాయి మిగిలిపోతానంటే అది అంత పాతకమా? లేదంటే హేమను శోబనం గదిలో అమ్మవారిలా చూసిన గౌరీనాధశాస్త్రి నీకంటికి విశ్వనాద్ గారి చేతుల్లోని సూత్రాల కదలికలకు అద్దం బట్టే ఉట్టి తోలుబోమ్మా?
ఎలా అయ్యానో, ఎందుకిలా పెరిగానో తెలీదు కాని నా జీవితానికి కళ్యాణం, సంసారం అంటే ఇదే నిర్వచనం. చేతులెవరివో, చేతలెవరివో మట్టికుండ తయారయి గట్టిపడింది కూడా.నువ్వొచ్చి రంగులద్దావు. ఒక బంధపు నాందీ ప్రస్తావనా సూచకంగా నవధాన్యాలను మోసే పవిత్రత వచ్చింది ఈ మట్టి కుండకు. భరించలేని విధి గట్టిగా వీచింది. నవధాన్యాలు ఎగిరిపోయ్యాయి. అవి ఇంక మొలకెత్తవు. మొలకెత్తినా ఆ నవజీవన రాగాలకు క్షేత్రం అయ్యే ఆ మట్టిని మోసే అదృష్టం నాకు లేదు. సొ వాట్?
అయితే మాత్రం బలవంతంగా నాలో జీర్ణించుకుపోయిన ఆ రంగులను కత్తి పెట్టి మరీ గీకేస్తానంటావా? నన్నంత వికారిని చేస్తావా? మొత్తం నగ్నంగా చేసి బాండ్ ఎయిడ్ ఒకటి తెచ్చి అంగుళానికి ఆచ్చాదన చేసి ఇక నీకేం పొ అంటావా? భార్య అంటే ఇంకో విధి వీతకు తలోగ్గేసి సర్దుకుపోతున్న ఇంకో స్త్రీ మాత్రమె, ఆ బహిర్ప్రాణమే అని ఎందుకలా చులకన చేస్తావు.ఆ అంగుళీకపు ఎత్తు కాదు నా దృష్టిలో భార్య అని ఎప్పుడు అర్థం చేసుకుంటావు. భార్య అన్న స్థానానికి నేను మనసులో ప్రతిష్టించుకున్న ఆకాశమంత నా నిర్వచనా ప్రతిమ కూడా అని ఎందుకు అర్థం చేసుకోవు? నా మనసులోని ఆ కాంచన సీత ఎదుట తల ఎత్తి నిలబడగలనా మనసులో ఒకరిని పెట్టుకుని ఇంకొకరిని చేసుకుంటే? నా కళ్ళ ముందే నన్ను మోకాళ్ళ మీద దేగేలా చెయ్యాలన్న పట్టుదల ఎందుకు నీకు?
అయినా ఎందుకు నీకు భవిష్యత్తు అంటే అంత భయం? ఇలా నన్ను వదిలేస్తే విధివిలాసం ఎలా ఉంటుందో అని నీకెందుకంత వెరుపు? బలవంతంగా నన్ను ఇంకో గాటికి పసుపుతాడుతో కట్టేయాలన్నంత వెరువు ఎప్పటినుంచి నీకు?
"నన్నిలాగే కొలుస్తూ ఉంటె ఇక అసలు వీడు ఇంకొకరి మొహం చూడడు" అని ఎందుకంత అహం నీకు? విధి ముందు మనమందరమూ మోకరిల్లాల్సిందే అన్నది తెలీదా? ఏమో నా లలాటంలో నువ్వు అగ్నిగుండంలో ఆహుతయినా పూమోగ్గలాగా తేలే ఇంకో వేదవతి రూపం సాక్షాత్కారం కావాల్సి ఉందేమో నీకేం తెలుసు? తొందరపడి శూర్పణఖలకు నన్ను కట్టబెట్టాల్సిన అవసరం ఏమిటి?
"వదిలేస్తే వీడిలాగే తనను తాను చంపుకుంటూ ఉంటాడు" అన్న ఆ పిచ్చి నమ్మకమెందుకు నీ వాడిపై? ప్రతీ వాళ్ళూ బ్రహ్మర్షులే....కాని మేనక వచ్చేంత వరకే. నా ఈ తపానికి పరమార్థం మేనక సాక్షాత్కారమే ఎందుకు కాకూడదు? ఇదంతా చతురాననుని చాతుర్యము అన్న నమ్మకం నీకెందుకు కలగదు?
ఈ మాటలు చెపితే ప్రతీవారూ ఆశ్చర్యపోతారు నీతో పాటు. అది నా ఆమ్బిగ్యుటీ అని కూడా అంటున్నారు. కాని నా మనసులో ఉన్న ప్రతిమ నీది అది చరిగే దాకా నేనింకొకరిని చేరను అనేది నా మనసు.....ఆది భావాల డోలికలో ఊరేగే ఆసామి....ఊహల పల్లకీలో అయినా సరే ఆసామిగా ఊరేగటం ఆ చిరుగుపాతల కృష్ణశాస్త్రికి సబబే. నా మనసును ఆకట్టుకుని నన్నీ ప్రళయ తాండవం నుంచి ప్రణయ ప్రణవం వైపుకు నడిపించే నగజ తప్పక వస్తుంది అన్న నా ధీమా విదిపై, ప్రేమపై నాకున్న నమ్మకం, ఆప్టిమిజం అది. రియాలిజంను నమ్ముకున్న బుద్ది వాక్కు అది. ఈ బుద్దేమో మీకందరికీ అదృశ్య వలువలు ధరించిన ఎంపరర్. పాపం అదేక్కడి నుంచి చూపించగలదు తన చీనిచీనాంబరాల వైభవం కళ్ళుండీ కబోది అయ్యే వారికి? మనసూ, బుద్ధీ రెండూ నా అంతరిందిర్యాలే అనేది నా అహం. ఇవన్నీ సమపాళ్ళలో ఉండేలా చేసే రాధాంగపాణి నా చిత్తం. నాలుగూ నావె. మరి రెండూ నా అభిప్రాయాలే, ఆ రెంటిపై నాకు గట్టి నమ్మకమే అనటంలో తప్పేమిటో నాకయితే అర్థం కాదు. (
అంతరింద్రియాల నిర్వచనం ఇక్కడ)
చూడు అనవసరంగా ఒక నాస్తికుడిని ఇతిహాసాలు పురాణాలు తోడు తెచ్చుకునేలా చేస్తున్నావు. పాపమంతా నీదేలే.
మామూలు మాటల్లో చెప్పెదోక్కటే. నీ ఈ ప్రయత్నాలపై...అదే నా పరిణయ ప్రయత్నాలపై నాకే కోపమూ లేదు...ఇంకా గర్వంగా ఉంది కూడా...నా మొదటి భార్య నాకు మారుమనువు చేబూనింది అని. కాకపొతే ఒకటే కోరిక నీ ప్రయత్నం నువ్వు చెయ్.....నా ధర్మం నేను పాటిస్తా. కాని ఈ మానవ ప్రయత్నం, లలాట లిఖితం, ధర్మం,అవసరం అనే రోళ్ళ మధ్యన పd నలగోద్దు. అనవసరంగా ఫీల్ అవ్వొద్దు. కంట తడిని రానివ్వొద్దు అనను. ఆపలేవు దానిని. కాని ఆ నీటిని చూసి గర్వపడు. ఒకరిపై అంత ప్రేమ మనకు కలిగేలా చేసిన ఆ విధాతకు ఎంత ఋణగ్రస్తులమో, ఇలాటి అనుబంధం మన జోలెలో పడేంత పుణ్యం మనమేం చేసుకున్నామో ఆలోచించుకో.
చిత్రంగా ఉంది కదూ? ఒకనాడు నన్నోదిలిపోతాను అని నువ్వంటే నేను వద్దన్నప్పుడు "ఇంతదృష్టం కూడా నోచుకోని వారు ఎన్ని వేలమంది ఉన్నారో ఆలోచించుకో".....అన్న నీకు నేను ఇలా చెప్పాల్సి రావటం.....నిజంగా మహేష్ గారు కోట్ చేసినట్టు జీవితం చాలా గడుసిది.
ఓ చిన్న టపాతో ఈ నా టపాకు ప్రాణం పోసిన "మీ శ్రేయోభిలాషి"గారికి నెనర్లు.